సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
తండ్రీకొడుకుల బంధంపై తీసిన ఒడియా చిత్రం 'ప్రతీక్ష'ను హిందీలో పునఃనిర్మిస్తామని ఇఫ్ఫి-53 వేదికపై ప్రకటించిన అనుపమ్ ఖేర్
"ఈ క్షణం మాకు గొప్పది, ఒడిశా ప్రజలకు కూడా ప్రత్యకమైనది" - దర్శకుడు అనుపమ్ పట్నాయక్
ప్రతీక్ష చిత్ర నిర్మాణంలోనే ఒక సినిమా తరహా మలుపులు ఉన్నాయి. తండ్రీకొడుకుల కథ గురించి రాయడం దగ్గర్నుంచి, చలనచిత్రం ప్రారంభ దశలోనే తన తండ్రిని కోల్పోవడం, ఇక ఆ సినిమా తీయకూడదని నిర్ణయించుకోవడం, చివరకు కుటుంబ సభ్యులు అతనిని ఒప్పించడం, చివరకు సినిమాను పూర్తి చేసి ఇఫ్ఫిలో ప్రదర్శించడం వరకు, అనుపమ్ పట్నాయక్ దర్శకత్వం వహించిన 'ప్రతిక్ష' సినిమా కూడా తనకంటూ ఒక సొంత ప్రయాణాన్ని సృష్టించుకుంది.
రచయిత గౌరహరి దాస్ రాసిన చిన్న కథ నుంచి ప్రేరణ పొందిన చిత్రం ఇది. తండ్రి పదవీ విరమణ చేయడానికి కొన్ని నెలల ముందు నుంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మధ్యతరగతి కుటుంబానికి చెందిన సంజయ్ అనే యువకుడి కథ ఇది. ప్రధాన నటుడి తండ్రి పాత్ర పేరు బిపిన్. ప్రాణాంతక వ్యాధితో బిపిన్ బాధపడుతుంటాడు. కుటుంబానికి అప్పులు ఉన్నందున, త్వరగా ఉద్యోగంలో చేరాలని సంజయ్‌కి తరచూ చెబుతుంటాడు. ఉద్యోగం చేస్తున్న తండ్రి మరణిస్తే, కారుణ్య నియామకం కింద ఆ ఉద్యోగాన్ని కుటుంబ సభ్యుడికి ఇస్తారన్న ప్రభుత్వ పథకం గురించి సంజయ్ తెలుసుకుంటాడు. ఉద్యోగ వేటలో విసుగు చెందిన సంజయ్, ఇక తన తండ్రి మరణం కోసం ఎదురు చూస్తుంటాడు. ఇది ఒక కుటుంబానికి సంబంధించిన, ముఖ్యంగా తండ్రీకొడుకుల మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాల గురించి వివరించిన చిత్రం ఇది.
![](https://ci6.googleusercontent.com/proxy/_zfIZ-Q_-v5NsvRqK8K2X865daudoKAjHyAXLTwl4Qsz-YS2oSg70kkPUHnE0LW2916V3ngFZ0aPI8buLaC3YCyTY71E1Wf3uE50HPIo6CPmAOY__JbI=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/KF-22Y60.jpg)
ఇఫ్ఫిలో తమ చిత్రాన్ని ప్రదర్శించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు, సంజయ్‌గా నటించిన దీపన్‌విత్ దశమహాపాత్ర చెప్పారు. “ప్రధాన నటుడిగా నా మొదటి చిత్రం ఇది. కాబట్టి ఇది నాకు గొప్ప గౌరవం. కొంతకాలంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న ఒడియా చిత్ర పరిశ్రమకు, ఒడిశా ప్రజలకు కూడా ఇది గొప్ప క్షణం" అని అన్నారు. ఒడియా చిత్ర పరిశ్రమ గురించి దర్శకుడు అనుపమ్ పట్నాయక్ మాట్లాడుతూ, “1999 తుఫానుకు ముందు ఒడిశాలో 160 థియేటర్లు ఉన్నాయి. తుఫాను తర్వాత 100 ఉన్నాయి. కొవిడ్ తర్వాత 60 మాత్రమే మిగిలాయి. కేవలం 60 థియేటర్లతో ఒక పరిశ్రమ ఎలా పని చేయగలదు?" అని ప్రశ్నించారు.
జాతీయ పురస్కారం గెలుచుకున్న తన తండ్రి మొదటి చిత్రం గురించి, దర్శకుడిగా తన మొదటి చిత్రం ఇఫ్ఫిలో ప్రదర్శితమవడం గురించి కూడా అనుపమ్ పట్నాయక్ మాట్లాడారు. ఇది తనకు ఒక ప్రత్యేకమైన సందర్భమని, తన దివగంత తండ్రికి తానిచ్చిన గౌరవమని చెప్పారు. దర్శకుడు, నటుడితో కలిసి వేదికపై ఉన్న అనుపమ్ ఖేర్, 'ప్రతిక్ష' సినిమాను హిందీలో పునఃనిర్మిస్తానని ఆకస్మికంగా ప్రకటించి వారిని ఆశ్చర్యపరిచారు. హిందీలో, తండ్రి పాత్రను తాను పోషిస్తానని వెల్లడించారు. సినిమా హక్కుల కోసం పట్నాయక్‌కు పెద్ద మొత్తం అందించారు.
* * *
(Release ID: 1878534)
Visitor Counter : 213