రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.573.13 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆమోదించిన శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 24 NOV 2022 2:06PM by PIB Hyderabad

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని ఎన్‌హెచ్‌-163లో ఉన్న హైదరాబాద్-భూపాలపట్నం సెక్షన్‌లో ఇప్పటికే ఉన్న 2 వరుసల రహదారిని మరింత విస్తరించడానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ వరుస ట్వీట్‌ల ద్వారా వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ మొత్తం వ్యయం రూ.136.22 కోట్లు. ప్రధాన పర్యాటక ప్రాంతాలైన లక్నవరం సరస్సు, బొగత జలపాతాలను కలుపుతూ రహదారి విస్తరణ ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ, చత్తీష్‌గఢ్ మధ్య అంతర్రాష్ట్ర అనుసంధానాన్ని కూడా మెరుగుపరుస్తుందని వెల్లడించారు. ములుగు జిల్లా మావోయిస్టు కార్యకలాల (ఎల్‌డబ్లూఈ) ప్రభావిత జిల్లా అని, రహదారి విస్తరణ వల్ల ఆయా కార్యకలాపాలను నియంత్రించడానికి ప్రభుత్వానికి వీలు కలుగుతుందని మంత్రి చెప్పారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ను కలుపుతూ నాగర్‌కర్నూల్ జిల్లాలో కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన అప్రోచ్‌ సహా, ఎన్‌హెచ్‌-167కేలో 2/4 వరుసల రోడ్డుకు సంబంధించిన పునరావాసం, విస్తరణకు ఈపీసీ పద్ధతిలో ఆమోదం లభించిందని శ్రీ గడ్కరీ చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ వ్యయం రూ.436.91 కోట్లు. ఎన్‌హెచ్‌-167కే వల్ల హైదరాబాద్/కల్వకుర్తి & తిరుపతి, నంద్యాల/చెన్నై వంటి నగరాలకు చేరే ప్రయాణం దాదాపు 80 కి.మీలు తగ్గిస్తుందని అన్నారు. ప్రస్తుతం ఎన్‌హెచ్‌-44 మీద వెళ్తున్న వాహనాలు, విస్తరణ పూర్తయిన తర్వాత NH-167కే మారతాయని వెల్లడించారు. నల్లమల అడవులకు సమీపంలో ఉన్న నంద్యాల, వ్యవసాయ ఉత్పత్తులు & అటవీ ఉత్పత్తులకు ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా అని చెప్పారు. కొల్లాపూర్‌ వద్ద నిర్మాణం కోసం మంజూరైన ఐకానిక్ వంతెన రెండు రాష్ట్రాలకు ముఖద్వారం అవుతుందని, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుందని ట్వీట్‌ ద్వారా శ్రీ గడ్కరీ వెల్లడించారు.

***



(Release ID: 1878573) Visitor Counter : 121


Read this release in: English , Urdu , Hindi , Tamil