ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా గ్రామాలు మరియు నగరాల్లో ఆరోగ్య సంరక్షణ సేవల విస్తరణ


దేశవ్యాప్తంగా 1,56,412 హెల్త్ & వెల్నెస్ సెంటర్లు పని చేస్తున్నాయి

గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం కోసం ఎన్‌హెచ్‌ఎం మద్దతుతో మొబైల్ మెడికల్ యూనిట్లు (ఎంఎంయులు) మరియు టెలిమెడిసిన్‌లు అమలు చేయబడుతున్నాయి

Posted On: 07 FEB 2023 3:25PM by PIB Hyderabad

భారతదేశంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మూడు దశల్లో అంటే సబ్ హెల్త్ సెంటర్ (అర్బన్ మరియు రూరల్), ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (అర్బన్ మరియు రూరల్) మరియు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (అర్బన్ మరియు రూరల్)గా విస్తరించి ఉంది. నిబంధన ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 30,000 (మైదానాలలో) మరియు 20,000 (కొండలు మరియు గిరిజన ప్రాంతాలలో) జనాభా కోసం ఒక పిహెచ్‌సి మరియు 5,000 (మైదాన ప్రాంతం) మరియు 3000 (కొండలు మరియు కొండ ప్రాంతాలలో) జనాభా కోసం సబ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. అలాగే 1,20,000 (మైదాన ప్రాంతం) మరియు 80,000 (కొండలు మరియు గిరిజన ప్రాంతంలో) జనాభా కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ (డిహెచ్), సబ్-డిస్ట్రిక్ట్ హాస్పిటల్ (ఎస్‌డిహెచ్) మరియు ఫస్ట్ రెఫరల్ యూనిట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ద్వితీయ శ్రేణి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తాయి.

గ్రామీణ ఆరోగ్య గణాంకాలు (ఆర్‌హెచ్‌ఎస్) అనేది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు నివేదించిన హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేటివ్ డేటా ఆధారంగా వార్షిక ప్రచురణ. గ్రామీణ & గిరిజన ప్రాంతాలలో పనిచేస్తున్న సబ్-సెంటర్లు, పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలు, సబ్-డివిజనల్ హాస్పిటల్, జిల్లా హాస్పిటల్ & మెడికల్ కాలేజీల వివరాలు, అలాగే ఈ పథకం కింద ఉన్న గ్రామాల సంఖ్యను రాష్ట్ర/యుటి వారీగా ఈ క్రింది లింక్‌లో చూడవచ్చు: https://main.mohfw.gov.in/sites/default/files/RHS%202021%2022.pdf

ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ ఆరోగ్య మిషన్ కింద  ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్‌ల (పిఐపిలు) రూపంలో స్వీకరించిన ప్రతిపాదనల ఆధారంగా మానవ వనరులకు మద్దతుతో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్రాలు/యూటీలకు సాంకేతిక మరియు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.  నిబంధనలు మరియు అందుబాటులో ఉన్న వనరుల ప్రకారం రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ (ఆర్ఒపిలు) రూపంలో ప్రతిపాదనలకు భారత ప్రభుత్వం ఆమోదం అందిస్తుంది.

జాతీయ ఆరోగ్య మిషన్ ప్రధాన కార్యక్రమాలలో జననీ శిశు సురక్ష కార్యక్రమం (జెఎస్ఎస్‌కె), రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బిఎస్‌కె), ఉచిత ఔషధ మరియు ఉచిత డయాగ్నోస్టిక్స్ సర్వీస్ ఇనిషియేటివ్‌ల అమలు, పిఎం నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ మరియు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ ఫ్రేమ్‌వర్క్ అమలు ఉన్నాయి. అలాగే మాతాశిశు ఆరోగ్యం, శిశు ఆరోగ్యం, కౌమార ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, సార్వత్రిక ఇమ్యునైజేషన్ కార్యక్రమం మరియు క్షయ, హెచ్‌ఐవి/ఎయిడ్స్, మలేరియా, డెంగ్యూ మరియు కాలా అజర్, లెప్రసీ వంటి వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధులకు సంబంధించిన అనేక ఉచిత సేవలను ఎన్‌హెచ్‌ఎం మద్దుతుతో అందించడం జరుగుతుంది.

గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడం కోసం ఎన్‌హెచ్‌ఎం మద్దతుతో  మొబైల్ మెడికల్ యూనిట్లు (ఎంఎంయులు) మరియు టెలిమెడిసిన్‌ సేవలు కూడా అందుతున్నాయి.

రాష్ట్రాల్లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు స్థానిక ప్రభుత్వం ద్వారా ఐదేళ్ల కాలంలో (2021-2026) మొత్తం రూ.70,051 కోట్ల గ్రాంట్లను అందించాలని 15వ ఫైనాన్స్ కమీషన్ నిర్దేశించింది. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పిఎం-ఏబిహెచ్‌ఐఎం) సబ్ హెల్త్ సెంటర్లు, అర్బన్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీలు మరియు క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్‌ల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి  రూ. 64,180 కోట్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ ( సిపిహెచ్‌సి) అందించడం కోసం దేశవ్యాప్తంగా ఉప ఆరోగ్య కేంద్రాలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాలుగా మార్చడానికి ప్రభుత్వం రాష్ట్రాలకు మద్దతు ఇస్తుంది. 31.01.2023 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 1,56,412 హెచ్‌డబ్ల్యూసీలు అమలు చేయబడ్డాయి.

సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్‌ఈసీసీ) ప్రకారం సుమారు 10.74 కోట్ల పేద మరియు బలహీన కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబి-పిఎంజెఏవై సంవత్సరానికి రూ. 5.00 లక్షల ఆరోగ్య కవరేజీని అందిస్తోంది.

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు.


 

****



(Release ID: 1897122) Visitor Counter : 131


Read this release in: English , Urdu , Tamil