శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ప్రజాశ్రేయస్సు లక్ష్యంగా సంప్రదాయ జ్ఞానంతో ఆధునిక సాంకేతికత మేళవింపును ప్రోత్సహించడం.. సమాచారం పంచుకోవడంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఎప్పుడూ ముందుంటారు: కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
న్యూఢిల్లీలో ఇవాళ ‘సంప్రదాయ విజ్ఞాన ఆదానప్రదానం.. వ్యాప్తిపై తొలి అంతర్జాతీయ సదస్సు’కు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించిన కేంద్రమంత్రి;
సంప్రదాయ విజ్ఞానాన్ని- ఆధునిక శాస్త్ర పరిశోధనలను మేళవించి
ఆధునిక ఉపకరణాలు.. సాంకేతికతల సమన్వయంతో సమష్టిగా
గరిష్ఠస్థాయిలో వినియోగించాలని డాక్టర్ సింగ్ పిలుపు
Posted On:
15 FEB 2023 5:36PM by PIB Hyderabad
ప్రజాశ్రేయస్సు లక్ష్యంగా సంప్రదాయ జ్ఞానంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మేళవింపును ప్రోత్సహించడం, భవిష్యత్తరం సాంకేతికతపై సమాచారం పంచుకోవడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎప్పుడూ ముందుంటారని కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ, భూవిజ్ఞాన శాఖ, ప్రధాని కార్యాలయ, ప్రజా ఫిర్యాదులు-పెన్షనన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల (స్వతంత్ర బాధ్యతగల) సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
న్యూఢిల్లీలో ఇవాళ ‘సంప్రదాయ విజ్ఞాన ఆదానప్రదానం-వ్యాప్తిపై తొలి అంతర్జాతీయ సదస్సు’ (సిడిటికె-2023)కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సంప్రదాయ విజ్ఞానాన్ని, ఆధునిక శాస్త్ర పరిశోధనలను మేళవించడంతోపాటు ఆధునిక ఉపకరణాలు, సాంకేతికతల సమన్వయంతో సమష్టిగా గరిష్ఠస్థాయిలో వినియోగించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సంప్రదాయ విజ్ఞాన డిజిటల్ గ్రంథాలయాన్ని (డిజిటిఎల్) ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తెచ్చిన నేపథ్యంలో విజ్ఞానంతో సాంకేతికత మేళవింపు సామాన్యులకు ఎంతో ప్రయోజనకరమని రుజువైందన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ‘స్వస్తిక్ (శాస్త్రీయ ధ్రువీకృత భారత సామాజిక సంప్రదాయ జ్ఞానం) కరదీపికతోపాటు పాపులర్ సైన్స్ బుక్, ఇండియన్ జర్నల్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ స్వాతంత్ర్య అమృత మహోత్సవ సంచికను కూడా కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. కాగా, న్యూఢిల్లీలోని ‘సిఎస్‌ఐఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (సిఎస్‌ఐఆర్—న్‌ఐఎస్‌సీపీఆర్) సంస్థ ఈ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తోంది. గత 8 ఏళ్లలో ప్రధాని మోదీ నాయకత్వాన సంప్రదాయ విజ్ఞానం, ఆధునిక శాస్త్రీయ పరిశోధనల సమన్వయంపై దృష్టి సారించే అనేక కార్యక్రమాల ద్వారా నేడు మహా సముద్రాల వంటి దేశీయ వనరులకు అత్యంత ప్రాధాన్యం లభిస్తున్నదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు హిందూ మహాసముద్రంలో (సంప్రదాయకంగా హింద్ మహాసాగర్) చేపట్టిన ‘డీప్ సీ మిషన్’, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లవెండర్ సాగును ప్రోత్సహించే ‘పర్పుల్ రివల్యూషన్ వంటివాటిని ఆయన ఉదాహరించారు. వీటిద్వారా స్థానిక కశ్మీరీలకు భారీ ఉపాధి అవకాశాలు అందివచ్చాయని పేర్కొన్నారు.
ఈ తొలి అంతర్జాతీయ సదస్సును ఇంత భారీస్థాయిలో చక్కని ఇతివృత్తంతో నిర్వహించడంపై ‘సిఎస్‌ఐఆర్—న్‌ఐఎస్‌సీపీఆర్’లను అభినందించారు. భారతదేశం అతిపెద్ద లిఖిత, మౌఖిక, అనువర్తిత సుసంపన్న జ్ఞానఖనిగా వెలుగొందుతున్నదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వాస్తవాన్ని ప్రస్ఫుటం చేసేవిధంగా ఈ జ్ఞానాన్ని అత్యుత్తమంగా వాడుకోవడం ఎలాగన్నదే నేడు మనముందున్న సవాలని ఆయన అన్నారు. ఈ రెండింటి మధ్య సరైన సమతౌల్యం కనుగొనడం ద్వారా ఇది సుసాధ్యం కాగలదని, ఈ దిశగా ఏకీకరణ, ఆలోచనాత్మక ప్రక్రియ అవసరమని డాక్టర్ సింగ్ చెప్పారు. ఈ రంగంలో భారత్ ప్రపంచ అగ్రగామిగా నిలిచేందుకు ఇదే సరైన సమయమన్నారు. ప్రధాని మోదీ హయాంలో శాస్త్ర-సాంకేతిక పరిశోధనలకు మునుపెన్నడూ లేనివిధంగా మద్దతు లభిస్తోందని ఆయన అన్నారు.
మహమ్మారిపై యుద్ధంలో ప్రపంచమంతా ఒక్క టీకా తయారీకే ఆపసోపాలు పడుతున్న సమయంలో ప్రధాని మోదీ నాయకత్వాత భారతదేశం ఏకంగా నాలుగు కోవిడ్-19 టీకాలను రూపొందించిందని గుర్తుచేశారు. అంతేకాకుండా కోవిడ్-19పై ప్రపంచ పోరాటంలో తనవంతుగా ‘వ్యాక్సిన్ మైత్రి’ కింద పలు చర్యలతోపాటు అనేక దేశాలకు టీకాలను అందించిందని పేర్కొన్నారు. తద్వారా భారత సంప్రదాయ, మానవ విలువలకు విశేష ప్రాచుర్యం లభించిందని చెప్పారు. సంప్రదాయ జ్ఞానం ప్రమాదంలో ఉన్నప్పుడు, అది సత్వరం స్వీకరించబడుతుందని, ఏకీకరణతోపాటు వనరుల సమీకరణ ద్వారా ఆధునిక యుగంలో మనకొక సానుకూల అవకాశం కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీఎస్‌ఐఆర్ డీజీ, డీఎస్‌ఐఆర్ కార్యదర్శి డాక్టర్ కలైసెల్వి మాట్లాడుతూ- శాస్త్ర-విజ్ఞాన పరిశోధనలు స్వేచ్ఛగా నిర్వహించుకునే స్వర్ణయుగంలో నేడు మనం జీవిస్తున్నామని పేర్కొన్నారు. ఆ మేరకు అంకుర సంస్థలను, పరిశోధకులను ప్రోత్సహిస్తున్న ఘనత ప్రధానమంత్రి మోదీకే దక్కుతుందన్నారు. కాగా, 2023 ఫిబ్రవరి 14, 15 తేదీల్లో నిర్వహించిన ఈ రెండు రోజుల సదస్సులో దేశంలోని 22 రాష్ట్రాలుసహా అమెరికా, కెనడా, స్విట్జర్లాండ్, ఖతార్, టర్కీ దేశాల నుంచి 200 మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు.
***
(Release ID: 1899686)
Visitor Counter : 158