ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈశాన్య ప్రాంత ఫీల్డ్ టెక్నికల్ సపోర్ట్ యూనిట్ల సమీక్షా సమావేశం

Posted On: 24 NOV 2022 6:00PM by PIB Hyderabad
ఈశాన్య ప్రాంత రాష్ట్రాల అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తోంది. 
లక్ష్యాల మేరకు అభివృద్ధి పథకాలు అమలు జరిగేలా చూసేందుకు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ  కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖల మధ్య వారధిలా పనిచేసి సమాచారం అందించేందుకు రాష్ట్ర ప్రధాన కేంద్రంలో  ఫీల్డ్ టెక్నికల్ సపోర్ట్ యూనిట్లను మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. గత రెండు నెలల నుంచి ఈ యూనిట్లు పనిచేస్తున్నాయి. 
యూనిట్లు పనిచేస్తున్న తీరును ఈ రోజు  న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన సమావేశంలో సమీక్షించారు. ఈశాన్య భారతదేశంలో పనిచేస్తున్న అన్ని ఫీల్డ్ టెక్నికల్ సపోర్ట్ యూనిట్లతో శ్రీ కిషన్ రెడ్డి వర్చువల్ విధానంలో మాట్లాడారు. రెండు నెలల కాలంలో  ఫీల్డ్ టెక్నికల్ సపోర్ట్ యూనిట్ల సిబ్బంది అనుభవాలు, అభిప్రాయాలను మంత్రి తెలుసుకున్నారు.   
 
 
 
ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులు సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. 
 ఒక రాష్ట్ర సమన్వయకర్త , 2 ప్రాజెక్ట్ అసోసియేట్‌లతో ప్రతి రాష్ట్రంలో ఫీల్డ్ టెక్నికల్ సపోర్ట్ యూనిట్ ఏర్పాటయింది. అభివృద్ధి ప్రాజెక్టులు  అమలు జరుగుతున్న తీరుపై ప్రతి యూనిట్ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖకు తరచు నివేదికలు పంపుతుంది. రాష్ట్ర ప్రాజెక్టులతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ఫీల్డ్ టెక్నికల్ సపోర్ట్ యూనిట్ పర్యవేక్షిస్తుంది. 
రవాణా, పర్యాటక, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాల్లో అమలు జరుగుతున్న వివిధ కార్యక్రమాల పురోగతిపై అభిప్రాయాలు, సలహాలు పంపాలని ఫీల్డ్ టెక్నికల్ సపోర్ట్ యూనిట్లకు శ్రీ కిషన్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను లక్ష్యాల మేరకు నిర్దిష్ట కాలపరిమితితో 8 ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తి చేయాలని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. లక్ష్య సాధనలో  ఫీల్డ్ టెక్నికల్ సపోర్ట్ యూనిట్ పాత్ర ఎక్కువగా ఉంటుందని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధికి కార్యక్రమాలు దోహదపడతాయని మంత్రి అన్నారు. 

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ఇతర కార్యక్రమాలు, పథకాలపై శాఖ కార్యదర్శి, సీనియర్ అధికారులతో శ్రీ కిషన్ రెడ్డి సమీక్షించారు. 

 

***

 
 
 


(Release ID: 1878689) Visitor Counter : 112


Read this release in: English , Urdu , Hindi , Assamese