సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర ప్రభుత్వ పింఛనుదార్ల డిజిటల్ జీవిత ధృవీకరణ ప‌త్రాల ప్రోత్సాహం కోసం దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర పింఛను & పింఛనుదార్ల సంక్షేమ విభాగం

Posted On: 11 NOV 2022 3:02PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ పింఛనుదార్ల డిజిటల్ జీవిత ధృవీకరణ ప‌త్రాల ప్రోత్సాహం కోసం కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పింఛను & పింఛనుదార్ల సంక్షేమ విభాగం దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పింఛన్ల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ముఖ ధృవీకరణ సాంకేతికతను ప్రారంభించారు. పింఛనుదార్ల కోసం 'ఈజ్ ఆఫ్ లివింగ్' పేరిట ప్రత్యేక శిబిరాలను నిర్వహించడం ద్వారా జీవిత ధృవీకరణ పత్రాలను ఇచ్చి, డిజిటల్ జీవిత ధృవీకరణ/ముఖ ధృవీకరణ సాంకేతికతను ప్రోత్సహించాలని అన్ని నమోదిత పింఛనుదార్ల సంఘాలు, పింఛను పంపిణీ చేసే బ్యాంకులు, భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, సీజీహెచ్‌ఎస్‌ కేంద్రాలకు ఆదేశాలు అందాయి. ఈ కార్యక్రమంలో భాగంగా, అండర్‌ సెక్రటరీ నేతృత్వంలోని పింఛను & పింఛనుదార్ల సంక్షేమ విభాగానికి చెందిన కేంద్ర ప్రభుత్వ బృందం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రచారం చేపట్టింది. ప్రయాగ్‌రాజ్‌లోని బమ్రౌలీ ఎస్‌బీఐ శాఖలో నవంబర్ 11, 2022న కేంద్ర ప్రభుత్వ పింఛనుదార్ల కోసం ప్రచార కార్యక్రమం నిర్వహించింది.

1.10.2022 నుంచి నేటి వరకు ఉన్న డీఎల్‌సీ గణాంకాలు: మొత్తం డీఎల్‌సీ - 36,38,937, ముఖ ధృవీకరణ ద్వారా మొత్తం డీఎల్‌సీ - 1,93,768, మొత్తం డీఎల్‌సీ సీజీవోవీ - 14,40,395, ముఖ ధృవీకరణ ద్వారా డీఎల్‌సీ సీజీవోవీ - 1,20,145

పింఛనుదార్లు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు, 92 ఏళ్ల పింఛనుదారు శ్రీ కేసీ గుప్తా కూడా ముఖ ధృవీకరణ ద్వారా తన జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి నిర్ణయించుకున్నారు. కొత్త సాంకేతికను ప్రవేశపెట్టడం పట్ల ఆయన సంతోషం, సంతృప్తి వ్యక్తం చేశారు. 'ఫేస్ అథెంటికేషన్ జీవన్ ప్రమాణ్ యాప్‌'ను పింఛనుదార్లు తమ చరవాణుల్లోకి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో, ఆ యాప్‌ ద్వారా వారి ఫోన్ల నుంచి జీవిత ధృవీకరణ పత్రాలను ఎలా సమర్పించాలనే అంశాల మీద అధికారులు మార్గనిర్దేశం చేశారు. జీవిత ధృవీకరణ పత్రం 60 సెకన్ల లోపు రూపొందుతుంది, వారి చరవాణులకు లింక్ వస్తుంది. ఆ లింక్‌ ద్వారా ఆ పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. భారత ప్రభుత్వ పింఛను & పింఛనుదార్ల సంక్షేమ విభాగం చేపట్టిన ఈ అడుగు డిజిటల్ ప్రపంచంలోకి తీసుకెళ్లే ఒక మైలురాయి. వృద్ధులైన పింఛనుదార్లు భౌతిక రూపంలో జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించడానికి గతంలో బ్యాంకుల వద్ద గంటల తరబడి వరుసలో నిలబడాల్సి వచ్చేదని అండర్ సెక్రటరీ దీపక్ గుప్తా వివరించారు. ఇప్పుడు, ఇంటి వద్ద సౌకర్యంగా కూర్చుని ఒక బటన్‌ నొక్కడం ద్వారా అదే పని సాధ్యమవుతోందని చెప్పారు.

చరవాణి ద్వారా ముఖ ధృవీకరణ ద్వారా జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించే ప్రక్రియలో భాగంగా ఆధార్ నంబర్, ఓటీపీ కోసం మొబైల్ నంబర్, పీపీవో నంబర్, బ్యాంక్/పోస్టాఫీసు ఖాతా నంబర్‌ వంటివి మొదటిసారి అవసరం. ఈ సదుపాయం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అందుబాటులో ఉంది. రాష్ట్ర ఖజానా కార్యాలయానికి పంపిణీ అధికారం ఉంటుంది.

బ్యాంకులు, పింఛనుదార్ల సంఘాలు, మైటీ/ఎన్‌ఐసీ, ఉడాయ్‌ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రచారం విజయవంతం కావడంలో వీళ్ల భాగస్వామ్యం అమూల్యమైనది. కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతినిధులందరికీ అండర్ సెక్రటరీ ధన్యవాదాలు తెలిపారు.

ముఖ ధృవీకరణ ద్వారా జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి ఈ విభాగం నవంబర్ నెల మొత్తం ప్రచార కార్యక్రమం నిర్వహిస్తోంది.

 

****


(Release ID: 1875549) Visitor Counter : 168
Read this release in: English , Urdu , Hindi , Marathi