రైల్వే మంత్రిత్వ శాఖ
రైలు ప్రయాణీకుల భద్రత కోసం నెల రోజుల పాటు దేశవ్యాప్త తనిఖీలు నిర్వహించిన ఆర్‌పీఎఫ్
Posted On:
06 JAN 2023 3:30PM by PIB Hyderabad
- మహిళల కోసం రిజర్వు చేసిన బోగీల్లో ప్రయాణించడం/ప్రవేశించిన నేరం మీద 5100 మందికి పైగా అరెస్టు
- దివ్యాంగుల కోసం రిజర్వ్ చేయబడిన బోగీలను ఆక్రమించిన/ప్రవేశించిన 6300 మందికి పైగా అరెస్టు
రైల్వే ఆస్తులు, ప్రయాణీకులు, ప్రయాణ ప్రాంగణాలు, వాటికి సంబంధించిన భద్రత బాధ్యతను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చూసుకుంటుంది. ప్రయాణీకులకు ఇబ్బంది లేని ప్రయాణం చేయడానికి, వారిలో భద్రత భావాన్ని పెంచడానికి నెల రోజుల పాటు దేశవ్యాప్త తనిఖీలను ఆర్‌పీఎఫ్ నిర్వహించింది. (i) మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేకించిన బోగీల్లోకి ఇతరుల ప్రవేశం (ii) హిజ్రాలతో ఇబ్బంది, భిక్షాటన, దోపిడీ (iii) సాధారణ బోగీల్లోని సీట్లను అనధికార వ్యక్తులు ఆక్రమించడం వంటి ఇబ్బందులపై ఈ తనిఖీల్లో దృష్టి పెట్టారు.
ఈ తనిఖీల సమయంలో, మహిళల కోసం రిజర్వ్ చేసిన బోగీల్లో ప్రయాణించిన/ప్రవేశించిన 5100 మందికి పైగా అరెస్టు అయ్యారు. దివ్యాంగుల కోసం రిజర్వ్ చేసిన బోగీలను ఆక్రమించిన/ప్రవేశించిన 6300 మందికి పైగా అరెస్టు అయ్యారు. రైల్వే చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం వారి మీద అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. వారికి వరుసగా రూ.6.71 లక్షలు, రూ.8.68 లక్షలు జరిమానా విధించారు.
రైళ్లలో, ముఖ్యంగా కొంతమంది హిజ్రాల వల్ల ఇబ్బంది, ప్రయాణీకుల పట్ల వారి దురుసు ప్రవర్తనకు సంబంధించి తరచూ చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఈ తనిఖీల సమయంలో, ప్రయాణీకులకు ఇబ్బంది కలిగిస్తున్న 1200 మందికి పైగా హిజ్రాలను అరెస్ట్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. రైల్వే చట్టంలోని నిబంధన ప్రకారం వారి నుంచి రూ.1.28 లక్షలను జరిమానా రూపంలో వసూలు చేశారు.
దీంతో పాటు, సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలోని సాధారణ బోగీల్లో సీట్లను అనధికారికంగా ఆక్రమిస్తున్న వారిని గుర్తించడానికి కూడా తనిఖీలు నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్న 36 మంది వ్యక్తులను గుర్తించి, వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ఈ తరహా తనిఖీలు కొనసాగించాలని ఆర్‌పీఎఫ్ క్షేత్ర స్థాయి సిబ్బందికి సూచించలు అందాయి.
***
(Release ID: 1889200)
Visitor Counter : 144