వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ప్రమాదకరమైన వస్తువుల రవాణాలో తీసుకోవాల్సిన భద్రత చర్యలపై మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం


దేశవ్యాప్తంగా ప్రమాదకర పదార్థాలను సురక్షితంగా నిర్వహించడం, రవాణా చేయడం కోసం నూతన ప్రామాణికత పాటించేలా మార్గదర్శకాలు

Posted On: 06 MAR 2023 3:06PM by PIB Hyderabad

జాతీయ ప్రమాణాల రూపకల్పన సంస్థ అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్‌), ప్రమాదకర వస్తువుల రవాణాలో భద్రత చర్యలను పెంచే లక్ష్యంతో ఇటీవల కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

'ఐఎస్‌ 18149:2023 - ప్రమాదకర వస్తువుల రవాణా — మార్గదర్శకాలు' పేరిట విడుదలైన మార్గదర్శకాలను, బీఐఎస్‌ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ సెక్షనల్ కమిటీ, ఎస్‌ఎస్‌డీ 01 కింద రూపొందించారు. దేశవ్యాప్తంగా ప్రమాదకర వస్తువుల సురక్షిత నిర్వహణ, రవాణా విషయంలో నూతన ప్రామాణికత పాటించేలా ఉండాలని భావిస్తున్నారు.

రవాణా పద్ధతుల ప్రామాణీకరణ లక్ష్యంతో, ప్రమాదకర వస్తువులను సురక్షిత పద్ధతిలో రవాణా చేసేలా, ప్రమాదాల అవకాశాన్ని, ప్రజలకు & పర్యావరణానికి హానిని తగ్గించేలా చేయడంలో బీఐఎస్‌ మార్గదర్శకాలు సహాయపడతాయి.

పేలుడు, మండే, విషపూరిత, వ్యాధులను వ్యాప్తి చేసే లక్షణాలు ఉండే ప్రమాదకర పదార్థాలు & వస్తువులు ప్రజా భద్రత, ఆస్తులు, పర్యావరణానికి ప్రమాదం కలిగిస్తాయి. ఇలాంటి వస్తువుల రవాణాలో సంపూర్ణ భద్రత పాటించేలా నిర్ధారించే తగిన చర్యలు కొత్త మార్గదర్శకాల్లో ఉన్నాయి.

భూమి, సముద్రం, జల మార్గాలు, రైలు లేదా వాయు మార్గం వంటి ఏ రూపంలో ప్రమాదకర వస్తువులను రవాణా చేసినా, ఆ ప్రక్రియలో నిర్దిష్ట జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఈ తరహా వస్తువుల విషయంలో పటిష్టమైన ప్యాకేజింగ్, నిర్వహణ, రవాణా సమయంలోనూ నిర్దిష్ట నిర్వహణ చర్యలు తీసుకోవడంతో పాటు, రవాణా & నిర్వహణ చూసుకునే వ్యక్తులకు శిక్షణ కూడా నూతన ప్రమాణంలో ఉన్నాయి.

వస్తువుల వర్గీకరణ, ప్యాకేజింగ్, లేబులింగ్, మార్కింగ్, నిర్వహణ, పత్రాలు, సంబంధిత వ్యక్తుల పాత్ర, శిక్షణ, రవాణా, అత్యవసర చర్యలకు సంబంధించిన నిబంధనలపై మార్గదర్శకాలను ఐఎస్‌ 18149:2023 ప్రమాణం అందిస్తుంది. ప్రమాదకర వస్తువులుగా పేర్కొన్నవాటిలో పేలుడు పదార్థాలు, వాయువులు, మండే ద్రవ పదార్థాలు, మండే ఘనపదార్థాలు, ఆక్సీకరణ పదార్థాలు, ఆర్గానిక్‌ పెరాక్సైడ్‌లు, విషపూరిత & వ్యాధులను వ్యాప్తి చేసే పదార్థాలు, రేడియోధార్మిక పదార్థాలు, ఇతర ప్రమాదకరమైన పదార్థాలు ఉన్నాయి.

ప్రమాదకర వస్తువులను సురక్షితంగా రవాణా చేయడానికి వాహన యజమానులు/రవాణా ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు, రవాణాదార్లు, ఆపరేటర్లు, ప్రమాదకర వస్తువులు/పదార్థాలను తీసుకెళ్లే డ్రైవర్లు సహా సంబంధిత అన్ని వర్గాలకు మార్గదర్శకాలను అందించడానికి ఈ ప్రమాణాన్ని రూపొందించారు.

 

****



(Release ID: 1904588) Visitor Counter : 174