జౌళి మంత్రిత్వ శాఖ

జాతీయ సాంకేతిక వస్త్ర కార్యక్రమం కింద సాంకేతిక వస్త్ర సంబంధ ‘ప్రోటెక్’పై జాతీయ సమావేశం


అంతర్జాతీయ అవకాశాల అన్వేషణ.. జాతీయ-అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్లు తీర్చడానికి దేశీయ సాంకేతిక వస్త్ర తయారీని ప్రోత్సహించడంపై కేంద్రం నిబద్ధత

ప్రోటెక్ ఉత్పత్తులకు అంతర్జాతీయ డిమాండ్.. వినియోగం పెరుగుదల నేపథ్యంలో ప్రత్యేక ప్రోటెక్‌ వస్తు ఉత్పాదనలో సాంకేతిక పరిజ్ఞానం దేశీయీకరణ.. నాణ్యత ప్రమాణాల అమలుపై దృష్టి సారించాలి: జౌళి శాఖ కార్యదర్శి పిలుపు

Posted On: 16 NOV 2022 5:57PM by PIB Hyderabad

   త్తర భారత వస్త్ర పరిశోధన సంస్థ (నిట్రా-NITRA), భారతీయ సాంకేతిక వస్త్ర పరిశ్రమ సంఘం (ఇట్టా-ITTA) భాగస్వామ్యంతో కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ ఇవాళ ఇక్కడ “నేషనల్ కాంక్లేవ్‌ ఆన్ టెక్నికల్ టెక్స్‌ టైల్స్- ప్రోటెక్” పేరిట ప్రత్యేక సమావేశం నిర్వహించింది. కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీమతి రచనా షా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దీంతోపాటు రక్షణాత్మక వస్త్ర ఉత్పత్తులు తయారుచేసే వివిధ కంపెనీల విస్తృత శ్రేణి ఉత్పత్తులతో ఒక ప్రదర్శనను కూడా ఆమె ప్రారంభించారు.

   ఈ సమావేశంలో భాగంగా భారతదేశంలో రక్షణాత్మక వస్త్ర ఉత్పత్తుల దేశీయీకరణకుగల అవకాశాలు, భారతీయ రక్షణాత్మక వస్త్ర వాడకంపై వినియోగదారుల అనుభవం-అంచనాలు, మార్కెట్‌ ప్రాచుర్యం కల్పన-ఎగుమతి అవకాశాలు సహా అంతర్జాతీయంగా ఉత్తమాచరణలపై మూడు బృంద గోష్ఠులు నిర్వహించబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం అధికారులు-ప్రతినిధులుసహా  భారత సాయుధ దళాలు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక వస్త్ర రంగం.. ముఖ్యంగా రక్షణాత్మక వస్త్ర (ప్రోటెక్‌) వృత్తి నిపుణులు మొత్తం 450 మంది వరకూ ఇందులో పాల్గొన్నారు.

   ఈ సందర్భంగా కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీమతి రచనా షా మాట్లాడుతూ- భారత ఆర్థిక వ్యవస్థతోపాటు భారతీయ ఎగుమతులకు సంబంధించి జౌళి పరిశ్రమ ప్రధాన పాత్ర పోషిస్తున్నదని ప్రముఖంగా ప్రస్తావించారు. సాంకేతిక వస్త్ర రంగాన్ని ఏటా 10 శాతం వృద్ధితో శరవేగంగా ఎదుగుతున్న నవ్య పరిశ్రమగా ఆమె అభివర్ణించారు. ఈ రంగం పరిమాణం రీత్యా ఇంకా శైశవ దశలోనే ఉన్నప్పటికీ, అంతర్జాతీయ వేదికపై ఈ రంగం కీలక పాత్ర పోషించగల అవకాశాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. సాంకేతిక వస్త్ర రంగంలో చైతన్యం, శక్తి గురించి మాట్లాడుతూ- తయారీ, ఎగుమతులకు భారత్‌ శక్తిమంతమైన గమ్యస్థానంగా ఆవిర్భవించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఉత్పాదకతలో వైవిధ్యం, రూపకల్పన, సౌందర్యం వంటివాటిపై దృష్టి సారించడంతోపాటు ఇందులో పాలుపంచుకునే కార్మికశక్తికి శిక్షణ అవసరాన్ని ఆమె నొక్కిచెప్పారు.

   సాంకేతిక వస్త్ర ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాల పెంపు-అమలుకు సమష్టి కృషి అవసరాన్ని ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నాణ్యమైన ఉత్పత్తుల తయారీ-విక్రయాలకు ‘ఎన్‌టీటీఎం’ ఆధ్వర్యాన తమ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా కృషి చేసిందని వివరించారు. సాంకేతిక వస్త్ర రంగంలో అత్యంత కీలక అనువర్తనాలలో ఒకటి రక్షణాత్మక విభాగంలో ఉందని చెప్పారు. ఇది రక్షణ అవసరాలున్న రంగాల్లో క్రియాత్మక పని సామర్థ్యం మెరుగుకు ఈ ఉత్పత్తులు ఉపయోగపడతాయనని ఆమె తెలిపారు. ఈ ‘ప్రోటెక్’  ఉత్పత్తులకు అంతర్జాతీయ డిమాండ్‌తోపాటు వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞాన దేశీయీకరణ, ప్రోటెక్ ప్రత్యేక వస్తు తయారీలో నాణ్యత ప్రమాణాల అమలుపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉందని స్పష్టం చేశారు.

   కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ కమిషనర్‌ శ్రీమతి రూప్‌ రాశి మాట్లాడుతూ- ఈ రంగంలో ఫలితాల ఆధారిత పరిశోధన-అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఎన్‌టీటీఎంలో భాగంగా పరిశోధన-అభివృద్ధిపై మంత్రిత్వ శాఖ అత్యంత శ్రద్ధ చూపుతున్న నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లో అపార వృద్ధి సాధ్యమని అంచనాలున్నట్లు ఆమె పేర్కొన్నారు. రుణమద్దతు, సబ్సిడీ మద్దతు, పెట్టుబడుల ప్రవాహ సౌలభ్యం తదితర అంశాలకు సంబంధించి ఈ రంగంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి ఆమె వివరించారు. పారిశ్రామిక విప్లవం 4.0 కు సంబంధించి భారత స్వప్న సాకారంలో సాంకేతిక వస్త్ర పరిశ్రమ ఒక ఉత్ప్రేరకం కాగలదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

   ఈ సమావేశంలో భాగంగా భారతీయ సాంకేతిక వస్త్ర మార్కెట్‌... ప్రత్యేకించి ‘ప్రోటెక్‌’ విశిష్టతలను కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ రాజీవ్ సక్సేనా వివరించారు. ఈ మేరకు జాతీయ సాంకేతిక వస్త్ర కార్యక్రమం (ఎన్‌టీటీఎం)లో భాగంగా ఉన్న పరిశోధన-అభివృద్ధి, ఆవిష్కరణలు సహా నైపుణ్యం, శిక్షణ, విద్య, ప్రోత్సాహం, మార్కెట్ విస్తృతి, ఎగుమతులకు ప్రోత్సాహం తదితరాల్లో పురోగమనం గురించి నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమం కింద ‘ప్రోటెక్‌’ ప్రత్యేక, వ్యూహాత్మక విభాగాలలో 12 ‘ప్రోటెక్‌’ ఉత్పత్తులు తదితరాలపై  ‘క్యూసీవో’ సహా పరిశోధన-అభివృద్ధి దిశగా చేపట్టిన వివిధ చర్యల గురించి వెల్లడించారు. మరోవైపు దేశంలో సాంకేతిక వస్త్ర రంగం వృద్ధికి తోడ్పాటునివ్వడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ మేరకు సాంకేతిక వస్త్ర రంగంలో కొత్త కోర్సులు, ప్రయోగశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధి సహా విద్యా పర్యావరణ వ్యవస్థ రూపకల్పన, నిపుణ కార్మికశక్తిని తయారుచేయడం తదితరాలపై త్వరలో మార్గదర్శకాలను రూపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

   ‘నిట్రా’ చైర్మన్ శ్రీ రాజ్ కుమార్ జైన్ మాట్లాడుతూ- సాంకేతిక వస్త్ర మార్కెట్ విస్తరిస్తోందని,  వ్యవసాయం, పరిశ్రమలు సహా వివిధ రంగాల్లో రక్షణాత్మక దుస్తులు వినియోగించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోందన్నారు. ఇంకా వినియోగార్హ ఆదాయం పెరుగుదలతో సమీప భవిష్యత్తులో చిన్న కుటుంబాలలోనూ సాంకేతిక వస్త్ర వినియోగం పెరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ‘పీఎల్‌ఐ’ పథకం, పీఎం మిత్ర, జాతీయ సాంకేతిక వస్త్ర కార్యక్రమం తదితర సాంకేతిక వస్త్రాభివృద్ధి, పురోగమనం దిశగా అనేక పథకాలను ప్రారంభించడంపై జౌళి మంత్రిత్వ శాఖను ఆయన అభినందించారు. అంతర్జాతీయ మార్కెట్‌ అవకాశాలను అన్వేషణతోపాటు దేశంలోనూ డిమాండ్‌ను తీర్చడంలో భాగంగా దేశీయ సాంకేతిక వస్త్ర తయారీని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆయన చెప్పారు.

   ‘ఇట్టా’ చైర్మన్‌ శ్రీ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ- రక్షణాత్మక వస్త్రాలు కేవలం అగ్నిమాపక దళం నిప్పునార్పే పరిస్థితులలో మాత్రమే కాకుండా శక్తి ప్రసరణ, రేడియేషన్ సంబంధిత అనేక ప్రమాదకర కార్యకలాపాలలో విస్తృతంగా వాడకంలో ఉన్నాయని నొక్కిచెప్పారు. దేశంలోని సంఘటిత, అసంఘటిత రంగాల్లో దాదాపు 10 కోట్లమందికిపైగా ప్రమాదకర పరిసరాలు, పరిస్థితుల నడుమ పనిచేస్తున్నందున రక్షణాత్మక వస్త్రాల వినియోగం విస్తృతం కాగలదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సాంకేతిక వస్త్ర ఉత్పత్తుల ప్రామాణికత పెంపుపై భారతదేశం దృష్టి సారించాల్సి ఉందని స్పష్టం చేశారు. వినియోగదారు పరిశ్రమలో సాంకేతిక వస్త్ర వినియోగం తప్పనిసరి చేయడం ద్వారా దేశంలో సాంకేతిక వస్త్రాభివృద్ధి గణనీయంగా నమోదు కాగలదని ఆయన పేర్కొన్నారు.

   ‘నిట్రా’ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అరిందమ్ బసు మాట్లాడుతూ- సాంకేతిక వస్త్రాలు.. ముఖ్యంగా రక్షణాత్మక దుస్తుల రంగంలో ఉత్తర భారత జౌళి పరిశోధన సంస్థ కల్పించిన పరిశోధన సదుపాయాలు, ప్రాజెక్టుల గురించి వివరించారు.

 

******



(Release ID: 1876693) Visitor Counter : 119