రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

నౌకాదళ కమాండర్ల సదస్సు 23/1

ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో సముద్రంపై జరగనున్న మొదటి దశ కార్యక్రమం

స్వదేశీ విమాన వాహక నౌకలో నౌకాదళ కమాండర్లను ఉద్దేశించి ప్రసంగించనున్న రక్షణ శాఖ మంత్రి

Posted On: 05 MAR 2023 9:02AM by PIB Hyderabad

నౌకాదళ కమాండర్ల సదస్సు 2023 మొదటి దఫా సమావేశం 06 మార్చి 2023న ప్రారంభం కానుంది. సైనిక వ్యూహాలకు సంబంధించి ముఖ్య భద్రత అంశాలపై చర్చించడానికి సీనియర్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడడానికి నౌకాదళ కమాండర్లకు ఈ సమావేశం ఒక వేదికగా ఉపయోగపడుతుంది.

కమాండర్ల సదస్సు మొదటి దశ సముద్రంపై జరగడం, మొదటిసారిగా భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో జరగడం ఈ సంవత్సరం కొత్తదనం. గౌరవనీయ భారత రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సదస్సు ప్రారంభం రోజున ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో నావికాదళ కమాండర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, భారత సైనిక, భారత వైమానిక దళాధిపతులు కూడా తర్వాతి రోజుల్లో సదస్సులో పాల్గొంటారు, త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని పెంపొందించే మార్గాలు, దేశ రక్షణ కోసం సంసిద్ధత, భారత జాతీయ ప్రయోజనాల గురించి చర్చిస్తారు. మొదటి రోజు కార్యకలాపాల్లో భాగంగా సముద్రంలో సైనిక విన్యాసాలు కూడా నిర్వహిస్తారు.
గత ఆరు నెలల్లో భారత నౌకాదళం చేపట్టిన ప్రధాన కార్యాచరణలు, విన్యాసాలు, రవాణా, మానవ వనరుల అభివృద్ధి, శిక్షణ, పరిపాలన కార్యకలాపాలను ఇతర నౌకాదళ కమాండర్లలతో కలిసి నౌకాదళాధిపతి సమీక్షిస్తారు. ముఖ్యమైన కార్యకలాపాలు, కార్యక్రమాల కోసం భవిష్యత్‌ ప్రణాళికలపైనా లోతుగా చర్చిస్తారు. నవంబర్ 2022లో భారత నౌకాదళంలో అమలు చేసిన ‘అగ్నిపథ్ పథకం’ గురించి కూడా ఈ సదస్సు సందర్భంగా నౌకాదళ కమాండర్లకు వివరిస్తారు.

(భారత సాయుధ దళాల మొదటి మహిళ అగ్నివీరుల బృందం సహా అగ్నివీరుల మొదటి బృందం పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ ఐఎన్‌ఎస్‌ చిల్కా నుంచి మార్చి 2023 చివరిలో ఉంటుంది)

ప్రస్తుత భౌగోళిక వ్యూహాత్మక పరిస్థితి కారణంగా, ఈ సమావేశానికి ప్రాముఖ్యత ఉంది. భారతదేశ పెరుగుతున్న సముద్ర ప్రాంత ప్రయోజనాలకు అనుగుణంగా నౌకాదళం సంవత్సరాలుగా తన కార్యాచరణల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది. మన సముద్ర జలాల ప్రయోజనాలకు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి నౌకాదళ సంసిద్ధతపైనా కమాండర్లు చర్చిస్తారు. యుద్ధ సన్నద్ధంగా ఉండడం, విశ్వసనీయమైన, సంఘటిత, భవిష్యత్‌ పోరాట శక్తి నిలవడంపై భారత నౌకాదళం దృష్టి పెట్టింది. భారతదేశ సముద్ర జలాల భద్రత హామీదారుగా తన బాధ్యతలను శ్రద్ధగా నిర్వహిస్తోంది.



(Release ID: 1904339) Visitor Counter : 184