ఆర్థిక మంత్రిత్వ శాఖ
బిహార్‌లో ఆదాయ పన్ను విభాగం తనిఖీలు, స్వాధీనాలు
Posted On:
22 NOV 2022 2:14PM by PIB Hyderabad
17.11.2022న, బంగారం & వజ్రాల ఆభరణాలు, స్థిరాస్తి వ్యాపారం చేసే సంస్థల్లో ఆదాయపు పన్ను విభాగం తనిఖీలు చేసింది. కీలక పత్రాలు, ఆస్తులు స్వాధీనం చేసుకుంది. పట్నా, భాగల్‌పూర్, దెహ్రీ-ఆన్-సోన్, లఖ్‌నవూ, దిల్లీలోని 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు జరిగాయి.
ఆదాయ పన్ను ఎగవేతను నిర్ధరించే అనేక పత్రాలు, డిజిటల్ ఆధారాలను అధికారులు కనిపెట్టి, స్వాధీనం చేసుకున్నారు.
బంగారం & వజ్రాల ఆభరణాల వ్యాపారం చేసే ఒక సంస్థలో స్వాధీనం చేసుకున్న సాక్ష్యాలను విశ్లేషించినప్పుడు, లెక్క చెప్పకుండా దాచిన డబ్బుతో నగదు రూపంలో నగల కొనుగోళ్లు, దుకాణాల పునరుద్ధరణ, స్థిరాస్తుల కోసం పెట్టుబడి పెట్టినట్లు వెల్లడైంది. ఖాతాదారుల నుంచి బయానాల రూపంలో డబ్బు తీసుకున్నట్లు లెక్కలు రాసి, రూ.12 కోట్లకు పైగా అక్రమ నగదును ఖాతా పుస్తకాల్లో చూపినట్లు గుర్తించారు. సోదాల సమయంలో ఆభరణాల నిల్వలను పరిశీలిస్తే, రూ.12 కోట్లకు పైగా విలువైన లెక్కల్లో చూపని ఆభరణాలు దొరికాయి.
భూమి కొనుగోలు, భవనాల నిర్మాణం, అపార్ట్‌మెంట్ల విక్రయాల్లో నల్లధన లావాదేవీలు జరిగినట్లు స్థిరాస్తి వ్యాపారం చేసే మరో సంస్థకు సంబంధించి తనిఖీల్లో తేలింది. దీనికి సంబంధించిన ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ భూ క్రయవిక్రయాల మధ్యవర్తి కేసులో స్వాధీనం చేసుకున్న సాక్ష్యాలు కూడా పైన పేర్కొన్న అక్రమ నగదును ధృవీకరించాయి. ఇలా స్వాధీనం చేసుకున్న లెక్కల్లో చూపని నగదు రూ.80 కోట్లకు పైగానే ఉంది. ఈ గ్రూప్‌లోని కీలక వ్యక్తులు సంపాదించిన నల్లధనంతో పెద్ద మొత్తంలో భూములు, చాలా స్థిరాస్తులను కొన్నట్లు రూఢీ అయింది.
ఈ సోదాల్లో, లెక్కల్లో చూపని రూ.5 కోట్లకు పైగా విలువైన నగదు, నగలను ఆదాయ పన్ను విభాగం స్వాధీనం చేసుకున్నారు. 14 బ్యాంకు లాకర్లను జప్తు చేశారు. ఇప్పటివరకు చేపట్టిన తనిఖీల్లో రూ.100 కోట్లకు పైగా నల్లధనం బయటపడింది.
తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
****
(Release ID: 1878009)
Visitor Counter : 165