రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భారతదేశ మొట్టమొదటి సి.డి.ఎస్. స్వర్గీయ జనరల్ బిపిన్ రావత్ మొదటి వర్ధంతిని పురస్కరించుకుని న్యూఢిల్లీ లో ఆయన ప్రతిమను ఆవిష్కరించిన - రక్షణశాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్

Posted On: 10 DEC 2022 6:50PM by PIB Hyderabad

భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సి.డి.ఎస్) జనరల్ బిపిన్ రావత్ మొదటి వర్ధంతి సందర్భంగా, 2022 డిసెంబర్, 10వ తేదీన న్యూ ఢిల్లీలోని యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా (యు.ఎస్.ఐ) లో రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్,  స్వర్గీయ జనరల్ బిపిన్ రావత్ ప్రతిమను ఆవిష్కరించారు.

 

ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్; ప్రస్తుత సి.డి.ఎస్. జనరల్ అనిల్ చౌహాన్;  వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీ.ఆర్. చౌదరి;  నావికా దళ అధిపతి అడ్మిరల్ ఆర్. హరి కుమార్;  సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే తో పాటు, త్రివిధ సైనిక దళాలకు చెందిన ప్రస్తుత సిబ్బంది, పదవీ విరమణ చేసిన సిబ్బంది పలువురు పాల్గొని, స్వర్గీయ జనరల్ రావత్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. 

 

జనరల్ బిపిన్ రావత్ జ్ఞాపకార్థం ఒక ప్రతిభా పీఠం తో పాటు, ఒక స్మారక ఉపన్యాసాన్ని ఏర్పాటు చేయాలని సాయుధ దళాలు, యు.ఎస్.ఐ. సంస్థ నిర్ణయించాయి.  జనరల్ బిపిన్ రావత్, తన విశిష్టమైన సర్వీసులో భారతదేశపు మొట్టమొదటి సి.డి.ఎస్. పి.వి.ఎస్.ఎం., యు.వై.ఎస్.ఎం., ఏ.వి.ఎస్.ఎం., వై.ఎస్.ఎం., ఎస్.ఎం., వి.ఎస్.ఎం. పురస్కారాలతో పాటు మరణానంతరం పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించబడ్డారు. ఆయన దూరదృష్టి గల నాయకుడిగా, ప్రతిభావంతమైన సైనికునిగా, వృత్తి నైపుణ్యం, నియమనిబద్దతలు, దృఢ విశ్వాసంతో, నిర్ణయాత్మక ఉన్నతాధికారిగా ప్రసిద్ధి చెందారు. 

 

తన నాలుగు దశాబ్దాల సర్వీసులో, జనరల్ రావత్ పూర్తి స్థాయి యుద్ధ నిర్వహణలో విస్తృత కార్యాచరణ అనుభవాన్ని పొందారు.  బ్రిగేడియర్‌గా, ఆయన, సోపోర్‌ లో విజయవంతమైన ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు నాయకత్వం వహించారు. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో బహుళజాతి సైన్య విభాగానికి విజయవంతంగా నాయకత్వం వహించారు.  మేజర్ జనరల్‌గా, ఆయన, ఉత్తర కాశ్మీర్‌ లోని నియంత్రణ రేఖ వెంబడి పదాతి దళ విభాగానికి నాయకత్వం వహించారు.  సైనిక దళ కమాండర్‌ గా, ఆయన, మయన్మార్‌ లో భారత సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు నిర్వహించిన తీవ్రవాదుల వ్యతిరేక దాడులను సమర్ధవంతంగా పర్యవేక్షించారు.  భారతదేశ వ్యూహాత్మక సంస్కృతి ని నిగ్రహం నుంచి దృఢంగా ఎదుర్కొనే స్థాయికి మార్చడానికి ఈ చర్య నాందిగా నిలిచింది.  ఆ తర్వాత, ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద బృందాలపై సర్జికల్ స్ట్రైక్స్‌ ను పర్యవేక్షించడంలో కీలకపాత్ర పోషించారు. 

 

ఆర్మీ స్టాఫ్ చీఫ్‌ గా, జనరల్ రావత్ సాధించిన విజయాలు సైనిక, జాతీయ భద్రతా వ్యవహారాలకు సంబంధించిన అన్ని రంగాల్లో అసాధారణమైనవి గా గుర్తింపు పొందాయి.   'స్వప్రయోజనం కంటే సేవ ముందు' అనే భారతీయ సైన్యం నినాదాన్ని, ఆయన తన సైనిక సర్వీసులో ప్రధాన మార్గదర్శక సూత్రంగా అనుసరించారు.   మొదటి సి.డి.ఎస్. గా, ఆయన సాయుధ దళాలను ఏకీకృతం చేయడానికి సంస్థాగత, నిర్మాణాత్మక సంస్కరణల కోసం విశేషమైన కృషి చేశారు.  విప్లవాత్మక పరివర్తన కార్యక్రమాల కోసం, పౌర-సైనిక సమ్మేళనం కోసం,  ఆయన చేసిన కృషి ముందు తరాలకు మార్గదర్శనం చేయనుంది. 

 

 

*****



(Release ID: 1882627) Visitor Counter : 150


Read this release in: English , Urdu , Marathi , Hindi