సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
“బీట్స్ అండ్ రిథమ్స్” మాస్టర్ క్లాస్ ను వీక్షించిన ఇఫీ-53
సంగీత స్వరాలు వాస్తవ కథను, స్వభావాలను ప్రతిబింబించి, పరిస్థితులకు న్యాయం చేయాలి : జి.వి.ప్రకాశ్ కుమార్
మీ సొంత అనుభవాలు, పర్యావరణం, సంస్కృతి జోడించి మీరు సంగీతం స్వరపరిచినట్టయితే అది సహజసిద్ధంగా ఉంటుంది : స్నేహ ఖన్వాల్కర్
సంగీతం ఎప్పుడూ ఒక పిచ్చిగానే ఉంటుంది. సంగీతం స్వరపరిచేందుకు నిర్దిష్టమైన నిబంధనలేవీ ఉండవు. కథ, డైరెక్టర్ కోరిన మేరకు ఒక చిత్రానికి సంగీతం స్వరపరచాల్సి ఉంటుందని స్వరకర్త, గాయకుడు జి.వి.ప్రకాశ్ కుమార్ గోవాలోని 53వ భారత అంతర్జాతీయ చిలనచిత్రోత్సవంలో “బీట్స్ అండ్ రిథమ్స్” పై మాస్టర్ క్లాస్ లో మాట్లాడుతూ అన్నారు.
సంగీతానికి కొనసాగింపు అనేది ఉండదని, అదెప్పుడూ వాస్తవ సంఘటనలకు అనుగుణంగా, శక్తిని నింపేదిగా ఉండాలని జివి అన్నారు. “సంగీత స్వరాలు ఎప్పుడూ కథనాన్ని వివరించి పాత్రలను, పరిస్థితులను ప్రతిబింబించేవిగా ఉండాలి. కథ చెప్పే విధానం మొత్తం అనుభవాన్ని మెరుగుపరిచేదిగా ఉండాలి” అని చెప్పారు.
సంగీతం మన జీవితం, సంస్కృతిలో అంతర్భాగమని, ఆది నుంచి అది మనతో ఉంటుందని జివి తెలిపారు.
వివిధ చిత్రాలకు సంగీతం అందించిన అనుభవం గురించి వివరిస్తూ సంగీతకర్తకు, డైరెక్టర్ కు మధ్య గల నమ్మకం, ప్రేమ అత్యంత కీలకమని అవార్డు గ్రహీత అయిన స్వరకర్త అన్నారు. సంగీత స్వరాలు ఒక చిత్రానికి, మరొక చిత్రానికి మధ్య వేరుగా, వైవిధ్యభరితంగా ఉంటాయి.
“కొన్ని సందర్భాల్లో కథ చెప్పే తీరును సంగీతం ఇనుమడింపచేయాలి. మౌనం తీవ్రతను మరింత ప్రతిబింబించేదిగా ఉండడం చాలదు” అని నొక్కి చెప్పారు.
జానపద సంగీతం ప్రాధాన్యతను నొక్కి చెబుతూ జానపద సంగీతం, స్వరం, పదాలు ఎప్పుడూ స్థానికత, సంస్కృతి, కథనం స్వభావానికి న్యాయం చేకూర్చేందుకు కృషి చేస్తుందని జివి అన్నారు. “ఒక కథకు సంగీతం అందించే సమయంలో భౌగోళిక స్వభావం, సంస్కృతుల సమ్మేళనాన్ని దృష్టిలో ఉంచుకోవాలి” అని తెలిపారు.
సంగీతం స్వరపరచడం సమ్మిళిత, సంక్లిష్ట ప్రక్రియ. అందుకు ఎంతో అభిరుచి కావాలి అని సంగీత దర్శకురాలు స్నేహ ఖన్వాల్కర్ అన్నారు.
ఒక స్వరకర్త తన అనుభవం, పరిస్థితులు, సంస్కృతిని మేళవించి సంగీతం సమకూర్చినట్టయితే అది వాస్తవంగాను, ప్రత్యేకంగాను ఉంటుందని ఒక ఔత్సాహికుని ప్రశ్నకు సమాధానంగా స్నేహ తెలిపారు.
జాతీయ అవార్డు పొందిన చిత్ర విమర్శకుడు భరద్వాజ్ రంగన్ ఈ సెషన్ కు మోడరేటర్ గా వ్యవహరించారు.
ఇఫీ 53 మాస్టర్ క్లాస్ లు, గోష్ఠి కార్యక్రమాలను సత్యజిత్ రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ (ఎస్ఆర్ఎఫ్ టిఐ), ఎన్ఎఫ్ డిసి, ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్ టిఐఐ), ఇఎస్ జి ఉమ్మడిగా నిర్వహించాయి. చలనచిత్ర నిర్మాణంలోని విభిన్న విభాగాలకు చెందిన విద్యార్థులు, ఔత్సాహికుల ప్రోత్సాహానికి ప్రతీ ఏటా నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 23 మాస్టర్ క్లాస్ లు, గోష్ఠి కార్యక్రమాలు జరిగాయి.
***
(Release ID: 1879524)
Visitor Counter : 156