వ్యవసాయ మంత్రిత్వ శాఖ

పరిస్థితిని సమూలంగా మార్చిన డీబీటీ పథకం 'పీఎం కిసాన్'

Posted On: 21 NOV 2022 6:22PM by PIB Hyderabad

సాగు భూమి కలిగిన రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ పథకం 'పీఎం కిసాన్ పథకం'. నేరుగా ప్రయోజనం బదిలీ (డీబీటీ) కింద, ఏటా రూ.6000 ఆర్థిక ప్రయోజనాన్ని రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాలకు కేంద్ర ప్రభుత్వం బదిలీ చేస్తోంది. ఆర్థిక స్థితి బాగున్న కొన్ని వర్గాలను ఈ పథకం నుంచి మినహాయించింది.

2019 ఫిబ్రవరి 24న గౌరవనీయ ప్రధాన మంత్రి ప్రారంభించిన ఈ ప్రతిష్టాత్మక పథకం, ప్రపంచంలోని అతి పెద్ద డీబీటీ పథకాల్లో ఒకటి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కోట్లాది మంది రైతులకు ఈ పథకం నేరుగా చేరువైంది. లబ్ధిదారుల నమోదు, ధృవీకరణ ప్రక్రియల్లో పూర్తి పారదర్శకతను కొనసాగిస్తున్నారు. నగదు బదిలీ సమయంలో గౌరవనీయ ప్రధాన మంత్రి ఒక మీట నొక్కిన నిమిషాల్లోనే, ఆర్థిక ప్రయోజనాలను భారత ప్రభుత్వం రైతులకు బదిలీ చేస్తోంది.

మొట్టమొదటి విడతలో ఆర్థిక ప్రయోజనం పొందిన రైతుల సంఖ్య 3.16 కోట్లుగా ఉంటే, ఇప్పుడు ఏ విడతలో చూసినా 10 కోట్లు దాటింది. మూడేళ్లలోనే 3 రెట్లు పెరిగింది.

ఈ మూడేళ్ల వ్యవధిలో, అవసరంలో ఉన్న కోట్లాది రైతులకు రూ.2 లక్షల కోట్లకు పైగా ఆర్థిక సాయం విజయవంతంగా అందింది. కొవిడ్ మహమ్మారి కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్ ప్రారంభం నుంచి రూ.1.6 లక్షల కోట్లకు పైగా ప్రయోజనం బదిలీ అయింది.

పీఎం కిసాన్ పథకం ఎప్పటికప్పుడు విస్తరిస్తోంది. ఈ పథకం కోసం, స్వీయ ధృవీకరణ ద్వారా రైతులే తమ అర్హతను స్వయంగా నిర్ధరిస్తారు. రైతుల పేర్ల నమోదు, రాష్ట్రాల ద్వారా ధృవీకరణ వంటి గత విధానాలను పక్కనబెట్టి, అర్హత ధృవీకరణను క్రమంగా మెరుగుపరిచారు.

రైతు వివరాల ధృవీకరణలో ప్రవేశపెట్టిన మెరుగుదల వల్ల ఈ పథకం విజయవంతమైంది. ప్రాథమిక స్థాయి తనిఖీ కోసం ఇవ్వాల్సిన కొన్ని తప్పనిసరి వివరాలను ప్రారంభం నుంచి మార్చలేదు. అర్హతగల రైతుల సమాచారాన్ని రాష్ట్రాలు తనిఖీ చేసి ధృవీకరించిన తర్వాత, అది పీఎం కిసాన్ పోర్టల్‌కు చేరుతుంది. తిరిగి అదే సమాచారాన్ని.. ఆర్థిక వివరాల ధృవీకరణ కోసం పీఎఫ్‌ఎంఎస్‌కు; ఆధార్ నిర్ధరణ కోసం ఉడాయ్‌ సర్వర్‌కు; ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా అన్ని విషయాలు తనిఖీ చేయడానికి ఆదాయపు పన్ను సర్వర్‌కు; బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానాన్ని ధృవీకరించడానికి ఎన్‌పీసీఐకి పంపుతారు. ఇప్పటికే ఉన్న, కొత్త లబ్ధిదారులను ఎప్పటికప్పుడు ధృవీకరించుకోవడానికి దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి వీలవుతుంది.

భారతదేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు విధానంలో ప్రధాన మార్పుగా పీఎం కిసాన్ కనిపిస్తుంది. మంచి పరిపాలనకు, నేరుగా పౌరుల వద్దకు చేరుకునేలా డిజిటలీకరణ వినియోగానికి ఉన్న అత్యుత్తమ ఉదాహరణల్లో ఈ పథకం ఒకటి. పీఎం కిసాన్ పథకం అమలులో డిజిటల్ సాంకేతికతలను విస్తృతంగా వినియోగించుకుంటూ, వ్యవసాయాభివృద్ధి కోసం డిజిటల్ వ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

అర్హులైన రైతులందరికీ పీఎం కిసాన్ పథకం ఫలాలను అందించడానికి, ఇప్పటికే ఉన్న లబ్ధిదారులందరినీ పునఃధృవీకరించడానికి దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి అవకాశం కలుగుతుంది. ప్రస్తుత లబ్ధిదారుల భూమి వివరాలు రాష్ట్రాల భూ రికార్డుల ప్రకారం అనుసంధానం జరుగుతోంది. తద్వారా, భవిష్యత్తులో రాష్ట్రాల డిజిటల్ భూ రికార్డులతో కేంద్ర ప్రభుత్వ అనుసంధానం సజావుగా సాగుతుంది. ఈ పథకంలో మరింత పారదర్శకత కోసం రైతులకు ఈ-కేవైసీ, ఆధార్ ఆధారిత చెల్లింపులను (ఏపీబీ) కూడా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. మరణించిన, భూమిని విక్రయించిన, అనర్హులైన రైతులను ఈ పథకం నుంచి తొలగించడానికి కూడా ఇది సహాయపడుతుంది.

వ్యవసాయ పనుల్లో ఉత్పాదక పెట్టుబడిగా పీఎం కిసాన్ పథకం రైతులకు సహాయపడిందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది అంతకంతకు పెరిగి, మొత్తం వ్యవసాయ రంగంలో మెరుగుదలకు దోహదపడింది.

ఉదాహరణకు, వ్యవసాయ పెట్టుబడుల విషయంలో రైతుల ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో ఈ పథకం గొప్పగా సహాయపడిందని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తో (ఐఎఫ్‌పీఆర్‌ఐ) కలిసి ఇక్రా నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. ఇంకా, చిన్న & సన్నకారు రైతులకు వ్యవసాయ అవసరాల కోసం మాత్రమేగాక, రోజువారీ వ్యవహారాలు, విద్య, ఆరోగ్యం, ఇతర అనుకోని ఖర్చులకు కూడా సాయపడింది.

ప్రతి నాలుగు నెలలకు ఒకసారి, దేశంలోని రైతులకు అవసరమైన సమయంలో నేరుగా వారిని చేరుకుని అవసరాలు తీర్చడంలో పీఎం కిసాన్‌ ఒక గొప్ప పథకం. 

 

<><><><><>



(Release ID: 1877863) Visitor Counter : 204