ఆర్థిక మంత్రిత్వ శాఖ
మొదటి జి-20 మౌలిక సదుపాయాల వర్కింగ్ గ్రూప్ (ఐ.డబ్ల్యూ.జి) సమావేశం పూణేలో ముగిసింది.
జి-20 ఐ.డబ్ల్యు.జి. సమావేశానికి 18 సభ్య దేశాల నుండి 64 మంది సభ్యులు హాజరయ్యారు.
సంస్కృతి, చరిత్రతో పాటు పూణే వంటకాలను కూడా ప్రతినిధులు ఆస్వాదించారు.
జి-20 ఐ.డబ్ల్యూ.జి రెండవ సమావేశం 2023 మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జరగనుంది.
Posted On:
17 JAN 2023 6:58PM by PIB Hyderabad
భారత్ అధ్యక్ష హోదాలో జి-20 దేశాల కూటమి మొదటి మౌలిక సదుపాయాల వర్కింగ్ గ్రూప్ సమావేశం 2023 జనవరి, 17వ తేదీన పూణేలో ముగిసింది. ఈ సమావేశానికి 18 సభ్య దేశాలు, 8 అతిథి దేశాలతో పాటు, 8 అంతర్జాతీయ సంస్థల నుండి 64 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భారత్ జి-20 అధ్యక్ష హోదాలో 2023 మౌలిక సదుపాయాల ఎజెండాను, జి-20 ఐ.డబ్ల్యూ.జి. చర్చించింది.
అధ్యక్ష హోదాలో భారతదేశం ఆతిథ్యమిచ్చిన ఈ రెండు రోజుల సమావేశంలో, "సమ్మిళిత, స్థితిస్థాపక, స్థిరమైన - రేపటి ఆర్థిక నగరాలు" అనే ప్రధాన ఇతివృత్తం పై చర్చ జరిగింది. నగరాలను ఆర్థిక వృద్ధి కేంద్రాలు గా మార్చేందుకు అవసరమైన పట్టణ మౌలిక సదుపాయాలకు ఆర్థిక సహకారం, భవిష్యత్తు అవసరాలకు అనువైన పట్టణ మౌలిక సదుపాయాలను నిర్మించడం, స్థిరమైన లక్ష్యాలను చేరుకోవడంలో నగరాల పాత్ర, ఇంధన-సమర్థతతో, పర్యావరణపరంగా స్థిరమైన మౌలిక సదుపాయాల కోసం ప్రైవేట్ ఆర్థిక సహకారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి, సామాజిక అసమతుల్యతలను తగ్గించడానికి వీలుగా ఆర్థిక పెట్టుబడులను నిర్దేశించడం వంటి వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి.
మౌలిక సదుపాయాల వ్యయంపై సమాచారాన్ని క్రోడీకరించే మార్గాలను అన్వేషించి, ఆ సమాచారం ప్రైవేటు రంగానికి ఉపయోగపడేలా చేయడం వంటి ఇతర ముఖ్యమైన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది.
పూణే సమావేశాల నేపథ్యంలో, "రేపటి నగరాలకు ఆర్థిక సహకారం" అనే అంశంపై ఉన్నత-స్థాయి వర్క్-షాప్ కూడా జరిగింది. ఇందులో 15 మందికి పైగా అంతర్జాతీయ నిపుణులు పాల్గొని, నగరాలకు ఆర్థిక సహకారం అందించడానికి సంబంధించిన సమస్యలపై చర్చించారు. ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచడానికి రేపటి నగరాలు తమ కీలకమైన పరిపాలనా విధులతో పాటు, వాటి ప్రణాళిక, నిధులు, ఆర్థిక సహకారాలను, నిధుల సమీకరణలను ఏ విధంగా ఒకదానితో ఒకటి అనుసంధానం చేయాలి అనే అంశాలపై కూడా ఈ వర్క్ షాప్ చర్చించింది. మూడు అంతర్-సంబంధిత సెషన్లుగా విభజించబడిన వర్క్‌షాప్ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది, రేపటి నగరాలను నిర్మించడానికి సాంకేతిక, యాజమాన్య నిర్వహణ సామర్థ్యం అవసరం. రేపటి నగరాలకు అవసరమైన ప్రైవేట్ ఆర్ధిక సహాకారాన్ని అందుకోడానికి, నగరాలు, ప్రభుత్వాలు తమను తాము ఎలా సిద్ధం చేసుకోవాలో అనే అంశంపై కూడా వర్క్‌షాప్ చర్చించింది.
ఐ.డబ్ల్యూ.జి. సమావేశాల సందర్భంగా ప్రతినిధులకు, పూణే యొక్క గొప్ప వంటకాలు, చరిత్ర, సంస్కృతిని అనుభవించే అవకాశం కూడా లభించింది. మొత్తం మీద, ప్రతినిధులు ఉత్పాదక సమావేశాలతో పాటు, పూణే అందించే సాంస్కృతిక అనుభవాలను కూడా ఆస్వాదించారు.
మౌలిక సదుపాయాల వర్కింగ్ గ్రూప్ రెండవ సమావేశం 2023 మార్చి 28, 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జరగనుంది.
*****
(Release ID: 1892060)
Visitor Counter : 271