నౌకారవాణా మంత్రిత్వ శాఖ

గ్రేట్ నికోబార్ ద్వీపం వద్ద అంతర్జాతీయ ట్రాన్స్‌షిప్‌మెంట్‌ నౌకాశ్రయ నిర్మాణం కోసం ఆసక్తి వ్యక్తీకరణలకు ఆహ్వానం


ప్రతిపాదిత పోర్టుకు సంవత్సరానికి 16 మిలియన్ కంటైనర్లను నిర్వహించగల గరిష్ట సామర్థ్యం ఉంటుంది, మొదటి దశలో 4 మిలియన్లకు పైగా కంటైనర్లను నిర్వహిస్తుంది

ప్రభుత్వం & పీపీపీ కాంట్రాక్టుదారు ఉమ్మడి పెట్టుబడితో కలిపి సహా రూ.41,000 కోట్లతో (5 బిలియన్ డాలర్ల) ప్రాజెక్ట్ పూర్తవుతుందని అంచనా

ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విమానాశ్రయం, టౌన్‌షిప్, విద్యుత్‌ కేంద్రం నిర్మించాలని ప్రణాళికలు

నిర్మాణ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలు (EOI) ఆహ్వానించిన నౌకాశ్రయాలు, నౌకా రవాణా & జల మార్గాల మంత్రిత్వ శాఖ

Posted On: 27 JAN 2023 10:17AM by PIB Hyderabad

ప్రాజెక్టు ముఖ్యాంశాలు

  • వ్యూహాత్మక స్థానం - సింగపూర్, క్లాంగ్, కొలంబో వంటి ప్రస్తుత ట్రాన్స్‌షిప్‌మెంట్ టెర్మినల్స్‌ ఉన్న అంతర్జాతీయ వాణిజ్య మార్గంలో ఇది ఉంది.
  • డ్రాఫ్ట్ - 20 మీ. సహజ లోతు
  • ఆకర్షించే అవకాశం - ఉపఖండంలోని ఈ తరహా అంతర్జాతీయ కేంద్రాల నుంచి, భారతీయ ఓడరేవులు సహా సమీపంలోని ఓడరేవుల నుంచి ట్రాన్స్‌షిప్‌మెంట్ కార్గోను ఆకర్షించే అవకాశం.
  • ఒకటో దశ ముఖ్యాంశాలు – రెండు బ్రేక్‌వాటర్లు, 400 మీ. వెడల్పున్న రవాణా కాల్వ, 800 మీ. వ్యాసంతో ఒక టర్నింగ్ సర్కిల్, 7 బెర్తుల మొత్తం పొడవు 2.3 కి.మీ. కంటైనర్ యార్డ్‌ కోసం 125 హెక్టార్ల స్థలం, ఆర్‌ఎంక్యూసీలు, ఆర్‌టీజీలు సహా కంటైనర్ నిర్వహణ పరికరాలు, 2 లిక్విడ్‌ రవాణా బెర్తుల అభివృద్ధి కోసం ఏర్పాట్లు

గ్రేట్ నికోబార్ ద్వీపం సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ద్వీప అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా, గలాథియా బే ఆఫ్ గ్రేట్ ద్వీపం వద్ద అతి పెద్ద అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్ (ఐసీటీపీ) అభివృద్ధి కోసం "కేంద్ర నౌకాశ్రయాలు, నౌకా రవాణా & జల మార్గాల మంత్రిత్వ శాఖ" కృషి చేస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఇతర ప్రాజెక్టుల్లో విమానాశ్రయం, టౌన్‌షిప్, విద్యుత్‌ కేంద్రం కూడా ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో అంతరాలను తగ్గించడం, ఫీడర్ల నుంచి ఖండాంతర నౌకల వరకు అన్ని రకాల నౌకల వేగంగా పెరగేలా ఆర్థిక అవకాశాలను మెరుగుపరచడం గ్రేట్‌ నికోబార్‌ దీవుల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక లక్ష్యం. అంతర్జాతీయ టెర్మినళ్లు, పొరుగు పోర్టులు అందిస్తున్న సేవలకు ప్రతిపాదిత మౌలిక సదుపాయాల కేంద్రాలు ఏమాత్రం తగ్గకూడదు.

అంతర్జాతీయ నౌకా రవాణా వాణిజ్య మార్గం (40 నాటికల్ మైళ్ళు) పరంగా వ్యూహాత్మక ప్రదేశం, 20 మీ. కంటే ఎక్కువ సహజ నీటి లోతు, భారతీయ ఓడరేవులు సహా సమీపంలోని అన్ని ఓడరేవుల నుంచి సరకును తరలించగల సామర్థ్యం వంటి మూడు కీలకాంశాల మీద ఈ ప్రాజెక్టు దృష్టి పెడుతుంది, ఫలితంగా ప్రముఖ కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్‌గా అవతరిస్తుంది.

ప్రస్తుత కేంద్రాల నుంచి భారతీయ & ప్రాంతీయ నౌకలను ఆకర్షించడం, ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకోవడం, భారతీయ వాణిజ్యంలో రవాణా ఇబ్బందులు తగ్గించడం, ఎగుమతి పోటీతత్వాన్ని పెంచడం, ఆసియా-ఆఫ్రికా, ఆసియా-యుఎస్/యూరప్ కంటైనర్ ట్రాఫిక్ వాణిజ్యానికి భారతదేశం అతి పెద్ద కేంద్రంగా మారడానికి అవకాశాన్ని సృష్టించడం కోసం ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్‌ ప్రారంభించాల్సిన ఒక బలమైన పరిస్థితి ఉందని నిపుణులు చాలాకాలంగా చెబుతున్నారు. ప్రస్తుతం, భారత్‌ రవాణా చేస్తున్న సరకులో దాదాపు 75%ను భారతదేశం వెలుపల ఉన్న ఓడరేవుల్లో నిర్వహిస్తున్నారు. కొలంబో, సింగపూర్, క్లాంగ్ ఈ కార్గోలో 85% భాగాన్ని నిర్వహిస్తున్నాయి, కొలంబో నౌకాశ్రయం ఒక్కటే 45% నిర్వహిస్తోంది. భారతీయ ఓడరేవులు ట్రాన్స్‌షిప్‌మెంట్ సరకు మీద ఏటా $200-220 మిలియన్లను ఆదా చేయగలవు. గెలాథియా బే ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్‌ను అభివృద్ధి చేయడం వల్ల విదేశీ మారక నిల్వలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఇతర దేశీయ ఓడరేవుల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరగడం, మెరుగైన రవాణా మౌలిక సదుపాయాలు వంటివి సాధ్యమవుతాయి. తద్వారా, నిర్వహణ సామర్థ్యాలు, ఉపాధి కల్పన, ఆదాయం పెరగడం వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఈ ట్రాన్స్‌షిప్‌మెంట్ కేంద్రంలో నౌకల మరమ్మతులు, సిబ్బంది మార్పు సౌకర్యం, రవాణా విలువ ఆధారిత సేవలు, సరకు నిల్వ కేంద్రాలు వంటి అనేక ఇతర అనుబంధ వ్యాపారాలు కూడా ప్రణాళికలో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ముగిసే నాటికి మరో 1700-4000 ఉద్యోగాలను నేరుగా సృష్టించే అవకాశం ఉంది.

ప్రతిపాదిత నౌకాశ్రయాన్ని నాలుగు దశల్లో అభివృద్ధి చేయాలని భావించారు. మొత్తం అంచనా వ్యయం రూ.41,000 కోట్లు. 4 మిలియన్ టీఈయూల నిర్వహణ సామర్థ్యంతో 2028లో మొదటి దశ ప్రారంభమవుతుంది, అంతిమ దశలో 16 మిలియన్ టీఈయూలకు ఇది పెరుగుతుంది. మొదటి దశ అంచనా వ్యయం దాదాపు రూ.18,000 కోట్లు. ఇందులో బ్రేక్‌వాటర్ల నిర్మాణం, పూడికతీత, పునరుద్ధరణ, బెర్త్‌లు, సరకు నిల్వ ప్రాంతాలు, భవనాలు & సౌకర్యాలు, ఉపకరణాల సేకరణ & ఏర్పాటు, ప్రభుత్వ సహకారంతో కీలక మౌలిక సదుపాయాలతో పోర్ట్ కాలనీ అభివృద్ధి కూడా మొదటి దశ ప్రణాళికలో ఉన్నాయి.

భూహక్కుదారు మార్గంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో ఈ ప్రాజెక్టును చేపడతారు. కనీస నౌకా ట్రాఫిక్‌ హామీకి లోబడి సొంత మార్కెట్, వ్యాపార అంచనాల ఆధారంగా సరకు నిల్వ ప్రాంతం, కంటైనర్ నిర్వహణ పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకునే సౌలభ్యం కాంట్రాక్టుదారుకు ఉంటుంది. కాంట్రాక్టుదారుకు 30 నుంచి 50 సంవత్సరాల (పరిస్థితిని బట్టి) దీర్ఘకాలిక పీపీపీ రాయితీని అందజేస్తారు. నౌకాశ్రయ సేవల నిబంధనలకు కాంట్రాక్టు సంస్థ బాధ్యత వహిస్తుంది. నౌకాశ్రయ వినియోగదార్ల మీద రుసుములు విధించడానికి, వసూలు చేయడానికి హక్కులు ఉంటాయి.

కేంద్ర ఓడరేవులు, నౌకారవాణా, జలమార్గాల మంత్రి శ్రీ శర్వానంద సోనోవాల్‌ ఈ ప్రాజెక్టుపై సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశాన్ని స్వీయ భరోసా, స్వావలంబన కలిగిన దేశంగా అభివృద్ధి చేయడంలో ఈ ప్రాజెక్టు ఒక ప్రధాన మైలురాయి అని, దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఊహించిన నవ భారతదేశాన్ని నిర్మించేందుకు తన మంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు.

మంత్రిత్వ శాఖ తరపున కోల్‌కతాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్టు (ఎస్‌ఎంపీకే) ఈ ప్రాజెక్టు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ, లాభదాయకమైన వృద్ధిని సాధించగల నౌకాశ్రయ నిర్మాణ సాంకేతిక నైపుణ్యం, ఆర్థిక సామర్థ్యం, అనుభవం ఉన్న సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలను ఎస్‌ఎంపీకే ఆహ్వానిస్తుంది,


ఐసీటీపీ గలాథియా తీరానికి సంబంధించిన ఈవోఐ జనవరి 28, 2023 నుంచి ఎస్‌ఎంపీకే వెబ్‌సైట్ https://smportkolkata.shipping.gov.inhttps://kopt.enivida.inలో అందుబాటులో ఉంటుంది. ఈవోఐ సమర్పించాల్సిన తేదీ సహా అన్ని ఇతర వివరాలు, గడవు పొడిగింపు, వివరాల సవరణ మొదలైనవి పై వెబ్‌సైట్లలో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అన్ని నియమ, నిబంధనలు ఈవోఐ ప్రకటన ప్రకారం ఉండాలి.

***



(Release ID: 1894135) Visitor Counter : 193