భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

'ఎన్నికల సమగ్రత' కోహోర్ట్‌కు అధ్యక్షత వహిస్తున్న భారత ఎన్నికల సంఘం, 'సాంకేతికత వినియోగం & ఎన్నికల సమగ్రత'పై 2వ అంతర్జాతీయ సదస్సును నిర్వహించనుంది

Posted On: 22 JAN 2023 5:31PM by PIB Hyderabad

2023 జనవరి 23-24 తేదీల్లో, 'సాంకేతికత వినియోగం & ఎన్నికల సమగ్రత' అనే అంశంపై 2వ అంతర్జాతీయ సదస్సును భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) న్యూదిల్లీలో నిర్వహిస్తోంది. 'ఎన్నికల సమగ్రత' కోహోర్ట్‌కు ఈసీఐ అధ్యక్షత వహిస్తోంది. డిసెంబర్ 2021లో జరిగిన 'ప్రజాస్వామ్య సదస్సు'కు కొనసాగింపుగా ఈ కోహోస్ట్‌ ఏర్పాటైంది. 'ఎన్నికల నిర్వహణ సంస్థల పాత్ర, ముసాయిదా, సామర్థ్యం' అనే అంశంపై 2022 అక్టోబర్ 31 - నవంబర్ 01 తేదీల్లో న్యూదిల్లీలో కోహోర్ట్ మొదటి అంతర్జాతీయ సమావేశం జరిగింది. 11 దేశాలకు చెందిన ఎన్నికల నిర్వహణ సంస్థల (ఈఎంబీ) నుంచి 50 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ ప్రారంభించనున్నారు. ముగింపు కార్యక్రమానికి భారత ఎన్నికల కమిషనర్ శ్రీ అనుప్ చంద్ర పాండే అధ్యక్షత వహిస్తారు. మొదటి సాంకేతిక సమావేశానికి భారత ఎన్నికల కమిషనర్ శ్రీ అరుణ్ గోయెల్ అధ్యక్షత వహిస్తారు. కోహోర్ట్‌కు సహాధ్యక్షులుగా వ్యవహరించడానికి గ్రీస్, మారిషస్, ఐఎఫ్‌ఈఎస్‌ను భారత ఎన్నికల సంఘం ఆహ్వానించింది. ప్రపంచ దేశాల ఎన్నికల నిర్వహణ సంఘాలు, ప్రభుత్వ నేతలతో పాటు ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్స్, ఇంటర్నేషనల్ ఐడియాను కూడా ఈ సదస్సుకు ఈసీఐ ఆహ్వానించింది.

అంగోలా, అర్జెంటీనా, అర్మేనియా, ఆస్ట్రేలియా, చిలీ, క్రొయేషియా, డొమినికా, ఫిజి, జార్జియా, ఇండోనేషియా, కిరిబాటి, మారిషస్, నేపాల్, పరాగ్వే, పెరూ, ఫిలిప్పీన్స్, సురినామ్‌తో సహా 17 దేశాలు/ఈఎంబీల నుంచి 43 మంది ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థలైన ఐఎఫ్‌ఈఎస్‌, ఇంటర్నేషనల్‌ ఐడియా నుంచి ఆరుగురు ఈ సదస్సులో పాల్గొంటారు. న్యూదిల్లీలో ఉన్న అనేక విదేశీ మిషన్ల ప్రతినిధులు కూడా సదస్సుకు హాజరుకానున్నారు.

నేపథ్యం:

2021 డిసెంబర్‌లో అమెరికా అధ్యక్షుడు ప్రారంభించి, ఆతిథ్యం ఇచ్చిన ఒక కార్యక్రమం 'సమ్మిట్ ఫర్ డెమోక్రసీ'. డిసెంబర్ 9, 2021న జరిగిన లీడర్స్ ప్లీనరీ కార్యక్రమంలో భారత ప్రధాని ప్రసంగించారు. ఈ సదస్సు తర్వాత, ప్రజాస్వామ్యానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు, సమావేశాలతో కూడిన "కార్యాచరణ సంవత్సరం"ను ప్రతిపాదించారు. కార్యాచరణ సంవత్సరంలో భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి  ‘ఫోకల్ గ్రూప్స్‌’, ‘డెమోక్రసీ కోహోర్ట్స్‌’ పేరిట రెండు వేదికలను కూడా ఈ సదస్సు ఏర్పాటు చేసింది. 2వ 'సమ్మిట్ ఫర్ డెమోక్రసీ' 2023 మార్చి 29-30 తేదీల మధ్య జరగనుంది. కోస్టారికా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, నెదర్లాండ్స్, జాంబియా, అమెరికా ప్రభుత్వాలు సహ-ఆతిథ్య దేశాలుగా ఈ సదస్సును నిర్వహిసాయి.

‘సమ్మిట్ ఫర్ డెమోక్రసీ’ కార్యాచరణ సంవత్సరంలో భాగంగా, తన వద్ద ఉన్న సమాచారం, సాంకేతిక నైపుణ్యం, అనుభవాలను ప్రపంచంలోని ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పంచుకోవడానికి ఈసీఐ ద్వారా ‘డెమోక్రసీ కోహోర్ట్ ఆన్ ఎలక్షన్ ఇంటెగ్రిటీ’ సదస్సుకు భారతదేశం నాయకత్వం వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ సంస్థలకు (ఈఎంబీలు) శిక్షణ, సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమాలను అందించాలని, ఇతర ఈఎంబీల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక సలహాలను అందించాలని అధ్యక్ష స్థానంలో ఉన్న భారత ఎన్నికల సంఘం ప్రతిపాదించింది

 

***


(Release ID: 1892909) Visitor Counter : 354