వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"వ్యవసాయ పెట్టుబడి పోర్టల్"ను ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ తోమర్


మహిళా రైతులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.
మెలిండా గేట్స్ కు వివరించిన శ్రీ తోమర్

Posted On: 05 DEC 2022 6:19PM by PIB Hyderabad

బిల్ అండ్మె లిండా గేట్స్ ఫౌండేషన్ కో-ఛైర్‌పర్సన్  మెలిండా ఫ్రెంచ్ గేట్స్ ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న సమగ్ర  "వ్యవసాయ పెట్టుబడి పోర్టల్" ని శ్రీ తోమర్ ప్రారంభించారు. ఈ సమావేశంలో శ్రీ తోమర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళా రైతులను ప్రోత్సహించే అంశానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని  అన్నారు.

వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సమర్ధ చర్యలు అమలు చేస్తున్నదని శ్రీ తోమర్ వివరించారు. దేశంలో సన్నకారు రైతుల సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపిన శ్రీ తోమర్ సన్నకారు రైతుల సంఖ్య పెరిగితే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడమే కాకుండా పంట దిగుబడి పెరుగుతుందని అన్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం సన్నకారు రైతుల అభివృద్ధికి కార్యక్రమాలు రూపొందించిందని శ్రీ తోమర్ వివరించారు. భారతదేశంలో  సాంప్రదాయ విధానంలో వ్యవసాయం సాగిందని శ్రీ తోమర్ అన్నారు.   ప్రస్తుతం వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు ఆకర్షించడానికి  ప్రభుత్వం అనేక సంస్కరణలు ప్రారంభించి, వ్యవసాయంలో సాంకేతికత ప్రవేశపెట్టిందని  శ్రీ తోమర్ అన్నారు. అర్హత కలిగిన రైతులకు పారదర్శక విధానంలో సహాయం అందించేందుకు ప్రభుత్వం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ప్రారంభించిందని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు ఎక్కువగా వచ్చేలా చూడాలన్న లక్ష్యంతో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద 1.5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని అన్నారు.లక్ష కోట్ల రూపాయలతో  వ్యవసాయ మౌలిక సౌకర్య నిధి ఏర్పాటయిందని తెలిపిన శ్రీ తోమర్  కార్యక్రమం కింద ఇతర కార్యక్రమాలు కూడా అమలు జరుగుతున్నాయని వివరించారు. కార్యక్రమాల వల్ల వ్యవసాయ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని శ్రీ తోమర్ అన్నారు. 

భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారని శ్రీ తోమర్ తెలిపారు. వ్యవసాయ రంగంలో మహిళల సంఖ్య పెరిగేలా చేసేందుకు  చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం వారి సంక్షేమం కోసం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా కార్యక్రమాలు అమలు చేస్తున్నదని శ్రీ తోమర్ అన్నారు. మహిళా రైతులకు సాధికారత కల్పించేందుకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమంలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ భాగస్వామిగా ఉందని అన్నారు. మహిళా రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ బడ్జెట్ లో నిధులు సమకూర్చామని అన్నారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు ఆకర్షించడానికి "కృషి నివేష్ పోర్టల్" (వ్యవసాయ పెట్టుబడి పోర్టల్) సహకరిస్తుందని అన్నారు.  వ్యవసాయ పెట్టుబడిదారులకు వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన వివిధ శాఖల ద్వారా  ప్రభుత్వం అమలు చేస్తున్న   వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు కేంద్రీకృత వన్ స్టాప్ పోర్టల్ గా "కృషి నివేష్ పోర్టల్" పనిచేస్తుందని శ్రీ తోమర్ చెప్పారు. ఈ పోర్టల్ పెట్టుబడిదారులకు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.  భారతదేశంలోని వివిధ రంగాలలో గేట్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని శ్రీ తోమర్ ప్రశంసించారు. వ్యవసాయ రంగంలో  ఫౌండేషన్ అమలు చేస్తున్న కార్యక్రమాలు విజయవంతం అవుతాయన్న ఆశాభావాన్ని  శ్రీ తోమర్ వ్యక్తం చేశారు.

వ్యవసాయ మంత్రిత్వ శాఖ తో కలిసి తమ ఫౌండేషన్ పనిచేస్తుందని మెలిండా గేట్స్ అన్నారు. మహిళా రైతుల భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలన్నారు. భరతదేశంతో సహా  ఫౌండేషన్ అనేక దేశాల్లో కార్యక్రమాలు అమలు చేస్తున్నదని ఆమె అన్నారు.  జీ -20 అధ్యక్ష పదవిని భారతదేశం పొందడం  పట్ల  మెలిండా గేట్స్ హర్షం  వ్యక్తం చేశారు భారతదేశంతో  ఎల్లప్పుడూ కలిసి పని పని చేస్తామని అన్నారు.  ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ కార్యదర్శి శ్రీ మనోజ్ అహుజా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ మాట్లాడారు.  సంయుక్త కార్యదర్శి  శ్రీ ప్రవీణ్ శామ్యూల్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) మరియు గేట్స్ ఫౌండేషన్ భారతదేశ కార్యాలయ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

***


(Release ID: 1881180) Visitor Counter : 263


Read this release in: Tamil , English , Urdu , Marathi