నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కర్ణాటక, తమిళనాడులో పర్యాటక-ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయనున్న సాగరమాల కార్యక్రమం


తమిళనాడు, కర్ణాటకకు 4 చొప్పున మొత్తం 8 తేలియాడే జెట్టీ ప్రాజెక్టులు మంజూరు

ఈ 4 ప్రాజెక్టులతో కలిపి కర్ణాటకకు ఇప్పటివరకు 11 తేలియాడే జెట్టీ ప్రాజెక్టులు మంజూరు

Posted On: 09 MAR 2023 10:12AM by PIB Hyderabad

దేశ సామాజిక-ఆర్థిక & వాతావరణ హిత నియంత్రణలను బలోపేతం చేయడానికి సాగరమాల కార్యక్రమం ద్వారా, కేంద్ర ఓడరేవులు, నౌకారవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ అనేక సంస్కరణలు, చర్యలు తీసుకొచ్చింది. సాంప్రదాయ స్థిర జెట్టీలతో పోలిస్తే అనేక ఎక్కువ ప్రయోజనాలను అందించే తేలియాడే జెట్టీల వంటి వినూత్న ఆవిష్కరణను ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం మంత్రిత్వ శాఖ చేపట్టిన ముఖ్య కార్యక్రమాల్లో ఒకటి. ఈ తేలియాడే జెట్టీలు పర్యావరణ అనుకూలమైనది, ఎక్కువ కాలం మన్నుతాయి. వీటిని ముందే నిర్మించి తర్వాత నీటిపై ఏర్పాటు చేసుకోవచ్చు.

సాగరమాల కార్యక్రమం కింద, మంత్రిత్వ శాఖ మరో 4 ప్రాజెక్టులకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. దీంతో, కర్ణాటకలో తేలియాడే జెట్టీ ప్రాజెక్టుల సంఖ్య 11కు చేరుకుంది. ఈ ప్రాజెక్టులు ప్రధానంగా గురుపుర నది, నేత్రావతి నదిపై ఏర్పాటు చేశారు, పర్యాటక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. తన్నీర్ బావి చర్చి, బంగ్రా కులూరు, కులూరు వంతెన, జప్పిన మొగరు NH వంతెన ప్రాంతాల్లో ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి.

తమిళనాడులోనూ 4 తేలియాడే జెట్టీ ప్రాజెక్టులకు మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. భారతదేశ ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశం రామేశ్వరంలోని అగ్ని తీర్థం, విల్లూంది తీర్థం వద్ద ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటికి అదనంగా, కడలూర్, కన్యాకుమారి వంటి ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల్లోని ప్రాజెక్టులు పర్యాటకులకు ఉపయోగపడతాయి.

పర్యాటకులకు సురక్షితమైన, ఇబ్బందులు లేని రవాణాను అందించడంలో ఈ ప్రాజెక్టులు సాయపడతాయి. తీర ప్రాంత ప్రజల అభివృద్ధికి దోహదపడతాయి.

కేంద్ర ఓడరేవులు,  నౌకారవాణా, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ శర్వానంద సోనోవాల్ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. 'అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు అవసరమైన బలమైన అనుసంధాన్ని అందించడం కోసం మన గౌరవనీయ ప్రధానమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కర్ణాటక, తమిళనాడులోని తీర ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి పెద్ద ప్రోత్సాహంగా  ఈ జెట్టీల ఏర్పాటు నిలుస్తుంది, స్థానిక జనాభాకు మరిన్ని ఉపాధి అవకాశాలను తీసుకొస్తుంది. జల సంబంధిత పర్యాటకం, ప్రాంతీయ వాణిజ్యానికి కొత్త మార్గాలను సృష్టిస్తుంది'.

*****


(Release ID: 1905298) Visitor Counter : 201