మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కాశీ తమిళ సంఘంలో భాగంగా బనారస్ హిందూ విశ్వవిద్యాలయం కేంద్ర గ్రంథాలయంలో అరుదైన తమిళ పుస్తకాలు, తాళపత్రాల ప్రదర్శన

Posted On: 05 DEC 2022 4:12PM by PIB Hyderabad

వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం కేంద్ర గ్రంథాలయంలో అరుదైన తమిళ పుస్తకాలు, రాతప్రతుల ప్రదర్శనను ప్రారంభించారు. భారతీయ భాష సమితి అధ్యక్షుడు, కాశీ తమిళ సంఘం చీఫ్ కన్వీనర్ శ్రీ చాము కృష్ణశాస్త్రి ఈ ప్రదర్శనను ప్రారంభించారు.

విశ్వవిద్యాలయంలో జరుగుతున్న కాశీ తమిళ సంఘంలో భాగంగా, సాయాజీ రావ్ గైక్వాడ్ కేంద్ర గ్రంథాలయం ఈ ప్రదర్శనను నిర్వహించింది. 1890ల నుంచి రాసిన వివిధ తమిళ గ్రంథాలు & 17, 18వ శతాబ్దాల తమిళ గ్రంథ లిపిలో ఉన్న 12 రాతప్రతులను ప్రదర్శిస్తున్నారు. తొలి తమిళ నాటకాల మొదటి ప్రతులు, అనీబిసెంట్‌కు బహుమతిగా ఇచ్చిన పుస్తకాలు, తమిళ సంగీత రీతులను వివరించే ఒక పుస్తకం, కుమారగురుబర పుస్తకాలు, శైవ తత్వశాస్త్రాన్ని వివరించే పుస్తకాలు, భారతి పుస్తకాలు, రామాయణం, మహాభారతం అనువాదాలు మొదలైనవి ఈ ప్రదర్శనలో ఉన్నాయి.

డిసెంబర్ 5 నుంచి 16వ తేదీ వరకు, 12 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 11:00 నుంచి రాత్రి 7:00 గంటల వరకు ఈ విలువైన పుస్తకాల ప్రదర్శన నిర్వహిస్తారు. కేంద్ర గ్రంథాలయం సెంట్రల్ హాల్ పక్కనే ఉన్న 'మాన్యుస్క్రిప్ట్స్ అండ్ రేర్ డాక్యుమెంట్స్' విభాగంలో వీటిని ప్రదర్శిస్తున్నారు.

ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన శ్రీ కృష్ణశాస్త్రి మాట్లాడుతూ, ఇలాంటి పురాతన& అరుదైన పత్రాలను విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో చక్కగా భద్రపరచడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ పత్రాలను సరిగ్గా వర్గీకరించి పరిశోధకుల కోసం అందుబాటులో ఉంచాలని కోరారు. వాటిని అర్ధం చేసుకోవడం ప్రస్తుత కాలానికి అవసరమని చెప్పారు.

ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాశీ తమిళ సంగమానికి వచ్చేవాళ్లంతా ఈ ప్రదర్శనను సందర్శించాలని ఉప గ్రంథాలయాధికారి డా.సుచితా సింగ్ ఆహ్వానం పలికారు.

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ డైరెక్టర్ ప్రొ.చంద్రశేఖరన్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం గ్రంథాలయాధికారి డా.దేవేంద్ర కుమార్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సహాయ గ్రంథాలయాధికారి డా. ఆర్.పరమేశ్వరన్, తమిళ విభాగానికి చెందిన ఇద్దరు సహాయ ఆచార్యులు డా. టి.జగతీశన్, డా.విఘ్నేష్ ఆనంద్, తమిళం చదువుతున్న విద్యార్థులు, తమిళ భాష ప్రచారకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

*****



(Release ID: 1881047) Visitor Counter : 133


Read this release in: English , Urdu , Hindi , Tamil