సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వీధివాసుల పారిశుద్ధ్య సమస్యలను ప్రతిబింబించిన మరాఠీ ఫిలిం ‘రేఖ’
వారిపట్ల సమాజం మురికి వైఖరిని నిలదీసిన సినిమా!
వీధుల్లో నివాసంఉండే అభాగ్యుల రోజువారీ జీవన పోరాటం, వారు ఎదుర్కొనే పరిశుభ్రత-పారిశుధ్య సమస్యలు, వారి సమస్యలపై సమాజం ప్రదర్శించే మురికి వైఖరిని వివరించే ఒక చనలచిత్రాన్ని గురువారం 53వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ(ఐ.ఎఫ్.ఎఫ్.ఐ.) వేదికపై ప్రదర్శించారు. ఇండియన్ పనోరమా కేటగిరీలో నాన్-ఫీచర్ విభాగం క్రింద ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ‘రేఖ’ అనే ఈ మరాఠీ సినిమా దర్శకుడు శేఖర్ బాపు రణ్‌ఖాంబే మహారాష్ట్రంలోని సాంగ్లీ నివాసి. ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ “వీధుల్లో నివాసం ఉండే వారికి మనం తలుపులు మూసివేశాం. కానీ మనం ఇలా ఎందుకు చేస్తున్నాం? వారి దుర్బర జీవితానికి గల కారణాన్ని తెలుసుకోవాలనే తపన, వీధివాసుల పట్ల సమాజపు నిర్లక్ష్య వైఖరి. ఈ కారణాలతోనే నేను ఏడాదిన్నర కాలంగా ఈ సినిమా ప్రాజెక్ట్‌పై పరిశోధన చేయాల్సి వచ్చింది.” అని అన్నారు. రోడ్లపై నివసించే మహిళలు తమ జీవితంలో ఎదుర్కునే ఇబ్బందులను చిత్రీకరిస్తూనే, వారి బహిష్టు సమయంలో దుర్భరమైన పారిశుద్ధ్యలోపాలపై కూడా ఈ చిత్రంలో దృష్టిని కేంద్రీకరించారు. “ఈ విషయంపై పరిశోధన చేస్తున్నప్పుడు, వారి వాస్తవిక పరిస్థితులు నన్ను ఎంతో విస్మయానికి గురిచేశాయి. ఈ దుర్భర పరిస్థితుల్లో నెలల తరబడి స్నానం చేయడానికి కూడా వారికి అవకాశం ఉండదు” అని శేఖర్ బాపు రణ్‌ఖాంబే అన్నారు.
ఈ చిత్రంలో రేఖ అనే కథానాయిక రోడ్డు పక్కనే నివసిస్తూ ఉంటుంది. ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్ అనే చర్మ సంబంధమైన రుగ్మతతో బాధపడుతూ ఉంటుంది. అయితే, ఇందుకు డాక్టర్ మందు ఇస్తూ, స్నానం చేసిన తర్వాతనే వాడాలని ఆమెకు సూచిస్తాడు. అయితే ఇందుకు ఆమె భర్త అడ్డుచెబుతూ ఆమెపట్ల అమర్యాదరకంగా ప్రవర్తిస్తాడు. రేఖ స్నానం చేయడానికి ప్రయత్నించినా, ఆమెతో పాటు నివసించే మహిళలు కూడా అందుకు అడ్డు చెబుతారు. ఇందుకు వారు చెప్పిన కారణంతో రేఖ విస్మయానికి గురవుతుంది. దీనితో చివరకు ఆమె ఎటూతోచని సంకటంలో చిక్కుకుంటుంది. రుగ్మతనుంచి తాను బయటపడాలంటే, స్నానం చేయాలని, అందుకు తన భర్తను కూడా వదలిపెట్టాలని ఆమె నిర్ణయించుకుంటుంది, తద్వారా ఇన్‌ఫెక్షన్‌ను ఎదుర్కోవటానికి తనకు వీలుంటుందను ఆమె భావిస్తుంది. పరిశుభ్రంగా ఉండేందుకు ఆమె ఎన్ని కష్టాలు పడిందో ఈ చిత్రం విపులంగా వివరిస్తుంది.
![](https://ci3.googleusercontent.com/proxy/n7SD6exmTQTl1ii9RtMuf4ZQ8dkX6iNPYIMRrFQR-JClkYy0kmLrymmuIZz2Lu5lnWg_6hYWF51sLLRv6Wnv9Lvn2hQoG23GOd9PaW-HZ56XWblmRowAQPr7=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/rekha-19WSA.jpg)
చిత్ర తారాగణంలో మహారాష్ట్రకు చెందిన వగా (రంగస్థల) కళాకారులు ఉన్నారు. వారెవరూ ఇంతకు ముందు సినిమా కెమెరాల ముందు నటించలేదు. అందుకే, కెమెరాల ముందు నటనపై శిక్షణ ఇచ్చేందుకు వారికి రెండు నెలల పాటు వర్క్‌షాప్‌ను నిర్వహించారు. రెండోదశ లాక్‌డౌన్ సమయంలో ఈ సినిమా స్క్రిప్ట్ రైటింగ్, షూటింగ్ పూర్తయింది.
ఐ.ఎఫ్.ఎఫ్.ఐ.పై పత్రికా సమాచార విభాగం (పి.ఐ.బి.) ఈ రోజు నిర్వహించిన “టేబుల్-టాక్స్” కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ బాపు రణ్‌ఖాంబే మాట్లాడారు. ఈ సినిమా ప్రాజెక్ట్‌లో ఎంతో సహాయపడిన ప్రముఖ మరాఠీ దర్శకుడు రవి జాదవ్‌కు తానెంతో రుణపడి ఉంటానని రణ్‌ఖాంబే అన్నారు.
![](https://ci6.googleusercontent.com/proxy/t_n79fp11JQlqz4Af_VA4SJlKPtj0ScXVW6WpEKOT52rHVKppwSLc_K2UBUgb5svIKcC4eR-Ee5VtI1fHSN0GDCUWMjHTqYzL_nPilnvkWGKasDlwnZWkAET=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/rekha-2FRX2.jpg)
పరిశుభ్రత, పారిశుద్ధ్యం అనే భావనకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సినిమాలో దృష్టిని కేంద్రీకరించినట్టు ఆయన చెప్పారు. అదే సమయంలో వీధి నివాసుల పట్ల సమాజం సచ్ఛమైన విధానం అవలంబించాల్సిన అవసరాన్ని ఈ సినిమా ప్రబోధిస్తుందన్నారు. మన సమాజంలో మహిళలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని అయన అన్నారు. "ఉన్నతశ్రేణి సమాజంలోని మహిళలు, అలాగే మురికివాడలలోని ఆడవారూ తాము ఒకే రకమైన మనస్తత్వాలను ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్నారు" అని అయన వివరించారు.
![](https://ci4.googleusercontent.com/proxy/SrYLQhhyRHfv97zxdBUaXKP7wpTAUDJ7mft8hDsmxETkuG8nG4D6YeLSAro6A0GyNxo52BIyVDZwm1rwl3kYlKFtSe0B891oSj-ZOsc3qwXnD7AGkz7AyeuR=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/rekha-3AMGK.jpg)
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలను పోషించిన మాయా పవార్, తమీనా పవార్ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ చిత్రంలో నటించే అవకాశం తమకు దక్కినందుకు, ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. చిత్రాల్లో ఈ సినిమా చోటు దక్కించుకున్నందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. తాము మహారాష్ట్రకు చెందిన తమాషా జానపద కళాకారులం అయినప్పటికీ, సినిమా మాధ్యమం తమకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టిందని వారు అన్నారు.
***
(Release ID: 1879030)
Visitor Counter : 175