సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner

లక్షిత ప్రేక్షకులెవరో తెలుసుకోవడం సినిమా విజయానికి దోహదం: ఎ.శ్రీకర్‌ ప్రసాద్


53వ ‘ఇఫి’ మాస్టర్ క్లాస్‌లో ‘టు కట్ ఆర్ నాట్ టు కట్’ పేరిట సినిమా ఎడిటింగ్లో సూక్ష్మ నైపుణ్యాలపై కీలకాంశాలను పంచుకున్న ప్రసిద్ధ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్

పీఐబీ ఢిల్లీ ద్వారా 2022 నవంబరు 25న సాయంత్రం 6:19 గంటలకు పోస్ట్‌ చేయబడినది

   గోవాలో53వ ‘ఇఫి’లో భాగమైన మాస్టర్ క్లాస్‌లో ‘టు కట్ ఆర్ నాట్ టు కట్’ పేరిట సినిమా ఎడిటింగ్‌లో సూక్ష్మ నైపుణ్యాలపై కీలకాంశాలను ప్రసిద్ధ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా లక్షిత ప్రేక్షకులెవరో తెలుసుకోవడానికిగల ప్రాముఖ్యాన్ని శ్రీ ప్రసాద్‌ వివరించారు. చిత్ర నిర్మాతలు.. ముఖ్యంగా యువ దర్శక-నిర్మాతలు ప్రేక్షకుల నాడిని చక్కగా పసిగట్టడం ఎంతో అవసరమని ఆయన సూచించారు. లక్షిత ప్రేక్షకులెవరో తెలుసుకోవడం సినిమా విజయానికి దోహదం చేస్తుందని తెలిపారు. ఏదైనా సినిమా ప్రేక్షకుల మెప్పుపొంది విజయం సాధించిందంటే అంతకన్నా ఆనందం మరొకటి ఉండదన్నారు.

   సినిమాల్లో అతిశయోక్తుల గురించి ప్రసాద్‌ ప్రస్తావిస్తూ- సినిమా కథ, నటీనటులను బట్టి అతిశయోక్తుల స్థాయి మారుతూంటుందని చెప్పారు. “అగ్ర నటుల సినిమాల్లో అభిమానులను మెప్పించడం కోసం అతిశయోక్తులు చూపిస్తుంటాం.. వాటి స్థాయి మారవచ్చుగానీ, అది తప్పదు” అన్నారు. అలాగే “సినిమాను ఆస్వాదించడంలో అది కనుమరుగవుతుంది. దాన్ని మీరు వేరుచేసి చూడలేరు.. అయితే, అతిశయోక్తి మితిమీరి పోకుండా వాస్తవికతను తేవడం ముఖ్యం’ అన్నారు. ఎడిటింగ్‌లో తన అనుభవం గురించి వివరిస్తూ- “ప్రతి అనుభవం మరొక అనుభవానికి దారితీస్తూంటుంది. ఎప్పుడేం చేయాలో, ఏం చేయకూడదో అది నేర్పుతూంటుంది. అందువల్ల ప్రతిసారీ దాన్ని పాఠం నేర్పే అనుభవంగానే భావించాలి. వదిలేయడం సులభమేగానీ, అంతిమ లక్ష్యం కోసం కృషి చేయడం, దాన్ని సాధించడం మరింత సవాలుగా ఉంటుంది” అన్నారు.

   హుళ కెమెరాలు, కోణాల్లో చిత్రీకరణ పద్ధతి, ఎడిటింగ్‌పై దాని ప్రభావం గురించి ప్రసాద్ మాట్లాడుతూ- యువ చిత్ర నిర్మాతలు కటింగ్‌ టేబుల్ వద్ద కూర్చునేదాకా కత్తిరింపును ఊహించలేరన్నారు. చాలామంది దర్శకులకు ఎడిటింగ్ గది అనుభవం ఉండదు. అయితే, మునుపటి రోజుల్లో తమ దర్శకత్వం మెరుగ్గా ఉండాలంటే వారికి ఈ అనుభవం తప్పనిసరి. నేటి ఎడిటింగ్ రూముల విషయానికొస్తే- ఇప్పుడు సాఫ్ట్‌ వేర్‌ల సహాయంతో మరింత ప్రత్యేకంగా సవరించే వీలుంది. అయితే, సరైన ఫలితం రాబట్టడం చాలా శ్రమతో కూడుకున్నదే. విరామాల (పాజ్‌)ల ప్రాముఖ్యాన్ని వివరిస్తూ- ‘పాజ్‌లు యావద్భారత భావనే అయినప్పటికీ, సాధారణంగా దక్షిణాది చిత్రాలలో సాగదీత దృశ్యాల మధ్య కాకుండా మొత్తం కథలోనే ఉంటుంది. కాబట్టి, ఎడిటర్లు సరైన వ్యవధిని గుర్తించడం ముఖ్యం. ప్రతి పరిస్థితికీ దానికంటూ ఒక వ్యవధి ఉంటుంది. సరైన వ్యవధిని ఎంచుకుని కత్తిరించడం అవసరం. ఒక నిర్దిష్ట సన్నివేశంలో కత్తిరింపు సున్నితత్వం, దాని భారీ ప్రభావం సన్నివేశం ప్రాధాన్యాన్ని బట్టి ఉంటుంది. సన్నివేశాన్ని మరింత ప్రభావశీలం, సమర్థంగా చూపించేలా కొన్నిసార్లు సంజాయిషీ ఇచ్చే అవసరం లేకుండానే మేము దాన్ని విరామంతో సాగదీస్తాం. వాస్తవానికి సదరు సన్నివేశంలో నటులు అంత విరామం తీసుకోకపోయి ఉండవచ్చు. కానీ సన్నివేశం పండటం కోసం మేం దాన్ని పెంచుతాం. వెంటవెంటనే సంభాషణవల్ల మెదడుపై భారం పడవచ్చు. ప్రేక్షకులు ఆ సన్నివేశంలో లీనం కావాలంటే ఓ క్షణం విరామం అవసరం కావచ్చు. కాబట్టి ఆ విరామం ప్రేక్షకులు భావోద్వేగాన్ని అర్థం చేసుకోవడానికి, అనుభూతి చెందడానికి సమయమిచ్చే ఓ జోక్‌లాగా ఉండొచ్చు” అని ప్రసాద్‌ చెప్పారు.

   శ్రీ ప్రసాద్ తన ప్రసంగం కొనసాగిస్తూ- “ఈ అంశాలన్నీ ఎడిటింగ్ సజావుగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఒక నిశ్శబ్ద సన్నివేశాలు ప్రభావవంతంగా ఉండి, నేపథ్యం సంగీతంతో మిళితమై భావోద్వేగానుభూతిని పంచుకునేలా చేస్తాయి” అన్నారు. ఈ మేరకు ఒక సినిమాలో సన్నివేశానికి రెండు పార్శ్వాలను చూపుతూ మరింత సమర్థం, ప్రభావవంతంగా సన్నివేశ రూపకల్పన కోసం దర్శకులు దీర్ఘ విరామాలను ఎలా అనుమతిస్తారో శ్రీ ప్రసాద్ వివరించారు. పాటల చిత్రీకరణలో గమనంలో ఉంచుకోవాల్సిన అంశాలపై ప్రేక్షకులు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ- “చలనచిత్ర చరిత్రలో పాటలకు సదా ప్రముఖ స్థానం ఉంటుంది. అలాగే అవి అత్యంత కనువిందుగా ఉంటాయి. ఇంతకుముందు పాటలు కథాగమనంలో ఒక భాగంగా ఉండేవి. అయితే, ఇప్పుడు కథాగమనాన్ని వివరించే ఒక సన్నివేశంలా ఉంటున్నాయి. కథాగమనం సజావుగా సాగడానికి ప్రాధాన్యం పెరిగినందువల్ల పాటల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది” అని వివరించారు.

   ఒక ఎడిటర్‌ తాను సఫలమయ్యానని ఎప్పుడు భావిస్తాడన్న మరో ప్రశ్నకు బదులిస్తూ- “ఎవరో ఒకరు వచ్చి చెప్పాల్సిందే. నేను చాలామందితో పనిచేస్తాను కాబట్టి ఎవరి అభిప్రాయాన్నైనా సహృదయంతో స్వీకరించాల్సిందే. ఇక నా పనితీరు సంతృప్తికరంగా ఉందని భావించాల్సిన వ్యక్తి చిత్ర దర్శకుడే” అని ప్రసాద్‌ చెప్పారు. చిత్రం ముగింపు ప్రక్రియపై ప్రశ్నకు సమాధానమిస్తూ- “పతాక సన్నివేశం (క్లైమాక్స్) కథను ముగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. చివరి సన్నివేశం బాగా లేకపోతే సినిమా మొత్తం వృథాయే. దురదృష్టవశాత్తూ భారతీయ చలనచిత్రాల్లో మనకు రెండు పతాక సన్నివేశాలుంటాయి. వాటిలో ఒకటి మధ్యన విరామం కాగా, మరొకటి చివర్లో వస్తుంది. కొన్నిసార్లు విరామ సన్నివేశం అత్యంత ఉత్కంఠ కలిగిస్తుంది. అందుకే రెండో సగంకన్నా మొదటి సగం బాగుందని ప్రేక్షకులు అంటూంటారు. ఇక క్లైమాక్స్ చివరి సన్నివేశం కాబట్టి ప్రేక్షకుల మనసులో అది ఒక ముద్ర వేస్తుంది” అని వివరించారు.

   ఓటీటీల కోసం ఎడిటింగ్‌ పద్ధతులను వివరిస్తూ- ది సినిమా లేదా సీరియల్‌ అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా సినిమాతో పోలిస్తే సీరియల్‌ రచనా శైలిలో తేడా ఉంటుంది. ఎందుకంటే ప్రతి భాగం చివర పతాక సన్నివేశంలా రచిస్తారు. కాబట్టి, మనం అనేక విరామాలు లేదా పతాక సన్నివేశాలతో సిద్ధంగా ఉండాలి” అని శ్రీ ప్రసాద్‌ తెలిపారు.

 

******

iffi reel

(Release ID: 1879032) Visitor Counter : 177