వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారతదేశ వ్యాప్తంగా అంతరాయాలు లేని అనుసంధానతను సృష్టించేందుకు, సామాన్య ప్రజలకు & పరిశ్రమలకు సహాయం చేసేందుకే పీఎం గతి శక్తి - శ్రీ గోయల్
రవాణాను వేగవంతం చేసేందుకు, రవాణా ఖర్చులు తగ్గించేందుకు, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం కోసం పీఎం గతి శక్తి - శ్రీ గోయల్
దేశాభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల మెరుగుదల చాలా ముఖ్యమని ప్రధాన మంత్రి విశ్వసించారు - శ్రీ గోయల్
పీఎం గతి శక్తి బహుళార్ధక జల మార్గాల సదస్సు వారణాసిలో నిర్వహణ
Posted On:
11 NOV 2022 6:54PM by PIB Hyderabad
భారతదేశంలో అనుసంధాన మౌలిక సదుపాయాలను మెరుగ్గా మార్చడమే పీఎం గతి శక్తి కార్యక్రమం లక్ష్యం అని కేంద్ర వాణిజ్యం & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో 2022 నవంబర్ 11-12 తేదీల్లో నిర్వహించిన పీఎం బహుళార్ధక జల మార్గాల సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర నౌకాశ్రయాలు, నౌకా రవాణా & జల మార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దేశీయ జల మార్గాల నిర్వహణ సంస్థ (ఐడబ్ల్యూఏఐ) ఈ సదస్సును నిర్వహించింది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర వాణిజ్యం & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, కేంద్ర నౌకాశ్రయాలు, నౌకా రవాణా & జల మార్గాల శాఖ మంత్రి శ్రీ శర్వానంద సోనోవాల్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించారు.
పీఎం గతి శక్తి కార్యక్రమం గురించి శ్రీ గోయల్ మాట్లాడుతూ, వివిధ మంత్రిత్వ శాఖలు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల మధ్య ఈ ప్రాజెక్ట్ సమన్వయం తెస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ మంత్రిత్వ శాఖలను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. వీటిలో రైల్వేలు, రహదారులు & హైవేలు, పెట్రోలియం & సహజ వాయువు, టెలీ కమ్యూనికేషన్, విద్యుత్, నౌకా రవాణా, పౌర విమానయానం ఉన్నాయి.
పీఎం గతి శక్తి మిషన్ కింద జరుగుతున్న దేశీయ జల మార్గాల పనులను మంత్రి అభినందించారు. గత ఎనిమిదిన్నరేళ్లుగా కేంద్ర ప్రభుత్వం చాలా సవాళ్లను ఎదుర్కొందని, ఆ సవాళ్లను అవకాశాలుగా మార్చుకున్న ఘనత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి దక్కుతుందని చెప్పారు. ఆయన ముందు చూపు, సరైన మార్గదర్శకత్వం వల్ల చాలా మంత్రిత్వ శాఖలు నేడు సమన్వయంతో పని చేస్తున్నాయని అన్నారు. ప్రధాన మంత్రి సమర్థ నాయకత్వం, మార్గదర్శకత్వంలో పీఎం గతి శక్తి మిషన్ సాధ్యమైందని వివరించారు.
ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం తప్పనిసరి అని ప్రధాన మంత్రి విశ్వసిస్తారని శ్రీ గోయల్ చెప్పారు. మరుగుదొడ్లు, పక్కా ఇళ్లు, విద్యుత్, డిజిటల్ సాంకేతికత సహా చాలా ప్రాథమిక అవసరాలను మెరుగు పరచడంలో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. విమానాశ్రయాలు, ఓడరేవుల సంఖ్య కూడా రెట్టింపు అయిన విషయం గుర్తు పెట్టుకోవాలని మంత్రి సూచించారు.
దాదాపుగా, ప్రపంచంలోని ఏ దేశంలోనూ గతి శక్తి వంటి సమగ్ర ప్రణాళిక లేదని పీయూష్ గోయల్ ప్రముఖంగా చెప్పారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అంతరాయాలు లేని అనుసంధానతను సృష్టిస్తుంది, సామాన్య ప్రజలకు & పరిశ్రమలకు సహాయం చేస్తుంది. రవాణా ఖర్చులను, రవాణా సమయాన్ని తగ్గిస్తుంది. ఏ ప్రాజెక్టునైనా వేగవంతం చేసే భూ రికార్డులను కూడా ఈ పథకంతో అనుసంధానించారు.
*****
(Release ID: 1875553)
Visitor Counter : 145