సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
పాత్రికేయులు.. ప్రతినిధులతో ‘ఇఫి’ అంతర్జాతీయ పోటీ న్యాయనిర్ణేతల సంఘం సమావేశం
వివిధ రకాల ఎంపికలకు అవకాశమివ్వడమే చలనచిత్రోత్సవ ధ్యేయం: అంతర్జాతీయ పోటీ న్యాయనిర్ణేతల సంఘం చైర్‌పర్సన్ నాదవ్ లాపిడ్;
థియేటర్లలో చిత్రాలు చూడండి: సంఘం సభ్యుడు జేవియర్ అంగులో బార్టురెన్;
ప్రపంచవ్యాప్త అత్యుత్తమ చిత్రాల కోసం ‘ఇఫి’కి
శాశ్వత నిర్వాహకత్వం అవసరం: సభ్యుడు సుదీప్తో సేన్;
సినిమాల్లో మహిళలకిచ్చే పాత్రలు ఏమంత
గౌరవప్రదంగా లేవు: సభ్యుడు పాస్క్ల్ చావాన్స్
చలనచిత్ర రంగంలో ఏదో ఒక పార్శ్వాన్ని ప్రదర్శించడం కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల ఎంపికకు అవకాశమివ్వడమే చలన చిత్రోత్సవ లక్ష్యమని ఇజ్రాయెల్ దర్శకుడు, రచయిత- ప్రస్తుత 53వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫి) అంతర్జాతీయ పోటీ న్యాయ నిర్ణేతల సంఘం చైర్‌పర్సన్ నాదవ్ లాపిడ్ అన్నారు. చిత్రోత్సవంలో భాగంగా ‘ఇఫి టేబుల్ టాక్స్’ పేరిట పత్రికా సమాచార సంస్థ (పీఐబీ) ఏర్పాటు చేసిన పాత్రికేయుల, ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక చలన చిత్రోత్సవాలను కలగలుపు విధానంలో నిర్వహిస్తున్నప్పటికీ భారీ తెరలపై సినిమాలు చూడటం మరింత అద్భుతమైన అనుభవమని నాదవ్ లాపిడ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు “ఉత్తమ చిత్రాలను పెద్ద తెరమీద చూడగలగటం మానవాళి సాధించిన అత్యున్నత విజయాలలో ఒకటి” అని ఆయన పేర్కొన్నారు.
వివిధ చలన చిత్రోత్సవాలతో ‘ఇఫి’కి సారూప్యంపై ప్రశ్నలకు బదులిస్తూ- ప్రతి చిత్రోత్సవం తనదైన రీతిలో ప్రత్యేకమైనదేనని, వాటిని సరిపోల్చడం సరికాదని నాదవ్ లాపిడ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ‘ఇఫి’ అంతర్జాతీయ పోటీ విభాగంలో చిత్రాల నాణ్యతపై సంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఎంపికలో మెరుగుదలకు సదా అవకాశం ఉంటుందని అంగీకరించింది. కాగా, ‘ఇఫి’లో ప్రతి ప్రదర్శనశాల ప్రేక్షకులతో నిండిపోవడం, తాము చూసిన చిత్రాల గురించి చర్చించుకోవడంపై ఫ్రాన్స్‌కు చెందిన డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాత, సంఘం సభ్యుడు జేవియర్ అంగులో బార్టూరెన్ హర్షం వెలిబుచ్చారు. ప్రజలు థియేటర్లలో పెద్ద తెరలపైన కూడా ఈ సినిమాలను చూడాలని ఆయన సూచించారు.
చలన చిత్రోత్సవాలకు ఉత్తమ చిత్రాలు వచ్చేవిధంగా చూసుకోవడం కోసం శాశ్వత నిర్వాహకత్వ పద్ధతిలో ఏడాది పొడవునా ఎంపిక ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఉందని న్యాయనిర్ణేతల సంఘంలోభారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడు, రచయిత-దర్శకుడు సుదీప్తో సేన్ సూచించారు. ఈ ఏడాది సంపూర్ణ, సమగ్ర చిత్రోత్సవాలను నిర్వహించారంటూ ‘ఇఫి’ నిర్వాహకులను ఆయన అభినందించారు. “ఇది నేను చూసిన అత్యుత్తమ ఇఫి.. ఒక దేశంగా భారత్‌లోని సప్తవర్ణ సమ్మిళిత వైవిధ్యం, ప్రదర్శన వగైరాలన్నీ చాలా బాగున్నాయి. ఈ వేడుకల వివిధ అంశాలను పరిశీలించినపుడు ‘ఇఫి’ అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు దీటుగా ఉన్నదని నేను కచ్చితంగా చెప్పగలను. ఇదొక పండుగలా పరిణతి సాధించింది” అని సుదీప్తో సేన్ వ్యాఖ్యానించారు. రాబోయే సంవత్సరాల్లో పర్యావరణం, వాతావరణ మార్పులపై ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ‘ఇఫి’ నిర్వాహకులను కోరారు.
సినిమాల్లో మహిళా ప్రాతినిధ్యంపై సంఘం సభ్యుడు, ఫ్రాన్స్‌కు చెందిన ఎడిటర్ పాస్కల్ చావాన్స్ మాట్లాడుతూ- తాను చాలామంది మంచి నటీమణులను చూసినప్పటికీ, వారికిచ్చిన పాత్రలు అంత గౌరవప్రదంగా లేవన్నారు. ఈ న్యాయ నిర్ణేతల సంఘంలో అమెరికాకు చెందిన యానిమేషన్ చిత్ర నిర్మాత జింకో గోటో కూడా సభ్యులుగా ఉన్నారు. సమావేశంలో ‘ఎన్‌ఎఫ్‌డీసీ' మేనేజింగ్ డైరెక్టర్ రవీందర్ భాకర్ మాట్లాడుతూ- ‘ఇఫి’లో భాగంగా 2022 నవంబర్ 28న ఉదయం పణజీలోని మిరామార్ బీచ్‌లో బీచ్ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ ఏడాది ‘ఇఫి’ అంతర్జాతీయ పోటీల ప్రతిష్టాత్మక ‘స్వర్ణ మయూరం’ (గోల్డెన్ పీకాక్) పురస్కారానికి 15 చిత్రాలు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తమ చిత్రంతోపాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ప్రత్యేక జ్యూరీ అవార్డులను న్యాయనిర్ణేతల సంఘం ప్రకటిస్తుంది. అలాగే 7 జాతీయ, అంతర్జాతీయ దర్శకుల తొలి చిత్రాల నుంచి ‘ఉత్తమ తొలి చిత్రం’ పురస్కారాన్ని కూడా ప్రకటిస్తుంది.
******
(Release ID: 1879396)
Visitor Counter : 180