వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అన్ని చక్కెర మిల్లులకు 60 ఎల్ఎంటీ ఎగుమతి కోటా కేటాయించిన ప్రభుత్వం


•వేగంగా ఎగుమతులు చేసి రైతులకు ముందస్తు చెల్లింపులు చేయాలని సూచించిన ప్రభుత్వం

• ప్రభుత్వ నిర్ణయంతో చక్కెర మిల్లులపై తగ్గనున్న నిల్వ,వర్కింగ్ క్యాపిటల్ ఖర్చులు

•పంచదార నిల్వలు తగ్గించేందుకు దేశవ్యాప్తంగా ఏకీకృత విధానం అమలు

• చక్కెర మిల్లుల మధ్య ఎగుమతి కోటా పంపిణీ లక్ష్యంగా విధానం అమలు

Posted On: 06 NOV 2022 1:07PM by PIB Hyderabad

దేశంలో పంచదార ధరల స్థిరీకరణ , చక్కెర మిల్లుల ఆర్థిక పరిస్థితిని  మెరుగు పరిచేందుకు 2022-23 చక్కెర సీజన్ లో 60 ఎల్ఎంటీ  పంచదార ఎగుమతి చేసేందుకు చక్కెర మిల్లులకు అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో చెరకు ఉత్పత్తికి సంబంధించి రూపొందిన ప్రాథమిక అంచనాల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పంచదార  ఎగుమతులను 'పరిమితం చేయబడిన' కేటగిరీ కింద  31 అక్టోబర్, 2023 వరకు పరిగణిస్తూ  DGFT ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. 

దేశంలో వినియోగం కోసం దాదాపు 275 లక్షల మెట్రిక్ టన్నుల(ఎల్ఎంటీ) పంచదార, ఇథనాల్ ఉత్పత్తి కోసం దాదాపు 50 ఎల్ఎంటీ పంచదార ను ప్రభుత్వం కేటాయించింది. ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలో 30.09.2023 నాటికి దాదాపు 60  ఎల్ఎంటీ  పంచదార ముగింపు నిల్వలు ఉన్నాయి. దీనికి మించి చక్కెర మిల్లులు ఉత్పత్తి చేసే పంచదార ఎగుమతి చేయడానికి అనుమతించబడుతుంది. 2022-23 చక్కెర సీజన్ లో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్న చెరుకుకు సంబంధించి ప్రాథమిక అంచనాలు సిద్ధం కావడంతో 60 ఎల్ఎంటీ పంచదార ఎగుమతి చేయడానికి  అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెరుకు ఉత్పత్తి జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు సమీక్షించి, పంచదార ఎగుమతులపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది. 

2021-22  చక్కెర సీజన్ లో భారతదేశం నుంచి  110 ఎల్ఎంటీ పంచదార ఎగుమతి అయింది. ప్రపంచంలో పంచదార ఎగుమతిలో రెండో అతిపెద్ద దేశంగా భారతదేశం గుర్తింపు పొందింది. పంచదార ఎగుమతుల ద్వారా దేశం  దాదాపు 40,000 లక్షల కోట్ల విలువ చేసే విదేశీ మారకద్రవ్యం ఆర్జిస్తోంది. సకాలంలో జరుగుతున్న చెల్లింపులు,  చక్కెర మిల్లుల రవాణా ఖర్చులు తగ్గడంతో రైతులకు చెల్లించాల్సిన  చెరకు బకాయిలను త్వరితగతిన చెల్లించేందుకు వీలు కలిగింది. 2021-22  చక్కెర సీజన్ లో రికార్డు స్థాయిలో 1.18లక్షల కోట్ల రూపాయల విలువ చేసే చెరకు సేకరించడం జరిగింది.  31.10.2022 నాటికి రైతుల చెరకు బకాయిల్లో 96% కంటే ఎక్కువ ఇప్పటికే చెల్లించడం జరిగింది. 

 2022-23 చక్కెర సీజన్  కోసం ప్రభుత్వం రూపొందించిన పంచదార ఎగుమతి విధానంలో దేశంలోని అన్ని చక్కెర  మిల్లులకు మిల్లుల  వారీగా ఎగుమతి కోటాను ప్రభుత్వం నిర్ణయించింది. గత మూడేళ్లలో చక్కెర మిల్లుల సగటు ఉత్పత్తి మరియు దేశంలోని గత 3 సంవత్సరాల కాలంలో జరిగిన సగటు చక్కెర ఉత్పత్తి ఆధారంగా ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది.  పంచదార  ఎగుమతులను వేగవంతం చేయడానికి మరియు ఎగుమతి కోటా అమలు చేయడంలో చక్కెర మిల్లులకు సౌలభ్యాన్ని కల్పించడానికి కూడా ప్రభుత్వం చర్యలు ప్రకటించింది. దీని ప్రకారం  మిల్లులు ఆర్డర్ జారీ చేసిన తేదీ నుండి 60 రోజులలోపు కోటాను పాక్షికంగా లేదా పూర్తిగా సరెండర్ చేయవచ్చు లేదా  ఎగుమతి కోటాను స్వదేశీ కోటాగా  మార్చుకోవచ్చు. మార్పిడి అవకాశం కల్పించడం వల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయి. ప్రభుత్వ విధానం వల్ల ఎగుమతి కోసం దూర ప్రాంతాల నుంచి ఓడ రేవులకు పంచదార తరలించాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా దేశంలో వినియోగించడానికి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి  పంచదార తరలించాల్సిన అవసరం ఉండదు.సమీపంలో ఓడ రేవు అందుబాటులో లేకపోవడంతో  పంచదార ఎగుమతి చేయడంలో విఫలమైన మిల్లులు తమ కోటాను ఎగుమతి చేయడానికి సౌకర్యాలు కలిగి ఉన్న మిల్లులకు మార్చడానికి ప్రభుత్వ విధానం అనుమతి ఇస్తుంది. దీనివల్ల, పేరుకు పోయిన పంచదార నిల్వలు తగ్గుతాయి. 2022-23 చక్కెర సీజన్ లో చక్కెర  మిల్లులు తమ ఉత్పత్తిని ఎగుమతి చేయడం లేదా స్వదేశీ మార్కెట్లో విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయంతో రైతులకు బకాయి పడిన మొత్తాలు చెల్లించగలుగుతాయి.   

ప్రభుత్వ విధానం చక్కెర మిల్లులకు ఒక వరంగా ఉంటుంది. 

  స్వదేశీ  వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు పంచదార ధరను అదుపు చేయాలన్న లక్ష్యంతో  పంచదార  ఎగుమతి విధానం రూపొందింది. పంచదార  ఎగుమతులను పరిమితం చేయడం వల్ల  దేశీయ ధరలు అదుపులో ఉంటాయి.  దేశీయ మార్కెట్‌లో పెద్దగా ద్రవ్యోల్బణ పోకడలు తలెత్తవు.  మార్కెట్ ధరలు నామమాత్రంగా పెరుగుదల నమోదు చేశాయి.  ఇది రైతులకు చెరకు FRP పెరుగుదలకు అనుగుణంగా ఉంది.

దేశంలో ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మరియు గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్లడానికి దేశంలో ఇథనాల్ ఉత్పత్తి ఎక్కువ చేసే అంశానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇథనాల్ ధరలు ఎక్కువగా ఉండడంతో డిస్టిలరీలు తమ  చక్కెర ఉత్పత్తిని  ఇథనాల్ రంగానికి  మళ్లించడానికి మొగ్గు చూపుతున్నాయి. ప్రభుత్వ్మ్ ప్రకటించిన చక్కెర ఎగుమతి విధానం వల్ల ఇథనాల్ ఉత్పత్తికి సరిపడా చెరకు/చక్కెర/మొలాసిస్ అందుబాటులో ఉంటుంది. ఇథనాల్ ఉత్పత్తి కోసం  2022-23 లో 45-50 ఎల్ఎంటీ  చక్కెర సరఫరా అవుతుందని అంచనా వేయబడింది.

పంచదార ఎగుమతులకు అనుమతులు ఇవ్వడం  ద్వారా ప్రభుత్వం చెరుకు రైతులు మరియు చక్కెర కర్మాగారాల ప్రయోజనాల పరిరక్షణకు కూడా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ విధానం వల్ల   మిల్లులు అనుకూలమైన అంతర్జాతీయ చక్కెర ధర దృష్టాంతంలో ప్రయోజనాలను పొందుతాయి.తమ ఉత్పత్తికి  మెరుగైన ధర పొందుతాయి. దీనివల్ల  ప్రస్తుత చక్కెర సీజన్ 2022-23లో రైతుల చెరకు బకాయిలు  సకాలంలో చెల్లించబడతాయి.  చక్కెర నిల్వలు తగ్గడం వల్ల వర్కింగ్ క్యాపిటల్ ఖర్చు కూడా తగ్గుతుంది. 

 చక్కెర మిల్లుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి, స్వావలంబన సాధించడానికి ఉపకరించే విధంగా గత 6 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం   చక్కెర రంగంలో బహుళ మరియు సమయానుకూల చర్యలు అమలు చేసింది.  2022-23  చక్కెర సీజన్ లో  చక్కెర మిల్లులకు పంచదార ఉత్పత్తి/మార్కెటింగ్‌కు ఎలాంటి సబ్సిడీ ఇవ్వలేదు.  ప్రస్తుత సీజన్‌లో కూడ, భారత ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సహకారం లేకుండా దేశంలో చక్కెర రంగం  పని చేస్తుందని భావిస్తున్నారు.  ఇథనాల్ ఉత్పత్తికి చక్కెర మళ్లించడం, లభ్యత ప్రకారం మిగులు పంచదార  ఎగుమతి చేయడానికి అనుమతి మంజూరు చేసి కేంద్ర  ప్రభుత్వం సుమారు 5 కోట్ల చెరకు రైతు కుటుంబాలతో పాటు ఇథనాల్ డిస్టిలరీలు, చక్కెర మిల్లులపై ఆధారపడి జీవిస్తున్న దాదాపు  5 లక్షల  కార్మికుల ప్రయోజనాలు రక్షించింది. ప్రభుత్వం తీసుకున్న సానుకూల నిర్ణయం వల్ల  ఇథనాల్ డిస్టిలరీలు, చక్కెర మిల్లులు అభివృద్ధి పథంలో నడుస్తాయి. 

***


(Release ID: 1874196) Visitor Counter : 199