సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కార్మికుల జనాభా నిష్పత్తి పెరుగుదల!
2017-18లో 46.8శాతం నుంచి
2020-21లో 52.6శాతానికి వృద్ధి..
ఉత్పాదనా ప్రక్రియలో ప్రజల ప్రమేయానికి
ఇదే నిదర్శనమన్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
2017-18 నుంచి నిరుద్యోగిత రేటు
తగ్గుతూ వస్తోందని వ్యాఖ్య..
ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద
రూ. 27లక్షల కోట్లకు మించి ఆర్థిక ఉద్దీపనలు..
కోవిడ్ -19 మహమ్మారితో జరిగిన ఉపాధి నష్టాన్ని
భర్తీచేసేందుకు చేపట్టిన
ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజనతో
60 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ప్రయోజనం
Posted On:
15 DEC 2022 12:51PM by PIB Hyderabad
కార్మికుల జనాభా నిష్పత్తి (డబ్ల్యు.పి.ఆర్.) పెరుగుతోందని కేంద్ర సైన్స్-టెక్నాలజీ శాఖ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. 2017-18వ సంవత్సరంలో 46.8శాతంగా ఉన్న ఈ నిష్పత్తి 2020-21లో 52.6శాతానికి పెరిగిందని, ఉత్పాదనా కార్యకలాపాల్లో ప్రజల భాగస్వామ్యం పెరగిందనడానికి ఇదే తార్కాణమని అని ఆయన అన్నారు. కేంద్ర భూగోళ శాస్త్రాలు, ప్రధాని కార్యాలయ వ్యవహారాలు, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా సమస్యలు, పెన్షన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖలను ఆయన సహాయమంత్రి హోదాలో పర్యవేక్షిస్తున్నారు
రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, కార్మిక జనాభా నిష్పత్తి గత నాలుగేళ్లలో నిరంతరంగా పైకి దూసుకువెళ్లే ధోరణి కనబడుతోందని. నిరుద్యోగిత రేటు (యు.ఆర్.) 2017-18వ సంవత్సరంనుంచి క్రమంగా క్షీణతను సూచిస్తోందని అన్నారు.
దేశంలో ఉపాధి-నిరుద్యోగ పరిస్థితిపై ఈ అధికారిక సమాచారానికి మూలం, 2017-18వ సంవత్సరం నుంచి జరిగే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పి.ఎల్.ఎఫ్.ఎస్.) అని చెప్పారు. కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతూ వస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ప్రతి సంవత్సరం జూలై నుంచి తదుపరి ఏడాది జూన్ వరకు ఈ సర్వే చేపడతారని చెప్పారు. అందుబాటులో ఉన్న వార్షిక పి.ఎల్.ఎఫ్.ఎస్. నివేదికల ప్రకారం, 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల సాధారణ స్థితిపై అంచనా ఆధారంగా కార్మికుల జనాభా నిష్పత్తి, నిరుద్యోగిత రేటు (యు.ఆర్.) ఈ క్రింది విధంగా ఉన్నాయి:
సంవత్సరం
|
కార్మికుల జనాభా రేటు(%)
|
నిరుద్యోగిత రేటు(%)
|
2017-18
|
46.8
|
6.0
|
2018-19
|
47.3
|
5.8
|
2019-20
|
50.9
|
4.8
|
2020-21
|
52.6
|
4.2
|
మూలం: పి.ఎల్.ఎఫ్.ఎస్., కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ.
ఉపాధి కల్పనతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యత అని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దీని ప్రకారం, ఇటీవలి కాలంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నట్టు రుజువవుతోందని అన్నారు.
వ్యాపారానికి ఉద్దీపన అందించడానికి, కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ కింద, ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆర్థిక ఉద్దీపనను ప్రభుత్వం అందిస్తోంది. దేశాన్ని స్వావలంబనతో తీర్చిదిద్దడానికి, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ఈ ప్యాకేజీ దోహదపడుతుంది. దీని కింద వివిధ దీర్ఘకాలిక పథకాలు/ కార్యక్రమాలు/ విధానాలను చేపట్టారు.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో కొత్తగా ఉపాధిని సృష్టించడానికి, ఉపాధికి కలిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు యజమానులను ప్రోత్సహించడానికి ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన (ఎ.బి.ఆర్.వై.)ను 2020 అక్టోబరు 1నుంచి అమలులోకి తెచ్చారు. లబ్ధిదారుల నమోదుకు చివరి తేదీగా 2022 మార్చి నెలాఖరును ప్రకటించారు. ఈ పథకం కింద 2022 నంబరు 28నాటికి 60.13 లక్షల మంది లబ్ధిదారులు ప్రయోజనాలు అందుకున్నారు.
ఇక 2021-22వ సంవత్సరపు బడ్జెట్లో ఉత్పాదనతో అనుసంధానించిన ప్రోత్సాహక పథకాలను (పి.ఎల్.ఐ.ని) ప్రారంభించారు. రూ. 1.97 లక్షల కోట్ల పెట్టుబడితో 2021-22 నుండి 5 సంవత్సరాల కాలానికి ఈ పథకాన్ని చేపట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పి.ఎల్.ఐ. పథకాలు 60 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది.
పి.ఎం. గతిశక్తి అనేది ఆర్థిక ప్రగతికి, సుస్థిర అభివృద్ధికి పరివర్తనాత్మక విధానంగా అమలులోకి వచ్చింది. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, భారీ రవాణా, జలమార్గాలు, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు వంటి ఏడు రంగాల ద్వారా ద్వారా ఈ విధానం నడుస్తోంది. స్వచ్ఛ ఇంధనం, సబ్‌కా ప్రయాస్ భావనలతో ఈ విధానాన్ని చేపట్టారు. అందరికీ భారీ స్థాయిలో ఉద్యోగాలు, వ్యవస్థాపక అవకాశాలను ఇది అందిస్తుంది.
స్వయం ఉపాధిని సులభతరం చేసేందుకు ప్రధాన మంత్రి ముద్రా యోజన (పి.ఎం.ఎం.వై.)ని ప్రభుత్వం అమలు చేస్తోంది. పి.ఎం.ఎం.వై. కింద, పూచీకత్తు అవసరంలేని రూ. 10లక్షల వరకూ రుణాలు అందిస్తారు. సూక్ష్మ/చిన్న తరహా వ్యాపార సంస్థలకు, సొంతంగా వ్యాపార కార్యకలాపాలను ఏర్పాటు చేసుకోదలిచిన వ్యక్తులకు, వారి వ్యాపారాల విస్తరణకు ఈ పథకం కింద రుణాలు అందిస్తారు. 2022 నవంబరు 25వ తేదీ సమాచారం మేరకు, ఈ పథకం ప్రారంభించినప్పటినుంచి ఇప్పటివరకూ రూ. 21.02 లక్షల కోట్ల విలువైన 37.75 కోట్ల రుణాలు దేశంలోని అన్ని వర్గాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందించారు.
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తితో తీవ్రంగా దెబ్బతిన్న వీధి వ్యాపారులు తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించేలా పూచీకత్తులేని రుణాన్నిసులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధిని (పి.ఎం. స్వానిధి పథకాన్ని) ప్రభుత్వం 2020 జూన్ 1నుంచి అమలు చేస్తోంది. 2022 డిసెంబర్ 8, నాటికి, ఈ పథకం కింద 37.95 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 4,396.12 కోట్లు అందించారు. మొత్తం 43.66 లక్షల మేర రుణాలు పంపిణీ అయ్యాయి.
ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పి.ఎం.ఇ.జి.పి.), మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.), పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (వై.డి.డి.యు.జి.వై.-జి.వై.) వంటి పథకాలపై గణనీయమైన పెట్టుబడి పేట్టారు. ఈ పథకాల కింద వివిధ ప్రాజెక్టులను భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఉపాధి కల్పన కోసం "దీన్ దయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ పట్టణ జీవనోపాధి పథకం (డి.ఎ.వై.- ఎన్.యు.ఎల్.ఎం.)" మొదలైన కార్యక్రమాలను చేపట్టారు.
ఈ పథకాలతో పాటుగా ఉపాధిని సృష్టించేందుకు మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్-అప్ ఇండియా, స్టాండ్-అప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీ మిషన్, అటల్ పట్టణ పునరుద్ధరణ, పరివర్తన పథకం, అందరికీ గృహ సదుపాయం వంటి వివిధ ప్రధాన కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడుతోంది.
<><><><>
(Release ID: 1883958)