శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

భవిష్యత్తుమహమ్మారి వ్యాధుల నిరోధానికిటీకా అభివృద్ధి!


ఇందుకోసం పరిశోధన, అభివృద్ధి రంగంలో కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన.. గణనీయంగా పెట్టుబడులు పెడతామన్న కేంద్రమంత్రిజితేంద్ర సింగ్ “భవిష్యత్ అంటువ్యాధుల నిరోధం కోసంసంసిద్ధత”పై అంతర్జాతీయ సమావేశంలో ప్రకటన ఫరీదాబాద్‌లోని బయో సైన్స్ క్లస్టర్‌లో సమావేశం నిర్వహణ.. 

Posted On: 07 DEC 2022 9:27AM by PIB Hyderabad

భవిష్యత్తులో ఎదురయ్యే అంటువ్యాధి మహమ్మారులను నిరోధించే లక్ష్యంతో టీకా రూపకల్పన, బట్వాడా కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేయడానికి భారతదేశం పరిశోధన, అభివృద్ధి రంగంలో గణనీయమైన పెట్టుబడి పెడుతుందని కేంద్ర సైన్స్-టెక్నాలజీ శాఖ (స్వతంత్ర హోదా) సహాయ మంత్రి, డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. “భవిష్యత్ అంటువ్యాధుల నిరోధం కోసం సంసిద్ధత: సి.ఇ.పి.ఐ. వంద రోజుల టీకా సవాలును ఎదుర్కోవడానికి భారతదేశం సిద్ధమేనా?” అనే అంశంపై 2రోజుల అంతర్జాతీయ సమావేశం సందర్భంగా ఒక సందేశమిస్తూ కేంద్రమంత్రి ఈ విషయం చెప్పారు. కోవిడ్-19 వైరస్ గురించిన విషయాలను వెలికితీసే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయని, ఇందుకు సంబంధించి నమూనాల రూపకల్పనకు, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు తగిన పెట్టుబడి పెట్టడానికి భారతదేశం సంసిద్ధంగా ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. 2022, డిసెంబర్ 5, 6 తేదీల్లో ఈ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర సైన్స్-టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర బయోటెక్నాలజీ శాఖ (డి.బి.టి.) ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఫరీదాబాద్‌లోని ట్రాన్సలేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (టి.హెచ్.ఎస్.టి.ఐ.) ఆవరణలోని ఎన్.సి.ఆర్. బయోటెక్ సైన్స్ క్లస్టర్‌లో ఈ సమావేశాన్ని నిర్వహించారు.

 

 

మహమ్మారివంటి అంటువ్యాధుల నిరోధానికి దీటుగా ప్రతిస్పందించడంలో కేంద్ర బయోటెక్నాలజీ శాఖ ఇప్పటివరకూ ఎంతో కృషి చేసిందని, కోవిడ్-9 వైరస్ వ్యాప్తితో ఎదురయ్యే ముప్పును అరికట్టడానికి ఎన్నో అపూర్వమైన చర్యలు తీసుకుందని ఆయన అన్నారు. ఇందుకు బయోటెక్నాలజీ శాఖ పరిధిలోని14 స్వయంప్రతిపత్తి సంస్థలు, ట్రాన్సలేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (టి.హెచ్.ఎస్.టి.ఐ.) నాయకత్వంలో కృషి చేశాయని అన్నారు. వైరస్ బాధితులు, రోగుల చికిత్సలో తగిన ఏర్పాట్లను సత్వరం కల్పించేందుకు, జీవకణాల్లో రోగనిరోధక ప్రతిస్పందనను అభివృద్ధి చేసేందుకు ఇది దోహదపడిందని అన్నారు. టీకా అభివృద్ధికి అవసరమైన జంతు అధ్యయనాలకు, భారతదేశపు మొట్టమొదటి డి.ఎన్.ఎ.-ప్రొటీన్ సబ్యూనిట్ వ్యాక్సిన్ అయిన కోర్బెవాక్స్‌ను రూపకల్పన చేసేందుకు ఇది టీకా పరిశ్రమకు తగిన మద్దతు ఇచ్చిందన్నారు.

భవిష్యత్తులో ఎలాంటి మహమ్మారి వ్యాధుల ముప్పునైనా ఎదుర్కొనేందుకు వీలుగా మనల్ని మనం సన్నద్ధం చేసుకోవడానికి ఇటీవలి కోవిడ్-19 తక్షణ మేల్కొలుపు పిలుపునిచ్చిందని, భవిష్యత్ సన్నద్ధత కోసం దేశం చేపట్టే టీకా అభివృద్ధి కార్యక్రమానికి బయోటెక్నాలజీ శాఖ, టి.హెచ్.ఎస్.ఐ.టి. నాయకత్వం వహించడం సమయోచితమని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పునరుద్ఘాటించారు.

ముందు కాలంలో రాబోయే అంటు వ్యాధుల నిరోధానికి వ్యాక్సిన్ అభివృద్ధి, సంబంధిత అంశాలను ముఖ్యంగా చర్చించడానికి విద్యాసంస్థలు, పరిశ్రమలు, నియంత్రణ సంస్థలకు చెందిన సారథులు, నిపుణులను ఒకచోట చేర్చేందుకు ఈ రెండు రోజుల సమావేశం దోహదపడింది. మహమ్మారి వ్యాధుల నిరోధానికి సంబంధించిన సంసిద్ధత కోసం ప్రత్యేకించి దక్షిణాది ప్రపంచం కోసం ఒక విధాన వ్యవస్థను అందించడంలో భారతదేశం ముందువరసలో ఉంటుందని ఆయన అన్నారు. సంబంధిత జాతీయ నియంత్రణ ప్రక్రియలను అంతర్జాతీయ ప్రక్రియలతో విలీనం చేయడం, భారీ ఎత్తున ఉత్పత్తికి వీలుగా తయారీ సామర్థ్యాన్ని పెంచడం, వనరులను సమీకరించడం వంటి విషయాల్లో దేశం తగిన కృషి చేస్తుందన్నారు. మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, బయోటెక్నాలజీ పరిశ్రమకు బలాన్ని సమీకరించడానికి, మన ఆర్థిక వ్యవస్థకు 80 బిలియన్ డాలర్లకు మించి ఎదిగేలా తగిన మద్దతు ఇవ్వడానికి కూడా ఇది దోహదపడుతుందని అన్నారు.

 

ఈ సమావేశంలో కేంద్ర బయోటక్నాలజీ శాఖ కార్యదర్శి డాక్టర్ రాజేష్ గోఖలే మాట్లాడుతూ, తయారీ రంగాన్ని, బయో-తయారీ ప్రక్రియను మెరుగుపరచడంలో ఔత్సాహిక క్రియాశీలతను, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి తమ శాఖ ఎంతో నిబద్ధతతో పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. టీకా సంసిద్ధత అనే ప్రక్రియ సంక్లిష్టమైనదని, ఈ విషయంలో సులభతరమైన శాస్త్రీయ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు తమ శాఖ మరింత కృషి చేస్తుందని ఆయన తెలిపారు. డెంగ్యూ, చికున్‌గున్యా, క్షయ తదితర వైరల్/బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌లను ఎదుర్కోగల సమకాలిక వ్యవస్థ అవసరమని, వ్యాక్సిన్, వ్యాధి నిర్ధారణ, వ్యాధిని నయం చేసే విధానాల్లో మరింత చురుకైన పరిష్కారాన్ని ఇది త్వరగా తీసుకువస్తుందని అన్నారు.

టి.హెచ్.ఎస్.టి.ఐ. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రమోద్ గార్గ్ మాట్లాడుతూ, పరిశోధన, అభివృద్ధి ప్రక్రియల్లో తమ సంస్థ కృషిని ప్రధానంగా ప్రస్తావించారు. కోవిడ్-19, క్షయ, డెంగ్యూ మొదలైన అంటు వ్యాధులపై క్లినికల్ పరిశోధనలు, టీకా ప్రభావ అధ్యయనాలు, పాన్-హాస్పిటల్ వ్యవస్థ అధ్యయనాలు, రోగనిర్ధారణ పద్ధతులు, అంతర్గత వ్యాక్సిన్ అభివృద్ధి పరిశోధనల గురించి డాక్టర్ ప్రమోద్ గార్గ్ క్లుప్తంగా వివరించారు. క్లినికల్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌లో కొత్తగా ఎం.ఎస్.సి. కోర్సు ప్రారంభించినట్టు చెప్పారు. విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయం చాలా అవసరమని ప్రమోద్ గార్గ్ అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక రంగం సహకారంతో పాన్ బీటా కరోనా వ్యాక్సిన్‌ను రూపకల్పన చేయడంలో సహకారం కోసం టి.హెచ్.ఎస్.టి.ఐ. ఇటీవల సి.ఇ.పి.ఐ. నుంచి 12 మిలియన్ల అమెరికన్ డాలర్ల నిధులను పొందిందని ఆయన తెలియజేశారు.

భారత ప్రభుత్వ వైజ్ఞానిక వ్యవహారాల మాజీ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ కె. విజయ్ రాఘవన్ ఈ సమావేశంలో ప్రధాన ఉపన్యాసం ఇచ్చారు. సి.ఇ.పి.ఐ. 100 రోజుల వ్యాక్సీన్ ఛాలెంజ్ ద్వారా ఎదురయ్యే సవాళ్లు, ప్రజారోగ్య సమాచారం, డేటా ఫ్లో సిస్టమ్స్, వ్యాక్సిన్ వేదికలు, ప్రీ క్లినికల్ సౌకర్యాలు, జంతు ప్రయోగాలు, నియంత్రణ వ్యవస్థ, అమలు వ్యవస్థ,.. ఈ సవాళ్లను ఎదుర్కొనే ప్రక్రియలను సూచించడంలో నిధుల పాత్ర ఎంతో ఉంటుందని ఆయన అన్నారు. కరోనా వైరస్‌కు బలమైన ఇమ్యునోజెనిక్ స్పైక్ ప్రొటీన్ యాంటిజెన్‌ని కలిగి ఉండటం మన అదృష్టమే కావచ్చని, అయితే, ఇతర అంటువ్యాధుల వ్యాప్తి విషయంలో అలా ఉండకపోవచ్చని ఆయన హెచ్చరించారు. అందువల్ల, 100 రోజుల సవాలును సాధించడానికి స్థిరమైన, ఆర్థికంగా లాభదాయకమైన వ్యవస్థకు రూపకల్పన చేయడం చాలా కీలకమని ఆయన అన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ.) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ, భారతదేశానికి ముఖ్యంగా ఎదురయ్యే వ్యాధుల నిరోధం కోసం తగిన కార్యాచరణ ప్రణాళికలను, ప్రొఫైల్‌ను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. వైరస్ బాధిత కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి, వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియలో భాగంగా ఈ కుటుంబాల నుంచి ప్రోటోటైప్‌లను ఎంచుకోవడానికి డబ్ల్యు.హెచ్.ఒ. ఒక కమిటీని ఏర్పాటు చేసిందని ఆమె పేర్కొన్నారు.

 

వివిధ అధ్యయన, పరిశోధన సంస్థలు, పరిశ్రమలు, నియంత్రణ సంస్థలకు చెందిన నిపుణులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నెదర్లాండ్స్‌కు చెందిన లైడెన్ విశ్వవిద్యాలయం, వైద్య కేంద్రం, అమెరికాకు చెందిన ఎమోరీ విశ్వవిద్యాలయం, IISc బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐ.ఐ.ఎస్.సి.), వేలూరుకు చెందిన క్రిస్టియన్ మెడికల్ కళాశాల (సి.ఎం.సి.), టి.హెచ్.ఎస్.టి.ఐ., భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐ.సి.ఎం.ఆర్.), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ.), సి.ఇ.పి.ఐ., సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, జైడస్ లైఫ్ సైన్సెస్ సంస్థ, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ప్రేమాస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, బయోలాజికల్ ఇ. ప్రైవేట్ లిమిటెడ్, పనాసియా బయోటెక్ లిమిటెడ్, జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ వంటి సంస్థల నిపుణులు, ముఖ్య ప్రతినిధులు తమ పరిశోధనాంశాలను ఈ సమావేశంలో సమర్పించారు.

 

<><><>



(Release ID: 1881715) Visitor Counter : 157


Read this release in: English , Urdu , Marathi , Tamil