వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
"స్టార్ట్-అప్-ఇండియా-ఇన్నోవేషన్" వారోత్సవాల్లో భాగంగా 5వ రోజు "సపోర్టింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్" పై నిర్వహించిన : వెబినార్లు, కాన్ఫరెన్సు, హ్యాక్-థాన్ లు
Posted On:
14 JAN 2023 7:04PM by PIB Hyderabad
"స్టార్టప్-ఇండియా-ఇన్నోవేషన్" వారోత్సవాల్లో భాగంగా, ఈరోజు, 5వ రోజు, భారతదేశంలో వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థ పురోగతిపై దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఎర్నాకులం లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & మేనేజ్‌మెంట్ సంస్థ "ఆల్-కేరళ రోబో ఛాంపియన్‌షిప్" పోటీలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, కేరళ వ్యాప్తంగా ఉన్న యాభైకి పైగా పాఠశాలలకు చెందిన విద్యార్థుల కోసం రాష్ట్ర స్థాయి పోటీ జరిగింది. రోబో వార్, హ్యాక్-థాన్, స్పేస్, రోబోటిక్స్, కోడింగ్ మొదలైన క్రియాశీల ఇతివృత్తాలకు సంబంధించిన అనేక ఇతర పోటీల్లో పాల్గొనడానికి విద్యార్థులకు అవకాశం కల్పించారు.
"వెబినార్-ఆన్-రెస్పాన్సిబుల్-ఇన్వెస్టింగ్-మెకానిజం" అనే అంశంపై, "స్టార్టప్-ఇండియా" ఒక వెబినార్ నిర్వహించింది. బాధ్యతాయుతమైన పెట్టుబడి యంత్రాంగం, ప్రస్తుతం ఉన్న పారిశ్రామికవేత్తలతో పాటు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇచ్చే వ్యూహాలపై ఈ వెబినార్ దృష్టి సారించింది.
ఈ వెబినార్ ను ఇక్కడ వీక్షించవచ్చు :
Masterclass on Responsible Investing | 14th January 2023
జాతీయ అంకుర సంస్థల దినోత్సవాన్ని పురస్కరించుకుని, నోయిడాలోని "క్యురేటివ్స్ టెక్నాలజీస్ & కన్సల్టేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అంకుర సంస్థల కోసం ఒక సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, 'అంకుర సంస్థల కోసం అమ్మకాలు / అభివృద్ధిని అర్థంచేసుకోవడం' అదే విధంగా, 'అంకుర సంస్థలను ఎలా పెంపొందించాలి, పెట్టుబడిదారులకు ఏమి కావాలి' అనే అంశాలపై రెండు సదస్సులు జరిగాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అంకుర సంస్థల వ్యవస్థాపకులు, విద్యార్థులు, యువ ఆవిష్కర్తలు దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొన్నారు.
ఐ.ఐ.ఎం. ఉదయపూర్ ఇంక్యుబేషన్ సెంటర్, జాతీయ అంకుర సంస్థల దినోత్సవాన్ని టి.ఐ.ఈ. ఉదయపూర్, సక్షం సహకారంతో, తమ కేంద్రంలో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, ఒక ప్రత్యేక ప్యానెల్ చర్చ, నాలెడ్జ్ సెషన్లతో పాటు, కొన్ని ఎంపిక చేసిన గుర్తింపు పొందిన అంకుర సంస్థలను సత్కరించాలని కూడా నిర్ణయించారు.
విద్యార్థులు, వ్యవస్థాపకులు, అంకుర సంస్థల ఔత్సాహికుల కోసం, "వ్యవస్థాపకత" అనే అంశంపై, ముంబైలోని వీరమాత జిజాబాయి సాంకేతిక సంస్థకు చెందిన "టెక్నాలజీ-బిజినెస్-ఇంక్యుబేటర్" సంస్థ "సెంటినరీ హ్యాకథాన్" ను నిర్వహించింది. వీటికి అదనంగా, ఈ కేంద్రంలో రోజంతా ‘ఐడియా & ఇన్నోవేషన్ పోటీ’ నిర్వహించి, విజేతలకు అద్భుతమైన బహుమతులు ప్రదానం చేశారు.
ఈనాటి రాష్ట్ర స్థాయి సదస్సును పుణె కు చెందిన "ఐడియాస్-టు-ఇంపాక్ట్స్-ఇన్నోవేషన్స్-ప్రైవేట్-లిమిటెడ్" సంస్థ నిర్వహించింది. ఈ సదస్సులో 400 కంటే ఎక్కువ నమోదిత అంకుర సంస్థలతో పాటు ముఫై మంది కంటే ఎక్కువగా పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఒక నిపుణుడి కీలకోపన్యాసంతో ఈ సదస్సు ప్రారంభమైంది. ఆ తర్వాత ‘స్టార్టప్-ఎగ్జిట్స్-అండ్-ఫండ్-రైజింగ్’ అనే అంశంపైన, ‘ఇన్వెస్ట్‌మెంట్- ల్యాండ్‌స్కేప్- ఇన్- ఇండియా’ అనే అంశంపైనా జరిగిన రెండు ప్యానెల్ చర్చల్లో పూణేకి చెందిన పలువురు పెట్టుబడిదారులు పాల్గొన్నారు.
*****
(Release ID: 1891426)
Visitor Counter : 138