బొగ్గు మంత్రిత్వ శాఖ
విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు పెరిగిన బొగ్గు సరఫరా
Posted On:
14 DEC 2022 1:01PM by PIB Hyderabad
దేశంలో బొగ్గు కొరత లేదు. 2022-23 సంవత్సరంలో ( 2022 నవంబర్ నాటికి)దేశంలో 524.2 మిలియన్ టన్నుల( తాత్కాలిక వివరాలు) బొగ్గు ఉత్పత్తి అయ్యింది. గత ఏడాది ఇదే సమయానికి దేశంలో 448.1 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ యాదాద్రి ఇంతవరకు బొగ్గు ఉత్పత్తి దాదాపు 17% పెరిగింది.అదేవిధంగా దేశంలో 2022-2023 లో (2022 నవంబర్ వరకు) దేశంలో 558.24 మిలియన్ టన్నుల (తాత్కాలికం) బొగ్గు సరఫరా/పంపిణీ జరిగింది. గత సంవత్సరం ఇదే కాలంలో జరిగిన 521.08 మిలియన్ టన్నుల సరఫరా/పంపిణీ తో పోల్చితే దాదాపు 7.33 % వృద్ధిని సాధించింది.
2022-23 లో విద్యుత్ రంగంలో పెరిగిన బొగ్గు వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని సీఐఎల్ 380.58 మిలియన్ టన్నుల (2022 నవంబర్ వరకు) (తాత్కాలిక సమాచారం) బొగ్గు సరఫరా చేసింది గత ఏడాది ఇదే సమయానికి జరిగిన 339.8 మిలియన్ టన్నుల సరఫరా తో పోల్చి చూసే ఈ ఏడాది ఇంతవరకు సరఫరా 12% పెరిగింది.
బొగ్గు సరఫరాకు సంబంధించి విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో ఒక ఉప సంఘం ఏర్పాటయింది. విద్యుత్ మంత్రిత్వ శాఖలు, బొగ్గు మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA), కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) మరియు సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రతినిధులతో ఏర్పాటైన అంతర్-మంత్రిత్వ శాఖ ఉప సంఘం తరచూ సమావేశం అవుతూ పరిస్థితిని సమీక్షిస్తోంది. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా మెరుగు పరచడానికి, విద్యుత్ రంగంలో అనుకోకుండా ఎదురయ్యే సమస్యల పరిష్కారం, అత్యవసర బొగ్గు నిల్వలు లాంటి అంశాలపై సంఘం నిర్ణయాలు తీసుకుంటుంది. దీనితో పాటు బొగ్గు ఉత్పత్తి ఎక్కువ చేయడానికి, విద్యుత్ ఉత్పత్తి సామర్ద్యాన్ని పెంపొందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి రైల్వే బోర్డు చైర్మన్, బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి మరియు విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సభ్యులుగా మరో అంతర్-మంత్రిత్వ శాఖ కమిటీ ఏర్పాటు అయ్యింది. నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ,సిఈఏ ఛైర్‌పర్సన్ ప్రత్యేక ఆహ్వానితులుగా అవసరమైన సమయంలో సహకారం అందిస్తారు.క్యాప్టివ్ బొగ్గు బ్లాకుల నుంచి బొగ్గు పంపిణీ జరుగుతున్న తీరును క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు.
భారతదేశంలో ఇంధనానికి ప్రధాన వనరుగా బొగ్గు ఉంది. బొగ్గు డిమాండ్ పెరుగుతూ 2030-2035 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశంలో బొగ్గు లభ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఈ క్రింది చర్యలు అమలు చేస్తోంది.
i. కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) గనుల నుంచి మెరుగైన బొగ్గు ఉత్పత్తి - ఇప్పటికే ఉన్న గనుల సామర్థ్యంతో పాటు కొత్త గనులు/ప్రాజెక్టుల నిర్వహణ.
ii. వాణిజ్య బొగ్గు గనుల ఉత్పత్తి ఎక్కువ చేయడం
iii. గనులు మరియు ఖనిజాల (అభివృద్ధి మరియు నియంత్రణ) సవరణ చట్టం, 2021 చట్టం నిబంధనలు కఠినంగా అమలు చేసి క్యాప్టివ్ గనుల యజమానులు (అణు ఖనిజాలు కాకుండా) వారి వార్షిక ఖనిజ (బొగ్గుతో సహా) ఉత్పత్తిలో 50% వరకు అవసరాలను తీర్చిన తర్వాత బహిరంగ మార్కెట్‌లో విక్రయించడానికి వీలు కల్పించడం
iv. మెరుగైన సరఫరా, రైలు ప్రాజెక్టులు , సమీకృత బొగ్గు రవాణా ద్వారా బొగ్గు సరఫరా ఎక్కువ చేయడం
v. ఉత్పత్తి ఎక్కువ చేయడానికి పెద్ద ఎత్తున బొగ్గు ఉత్పత్తి విధానాలు అమలు చేయడం, ఈఆర్సీ, కార్యకలాపాల డిజిటలైజేషన్ ద్వారా గనుల సామర్థ్యాన్ని పెంచడం.
vi.బొగ్గు మంత్రిత్వ శాఖ ద్వారా నిరంతర పర్యవేక్షణ.
vii. బొగ్గు గనులను త్వరితగతిన ప్రారంభించేలా చూసేందుకు అవసరమైన అనుమతులను ఏక గవాక్ష విధానంలో మంజూరు చేయడం.
బొగ్గు, గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1883551)