బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు మంత్రిత్వ శాఖ సలహా సంఘం భేటీ


బొగ్గు గనుల మూసివేతతో తలెత్తే సమస్యలపై సభ్యుల చర్చ..
సమంజసమైన ఇంధన పరివర్తనే లక్ష్యం

Posted On: 09 NOV 2022 4:09PM by PIB Hyderabad

   మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ రోజు జరిగిన బొగ్గు మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ సలహా సంఘం సమావేశానికి కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి  అధ్యక్షత వహించారు. బొగ్గు గనుల మూసివేతతో తలెత్తే సమస్యలను, అందరికీ సమంజసమైన ఇంధన పరివర్తనను సాధించే అంశాన్నిచర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

   పార్లమెంటరీ సలహా సంప్రదింపుల సంఘం సభ్యులు చున్నీ లాల్ సాహు, జువల్ ఓరం,  కృపాల్ తుమానే, సంతోష్ కుమార్, సురేష్ పూజారి, అజయ్ ప్రతాప్ సింగ్ బఘేల్, ఖిరు మహతో,  ప్రశాంత నందా ఈ సమావేశంలో పాల్గొని, తమ విలువైన సూచనలను అందించారు. బొగ్గు గని మూసివేతతో తలెత్తే సమస్యలు, ఈ నేపథ్యంలో అందరికీ సమంజసమైన రీతిలో పరివర్తనను సాధించడం తదితర అంశాలపై సమాచారాన్ని కూడా వారు ఈ సమావేశంలో తోటి సభ్యులతో పంచుకున్నారు. కోల్ ఇండియా లిమిటెడ్ (సి.ఐ.ఎల్.) చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ (సి.ఎం.డి.), ఎన్.ఎల్.సి.ఐ.ఎల్. సంస్థ చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్, కోల్ ఇండియా అనుబంధ సంస్థల చైర్మెన్-మేనేజింగ్ డైరెక్టర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

https://ci3.googleusercontent.com/proxy/cieY8-0MIq9osIQbnCCK5JZsdTk2R63z975RJ_VxrwvYE0A5p5frw8y0TrvYuei78q4Ij6LxjOVk3q0Skf1_LTPJ5SYowht_4Nx_ZC8-IQzHwon6YlgsJCXRXA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001GF7O.jpg

  ఈ సందర్భంగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభోన్యాసం చేస్తూ,  బొగ్గు ప్రమేయంలేని  ఇంధన పరివర్తనకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం ఏర్పడుతోందని సలహాసంఘం సభ్యులకు తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ, భారతదేశానికి, బొగ్గు అందుబాటు ధరలో దొరికే ఇంధన వనరుగా ఉంటోందని, పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ నేపథ్యంలో దేశంలో ఇంధన అవసరాలను తీర్చడంలో బొగ్గే ప్రధానపాత్ర పోషిస్తోందని అన్నారు. దేశ ప్రాథమిక ఇంధన అవసరాలలో 51శాతానికి పైగా బొగ్గే ఆక్రమిస్తోందని, విద్యుత్ ఉత్పత్తిలో 73శాతం వరకూ బొగ్గుదే కీలకపాత్రగా ఉంటోందని ఆయన అన్నారు. అలాగే, ఉక్కు, స్పాంజ్ ఐరన్, అల్యూమినియం, సిమెంట్, కాగితం, ఇటుకలు మొదలైన సరకుల ఉత్పత్తిలో వాడే మూలకాల్లో బొగ్గుది ప్రధాన భాగమని అన్నారు. దేశంలో బొగ్గు డిమాండ్ ఇంకా గరిష్ట స్థాయికి చేరుకోలేదని, వివిధ ఇంధన శక్తుల్లో  2040వ సంవత్సరం, లేదా ఆ ముందు కాలం వరకూ బొగ్గు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అన్నారు.  అందువల్ల, భారతదేశంలో బొగ్గు ప్రమేయంలేని ఇంధన మార్పు సమీప భవిష్యత్తులో జరిగే అవకాశాలు లేవని అన్నారు.

  కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమృత్ లాల్ మీనా మాట్లాడుతూ, 2015లో ప్యారిస్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సు (కాప్- 21) సందర్భంగా వాతావరణ ప్రకటనలను చేర్చడంతో సమంజసమైన ఇంధన పరివర్తన అనే పదబంధానికి ప్రాధాన్యం పెరిగిందని మీనా వివరించారు. ఎక్కువ కర్బనం వినియోగించే ఇంధన వనరునుంచి తక్కువ కర్బనం వినియోగించే ఇంధన వనరుకు మారాలన్న పరివర్తనను ప్రజలపై కఠినంగా అమలు చేయడం సరికాదని, ఎందుకంటే ప్రజలు అదే వనరుపై ఎక్కువగా ఆధారపడి ఉన్నారని మీనా అభిప్రాయపడ్డారు. ఇంధన పరివర్తనతో ప్రభావితులయ్యే అలాంటి వారికి పరిహారం చెల్లించాలని, లేదా వారికి తిరిగి శిక్షణ ఇవ్వాలని అన్నారు. అలా కానిపక్షంలో తక్కువ స్థాయి-కర్బన వినియోగ ఆర్థిక కార్యకలాపాలలో వారికి ఉపాధి కల్పించాల్సి ఉంటుందని అన్నారు.

  ఈ సమావేశంలో, బొగ్గు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వివరణాత్మక ప్రసంగం చేశారు.   బొగ్గు వినియోగ దశను తగ్గించాలన్న అంశంపై తక్షణమే సవాళ్లు ఎదరయ్యే అవకాశాలు లేనప్పటికీ, ఇప్పటికే రద్దైన గనులు, సమీప భవిష్యత్తులో మూతబడే ఆస్కారం ఉన్న ఉన్న బొగ్గు గనుల విషయంలో బొగ్గు కంపెనీలు తగిన బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుందని ఆయన అన్నారు. సమీప భవిష్యత్తులో భూమి వినియోగ ప్రయోజనాల్లో మార్పులు, మౌలిక సదుపాయాల ఆస్తుల పునర్నిర్మాణం, కార్మికుల, అనధికారిక ఉపాధి పొందిన వారి జీవనోపాధి, పాఠశాలలు, ఆసుపత్రులు, కమ్యూనిటీ భవనాలు మొదలైన సామాజిక మౌలిక సదుపాయాలకు మద్దతును కొనసాగించడానికి వీలుగానే సమంజసమైన ఇంధన పరిర్తన ఉంటుందని ఆయన అన్నారు.

  గనుల మూసివేతపై ఇప్పటికే అమలులో ఉన్న మార్గదర్శకాలు ఇంకా ఎప్పటికప్పుడు మార్పు చెందుతూనే ఉన్నాయి. గని మూసివేత భౌతిక, పర్యావరణ అంశాలపై ఈ మార్గదర్శకాలు  ప్రధానంగా దృష్టిని సారిస్తాయి.  గని మూసివేత నేపథ్యంలో భూమి, మౌలిక సదుపాయాల ఆస్తుల పునర్నిర్మాణంతో ముడివడిన సామాజిక అంశాలను ఈ మార్గదర్శకాలు సరిగ్గా ప్రస్తావించవు. అందువల్ల, గని మూసివేతకు సంబంధించిన ప్రతి అంశానికీ వర్తింపజేయడానికి తగిన సంస్థాగత వ్యవస్థ ఏర్పాటు, నిధుల యంత్రాంగం రూపకల్పనతో పాటుగా  సమంజస పరివర్తన సూత్రాలపై ఏకరీతిన సమగ్రమైన పద్ధతిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.

https://ci6.googleusercontent.com/proxy/w243xT2WBYugRDwsLFI0vo6OKjlmkf2Xrqsp2PyW4IdQNleZT3rgWOiKTp0iiQDJnO1z1gWE42LHCq8oNh_8b7BxoaJUhhb7sIebtH1dr5GkKm625vHLQUHXwQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0024W9E.jpg

   బొగ్గు గనుల మూసివేత నేపథ్యంలో బొగ్గు మంత్రిత్వ శాఖ, బొగ్గు/లిగ్నైట్ ప్రభుత్వ రంగ సంస్థలు చేపడుతున్న కృషిని పార్లమెంటరీ సలహా సంఘం సభ్యులు ఈ సందర్భంగా అభినందించారు. బొగ్గు గనుల మూసివేత నేపథ్యంలో అమలుచేయాల్సిన వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి బొగ్గు రంగం చేపట్టిన కార్యక్రమాలకు సభ్యులు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. ప్రపంచ స్థాయి ఉత్తమ పద్ధతులను అవలంబించడం, గనుల మూసివేతకు సమంజస బదిలీ సూత్రాన్ని వర్తింపజేయడం ద్వారా సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం సాధించేందుకు ఇది పెద్ద ముందడుగు కానున్నదని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ, బొగ్గు గనుల మూసివేత, సామాజిక సంక్షేమం, ఉత్పాదకత వంటి అంశాలపై ప్రజాప్రతినిధులను బొగ్గు కంపెనీలు తరచుగా సంప్రదించాలని చర్చ సందర్భంగా పార్లమెంటరీ సలహాసంఘం సభ్యులు సూచించారు.

  సమావేశాల్లో, చర్చల్లో సలహా సంఘం సభ్యులు చురుకుగా పాల్గొన్నందుకు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తన ప్రసంగం ముగింపు సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. సభ్యుల విలువైన సూచనలను బొగ్గు మంత్రిత్వ శాఖ, బొగ్గు/లిగ్నైట్‌కు అనుబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలు తప్పకుండా స్వీకరిస్తాయని ఆయన హామీ ఇచ్చారు. 

****


(Release ID: 1874839) Visitor Counter : 147