ఆయుష్
మొదటి 'చింతన్ శివిర్'ను అసోంలోని కజిరంగా జాతీయ పార్క్‌లో నిర్వహించనున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ
రెండు రోజుల కార్యక్రమంలో వివిధ అంశాలపై చర్చలు, పాల్గొననున్న ప్రముఖ వక్తలు & నిపుణులు
Posted On:
25 FEB 2023 12:22PM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వ శాఖ, 2023 ఫిబ్రవరి 27, 28 తేదీల్లో అసోంలోని కజిరంగా జాతీయ పార్క్‌లో “చింతన్ శివిర్” నిర్వహించనుంది. కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ శర్వానంద సోనోవాల్‌తో పాటు ఆయుష్ శాఖ సహాయ మంత్రి డా.ముంజపర మహేంద్రభాయ్ కూడా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రముఖ వక్తలు, నిపుణులు, ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారులు, మరికొందరు ప్రముఖులు కూడా చింతన్ శివిర్‌లో పాల్గొంటారు. ఆయుష్ విభాగాలు & సాంప్రదాయ వైద్యంలో ఇప్పటికే ఉన్న విధానాలను భవిష్యత్‌లో మరింత మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజుల సమావేశాల్లో చర్చిస్తారు. మంత్రిత్వ శాఖ, ఆయుష్ విభాగాలు రెండింటికీ ఒక భవిష్యత్ మార్గాన్ని చూపేలా ఈ సమావేశాలు సాగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రెండు రోజుల సమావేశాల్లోస ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, విద్య మంత్రిత్వ శాఖ, అసోం ప్రభుత్వం, నీతి ఆయోగ్, పరిశ్రమలు, అంకుర సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు, నిపుణులతో ప్యానెల్ చర్చలు జరుగుతాయి. ఇతర ఆయుష్ వర్గాలతో ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయి.
“డిజిటల్ హెల్త్ అండ్ టెక్నాలజీ ఇన్ ఆయుష్” అనే అంశంపై ఫిబ్రవరి 27న 1వ సెషన్ జరుగుతుంది. అదే రోజున జరిగే 2వ సెషన్‌లో, “ఆయుష్ రీసెర్చ్, ఫ్యూచర్ స్ట్రాటజీ, ఛాలెంజెస్ అండ్ వే ఫార్వర్డ్” అనే అంశంపై చర్చలు జరుగుతాయి. 3వ సెషన్‌లో, ఆయుష్ విద్యలో భవిష్యత్ కార్యక్రమాలు, సామర్థ్య నిర్మాణం, ఉపాధి కల్పన, ఎన్‌ఈపీ గురించి మాట్లాడతారు.
'ఆయుష్ ఔషధ పరిశ్రమలు, సేవలు, ఆయుష్ ఉత్పత్తుల ప్రామాణీకరణలో ఎదరవుతున్న సవాళ్లు, వాటిని అధిగమించే ముందడుగులు' అనే అంశంపై రెండో రోజు సమావేశంలో చర్చలు జరుగుతాయి. ఆయుష్ మార్కెట్‌లో, ప్రపంచంతో పోలిస్తే భారతదేశం వేగంగా వృద్ధి చెందింది. ప్రపంచ మార్కెట్‌లో భారత్‌కు 2.8 శాతం వాటా ఉన్న నేపథ్యంలో ఈ సెషన్ చాలా ముఖ్యమైనది. 'ప్రజారోగ్యంలో ఆయుష్, సవాళ్లు, అధిగమించే మార్గాలు'పై తర్వాతి సెషన్ ఉంటుంది.
ఆయుష్ విభాగాల్లో అంకుర సంస్థల వ్యవస్థను నిర్మించేందుకు, ఆయుష్ అంకుర సంస్థలు & తయారీదార్లను ప్రోత్సహించే మార్గాలను గుర్తించడం కూడా ఈ రెండు రోజుల సమావేశం లక్ష్యం. ఆయుష్ కోసం మరింత పటిష్టమైన పరిశోధన & అభివృద్ధి మౌలిక సదుపాయాలను కల్పించడంపై ఈ చర్చలు దృష్టి పెడతాయి. అమృత్ కాల్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయుష్ మంత్రిత్వ శాఖ రూపొందించిన భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా "చింతన్ శివిర్" చర్చలు జరుగుతాయి. రెండు రోజుల సమావేశాల్లో భాగంగా, కజిరంగా జాతీయ పార్క్‌లోని ప్రశాంతమైన వాతావరణంలో ఇతర కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయి. అసోం సంప్రదాయాలు, సంస్కృతి, వన్యప్రాణులు, జీవవైవిధ్యాన్ని ప్రత్యక్షంగా చూడడం, అనుభూతి చెందడం ద్వారా ఆహ్వానితులకు అదనపు ప్రయోజనం పొందుతారు.
ప్రస్తుతం, జీ20 దేశాల కూటమికి & ఎస్‌సీవోకి (షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్) భారతదేశం అధ్యక్ష పదవిలో ఉంది. ఆయుష్ వ్యవస్థల ద్వారా ఆరోగ్యాన్ని కోరుకునే ధోరణిలోకి ప్రజలు మారుతున్న సమయంలో ఈ రెండు అంతర్జాతీయ వేదికలకు భారత్ అధ్యక్ష బాధ్యత వహిస్తోంది. ఈ వేదికల ద్వారా ఆయుష్ వ్యవస్థలను ప్రపంచ ప్రజలకు చేరువ చేయడానికి, విస్తరించడానికి వీలుగా, ఆయుష్ సంస్థల నవీకరణ, సాంకేతిక పురోగతితో వాటి అనుసంధానానికి మార్గాలను గుర్తించే విధానాలను రూపొందించడానికి, కొత్త విద్యా విధానంతో ఆయుష్‌ను ఏకీకృతం చేయడానికి, ఆయుష్ ప్రయోజనాన్ని పొందే వృద్ధి సామర్థ్యం ఉన్న ప్రస్తుత సేవలను కూడా గుర్తించడానికి కజిరంగాలో “చింతన్ శివిర్” నిర్వహిస్తున్నారు.
ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడానికి, సాంకేతికత పురోగతిని గరిష్టంగా ఉపయోగించుకోవడంతో పాటు, వాటి సమర్థవంత పంపిణీ విధానాలపై స్పష్టతనిచ్చేలా రెండు రోజుల "చింతన్ శివిర్"లో చర్చల ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నారు.
*****
(Release ID: 1902344)
Visitor Counter : 198