రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో భారత నావికాదళం నిర్వహించిన కార్యాచరణ ప్రదర్శనను తిలకించిన భారత రాష్ట్రపతి.


రక్షణ మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, రహదారి మార్గాలు, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన.

భారత జాతీయ నావికా ప్రయోజనాల పరిరక్షణ కోసం భద్రతా వలయాన్ని నిర్వహించే గురుతర బాధ్యత భారత నౌకాదళానికి ఉంది: రాష్ట్రపతి శ్రీమతి ముర్ము

Posted On: 04 DEC 2022 7:42PM by PIB Hyderabad

నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఈరోజు (డిసెంబర్ 4, 2022) విశాఖపట్నంలో భారత నావికాదళం నిర్వహించిన ప్రదర్శనను భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము వీక్షించారు. రక్షణ మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన వివిధ ప్రాజెక్టులను ఆమె ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు.

 

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, నావికాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 1971 యుద్ధంలో చారిత్రాత్మక విజయానికి దోహదపడిన భారత నౌకాదళ సాహస కృత్యాలను స్మరించుకోవడానికి ఈ రోజును నిర్వహించుకుంటున్నామని ఆమె చెప్పారు. ఇది చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొంది, తరతరాలకూ స్ఫూర్తిదాయకంగా ఉన్న మన అమరవీరులను స్మరించుకునే , సత్కరించే రోజని, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, అమృత్ కాల్ ద్వారా గొప్ప భవిష్యత్తు వైపుకు తీసుకెళ్లడానికి మనల్ని మనం పునరంకితం చేసుకోవాలని కూడా ఈ రోజు గుర్తుచేస్తుంది అని రాష్ట్రపతి పేర్కొన్నారు.

మూడు వైపులా సముద్రం, నాల్గవ వైపు ఎత్తైన పర్వతాలతో మనది స్వాభావికంగా సముద్ర ప్రాముఖ్యత గల దేశం అని, భారతదేశ అభివృద్ధి, శ్రేయస్సులో మహాసముద్రాలు కీలక పాత్ర పోషించడం సహజమని, భారతదేశ జాతీయ సముద్ర ప్రయోజనాలకు భద్రత కల్పించే భారీ బాధ్యత భారత నౌకాదళానికి ఉందని రాష్ట్రపతి అన్నారు.

 

భారత నావికాదళం తన దీక్ష,పట్టుదలతో, నిబద్ధత, దృఢ నిశ్చయాలతో, సామర్థ్య అభివృద్ధిలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, చర్యలో ఫలిత దృష్టితో క్రియాశీలంగా ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ నౌకా దినోత్సవ ఇతివృత్తం - ‘పోరాటస్ఫూర్తితో సదాసిద్ధంగా, విశ్వసనీయ, సమ్మిళిత భావి సేన’ ప్రకటన నుంచి కూడా ఇది స్పష్టమవుతుందని ఆమె అన్నారు. సర్వ సైన్యాధ్యక్షురాలిగా, భారత నావికాదళం నూతన , అభివృద్ధి చెందిన భారతదేశ దృక్కోణానికి అనుగుణంగా - శక్తి నుండి శక్తికి ఎదుగుతుందని తాను విశ్వసిస్తున్నాను అని రాష్ట్రపతి అన్నారు.

ఈరోజు ప్రారంభించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టులు భారతదేశ సమగ్ర, సమ్మిళిత అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని తనకు నమ్మకం ఉందని అన్నారు. భారతీయులందరూ గర్వంగా ముందుకు సాగి,నూతన, అభివృద్ధి చెందిన భారతావనిలోకి అడుగు పెట్టేందుకు అనుగుణంగా మనం అభివృద్ధి పథాన అంతరాలను పూడ్చుకోవాలని ఆమె అన్నారు.

 

రాష్ట్రపతి ప్రసంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

***


(Release ID: 1880862) Visitor Counter : 271