ప్రధాన మంత్రి కార్యాలయం

2022 డిసెంబర్ 25వ తేదీన జరిగిన ‘ మన్ కీ బాత్ ’ (‘ మనసు లో మాట ’) కార్యక్రమం96వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 25 DEC 2022 11:50AM by PIB Hyderabad

ప్రియమైన నా దేశవాసులారా, నమస్కారం. ఈ రోజు న మనం 'మన్ కీ బాత్' (మనసు లో మాట’) కార్యక్రమం తొంభై ఆరవ ఎపిసోడ్ లో భేటీ అవుతున్నాం. 'మన్ కీ బాత్' (మనసు లో మాట’) కార్యక్రమం తరువాతి ఎపిసోడ్ 2023వ సంవత్సరం లో ఒకటో ఎపిసోడ్ అవుతుంది. మీరు పంపిన సందేశాల ను పరిశీలిస్తున్నప్పుడు, వాటి లో గతించిపోతున్నటువంటి 2022 వ సంవత్సరాన్ని గురించి మాట్లాడాలి అంటూ మీరు విన్నవించడం నా దృష్టి కి వచ్చింది. భూతకాలాన్ని పరిశీలించడం అనేది ఎల్లప్పుడూ మనలకు వర్తమానం మరియు భవిష్యత్తు లకు సంబంధించినటువంటి సన్నాహాల కు ప్రేరణ ను ఇస్తుంది. 2022వ సంవత్సరం లో దేశ ప్రజల సామర్థ్యం, వారి యొక్క సహకారం, వారి యొక్క సంకల్పం, వారి యొక్క విజయాలు ఎంత ఎక్కువగా ఉన్నాయి అంటే వాటన్నిటిని ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట కార్యక్రమం) లో చేర్చడం కష్టం. 2022వ సంవత్సరం నిజానికి చాలా స్ఫూర్తిదాయకం గాను, అనేక విధాలుగా అద్భుతంగాను ఉంది. ఈ సంవత్సరాని కి భారతదేశం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరంలోనే అమృతోత్సవ కాలం ప్రారంభమైంది. ఈ సంవత్సరం దేశం కొత్త జోరు ను అందుకొన్నది. దేశప్రజలంతా ఒకరికి మించి మరొకరు మంచి పనుల ను చేశారు. 2022వ సంవత్సరం లో సాధించిన విజయాలు ప్రపంచవ్యాప్తం గా భారతదేశాని కి ప్రత్యేక స్థానాన్నికల్పించాయి. 2022వ సంవత్సరం అంటే భారతదేశం ప్రపంచం లోని ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ హోదా ను పొందడం. 2022వ సంవత్సరం అంటే ఎవరూ నమ్మలేని విధం గా దేశం 220 కోట్ల వేక్సీన్ ల మైలురాయి ని అధిగమించి రికార్డు ను సాధించడం. 2022వ సంవత్సరం అంటే భారతదేశం ఎగుమతుల లో 400 బిలియన్ డాలర్ల మేజిక్ ఫిగర్‌ ను దాటిపోవడం, 2022వ సంవత్సరం అంటే ప్రజలు ఆత్మ నిర్భర్ భారత్ సంకల్పాన్ని స్వీకరించడం, జీవించి చూపించడమూ ను. 2022వ సంవత్సరం అంటే భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ ను స్వాగతించడం. 2022వ సంవత్సరం అంటే అంతరిక్షం, డ్రోన్, రక్షణ రంగాల లో భారతదేశం యొక్క కీర్తిపతాక. 2022వ సంవత్సరం అంటే ప్రతి రంగం లో భారతదేశం యొక్క సాఫల్యం. కామన్ వెల్థ్ గేమ్స్ కానివ్వండి, లేదా మన మహిళా హాకీ జట్టు విజయం కానివ్వండి.. మన యువతీయువకులు అద్భుతమైన సామర్థ్యాన్ని కనబరచడం జరిగింది.

 

సహచరులారా, వీటన్నిటితో పాటు 2022 సంవత్సరాన్ని గుర్తుంచుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఇది 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' భావన యొక్క విస్తరణ గా ఉంది. దేశ ప్రజలు ఐకమత్యాన్ని, సంఘీభావాన్ని వేడుకగా జరుపుకొనేందుకు కూడాను అనేక అద్భుత కార్యక్రమాల ను నిర్వహించడం జరిగింది. రుక్మిణీ కళ్యాణం తో పాటు శ్రీకృష్ణుని కి ఈశాన్య ప్రాంతాల తో ఉన్న సంబంధాన్ని వెల్లడించే గుజరాత్‌ లోని మాధవపుర్ మేళా కావచ్చు, లేదా కాశీ-తమిళ సంగమం కావచ్చు.. ఈ పర్వదినాలలో ఏకీభావం యొక్క ప్రదర్శన అనేక వన్నెల ను రువ్వింది. 2022వ సంవత్సరం లో దేశ ప్రజలు మరో అజరామర చరిత్ర ను వ్రాశారు. ఆగస్టు లో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారాన్ని ఎవరు మరచిపోగలరు. దేశం లోని ప్రతి ఒక్కరి కి రోమాలు నిక్కబొడుచుకునే క్షణాలు అవి. స్వతంత్ర భారతదేశం 75 ఏళ్ల ఉత్సవాల సందర్భం లో దేశం యావత్తూ త్రివర్ణభరితం గా మారిపోయింది. 6 కోట్ల మంది కి పైగా ప్రజలు త్రివర్ణ పతాకం తో సెల్ఫీలు దిగి పంపించారు. ఈ స్వాతంత్ర్య అమృత మహోత్సవం వచ్చే ఏడాది కూడా ఇదే విధం గా కొనసాగనుంది. ఇది అమృతోత్సవ కాల పునాది ని మరింత బలోపేతం చేయగలదు.

 

సహచరులారా, జి-20 సమూహానికి అధ్యక్షత వహించే బాధ్యత కూడా ఈ ఏడాది భారతదేశాని కి లభించింది. ఇదివరకు దీని ని గురించి నేను విస్తారం గా చర్చించాను. 2023వ సంవత్సరం లో మనం జి-20 ఉత్సాహాన్ని కొత్త శిఖరాలకు తీసుకుపోవాలి. ఈ కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమం గా మార్చవలసి ఉన్నది.

 

ప్రియమైన నా దేశ ప్రజలారా, ఈ రోజు న క్రిస్ మస్ పండుగ ను ప్రపంచమంతటా ఘనంగా జరుపుకొంటున్నారు. ఇది యేసు క్రీస్తు యొక్క జీవనం, వారి బోధనల ను గుర్తుకు తెచ్చుకొనేటటువంటి దినం. నేను మీ కు అందరికి క్రిస్ మస్ తాలూకు చాలా చాలా శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను.

 

సహచరులారా, ఈ రోజు న గౌరవనీయ అటల్ బిహారీ వాజ్‌పేయి గారి పుట్టిన రోజు కూడాను. దేశాని కి అసాధారణమైనటువంటి నాయకత్వాన్ని అందించిన గొప్ప రాజనీతిజ్ఞుడు ఆయన. ఆయన కు భారతదేశం లో ప్రతి ఒక్కరి హృదయం లో ప్రత్యేక స్థానం ఉంది. కోల్‌కాతా కు చెందిన ఆస్థా గారి నుండి నాకు ఉత్తరం వచ్చింది. ఈ లేఖలో ఆమె తన దిల్లీ పర్యటన ను గురించి ప్రస్తావించారు. ఆ సమయం లో పీఎం మ్యూజియాన్ని సందర్శించడానికి వీలు చేసుకొన్నానంటూ ఆమె వ్రాశారు. ఆ సంగ్రహాలయం లోని అటల్ జీ గ్యాలరీ ఆమె కు బాగా నచ్చిందట. అక్కడ అటల్ జీ చిత్రం తో తీసుకున్న ఫోటో ఆమె కు ఎప్పుడూ గుర్తుండిపోయే జ్ఞాపకం గా మారిపోయింది. అటల్ జీ యొక్క గ్యాలరీ లో, దేశానికి ఆయన అందించినటువంటి అమూల్యమైన కృషి ని మనం చూడవచ్చును. మౌలిక సదుపాయాల రంగం లో గాని, లేదా విద్య రంగం లో గాని, లేదా విదేశాంగ విధానంలో గాని.. ప్రతి రంగం లో భారతదేశాన్ని కొత్త శిఖరాల కు తీసుకుపోవడానికి ఆయన పాటుపడ్డారు. నేను మరోసారి అటల్ జీ కి హృదయపూర్వకం గా నమస్కరిస్తున్నాను.

 

సహచరులారా, రేపు డిసెంబర్ 26వ తేదీ నాడు ‘వీర్ బాల్ దివస్’ ను జరుపుకోబోతున్నాం. ఈ సందర్భం లో అమరవీరులు సాహిబ్ జాదాలు జోరావర్ సింహ్ జీ, సాహిబ్ జాదా ఫతేహ్ సింహ్ జీ స్మృతి లో దిల్లీ లో నిర్వహించే ఒక కార్యక్రమం లో పాల్గొనే అదృష్టం నాకు కలిగింది. సాహిబ్ జాదే, మాతా గుజరీ ల త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకొంటుంది.

 

ప్రియమైన నా దేశవాసులారా, మన దగ్గర ఒక మాటను చెబుతూ ఉంటారు.. అదే,

“సత్యమ్ కిమ్ ప్రమాణం,

ప్రత్యక్షమ్ కిమ్ ప్రమాణమ్” .

ఈ మాటల కు సత్యాని కి రుజువులు అవసరం లేదు అని అర్థం. ఏదయితే ప్రత్యక్షం గా కనబడుతుంటుందో దానికి కూడా రుజువు అవసరం లేదు. కానీ ఆధునిక వైద్య శాస్త్రం విషయానికి వస్తే రుజువు చాలా ముఖ్యమైన విషయం. శతాబ్దాలుగా భారతీయుల జీవనం లో భాగం అయిన యోగ, ఆయుర్వేదం వంటి మన శాస్త్రాల లో సాక్ష్యాధారాలపై ఆధారపడిన పరిశోధన లేకపోవడం ఎప్పుడూ సవాలు గా ఉంది. ఫలితాలు కనిపిస్తాయి. కానీ రుజువులు కాదు. కానీ సాక్ష్యాధారిత వైద్య యుగంలో యోగ, ఆయుర్వేదం ఇప్పుడు ఆధునిక యుగ పరీక్షల లో విశ్వసనీయం అయినవి గా నిలుస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ముంబయి లో ఉన్న టాటా మెమోరియల్ సెంటర్ ను గురించి మీరంతా వినే ఉంటారు. పరిశోధన, నూతన ఆవిష్కరణ, కేన్సర్ సంరక్షణ లో ఈ సంస్థ చాలా పేరు సంపాదించింది. బ్రెస్ట్ కేన్సర్ పేషెంట్ లకు యోగ చాలా ప్రభావవంతం గా ఉంటుంది అని ఈ కేంద్రం చేసిన లోతైన పరిశోధన లో వెల్లడి అయింది. అమెరికా లో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి బ్రెస్ట్ కేన్సర్ సదస్సు లో టాటా మెమోరియల్ సెంటర్ తన పరిశోధన ఫలితాల ను వెల్లడించింది. ఈ ఫలితాలు ప్రపంచం లోని పెద్ద పెద్ద నిపుణుల దృష్టి ని ఆకర్షించాయి. ఎందుకంటే యోగ ఫలితం గా రోగులు ఎటువంటి ప్రయోజనాన్ని పొందారో టాటా మెమోరియల్ సెంటర్ సాక్ష్యాధారాల తో సహా తెలియజేసింది. ఈ కేంద్ర పరిశోధన ప్రకారం, క్రమం తప్పకుండా యోగ ను సాధన చేయడం వల్ల బ్రెస్ట్ కేన్సర్ పునరావృత్తం అయ్యే అవకాశాలు, మరణాల ముప్పు 15 శాతం తగ్గాయి. పాశ్చాత్య పద్ధతుల కఠినమైన ప్రమాణాల తో భారతీయ సంప్రదాయ వైద్య ఫలితాల నిగ్గు తేల్చడం విషయం లో ఇది మొదటి ఉదాహరణ. అలాగే బ్రెస్ట్ కేన్సర్‌ తో బాధపడుతున్న మహిళల్లో జీవన నాణ్యత ను మెరుగుపరచడం లో యోగ ఫలితాలను కనుగొన్న మొదటి అధ్యయనం ఇది. దీని దీర్ఘకాలిక ప్రయోజనాలు కూడా తెరపైకి వచ్చాయి. పేరిస్‌ లో జరిగిన యూరోపియన్ సొసైటీ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ సదస్సు లో టాటా మెమోరియల్ సెంటర్ తన అధ్యయనం యొక్క ఫలితాల ను సమర్పించింది.

 

సహచరులారా, నేటి యుగం లో భారతీయ వైద్య విధానాల లో సాక్ష్యాధారాలు ఎక్కువైనకొద్దీ ప్రపంచం మొత్తంలో వాటికి అంతగా ఆదరణ పెరుగుతుంది. ఈ ఆలోచన తో దిల్లీ లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎఐఐఎమ్ఎస్) లో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ మన సంప్రదాయ వైద్య విధానాలను ధ్రువీకరించడానికి సెంటర్ ఫార్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ ను ఆరేళ్ల కిందట స్థాపించారు. ఇందులో ఆధునిక పరిజ్ఞానాన్ని, పరిశోధన పద్ధతుల ను ఉపయోగించారు. ప్రఖ్యాత అంతర్జాతీయ జర్నల్స్‌ లో ఈ కేంద్రం ఇప్పటికే 20పత్రాలను ప్రచురించింది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌ లో ప్రచురితమైన ఒక పత్రం సిన్ కపీ తో బాధ పడుతున్న రోగుల కు యోగ వల్ల కలిగే ప్రయోజనాల ను వివరించడం జరిగింది. ఇదే విధం గా న్యూరాలజీ జర్నల్ లో ప్రచురితమైన పత్రం లో మైగ్రేన్‌ బాధితులకు యోగ వల్ల కలిగే ప్రయోజనాల ను వివరించడమైంది. ఇవే కాకుండా అనేక ఇతర వ్యాధుల బాధితుల కు కూడా యోగ వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించి అధ్యయనాలు జరుగుతున్నాయి. గుండె జబ్బు, డిప్రెశన్, స్లీప్ డిజార్డర్ మరియు గర్భవతులుగా ఉన్న కాలం లో మహిళ లు ఎదుర్కొనే సమస్యలు మొదలైన వాటిపై ఈ అధ్యయనాలు నిర్వహిస్తున్నారు.

 

సహచరులారా, కొన్ని రోజుల క్రితం నేను ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ లో పాల్గొనేందుకు గోవా వెళ్ళాను. ఇందులో 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొని 550కి పైగా శాస్త్రీయ పత్రాల ను సమర్పించారు. భారతదేశం తో సహా ప్రపంచవ్యాప్తం గా ఉన్న దాదాపు 215 కంపెనీ లు ఇక్కడ ప్రదర్శన లో వాటి ఉత్పత్తుల ను ప్రదర్శించాయి. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ ఎక్స్‌పో లో లక్ష మంది కి పైగా ప్రజలు ఆయుర్వేదాని కి సంబంధించిన అనుభవాన్ని ఆస్వాదించారు. ఆయుర్వేద కాంగ్రెస్‌ లో కూడా ప్రపంచం నలు మూలల నుండి హాజరైన ఆయుర్వేద నిపుణుల ను సాక్ష్యాధారిత పరిశోధనలు నిర్వహించవలసింది గా కోరాను. కరోనా మహమ్మారి కాలం లో యోగ, ఆయుర్వేదం ల యొక్క శక్తి ని మనమందరం చూస్తున్నాం. వీటికి సంబంధించిన సాక్ష్యాధారిత పరిశోధన లు చాలా ముఖ్యమైనవి గా నిరూపితం అవుతాయి. యోగ, ఆయుర్వేదం, మన సంప్రదాయ వైద్య పద్ధతుల కు సంబంధించిన అటువంటి ప్రయత్నాల ను గురించి మీ వద్ద ఏదైనా సమాచారం ఉంటే ఆ సమాచారాన్ని సోశల్ మీడియా లో పంచుకోవలసింది గా మిమ్మల్ని నేను కోరుతున్నాను.

 

ప్రియమైన నా దేశప్రజలారా, గత కొన్ని సంవత్సరాలు గా ఆరోగ్య రంగాని కి సంబంధించిన అనేక ప్రధాన సవాళ్ల ను మనం అధిగమించాం. మన వైద్య నిపుణులు, శాస్త్రవేత్త లు, దేశ ప్రజల సంకల్ప శక్తి వల్లే ఇది సాధ్యం అయింది. మనం భారతదేశం నుండి మశూచి, పోలియో, 'గిని వార్మ్' ల వంటి వ్యాధుల ను నిర్మూలించాం.

 

ఈ రోజు న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం శ్రోతల కు మరో సవాలు ను గురించి చెప్పాలి అని నేను అనుకొంటున్నాను. ఈ కార్యక్రమం ఇప్పుడు ఇక ముగింపు దశ కు చేరుకొంది. ఈ సవాలు- ఈ వ్యాధి ఏది అంటే అదే 'కాలాజార్'. ఈ వ్యాధి పరాన్నజీవి సాండ్ ఫ్లై అంటే ఒక రకం ఈగ కాటు ద్వారా వ్యాపిస్తుంది. 'కాలాజార్' వచ్చినప్పుడు నెలల తరబడి జ్వరం ఉంటుంది. రక్తహీనత కలుగుతుంది. శరీరం బలహీనపడటంతో పాటు బరువు కూడా తగ్గుతుంది. ఈ వ్యాధి పిల్లల నుండి పెద్దల వరకు ఎవరికి అయినా రావచ్చు. కానీ అందరి కృషి తో ‘కాలాజార్’ వ్యాధి నిర్మూలన ఇప్పుడు వేగం గా జరుగుతోంది. కొద్దికాలం క్రితం వరకు ‘కాలాజార్’ వ్యాప్తి 4 రాష్ట్రాల్లోని 50 కంటే ఎక్కువ జిల్లాల్లో ఉండేది. కానీ ఇప్పుడు ఈ వ్యాధి బిహార్, ఝార్ ఖండ్‌ లోని 4 జిల్లాల కు మాత్రమే పరిమితం అయింది. బిహార్-ఝార్ ఖండ్ ప్రజల సామర్థ్యం, అవగాహన ఈ నాలుగు జిల్లా ల నుండి కూడా ‘కాలాజార్’ ని నిర్మూలించడానికి ప్రభుత్వ ప్రయత్నాల కు దోహదపడతాయి అనే విశ్వాసం నాలో ఉంది. ‘కాలాజార్’ ప్రభావిత ప్రాంతాల ప్రజలు రెండు విషయాల ను గుర్తుంచుకోవాలి అని నేను కోరుతున్నాను. ఒకటి - శాండ్ ఫ్లై నియంత్రణ. రెండోది, ఈ వ్యాధి ని వీలైనంత త్వరగా గుర్తించి, పూర్తి చికిత్స ను అందించడం. ‘కాలాజార్’ చికిత్స సులభం. దీనికి ఉపయోగించే మందులు కూడా చాలా ప్రభావవంతం గా ఉంటాయి. మీరు అప్రమత్తం గా ఉంటే చాలు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయవద్దు. సాండ్ ఫ్లై స్ ను చంపే మందుల ను పిచికారీ చేస్తూ ఉండండి. మన దేశం ‘కాలాజార్’ బారి నుండి విముక్తి ని పొందినపుడు మనకు ఎంత సంతోషం కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. సమష్టి కృషి- సబ్ కా ప్రయాస్- భావన తో భారతదేశం 2025 వ సంవత్సరానికంతా టి. బి. నుండి కూడా విముక్తి ని పొందేటట్టు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో టీబీ విముక్త భారత ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు వేల కొద్దీ ప్రజలు టి.బి. రోగుల ను ఆదుకొనేందుకు ముందుకు రావడాన్ని మీరు చూసి ఉంటారు. ఈ వ్యక్తులు క్షయ రహిత ప్రచార మిత్రులు కావడం తో టీబీ రోగుల ను ఆదుకుంటున్నారు. వారికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. ప్రజల సేవ, భాగస్వామ్యం ఉన్న ఈ శక్తి అనేది ప్రతి కష్టమైన లక్ష్యాన్ని సాధించడం ద్వారా మాత్రమే ప్రదర్శితం అవుతుంది.

 

ప్రియమైన నా దేశవాసులారా, మన సంస్కృతి సంప్రదాయాల కు గంగామాత తో విడదీయలేనటువంటి సంబంధం ఉన్నది. గంగాజలం మన జీవన విధానం లో అంతర్భాగం గా ఉంది.

 

‘‘నమామి గంగే తవ్ పాద పంకజం,

సుర అసురై: వందిత దివ్య రూపం.

భుక్తిం చ ముక్తిం చ దదాసి నిత్యమ్,

భావ అనుసారేణ సదా నరాణామ్..’’

 

అని మన గ్రంథాలలో పేర్కొన్నారు.

ఈ మాటల కు - “ఓ గంగ మాతా! భక్తుల కు వారి ఇష్టానుసారం ప్రాపంచిక సుఖాన్ని, ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తున్నావు. అందరూ నీ పవిత్ర పాదాల ను పూజిస్తారు. నేను కూడా నీ పవిత్ర పాదాల కు నమస్కరిస్తున్నాను.” అని అర్థం. ఇటువంటి పరిస్థితుల లో శతాబ్దాల పాటు ప్రవహిస్తున్న గంగమ్మ ను పరిశుభ్రం గా ఉంచుకోవడం మనందరి ముందున్న పెద్ద బాధ్యత. ఈ లక్ష్యం తో ‘నమామి గంగే అభియాన్’ ను ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభించాం. ఈ కార్యక్రమం ప్రస్తుతం ప్రపంచం అంతటా ప్రశంసల ను అందుకోవడం మనకు అందరికి గర్వకారణం. పర్యావరణ వ్యవస్థ ను పునరుద్ధరించడం విషయం లో ప్రపంచం లోని మొదటి పది కార్యక్రమాల లో ‘నమామి గంగే’ మిశన్‌ ను ఐక్య రాజ్య సమితి చేర్చింది. ప్రపంచం నలు మూలల నుండి వచ్చిన 160 కార్యక్రమాల లో ‘నమామి గంగే’ కు ఈ గౌరవం లభించడం మరింత సంతోషకరమైన విషయం.

 

సహచరులారా, ‘నమామి గంగే’ ప్రచారం లో అతి పెద్ద శక్తి ప్రజల నిరంతర భాగస్వామ్యం. ‘నమామి గంగే’ ప్రచారం లో గంగ ప్రహరీల కు, గంగ దూతల కు ప్రాముఖ్యం కల్పించడమైంది. వారు మొక్కల ను నాటడం, ఘాట్‌ల ను శుభ్రపరచడం, గంగా హారతి, వీధి నాటకాలు, పెయింటింగు లు వేయడం, కవిత ల ద్వారా అవగాహన ను కల్పించడం వంటి కార్యక్రమాల లో నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రచారం వల్ల జీవవైవిధ్యం లో కూడా చాలా అభివృద్ధి కనిపిస్తోంది. వివిధ జాతుల హిల్సా చేప లు, గంగా డాల్ఫిన్ లు మరియు తాబేళ్ల సంఖ్య గణనీయం గా పెరిగింది. గంగ పర్యావరణ వ్యవస్థ పరిశుభ్రం గా ఉండడం తో ఇతర జీవనోపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇక్కడ జీవవైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన ‘జల జీవనోపాధి నమూనా’ ను గురించి చర్చించాలి అని అనుకొంటున్నాను. ఈ పర్యాటక ఆధారిత బోట్ సఫారీల ను 26 ప్రదేశాల లో ప్రారంభించారు. సహజంగానే ‘నమామి గంగే’ మిశన్ పరిధి, దాని విస్తృతి నది ని శుభ్రపరచడం కంటే అధికం గా పెరిగింది. ఇది మన సంకల్ప శక్తి కి , అవిశ్రాంత ప్రయత్నాల కు ప్రత్యక్ష నిదర్శనం. మరో వైపు పర్యావరణ పరిరక్షణ దిశ గా ప్రపంచానికి కొత్త మార్గాన్ని కూడా చూపబోతోంది.

 

ప్రియమైన నా దేశ ప్రజలారా , మన సంకల్ప శక్తి బలం గా ఉన్నప్పుడు అతి పెద్ద సవాలు కూడా సులభం అవుతుంది. సిక్కిం లోని థేగూ గ్రామాని కి చెందిన ‘సంగే శేర్ పా గారు’ దీనికి ఉదాహరణగా నిలిచారు. గత 14 సంవత్సరాలు గా 12,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు లో పర్యావరణ పరిరక్షణ పని లో ఆయన తలమునకలు గా ఉన్నారు. సంగే గారు సాంస్కృతిక, పౌరాణిక ప్రాముఖ్యం గల సోమ్‌గో సరస్సు ను శుభ్రం గా ఉంచే పని ని చేపట్టారు. తన అలుపెరగని కృషితో ఆయన ఈ హిమానీ నదం సరస్సు రంగు రూపుల ను మార్చివేశారు. ఈ పరిశుభ్రత ప్రచారాన్ని 2008వ సంవత్సరం లో సంగే శేర్ పా గారు ప్రారంభించినప్పుడు అనేక ఇబ్బందుల ను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే అనతికాలం లోనే ఈ మహత్తర కార్యానికి యువకులు, గ్రామీణుల తో పాటు పంచాయతీ నుండి కూడా పూర్తి మద్దతు లభించడం మొదలైంది. ఈ రోజు న మీరు సోమ్‌గో సరస్సు ను చూడడానికి వెళ్లారంటే అక్కడ చుట్టూ పెద్ద పెద్ద చెత్త డబ్బాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ సేకరించిన చెత్త ను రీసైక్లింగ్ కోసం పంపుతున్నారు. ఇక్కడకు వచ్చే పర్యటకులు చెత్త ను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా వారికి గుడ్డ తో చేసిన చెత్త సంచుల ను కూడా అందజేస్తున్నారు. ఇప్పుడు ఈ పరిశుభ్రమైన సరస్సు ను చూడటానికి ప్రతి ఏటా సుమారు 5 లక్షల మంది పర్యటకులు ఇక్కడ కు చేరుకుంటున్నారు. సోమ్‌గో సరస్సు ను పరిరక్షించడానికి చేసిన ఈ ప్రత్యేకమైన కృషి కి గాను సంగే శేర్ పా ను అనేక సంస్థ లు గౌరవించాయి. ఇటువంటి ప్రయత్నాల కారణంగా సిక్కిం భారతదేశం లో పరిశుభ్ర రాష్ట్రాల లో ఒక రాష్ట్రం గా పరిగణించబడుతోంది. సంగే శేర్ పా గారు, ఆయన సహచరులతో పాటు దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కు సంబంధించిన గొప్ప ప్రయత్నాల లో నిమగ్నం అయిన ప్రజలను కూడా నేను హృదయపూర్వకం గా అభినందిస్తున్నాను.

 

సహచరులారా, ‘స్వచ్ఛ్ భారత్ మిశన్’ నేడు ప్రతి భారతీయుని మనస్సు లో స్థిరపడినందుకు నేను సంతోషిస్తున్నాను. 2014వ సంవత్సరం లో ఈ ప్రజాఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి దీనిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రజల నుండి అనేక విశిష్ట ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రయత్నాలు సమాజం లోనే కాకుండా ప్రభుత్వం లో కూడా జరుగుతున్నాయి. ఈ నిరంతర ప్రయత్నాల తాలూకు ఫలితాలు అనేకం గా ఉన్నాయి. చెత్త ను తొలగించడం వల్ల, అనవసరమైన వస్తువులను తొలగించడం వల్ల కార్యాలయాల లో చాలా స్థలం ఖాళీ అవుతుంది. కొత్త స్థలం అందుబాటు లోకి వస్తుంది. ఇంతకు ముందు స్థలాభావం వల్ల దూరప్రాంతాల లో కార్యాలయాల ను అద్దె కు తీసుకోవలసి వచ్చేది. ఈ రోజులలో శుభ్రత కారణం గా చాలా స్థలం అందుబాటు లోకి వచ్చి ఇప్పుడు అన్ని కార్యాలయాలు ఒకే చోటు కు వచ్చేందుకు అవకాశం ఏర్పడింది. గతం లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కూడా ముంబయి, అహమదాబాద్, కోల్‌కాతా, శిలాంగ్ లతో పాటు అనేక ఇతర నగరాల్లోని తన కార్యాలయాల లో చాలా కృషి చేసింది. ఆ కారణం గానే నేడు పూర్తి గా కొత్తగా వినియోగించుకొనే రెండు- మూడు అంతస్తులు వారికి అందుబాటు లోకి వచ్చాయి. ఈ పరిశుభ్రత కారణం గా వనరుల ను ఉత్తమం గా వినియోగించుకోవడం లో ఉత్తమ అనుభవాన్ని పొందుతున్నాం. ఈ ప్రచారం సమాజంతో పాటు గ్రామాలు, నగరాలు, కార్యాలయాల లో కూడా అన్ని విధాలు గా దేశాని కి ఉపయోగపడుతుంది.

 

ప్రియమైన నా దేశప్రజలారా, మన దేశం లో మన కళ లపై, సంస్కృతి పై కొత్త అవగాహన వస్తోంది. కొత్త చైతన్యం జాగృతం అవుతోంది. ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం లో ఈ ఉదాహరణల ను తరచు గా చర్చిస్తాం. కళ, సాహిత్యం, సంస్కృతి సమాజానికి సమష్టి మూలధనం అయినట్లే, వాటిని ముందుకు తీసుకుపోవలసిన బాధ్యత కూడా మొత్తం సమాజం పైన ఉంది. అటువంటి విజయవంతమైన ప్రయత్నం లక్షద్వీప్‌ లో జరుగుతోంది. కల్పేని ద్వీపంలో ఒక క్లబ్ ఉంది - కూమేల్ బ్రదర్స్ చాలెంజర్స్ క్లబ్. ఈ క్లబ్ స్థానిక సంస్కృతి, సంప్రదాయ కళల ను కాపాడుకోవడానికి యువత కు స్ఫూర్తి ని ఇస్తుంది. ఇక్కడ యువత స్థానిక కళలైన కోల్ కలీ, పరీచాక్ లీ, కిలిప్పాట్ట్ మరియు సంప్రదాయ గీతాల లో శిక్షణ పొందుతున్నారు. అంటే పాత వారసత్వాన్ని కొత్త తరం చేతుల్లో భద్రపరుచుకుంటూ ముందుకు సాగుతున్నారు. మిత్రులారా, దేశంలోనే కాదు-విదేశాల్లోనూ ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఇటీవల దుబయి నుండి అక్కడి కలారీ క్లబ్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ లో పేరు నమోదు చేసిందని వార్తలు వచ్చాయి. దుబాయ్ క్లబ్ రికార్డ్ సృష్టించిందని, దీనికి భారతదేశం తో సంబంధం ఏమిటి అని ఎవరైనా అనుకోవచ్చు. వాస్తవానికి ఈ రికార్డు భారతదేశం లోని పురాతన యుద్ధ కళ కలరిపయట్టు కు సంబంధించింది. ఏకకాలం లో ఎక్కువ మంది వ్యక్తులు కలారీ ని ప్రదర్శించినందుకు ఈ రికార్డు నమోదు అయింది. దుబయి లోని కలరి క్లబ్, దుబయి పోలీసులతో కలిసి దీనికి ప్రణాళిక రూపొందించి, అరబ్ ఎమిరేట్స్ జాతీయ దినోత్సవం సందర్భం గా ప్రదర్శించింది. ఈ కార్యక్రమం లో నాలుగేళ్ల పిల్లల నుండి అరవయ్యేళ్ల వృద్ధుల వరకు కలారీ లో అత్యుత్తమ ప్రతిభ ను కనబరిచారు. వివిధ తరాలు ప్రాచీన సంప్రదాయాన్ని పూర్తి అంకితభావం తో ఎలా ముందుకు తీసుకు పోతున్నాయో తెలియజేసేందుకు ఇదొక అద్భుతమైన ఉదాహరణ.

 

సహచరులారా, కర్నాటక లోని గడక్ జిల్లా లో నివసించే 'క్వేమశ్రీ' గారి గురించి కూడా ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం శ్రోతల కు తెలియజేయాలి అని నేను అనుకొంటున్నాను. దక్షిణాది లో కర్నాటక కళ-సంస్కృతి ని పునరుద్ధరించే లక్ష్యం లో 'క్వేమశ్రీ' గత 25 సంవత్సరాలుగా నిరంతరం నిమగ్నమై ఉన్నారు. వారి తపస్సు ఎంత గొప్పదో మీరు ఊహించుకోవచ్చు. అంతకుముందయితే క్వేమశ్రీ గారు కి హోటల్ మేనేజ్‌మెంట్ వృత్తి తో అనుబంధం కలిగి ఉండేవారు. కానీ సంస్కృతి సంప్రదాయాల తో లోతైన అనుబంధం ఉండడం తో దానిని తన లక్ష్యం గా చేసుకొన్నారు. ‘కళా చేతన’ పేరు తో ఓ వేదిక ను రూపొందించారు. ఈ వేదిక కర్నాటక తో పాటు దేశ విదేశాల కళాకారుల తో అనేక కార్యక్రమాల ను నిర్వహిస్తున్నది. ఇందులో స్థానిక కళ ను, సంస్కృతి ని ప్రోత్సహించడానికి అనేక వినూత్న కార్యక్రమాల ను కూడా నిర్వహిస్తారు.

 

సహచరులారా, తమ కళ అన్నా, సంస్కృతి అన్నా దేశ ప్రజలలో పెల్లుబుకుతున్న ఈ ఉత్సాహం 'మన వారసత్వం పట్ల గర్వం' తాలూకు భావన ను వ్యక్తపరచడం వంటిది. మన దేశం లో ప్రతి మూల లో చెల్లాచెదరు గా అటువంటి వర్ణమయ ప్రయత్నాలు అనేకం ఉన్నాయి. వాటిని అలంకరించడానికి మరియు సంరక్షించడానికి మనం నిరంతరం కృషి చేస్తూ ఉండాలి.

 

ప్రియమైన నా దేశ ప్రజలారా , దేశం లోని అనేక ప్రాంతాల లో వెదురు తో చాలా అందమైన, ఉపయోగకరమైన వస్తువుల ను తయారు చేస్తారు. ముఖ్యం గా ఆదివాసీ ప్రాంతాల లో నైపుణ్యం ఉన్న వెదురుపని వారు, కళాకారులు ఉన్నారు. వెదురు కు సంబంధించిన బ్రిటిష్ కాలం నాటి చట్టాల ను మార్చినప్పటి నుండి దానికి భారీ బజారు అభివృద్ధి చెందింది. మహారాష్ట్ర లోని పాల్ ఘర్ వంటి ప్రాంతాల లో కూడా ఆదివాసీ లు వెదురు తో అందమైన ఉత్పత్తుల ను ఎన్నింటి నో తయారు చేస్తున్నారు. వెదురు తో చేసిన పెట్టెలు, కుర్చీలు, టీపాట్‌ లు, బుట్ట లు, ట్రే లు మొదలైనవి బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అంతే కాదు- ఈ వ్యక్తులు వెదురు గడ్డి తో అందమైన బట్టల ను, అలంకరణ వస్తువుల ను కూడా తయారు చేస్తారు. దీనివల్ల ఆదివాసీ మహిళ లు కూడా ఉపాధి ని పొందుతున్నారు. వారి నైపుణ్యాని కి గుర్తింపు లభిస్తున్నది.

 

సహచరులారా, కర్నాటక కు చెందిన ఓ జంట తమలపాకు తో తయారు చేసిన అనేక ప్రత్యేకమైన ఉత్పత్తుల ను అంతర్జాతీయ బజారు కు పంపుతున్నది. కర్నాటక లోని శివమొగ్గ కు చెందిన ఆ దంపతులు - శ్రీ సురేశ్ గారు, ఆయన భార్య శ్రీమతి మైథిలి గారు. వారు తమలపాకు పీచు తో ట్రేల ను, ప్లేటుల ను, హ్యాండ్‌బ్యాగుల మొదలుకొని అనేక అలంకరణ వస్తువుల ను తయారు చేస్తున్నారు. ఈ పీచు తో చేసిన చెప్పుల ను కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు. వారి ఉత్పత్తులను లండన్, ఐరోపా లోని ఇతర మార్కెట్ల లో విక్రయిస్తున్నారు. ఇది అందరూ ఇష్టపడుతున్నమన సహజ వనరులు, సంప్రదాయ నైపుణ్యాల నాణ్యత. ఈ సంప్రదాయ జ్ఞానం లో ప్రపంచం స్థిరమైన భవిష్యత్తు వైపు చూస్తోంది. మనం కూడా ఈ దిశ లో మరింత అవగాహన ను కలిగి ఉండవలసిన అవసరం ఉంది. మనమే అటువంటి స్వదేశీ, స్థానిక ఉత్పత్తుల ను ఉపయోగించాలి. ఇతరుల కు కూడా బహుమతి గా ఇవ్వాలి. ఇది మన గుర్తింపు ను దృఢపరుస్తుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థ ను బలోపేతం చేస్తుంది. పెద్ద సంఖ్య లో ప్రజల భవిష్యత్తు ను ప్రకాశవంతం చేస్తుంది.

 

ప్రియమైన నా దేశప్రజలారా, ఇప్పుడు మనం ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం లో అపూర్వమైన మైలురాయి అయిన వందో ఎపిసోడ్ వైపు నెమ్మది గా కదులుతున్నాం. నాకు చాలా మంది దేశ ప్రజల నుండి లేఖ లు వచ్చాయి. అందులో వారు వందో ఎపిసోడ్ ను గురించి చాలా ఉత్సుకత ను వ్యక్తం చేశారు. నూరో ఎపిసోడ్‌ లో మనం ఏం మాట్లాడాలి, దాన్ని ఎలా ప్రత్యేకం గా రూపొందించాలి అనే దాని పై మీరు మీ సూచనల ను పంపితే నేను సంతోషిస్తాను. తరువాతి సారి మనం 2023వ సంవత్సరంలో కలుద్దాం. 2023వ సంవత్సరం సందర్భం లో మీకు ఇవే శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం సైతం దేశాని కి ప్రత్యేకం కావాలి, దేశం కొత్త శిఖరాల ను అందుకోవాలి అని కోరుకొందాం. అందరం కలసి ఒక తీర్మానం చేయాలి. అలాగే దానిని సాకారం కూడా చేయాలి. ఈ సమయం లో చాలా మంది సెలవు ల మూడ్‌ లో ఉన్నారు. మీరు ఈ పండుగల ను చాలా ఆనందించండి. అయితే కొంచెం జాగ్రత్త గా ఉండండి. ప్రపంచం లోని చాలా దేశాల లో కరోనా పెరుగుతుండటాన్ని మీరు కూడా గమనిస్తున్నారు. కాబట్టి మనం మాస్క్ లను ధరించడం, చేతులను కడుగుకొంటూ ఉండడం వంటి జాగ్రత చర్యలపై మరింత దృష్టి పెట్టాలి. మనం జాగ్రత గా ఉంటే సురక్షితం గా కూడా ఉంటాం. మన ఆనందాని కి ఎటువంటి ఆటంకం ఉండదు. మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.

 

***



(Release ID: 1886473) Visitor Counter : 267