ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

రేపు న్యూదిల్లీలో జరగనున్న మొట్టమొదటి 'ఇండియా స్టేక్ డెవలపర్ కాన్ఫరెన్స్'


ఇండియా స్టేక్‌ను భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా విస్తృతం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది: మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్

ఇండియా స్టేక్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, ప్రపంచీకరించడంపై చర్చించనున్న ప్రభుత్వం, పరిశ్రమ, అంకుర సంస్థలు/యునికార్న్‌ల ప్రతినిధులు, మేధావులు

జీ20 దేశాలు, జీ20 సచివాలయాల ప్రతినిధులకు కూడా ఈ సదస్సుకు ఆహ్వానం

Posted On: 24 JAN 2023 5:06PM by PIB Hyderabad

భారతదేశ డిజిటల్ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిచే మార్గాలపై చర్చించే మొట్టమొదటి 'ఇండియా స్టేక్ డెవలపర్ కాన్ఫరెన్స్' రేపు న్యూదిల్లీలో జరగనుంది.

ప్రభుత్వం, పరిశ్రమ, అంకుర సంస్థలు, యునికార్న్‌ల ప్రతినిధులు, మేధావులు కలిసి 100 మందికి పైగా డిజిటల్ నాయకులు ఈ సదస్సుకు హాజరవుతారు. జీ20 దేశాలు, జీ20 సచివాలయాల ప్రతినిధులను కూడా ఈ సదస్సుకు ఆహ్వానించారు.

కేంద్ర ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతికత శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ఈ సదస్సు గురించి వివరించారు. బలమైన అంకుర సంస్థలు, ఆవిష్కరణల వ్యవస్థను భారత్‌లో అభివృద్ధి చేసే మార్గాలను అన్వేషించడానికి పరిశ్రమ, అభివృద్ధి వర్గానికి ఈ సదస్సు ఒక వేదికగా మారుతుంది, ఇండియా స్టేక్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తృతం చేసే మార్గాలపై చర్చించే అవకాశాన్ని కూడా అందిస్తుందని చెప్పారు.

ఇండియా స్టేక్ అంటే ఆధార్, యుపీఐ, డిజీ లాకర్, కొ-విన్, జీఈఎం, జీఎస్‌టీఎన్ వంటి డిజిటల్ పరిష్కారాలతో కూడిన బహుళ-పొరల క్లస్టర్‌ అని మంత్రి చెప్పారు. భారతదేశంలో డిజిటల్ పరివర్తనలో ఇవన్నీ ముఖ్య పాత్ర పోషించాయి. “కొవిడ్ తర్వాత క్షేత్ర స్థాయిలో అభివృద్ధి, పరిపాలన కోసం సాంకేతికతను ఉపయోగించడంలో భారతదేశం ఒక ప్రముఖ దేశంగా ఉద్భవించింది. మా దృష్టి ఇప్పుడు దేశంలో డిజిటల్ ఉత్పత్తుల వ్యాప్తిని విస్తృతం చేయడం, విదేశాల్లోనూ వాటి వ్యాప్తిని విస్తృతం చేయడంపై ఉంది" అని మంత్రి వెల్లడించారు.

“వసుధైక కుటుంబం (ప్రపంచమంతా ఒకే కుటుంబం) సూత్రాన్ని మేం విశ్వసిస్తాం. భారతదేశ చొరవను అనుసరించడానికి ఆసక్తి ఉన్న దేశాలు తమ అవసరాలకు అనుగుణంగా ఇండియా స్టేక్‌ను స్వీకరించవచ్చు" అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

వచ్చే నెలలో అబుదాబిలో జరగనున్న 'వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2023'లో ఆకర్షణీయ అంశాల్లో ఇండియా స్టేక్ ఒకటిగా ఉంటుందని మంత్రి తెలిపారు.

 

***(Release ID: 1893486) Visitor Counter : 236


Read this release in: English , Urdu , Hindi , Malayalam