సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఇఫ్ఫి 53 వేడుక సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


"గోవాలో ఒకేచోట చేరిన ఈ చిన్న ప్రపంచంలోని పరస్పర స్నేహం వల్ల కళా ప్రపంచం మీద లోతైన అవగాహన, కొత్త విషయాలు నేర్చుకోవడానికి వీలవుతుంది"

Posted On: 18 NOV 2022 5:47PM by PIB Hyderabad

చలనచిత్రం ద్వారా ఏకతాటిపైకి వచ్చిన వివిధ దేశాలు, సమాజాలకు చెందిన ప్రతినిధుల మధ్య ఉత్తేజకర సమ్మేళనాన్ని ఇఫ్ఫి ‍‌‍‌(ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా) ప్రోత్సహిస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఇఫ్ఫిని భారతదేశపు అతి పెద్ద చలనచిత్రోత్సవంగా అభివర్ణించారు. "గోవాలో ఒకేచోట చేరిన ఈ చిన్న ప్రపంచంలోని పరస్పర స్నేహం వల్ల కళా ప్రపంచం మీద లోతైన అవగాహన, కొత్త విషయాలు నేర్చుకోవడానికి వీలవుతుంది" అని ప్రధాన మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇఫ్ఫి, భారతీయ సినిమా ప్రపంచ వేదికపై తమకంటూ ఒక చక్కటి స్థానాన్ని ఏర్పరుచుకున్నాయని తన సందేశంలో ప్రధాన మంత్రి పేర్కొన్నారు. "వివిధ భారతీయ భాషల్లో వస్తున్న చలనచిత్రాలు ఎక్కువమంది అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ అవుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెంచుకుంటున్నాయి".

సామాజిక అంశాలను ప్రతిబింబించడంలో, మార్చడంలో చలనచిత్ర పాత్రపై ప్రధాని తన ఆలోచనలు పంచుకున్నారు. “వందేళ్లకు పైగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఊహలను సినిమా ఆకర్షించింది. వర్తమానంలోని సామాజిక అంశాలను అది ప్రతిబింబిస్తుంది, మారుస్తుంది".

సామాజిక మార్పు తీసుకురావడంలో చలనచిత్రాలకు ఉన్న శక్తి, భారతీయ భాషల గొప్ప చరిత్ర & కథను చెప్పే కళ గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. “అడ్డంకులు దాటుకుని, ప్రేక్షకులతో భావోద్వేగ బంధాన్ని ఏర్పరుచుకునే ప్రత్యేక శక్తి సినిమాలకు ఉంది. శక్తిమంతమైన కథనం ద్వారా చలనచిత్రాలు ప్రజలను అలరిస్తాయి, వారిలో అవగాహన కల్పిస్తాయి, ప్రేరణ కూడా రలిగిస్తాయి. సామాజిక పరివర్తన తేవడంలో వాటి సమర్థత నిజంగా అసమానమైనది. భారతదేశం సుసంపన్నమైన, వైవిధ్యమైన సంస్కృతి ఉన్న, సంప్రదాయంతో ఆధునికత మేళవించిన దేశం. వివిధ భారతీయ భాషల్లోని గద్యం, పద్యాలు, సంగీతం, నృత్యం, నాటకాల నుంచి చలనచిత్రం వరకు, కథలు చెప్పే చరిత్ర, కళ మన శక్తిమంతమైన సామాజిక-సాంస్కృతిక వైభవం వేడుక జరుపుకోవడానికి వీలు కల్పిస్తుంది".

ఇఫ్ఫి వేడుకకు గోవా సరైన వేదిక అని ప్రధాని చెప్పారు. ఎప్పటికప్పుడు పెరుగుతున్న ప్రేక్షకులకు చలనచిత్రాలను చేరువ చేసేలా కొత్త ఆలోచనలతో వచ్చే సినీ అతిథులకు ఇది స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. “అందమైన ప్రకృతి, వైభవోపేతమైన సంస్కృతితో కూడిన గోవా, ఇఫ్ఫికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన వేదిక. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారి సృజనాత్మకతను ఈ ప్రాంతం ప్రోత్సహిస్తుందని, ఎప్పటికప్పుడు పెరుగుతున్న ప్రేక్షకులకు సినిమాను చేరువ చేయడంలో సహాయపడటానికి కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చేలా వారిని ప్రేరేపిస్తుందని నేను కచ్చితంగా భావిస్తున్నాను."

53వ దఫా ఇఫ్ఫి వేడుక గొప్ప విజయం సాధించాలని ప్రధాన మంత్రి ఆకాంక్షించారు.

 

***



(Release ID: 1877267) Visitor Counter : 140