శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
జాతీయ సైన్స్ దినోత్సవం-2023 ఇతివృత్తం ఆవిష్కరణ
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చేతుల మీదుగా విడుదల
“ప్రపంచ సంక్షేమం కోసం విశ్వ విజ్ఞాన శాస్త్రం” పేరిట
ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో కార్యక్రమం...
అంతర్జాతీయ వైజ్ఞానిక రంగంలో పెరుగుతున్న
భారత్ పాత్రను ఇది సూచిస్తోందన్న కేంద్రమంత్రి..
‘రామన్ ఎఫెక్ట్’ ఆవిష్కరణ జ్ఞాపకార్థం యేటా ఫిబ్రవరి 28 న
దేశవ్యాప్తంగా జాతీయ వైజ్ఞానిక దినోత్సవం నిర్వహణ.
జాతీయ సైన్స్ దినోత్సవ ఇతివృత్తం ఎంపిక,
వివిధ కార్యక్రమాల నిర్వహణపై మార్గనిర్దేశం చేసినందుకు
ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రి..
భారతదేశం జి-20 సారథ్య బాధ్యతలు చేపట్టిన తరుణంలో జాతీయ సైన్స్ డే ఇతివృత్తం ఎంపిక...
ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, వర్ధమాన దేశాలతో సహా
ప్రపంచ దక్షిణాది దేశాల వాణిగా నిలిచిన భారత్: జితేంద్ర సింగ్
Posted On:
09 JAN 2023 4:05PM by PIB Hyderabad
"ప్రపంచ సంక్షేమం కోసం విశ్వవిజ్ఞాన శాస్త్రం" పేరిట రూపొందించిన ఈ సంవత్సరపు "జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం-నేషనల్ సైన్స్ డే" ఇతివృత్తాన్ని కేంద్ర సైన్స్-టెక్నాలజీ శాఖ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేసారు. ఈ రోజు ఇక్కడి నేషనల్ మీడియా సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో విజ్ఞాన శాస్త్ర దినోత్సవ ఇతివృత్తాన్ని ఆయన ఆవిష్కరించారు. స్వతంత్ర హోదా కలిగిన సహాయమంత్రిగా భూగోళ శాస్త్రాలు, ప్రధాని కార్యాలయ వ్యవరారాలు, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖలను కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ పర్యవేక్షిస్తున్నారు.
ఈ నాటి కార్యక్రమంలో కేంద్రమంత్రి ప్రసంగిస్తూ, దేశం 2023లోకి ప్రవేశిస్తున్నందున ప్రస్తుత తరణంలో విజ్ఞాన శాస్త్ర రంగంలో పెరుగుతున్న భారతదేశం పాత్రను, అంతర్జాతీయ రంగంలో నిర్వహించవలసిన భూమికను సైన్స్ దినోత్సవ ఇతివృత్తం తెలియజేస్తున్నదని అన్నారు.
జాతీయ సైన్స్ దినోత్సవ ఇతివృత్తం, అధ్యయన అంశానికి, కార్యక్రమాలకు సంబంధించి గట్టి మార్గనిర్దేశం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి డాక్టర్ జితేంద్ర సింగ్ తన కృతజ్ఞతలు తెలిపారు.
"ప్రపంచ సంక్షేమం కోసం విశ్వ విజ్ఞానశాస్త్రం" అనే ఇతివృత్తం, జి-20 దేశాల అధ్యక్ష పదవిని భారతదేశం చేపట్టడానికి అనుగుణంగా ఉండటం అభినందనీయమని, ఆసియా, ఆఫ్రికా, దక్షిణఅమెరికాతో పాటు, ప్రపంచంలోని దక్షిణాది వర్ధమాన దేశాల వాణికి ప్రతిరూపంగా భారతదేశం తయారవుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోదీ నరేంద్ర మోదీ సారథ్యంలో భారతదేశం ప్రపంచ దృష్టిని గణనీయంగా ఆకర్షించిందని ప్రపంచ స్థాయిలో ఎదురయ్యే సవాళ్ల పరిష్కారం లక్ష్యంగా ఫలితాల ప్రాతిపదికన ప్రపంచ స్థాయి సహకారానికి తాము సంసిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి చెప్పారు. ఆందోళనలు, సవాళ్లు, ప్రమాణాలు ప్రపంచ స్థాయికి చేరినపుడు, పరిష్కారాలు కూడా ప్రపంచ స్థాయిలోనే అదే ప్రమాణాలతో దీటుగా ఉండాలని ఆయన అన్నారు.
'రామన్ ఎఫెక్ట్' ఆవిష్కరణ సంస్మరణార్థం ప్రతియేటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారు. ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా భారత ప్రభుత్వం 1986లో ప్రకటించింది. తాను రామన్ ఎఫెక్ట్ అన్న సిద్ధాంతాన్ని కనుగొన్నట్టు సర్ సి.వి. రామన్ అదే రోజున ప్రకటించారు. ఇందుకోసం ఆయనకు 1930లో ప్రతిష్టాత్మక భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. సైన్స్ డే సందర్భంగా దేశమంతటా ప్రత్యేక ఇతివృత్తం ప్రాతిపదికగా విజ్ఞాన శాస్త్ర కార్యక్రమాలను, ఇనేక ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తారు.
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని శాస్త్రవేత్తలకు, విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని ప్రదర్శించే ఔత్సాహికులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేసిన సంగతిని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా గుర్తుజేశారు. ప్రపంచ శ్రేయస్సు కోసం కృషి చేయవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. “విజ్ఞాన శాస్త్రపరంగా మన ఉమ్మడి బాధ్యతను నెరవేర్చడానికి, మానవాళికి శాస్త్రీయ విజ్ఞాన శక్తిని అందించడానికి, మానవ ప్రగతికి మన నిబద్ధతను పునరుద్ఘాటిద్దాం." అని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ శ్రేయస్సును ప్రభావితం చేస్తున్న విజ్ఞానశాస్త్రీయ అంశాలపై ప్రజల ప్రశంసలను పెంచే ధ్యేయంతోనే ప్రపంచ సంక్షేమం కోసం విశ్వవిజ్ఞాన శాస్త్రం అన్న ఇతివృత్తాన్ని ఎంపిక చేసినట్టు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు.
భారతీయ వైజ్ఞానిక ప్రగతి ఈ నాడు ప్రయోగశాల నుంచి భూమికి చేరుకున్నదని, వాస్తవానికి సామాన్యులకు "జీవన సౌలభ్యం" అందించేందుకు ప్రతి కుటుంబంలోని వారూ విజ్ఞాన శాస్త్ర ప్రయోజనాలను అనుభవిస్తున్నారని, పరికరాలను ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు. మానవజాతి శ్రేయస్సు లక్ష్యంగా, దేశంతోపాటు, విదేశాల్లోని విజ్ఞానశాస్త్ర సమాజం సైన్స్ అధ్యయనంలో ఆనందాన్ని అనుభవించడానికి, కలిసికట్టుగా పనిచేయడానికి తగిన అవకాశాలను అందించడానికి సైన్స్ కొత్త శకానికి నాంది పలికిందని మంత్రి తెలిపారు.
దేశంలోని సైన్స్-టెక్నాలజీ సానుకూల వాతావరణం గత ఎనిమిదిన్నరేళ్లలో కొత్తగా అనేక ప్రధాన సంస్కరణలను ప్రారంభించడానికి దోహదపడిందని, దీనితో ఎన్నో దీర్ఘకాలిక ప్రభావాలతో దేశం వేగంగా పురోగతి సాధించే అవకాశం ఏర్పడిందని అన్నారు. సైన్స్‌పై ప్రభుత్వం మరింతగా దృష్టిని కేంద్రీకరిస్తుందన్నారు. పారిశ్రామికీకరణ, సాంకేతిక పరిజ్ఞాన రంగంలో భారతదేశం క్రమంగా ప్రపంచ దేశాల సారథిగా ముందుకు సాగుతుందని అన్నారు. 2020వ సంవత్సరపు సైన్స్, టెక్నాలజీ-ఆవిష్కరణ విధానంగా పిలుచుకునే భారతదేశం కొత్త ప్రణాళికతో విజ్ఞాన శాస్త్రానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని, నిపుణుల సారథ్యంలో మరింత ప్రతిభావంతంగా ముందుకు సాగుతుందని కేంద్రమంత్రి తెలిపారు.
భారత ప్రభుత్వ ప్రధాన వైజ్ఞానిక సలహాదారు డాక్టర్ అజయ్ కుమార్ సూద్ మాట్లాడుతూ, జాతీయ. సైన్స్ దినోత్సవ ఇతివృత్తం ఎంపికకు గల కారణాలను వివరించారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో ప్రపంచ దేశాలన్నీ పరస్పరం మరింత చేరువయ్యాయని అన్నారు. ఇకపై ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో ప్రపంచ దేశాలన్నీ మరింత చేరువయ్యే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. 1928 ఫిబ్రవరి 28న దిగ్గజ భారతీయ భౌతిక శాస్త్రవేత్త సి.వి. రామన్ ఒక ముఖ్యమైన వైజ్ఞానిక సిద్ధాంతాన్ని ఆవిష్కరించారని, దీన్నే రామన్ ఎఫెక్ట్‌గా వ్యవహరిస్తున్నారని డాక్టర్ సూద్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సైన్స్-టెక్నాలజీ (డి.ఎస్.టి.) శాఖ కార్యదర్శి ఎస్. చంద్రశేఖర్ స్వాగతోపన్యాసం చేశారు. ముఖ్యమైన వైజ్ఞానిక దినోత్సవాలను అనుబంధ కార్యక్రమాలతో జరుపుకోవడంవల్ల సమాజంలో శాస్త్రీయపరమైన అవగాహన, చైతన్యం కలుగుతుందని ఆయన అన్నారు. అనేక సంస్థలు, తమ ప్రయోగశాలల కోసం ఓపెన్ హౌస్‌ల పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తాయని, నిర్దిష్ట పరిశోధనా ప్రయోగశాలలో/సంస్థల్లో అందుబాటులో ఉన్న అవకాశాల గురించి అవి విద్యార్థులకు తెలియజేస్తాయని ఆయన చెప్పారు.
కేంద్ర సైన్స్-టెక్నాలజీ శాఖతో అనుబంధం ఉన్న వైజ్ఞానిక సంస్థలు, పరిశోధనా శాలలు, స్వయంప్రతిపత్తి వైజ్ఞానిక సంస్థలు దేశవ్యాప్తంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి వీలుగా సైన్స్-టెక్నాలజీ శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. రాష్ట్రాల సైన్స్-టెక్నాలజీ మండలలు, శాఖల ద్వారా దేశవ్యాప్తంగా నిర్వహించే ఉపన్యాసాలు, క్విజ్‌లు, ఓపెన్ హౌస్‌లు తదితర కార్యక్రమాలకు సైన్స్-టెక్నాలజీ శాఖ పరిధిలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్-టెక్నాలజీ కమ్యూనికేషన్ (ఎన్.సి.ఎస్.టి.సి.) మద్దతునిస్తోంది.
నేటి కార్యక్రమంలో కేంద్ర సైన్స్-టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్.సి.ఎస్.టి.సి. అధిపతి డాక్టర్ మనోరంజన్ మొహంతి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
సైన్స్ డే ఇతివృత్తం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సైన్స్-టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్.సి.ఎస్.టి.సి. అధిపతి డాక్టర్ మనోరంజన్ మొహంతి,
ఇతర సీనియర్ అధికారులు
<><><><><>
(Release ID: 1889894)
Visitor Counter : 714