ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ఐసీఎంఆర్ - ఎన్ఏఆర్ఎఫ్ బిఆర్ (నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్)ని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


21వ శతాబ్దపు బయోమెడికల్ పరిశోధనలో భారతదేశాన్ని ఒక కీలకమైన ప్రపంచ శక్తిగా మార్చగల సామర్థ్యాన్ని ఐసీఎంఆర్ - ఎన్ఏఆర్ఎఫ్ బిఆర్ కలిగి ఉంది

దేశ ఆరోగ్య, సంక్షేమ రంగ అభివృద్ధికి ఐసీఎంఆర్ - ఎన్ఏఆర్ఎఫ్ బిఆర్ దోహదపడుతుంది.. కేంద్ర మంత్రి

Posted On: 17 DEC 2022 3:30PM by PIB Hyderabad

' దేశాభివృద్ధిలో పరిశోధన, ఆవిష్కరణలు కీలక అంశాలుగా ఉంటాయి. భారతదేశం స్వదేశీ పరిశోధనలకు ప్రోత్సాహాన్ని అందించింది. పరిశోధనల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. 21వ శతాబ్దపు బయోమెడికల్ పరిశోధనలో భారతదేశాన్ని ఒక కీలకమైన ప్రపంచ శక్తిగా మార్చగల సామర్థ్యాన్ని ఐసీఎంఆర్ - ఎన్ఏఆర్ఎఫ్ బిఆర్ కలిగి ఉంది. మానవులు, జంతువులపై పరిశోధనలు జరిగే సమయంలో నైతిక విలువలు పాటించి తగిన సంక్షేమాన్ని అంతర్జాతీయ ప్రమాణాల మేరకు పాటించాల్సి ఉంటుంది. అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ నాణ్యమైన సేవలు అందించడం ద్వారా ఎన్ఏఆర్ఎఫ్ బిఆర్ దేశంలో ఆరోగ్య, సంక్షేమ రంగాల అభివృద్ధికి సహకరిస్తుంది.' అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు ఈ రోజు హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ఐసీఎంఆర్ - ఎన్ఏఆర్ఎఫ్ బిఆర్ (నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్)ని తెలంగాణ కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి శ్రీ సి. మల్లా రెడ్డి సమక్షంలో డాక్టర్ మాండవీయ ప్రారంభించారు.

 

స్వదేశీ పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని డాక్టర్ మాండవీయ వివరించారు. 'కోవిడ్ మహమ్మారి సమయంలో దేశంలో వ్యాక్సిన్ సిద్ధం కావాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయించారు. ప్రపంచం వ్యాక్సిన్ కొరత ఎదుర్కొంటున్న సమయంలో దేశ శాస్త్రవేత్తల సహకారంతో సవాల్ ఎదుర్కోవడానికి సిద్దమయ్యింది. మన శాస్త్రవేత్తలు తమ శక్తి సామర్ధ్యాలు ప్రదర్శించి వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. విదేశాల నుంచి వ్యాక్సిన్ దిగుమతి చేసుకోవడానికి 5 నుంచి 10 సంవత్సరాలు పట్టేది. అయితే, రాజకీయ వర్గాలు , సంబంధిత వర్గాల నుంచి అందిన సంపూర్ణ సహకారంతో మన శాస్త్రవేత్తలు ఏడాది కాలంలో వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు' అని డాక్టర్ మాండవీయ వివరించారు. 

 

జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధులు, వ్యాధి నివారణ, చికిత్స అంశాలపై జంతువులపై పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అన్ని సౌకర్యాలు నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ కలిగి ఉంటుంది. పరిశోధన సమయంలో నైతిక విలువలకు ప్రాధాన్యం ఇస్తూ జంతువులకు అవసరమైన సంరక్షణను నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ అందిస్తుంది. అధునాతన సౌకర్యాలతో ఏర్పాటైన నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ కేవలం జంతువులకు నైతిక సంరక్షణ కల్పించడం మాత్రమే కాకుండా పరిశోధన సమయంలో నియంత్రణ చర్యలు కూడా అమలు చేస్తుంది. పరిశోధన సాగించే పరిశోధకులకు అవసరమైన సౌకర్యాలు అందించి వారి నైపుణ్య అభివృద్ధికి, కొత్తగా అభివృద్ధి చేసిన ఔషధాలు, వ్యాక్సిన్, వ్యాధి నిర్ధారణ అంశాలపై దేశంలో క్లినికల్ పరీక్షలు నిర్వహించడానికి, నూతన ఆవిష్కరణల నాణ్యత నిర్ధారించడానికి అవసరమైన సౌకర్యం అందిస్తుంది. 

 

భారతదేశ మానవ వనరులు, మేధో సంపత్తి పై డాక్టర్ మాండవీయ ప్రశంసల జల్లు కురిపించారు. పరిశోధనా సంస్థలు, సాంకేతిక సంస్థలు, ఫార్మా లాంటి రంగాల్లో ఆవిష్కరణలు సాధించే అంశంలో భారతదేశం మొదటి నుంచి మందు ఉంది అని డాక్టర్ మాండవీయ అన్నారు. ప్రపంచ ఫార్మా రంగంలో భారతదేశ ఫార్మా రంగం ప్రాధాన్యత వివరించిన డాక్టర్ మాండవీయ ' ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న నాలుగు మందుబిళ్లలో ఒక మందు బిళ్ళ భారతదేశం ఉత్పత్తి అవుతోంది. ప్రపంచంలో ఔషధ రంగంలో మాత్రమే కాకుండా ఫార్మా రంగంలో కూడా భారతదేశం అగ్రస్థానంలో నిలబడేలా చూడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ లక్ష్యాన్ని సాధించడానికి దేశంలో క్లినికల్ పరీక్షలు నిర్వహించడానికి పటిష్టమైన వ్యవస్థ, జంతువుల సంరక్షణ అవసరం ఉంటుంది. లక్ష్య సాధన దిశలో ఎన్ఏఆర్ఎఫ్ బిఆర్ సహకరిస్తుంది' అని డాక్టర్ మాండవీయ వివరించారు. 

 

దేశంలో పటిష్టమైన పరిశోధన, ఆవిష్కరణ రంగం ఉండాలని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని డాక్టర్ మాండవీయ అన్నారు. విద్యా ప్రమాణాలు, పరిశోధన సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు అమలు చేస్తున్నదని అన్నారు. యువత తమ మేధస్సును దేశ సంక్షేమం, అభివృద్ధి కోసం వినియోగించడానికి అవసరమైన వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

 

ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, ఆరోగ్య పరిశోధన శాఖ కార్యదర్శి డాక్టర్ రాజీవ్ భల్ మాట్లాడుతూ నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో అత్యధిక ఆధునిక సౌకర్యాలు కలిగి ఉంటుందని తెలిపారు. నైతిక విలువలు పాటిస్తూ జంతువులపై పరిశోధనలు సాగించడానికి అవసరమైన సౌకర్యాలు సంస్థ కలిగి ఉంటుందని అన్నారు. జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధులు అరికట్టడానికి సంస్థ ఉపయోగపడుతుందని అన్నారు. 

 

కార్యక్రమ ప్రారంభ కార్యక్రమాన్ని యూ ట్యూబ్ : Inaugurating the ICMR-National Animal Resource Facility For Biomedical Research - YouTube 

 

పేస్ బుక్ లో : https://www.facebook.com/mansukhmandviya/videos/1413962979432636 లో చూడవచ్చు. .

 

 నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ రామచంద్ర మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు.

 

***



(Release ID: 1884428) Visitor Counter : 180


Read this release in: English , Urdu , Marathi , Tamil