ప్రధాన మంత్రి కార్యాలయం

‘హరిత వృద్ధి’పై బడ్జెట్‌ అనంతర వెబ్‌ సదస్సులో ప్రధాని ప్రసంగం


“హరిత వృద్ధి వైపు ఉరవడిని అమృతకాల బడ్జెట్‌ వేగవంతం చేస్తుంది”;

“ఈ ప్రభుత్వంలో ప్రతి బడ్జెట్‌ వర్తమాన సవాళ్లకు పరిష్కారాలు

అన్వేషిస్తూనే నవతరం సంస్కరణలను ముందుకు తీసుకెళ్తోంది”;

“ఈ బడ్జెట్‌లోహరిత ఇంధనంపై ప్రకటనలు అందకు పునాదివేయడమేగాక భవిష్యత్తరాలకు బాటలుపరుస్తున్నాయి”;

“ప్రపంచ హరిత ఇంధన మార్కెట్‌లో భారత్‌ను అగ్రభాగాన

నిలపడంలో ఈ బడ్జెట్‌ కీలక పాత్ర పోషిస్తుంది”;

పునరుత్పాదక ఇంధన సామర్థ్యం జోడింపు వేగంలో

2014 నుంచి భారత్‌ ప్రధాన ఆర్థిక వ్యవస్థలకన్నా ముందుంది”;

సౌర.. పవన..బయోగ్యాస్‌ సామర్థ్యంరీత్యా మన ప్రైవేటు రంగానికిభారతదేశం ఓ బంగారు గని లేదా చమురుక్షేత్రానికి తీసిపోదు”;

“హరిత వృద్ధి వ్యూహంలో వాహన తుక్కు విధానం ఓ కీలక భాగం”;

“హరిత ఇంధనంలో ప్రపంచాన్నినడిపించగల భారీ సామర్థ్యం భారతకు ఉంది.. ప్రపంచ శ్రేయస్సుతోపాటు హరిత ఉద్యోగాలసృష్టిని ముందుకు తీసుకెళ్తుంది”;ఈ బడ్జెట్‌ ఓ అవకాశం మాత్రమేకాదు... మన భవిష్యత్‌ భద్రతకు హామీ ఇస్తోంది”

Posted On: 23 FEB 2023 11:13AM by PIB Hyderabad

  ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ ‘హరిత వృద్ధి’’పై బ‌డ్జెట్ అనంతర వెబ్‌ సదస్సులో ప్రసంగించారు. కేంద్ర బడ్జెట్ 2023లో ప్రకటించిన కార్యక్రమాల సమర్థ అమలుకు తగిన సలహాలు, సూచనలను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన 12 బడ్జెట్ అనంతర వెబ్‌ సదస్సులలో ఇది మొదటిది. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి ప్ర‌సంగిస్తూ- దేశంలో 2014 త‌ర్వాత ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్లన్నీ ఇటు వర్తమాన సవాళ్ల‌కు ప‌రిష్కారాన్వేషణ సహా అటు నవతరం సంస్క‌ర‌ణ‌ల‌ను ముందుకు తీసుకెళ్తున్నాయని వ్యాఖ్యానించారు.

   రిత వృద్ధి, ఇంధన ప్రసారానికి సంబంధించిన మూడు స్తంభాల గురించి ప్రధాని వివరించారు. ఇందులో మొదటిది.. పునరుత్పాదక ఇంధన ఉత్పాదన పెంపు; రెండోది.. ఆర్థిక వ్యవస్థలో శిలాజ ఇంధన వినియోగం తగ్గింపు; మూడోది.. దేశంలో గ్యాస్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు వేగంగా పరివర్తన. ఈ త్రిముఖ వ్యూహంలో భాగంగా ఇథనాల్‌ మిశ్రమం, పీఎం కుసుమ్‌ యోజన, సౌరశక్తి ఉత్పాదనకు ప్రోత్సాహకాలు, పైకప్పు సౌరశక్తి పథకం, బొగ్గు గ్యాస్‌గా మార్పు, బ్యాటరీ నిల్వ వంటివాటిపై కొన్నేళ్లుగా బడ్జెట్లలో ప్రకటనలు చేస్తున్నట్లు గుర్తుచేశారు. అదేవిధంగా మునుపటి బడ్జెట్లలో ప్రధానమైన ప్రకటనలను ప్రధాని ఉద్ఘాటించారు. ఈ మేరకు పరిశ్రమలకు హరిత క్రెడిట్‌, రైతుల కోసం పీఎం ప్రాణమ్‌ యోజన, గ్రామాలకు గోబర్ధన్‌, నగరాలకు వాహన తుక్కు విధానం, హరిత ఉదజని సహా ఈ ఏడాది బడ్జెట్‌లో చిత్తడి భూముల పరిరక్షణ వంటివి ఉన్నాయని వివరించారు. ఈ ప్రకటనలన్నీ హరిత వృద్ధికి పునాది వేయడమేగాక భవిష్యత్తరాలకు బాటలు పరుస్తున్నాయని పేర్కొన్నారు.

   పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్‌ శాసించగల స్థితిలో ఉండటం ప్రపంచంలో తగిన మార్పును తప్పక తెస్తుందని ప్రధాని అన్నారు. “ప్రపంచ హరిత ఇంధన మార్కెట్లో భారతదేశాన్ని అగ్రభాగాన నిలపడంలో ఈ బడ్జెట్‌ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే, ఇవాళ మన దేశంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఇంధన ప్రపంచంలోని ప్రతి వాటాదారునూ ఆహ్వానిస్తున్నాను” అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఇంధన సరఫరా శ్రేణి వైవిధ్యం కోసం ప్రపంచవ్యాప్త కృషిని ప్రస్తావిస్తూ- ప్రతి హరిత ఇంధన పెట్టుబడిదారు భారతదేశంలో పెట్టుబడులు పెట్టే గొప్ప అవకాశాన్ని ఈ బడ్జెట్‌ కల్పించిందని పేర్కొన్నారు. ఈ రంగంలోని అంకుర సంస్థలకూ ఇదెంతో ప్రయోజనకరమని ఆయన తెలిపారు.

   “పునరుత్పాదక ఇంధన సామర్థ్యం జోడింపు వేగంలో 2014 నుంచి భారతదేశం ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలకన్నా ముందుంది” అని ప్రధానమంత్రి చెప్పారు. పునరుత్పాదక ఇంధన వనరుల విషయంలో గడువుకు ముందే లక్ష్యం సాధించగల సామర్థ్యం భారతదేశానికి ఉందన్న వాస్తవాన్ని మన గత విజయాలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆ మేరకు స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో శిలాజేతర ఇంధన వనరుల వాటా 40 శాతం ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశిత గడువుకు 9 ఏళ్లు ముందుగానే భారత్‌ సాధించిందని ప్రధాని గుర్తుచేశారు. అలాగే పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ కలిపే లక్ష్యాన్ని 5 నెలలు ముందుగానే సాధించిందని, ఇదే ఊపుతో 2030 నాటికి 20 శాతం లక్ష్యాన్ని 2025-26కల్లా సాధించగలదని దృఢ విశ్వాసం వ్యక్తం చేశారు. అదేవిధంగా 500 గిగావాట్ల సామర్థ్యం లక్ష్యాన్ని కూడా 2030 నాటికి సాధించగలమని ఆశాభావం వెలిబుచ్చారు. ఇటీవలే ‘ఇ20’ ఇంధన విక్రయాలకు శ్రీకారం చుట్టడాన్ని ప్రస్తావిస్తూ- జీవ ఇంధనాలపై ప్రభుత్వ ప్రాధాన్యాన్ని ప్రధాని మరోసారి గుర్తుచేశారు. దీంతో పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలు అందివచ్చాయని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ వ్యర్థాలు పుష్కలం కాబట్టి మూలమూలనా ఇథనాల్ ప్లాంట్ల ఏర్పాటు అవకాశాన్ని వదులుకోవద్దని ఆయన పెట్టుబడిదారులకు సూచించారు. “సౌర, పవన, బయోగ్యాస్‌ సామర్థ్యం రీత్యా మన ప్రైవేటు రంగానికి భారతదేశం ఓ బంగారు గని లేదా చమురు క్షేత్రానికి తీసిపోదు” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

   జాతీయ హరిత ఉదజని కార్యక్రమం కింద 5 ఎంఎంటి ఉత్పత్తి లక్ష్యంగా భారత్‌ ముందుకు సాగుతున్నదని ప్రధాని చెప్పారు. ఈ రంగంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం కోసం రూ.19 వేల కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు. ఎలక్ట్రోలైజర్, గ్రీన్ స్టీల్ తయారీ, సుదీర్ఘ ఇంధన నిల్వ ఘటాలు వంటి ఇతర అవకాశాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అంతేకాకుండా గోబర్ (ఆవు పేడ) నుంచి 10 వేల మిలియన్ క్యూబిక్ మీటర్ల బయోగ్యాస్‌ను, 1.5 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం భారతదేశానికి ఉందని ప్రధాని పేర్కొన్నారు. ఇది దేశంలోని నగరాల్లో గ్యాస్ పంపిణీకి 8 శాతందాకా తోడ్పాటు ఇవ్వగలదని తెలిపారు. “ఈ అవకాశాలన్నిటి నేపథ్యంలో నేడు గోబర్ధన్ యోజన భారత జీవ ఇంధన వ్యూహంలో కీలక భాగంగా ఉంది. దీనికి అనుగుణంగా ఈసారి బడ్జెట్‌లో గోబర్ధన్ యోజన కింద 500 కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇవి పాతకాలం తరహాలోనివి కావని, ఈ ఆధునిక ప్లాంట్ల కోసం ప్రభుత్వం రూ.10,000 కోట్లు వెచ్చిస్తుందని వెల్లడించారు. వ్యవసాయ వ్యర్థాలతోపాటు పురపాలక ఘన వ్యర్థాల నుంచి కూడా ‘సీబీజీ’ ఉత్పత్తికి ప్రైవేట్ రంగం ఆకర్షణీయ ప్రోత్సాహకాలు పొందగలదని ప్రధానమంత్రి తెలియజేశారు.

   భారత ప్రభుత్వ వాహన తుక్కు విధానాన్ని ప్రస్తావిస్తూ- హరిత వృద్ధి వ్యూహంలో ఇదొక కీలక భాగమని స్పష్టం చేశారు. పోలీసు వాహనాలు, అంబులెన్సులు, బస్సులుసహా 15 ఏళ్లు పైబడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని సుమారు 3 లక్షల వాహనాల రద్దుకు ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.3000 కోట్ల కేటాయించిందని తెలిపారు. పునరుపయోగం, పునరుత్పత్తి, పునస్సమీకరణ సూత్రం ప్రకారం “వాహన తుక్కు ఇకపై ఓ భారీ మార్కెట్‌ కానుంది” అని ప్రధానమంత్రి ప్రకటించారు. ఇది మన వృత్తాకార ఆర్థిక వ్యవస్థకు కొత్త బలాన్నిస్తుందని నొక్కిచెప్పారు. తదనుగుణంగా ఈ ఆర్థిక వ్యవస్థలోని వివిధ మార్గాల్లో పయనించాలని భారత యువతరానికి పిలుపునిచ్చారు. రానున్న 6-7 సంవత్సరాల్లో భారతదేశం తన బ్యాటరీ నిల్వ సామర్థ్యాన్ని 125-గిగావాట్లకు పెంచుకోవాల్సి ఉందని ప్రధానమంత్రి అన్నారు. భారీ మూలధనంతో కూడిన ఈ రంగంలో భారీ లక్ష్యాల సాధనకు తోడ్పడే విధంగా బ్యాటరీల రూపకర్తలకు మద్దతివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తదనుగుణంగా నిలదొక్కకునే దాకా నిధుల తోడ్పాటు పథకాన్ని ఈ బడ్జెట్‌లో ప్రకటించినట్లు ప్రధాని తెలిపారు.

   దేశంలో జలాధారిత రవాణా కూడా ఓ భారీ రంగంగా రూపొందే అవకాశాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. భారత్‌ ఇవాళ తన సరకు రవాణా పరిమాణంలో కేవలం 5 శాతాన్ని మాత్రమే తన తీరప్రాంత జలమార్గంలో రవాణా చేస్తున్నదని, అలాగే అంతర్గత జలమార్గాల ద్వారా సరకు రవాణా 2 శాతంగా మాత్రమే ఉందని ఆయన తెలియజేశారు. భారతదేశంలో జలమార్గాల అభివృద్ధి ఈ రంగంలో వాటాదారులందరికీ అనేక అవకాశాలను కల్పిస్తుందని ఆయన నొక్కిచెప్పారు. చివరగా- హరిత ఇంధనం విషయంలో- ప్రపంచాన్నే నడిపించగల అపార సామర్థ్యం భారతదేశానికి ఉందన్నారు. ప్రపంచ శ్రేయస్సుతోపాటు హరిత ఉద్యోగాల సృష్టిని మన దేశం ముందుకు తీసుకెళ్తుందని ఆయన నొక్కి చెప్పారు. “ఈ బడ్జెట్ ఒక అవకాశం మాత్రమే కాదు... మన భవిష్యత్తు భద్రతపై హామీ కూడా ఇస్తుంది” అని ప్రధాని పేర్కొన్నారు. ఈ మేరకు బడ్జెట్‌లోని ప్రతి కేటాయింపునూ సద్వినియోగం చేసుకోవడానికి భాగస్వామ్యులంతా త్వరగా కార్యరంగంలో దూకాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ మేరకు  “ప్రభుత్వం మీకు - మీ సూచనలకు పూర్తి మద్దతునిస్తుంది” అని ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.

నేపథ్యం

   కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ వెబ్‌ సదస్సులో హరిత వృద్ధిలోని హరిత ఇంధన, ఇంధనేతర భాగాలు రెండింటినీ సమన్వయం చేస్తూ విరామాలతో చర్చా గోష్టులు నిర్వహిస్తుంది. సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖల మంత్రులు, కార్యదర్శులతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు & పరిశోధన సంస్థలు సహా ప్రభుత్వ రంగంలోని అనేక భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు ఈ వెబ్‌ చర్చాగోష్ఠులకు హాజరవుతారు. తద్వారా బడ్జెట్ ప్రకటనల మెరుగైన అమలుకు సూచనలిస్తూ సహకరిస్తారు. దేశంలో హరిత పారిశ్రామిక-ఆర్థిక పరివర్తన, పర్యావరణహిత వ్యవసాయం, సుస్థిర ఇంధనం కోసం కేంద్ర బడ్జెట్ 2023-24 ఏడు కీలక ప్రాథమ్యాలను నిర్దేశించుకుంది. వాటిలో హరిత వృద్ధి ఒకటి కాగా, దీనిద్వారా పెద్ద సంఖ్యలో హరిత ఉద్యోగాల సృష్టి కూడా సాధ్యం కాగలదు. వివిధ రంగాలు, మంత్రిత్వ శాఖల పరిధిలోగల అనేక ప్రాజెక్టులు, కార్యక్రమాలను ఈ బడ్జెట్‌ నిర్దేశిస్తోంది. ఇందులో హరిత ఉదజని కార్యక్రమం, విద్యుత్‌ ప్రసారం, ఇంధన నిల్వ ప్రాజెక్టులు, పునరుత్పాదక ఇంధన తరలింపు, హరిత క్రెడిట్ కార్యక్రమం, పీఎం-ప్రాణమ్‌, గోబర్ధన్ పథకం, భారతీయ ప్రకృతి వ్యవసాయ బయో-ఉత్పాదక వనరుల కేంద్రాలు, మిష్టి, అమృత ధరోహర్, తీర నౌకాయానం, వాహన భర్తీ వంటివి అంతర్భాగంగా ఉన్నాయి.

   డ్జెట్‌ అనంతర వెబ్‌ సదస్సులు ప్రతిదానిలోనూ మూడు చర్చాగోష్ఠుల విభాగాలుంటాయి. ఇందులో తొలి మహా సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగంతో ప్రారంభమైంది. దీనికి సమాంతరంగా వివిధ ఇతివృత్తాలతో ప్రత్యేక విరామ గోష్ఠులు నిర్వహించబడతాయి. అంతిమంగా అందరి అభిప్రాయాలనూ ప్లీనరీ ముగింపు గోష్టిలో సమర్పిస్తారు. ఈ వెబ్‌ సదస్సు సందర్భంగా అందే సూచనలు, సలహాల ప్రకారం సంబంధిత మంత్రిత్వశాఖలు నిర్దిష్ట వ్యవధితో కూడిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తాయి. అనంతరం దీన్ని బడ్జెట్‌ ప్రకటనలకు తగినట్లు అమలు చేస్తారు. ప్రభుత్వం గత కొన్నేళ్లుగా అనేక బడ్జెట్ సంస్కరణలను చేపట్టిన నేపథ్యంలో తొలుత బడ్జెట్ తేదీని ముందుకు తెచ్చి, ఫిబ్రవరి 1న ప్రకటిస్తున్నారు. దీనివల్ల రుతుపవనాల ప్రారంభానికి ముందు నిధుల వినియోగానికి మంత్రిత్వ శాఖలు, విభాగాలకు తగినంత సమయం లభిస్తుంది. బడ్జెట్ అమలులో సంస్కరణల దిశగా ముందడుగుకు ఉద్దేశించినవే ఈ వెబ్‌ సదస్సులు. ఇదొక సరికొత్త యోచన... ప్రభుత్వ-ప్రైవేట్ రంగాల నిపుణులు, విద్యా సంస్థలు, పరిశ్రమలు, భాగస్వాములను ఒకే వేదికపైకి తెచ్చి అన్ని రంగాల్లో వ్యూహాల అమలులో సంయుక్తంగా కృషి చేయడానికి ప్రధానమంత్రి ఈ ఆలోచనను రూపొందించారు. ఈ వెబినార్లు 2021లో ప్రజా భాగస్వామ్యం స్ఫూర్తితో ప్రారంభించబడ్డాయి. బడ్జెట్ ప్రకటనలను సమర్థంగా, సత్వరం, నిరంతరం అమలు చేయడంలో సంబంధిత భాగస్వాములందరి ప్రమేయాన్ని, యాజమాన్యాన్ని ఈ వెబ్‌ సదస్సులు ప్రోత్సహిస్తాయి.

   త్రైమాసిక లక్ష్యాలతో కార్యాచరణ ప్రణాళికల తయారీకి వివిధ శాఖల మంత్రులు, విభాగాలు, సంబంధిత వాటాదారులందరి సమన్వయ కృషిపై ఈ వెబ్‌ సదస్సులు దృష్టి సారిస్తాయి. తద్వారా అమలు ముందడుగు పడి, నిర్దేశిత ఫలితాలను సకాలంలో సాధించే వెసులుబాటు కలుగుతుంది. ఈ మేరకు విస్తృత భాగస్వామ్యానికి భరోసా ఇస్తూ ఈ సదస్సులను వర్చువల్‌ మాధ్యమం ద్వారా నిర్వహిస్తారు. సంబంధిత కేంద్ర మంత్రులు, ప్రభుత్వ శాఖలు, నియంత్రణ వ్యవస్థలు, విద్యా సంస్థలు, వాణిజ్య/పారిశ్రామిక సంఘాలు తదితర కీలక వాటాదారులు ఈ సదస్సులలో పాల్గొంటారు.

 

***

DS/TS



(Release ID: 1901717) Visitor Counter : 191