సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
గోవాలో జరిగే ఇఫ్ఫి-53వ వేడుకలకు హాజరుకానున్న కేంద్ర ఐ&బీ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్
కేంద్ర సమాచార & ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ నవంబర్ 20, 21 తేదీల్లో గోవాలో పర్యటించనున్నారు. గోవాలో 53వ 'భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం' ప్రారంభోత్సవ వేడుకలు, ఇతర కార్యక్రమాలకు హాజరు కానున్నారు.
53వ ఇఫ్పి ప్రారంభ చిత్రం, ఆస్ట్రియా సినీ దర్శకుడు డైటర్ బెర్నర్ రూపొందించిన 'అల్మా అండ్ ఆస్కార్' స్వాగత ప్రదర్శనకు నవంబర్ 20న మంత్రి ఠాకూర్ హాజరవుతారు. సాయంత్రం, 53వ ఇఫ్ఫి ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియానికి వెళతారు. 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ' 2022 పురస్కారం విజేతను అక్కడ ప్రకటిస్తారు. స్పానిష్ చిత్ర దర్శకుడు కార్లోస్ సౌరాకు సత్యజిత్ రే జీవితకాల సాఫల్యత పురస్కారాన్ని ఇఫ్ఫి-53 ప్రారంభోత్సవంలో ప్రదానం చేస్తారు.
పర్యటన రెండో రోజున, 53వ ఇఫ్ఫి '75 క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో సెక్షన్' రెండో ఎడిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. భారత్ నలుమూలల నుంచి వచ్చి 75 మంది యువ సినీ ప్రతిభావంతులతో అక్కడ ముఖాముఖి సంభాషిస్తారు. తర్వాత, ఇఫ్ఫి-53 ఫిల్మ్ బజార్ పెవిలియన్ ప్రారంభోత్సవానికి శ్రీ ఠాకూర్ హాజరవుతారు. ఈ కార్యక్రమం తర్వాత, ఇండియన్ పనోరమా విభాగం, కంట్రీ ఫోకస్ (ఫ్రాన్స్) విభాగం ప్రారంభోత్సవానికి హాజరవుతారు.
పంజిమ్‌లోని డిబి రోడ్‌లో ఉన్న ఫుట్‌బాల్ మైదానంలో ఎఫ్‌టీఐఐ నిర్వహించే చలనచిత్ర సాంకేతికత ప్రదర్శనను ప్రారంభిస్తారు. సాంకేతికత, చలనచిత్ర కళకు వివిధ అంశాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. దీంతో, మంత్రి అనురాగ్ సింగ్ రెండు రోజుల గోవా పర్యటన ముగుస్తుంది.
* * *
(Release ID: 1877802)
Visitor Counter : 149