కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

భారతదేశంలో మొట్టమొదటి 'నీటిపై తేలే ఆర్థిక అక్షరాస్యత శిబిరం' నిర్వహిస్తున్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్


"మహిళల ద్వారా, మహిళల కోసం" ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించేందుకు 'నివేశక్ దీదీ' కార్యక్రమం ప్రారంభం

Posted On: 02 NOV 2022 6:39PM by PIB Hyderabad

కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన తపాలా విభాగం కింద ఏర్పాటయిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ), 'నివేశక్ దీదీ' పేరిట భారతదేశంలో మొట్టమొదటి నీటిపై తేలే ఆర్థిక అక్షరాస్యత శిబిరాన్ని జమ్ము&కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఇవాళ నిర్వహించింది. "మహిళల ద్వారా, మహిళల కోసం" ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

భారతదేశం ఒక పెద్ద & అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. జనాభాలో పెద్ద వాటా ప్రజలు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నందున, ప్రజలందరిలో ఆర్థిక అవగాహన పెంచడం ఇప్పటికీ సవాలుగా ఉంది. ఐపీపీబీ, ప్రపంచంలో అతి పెద్దదయిన తన తపాలా నెట్‌వర్క్ సాయంతో చివరి మైలు వరకు విస్తరించడానికి, ఆర్థిక అక్షరాస్యతలో అంతరాలను తగ్గించడానికి కొత్త వారసత్వాన్ని సృష్టించింది.

భారత ప్రభుత్వ ఆదేశానుసారం, గ్రామీణ భారతదేశంలో ఆర్థిక అవగాహనను పెంచే ప్రయాణాన్ని ఐపీపీబీ ప్రారంభించింది. విశాల భారతదేశంలో మారుమూల ప్రాంతాలకు చేరుకోవడం, సమాచారం అందించడం ఎప్పుడూ సవాలే. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి, పోస్ట్‌మెన్/గ్రామీణ డాక్ సేవక్‌లు దేశంలోని ప్రతి మూలలో ఉన్న ప్రజలకు చేరువయ్యారు. వారి ఇంటి వద్దకే వెళ్లి డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నారు.

ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి.. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) ఆధ్వర్యంలోని 'ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ' (ఐఈపీఎఫ్‌ఏ) సహకారంతో 'నివేశక్ దీదీ' కార్యక్రమాన్ని ఐపీపీబీ ప్రారంభించింది. గ్రామీణ ప్రాంత మహిళలు తమ సందేహాలను మరో మహిళతోనే స్వేచ్ఛగా పంచుకోగలరు కాబట్టి, 'నివేశక్ దీదీ' కార్యక్రమం మహిళల ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. జే &కేలోని శ్రీనగర్‌లో ఇటీవల జరిగిన ఐఈపీఎఫ్‌ఏ కాన్ఫరెన్స్‌లో, కశ్మీర్ లోయకు చెందిన ముగ్గురు ప్రతినిధులకు 'నివేశక్ దీదీ' ధృవపత్రాలను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ రావు ఇంద్రజిత్ సింగ్ అందజేశారు. పార్లమెంటు సభ్యుడు (శ్రీనగర్) డా.ఫరూక్ అబ్దుల్లాతో పాటు శ్రీమతి అనితా షా అకెల్లా, సీఈవో ఐఈపీఎఫ్‌ఏ & జేఎస్‌ ఎంసీఏ & ఐఈపీఎఫ్‌ఏ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా, కశ్మీర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ & సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

శ్రీనగర్‌లో జరిగిన ఐఈపీఎఫ్‌ఏ కాన్ఫరెన్స్‌లో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ రావు ఇంద్రజిత్ సింగ్, పార్లమెంటు సభ్యుడు (శ్రీనగర్) డా.ఫరూక్ అబ్దుల్లా

 

'నివేశక్ దీదీ' కార్యక్రమం ప్రారంభంలో భాగంగా, కొత్తగా నియమితులైన 'నివేశక్ దీదీ' ద్వారా భారతదేశపు మొట్టమొదటి 'నీటిపై తేలే ఆర్థిక అక్షరాస్యత శిబిరాన్ని' ఐపీపీబీ నిర్వహించింది. శ్రీనగర్‌లోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన దాల్ సరస్సు చుట్టూ ఉన్న నివాసితుల మధ్య నీటిపై తేలే ఆర్థిక అక్షరాస్యత శిబిరాన్ని' నిర్వహించింది. షికారా (ఇంటి లాంటి పడవ) వారి జీవితంలో ఒక భాగం కాబట్టి, ఈ సమావేశాన్ని షికారాల్లో నిర్వహించారు. 'నివేశక్ దీదీ' షికారా నుంచి స్థానిక కశ్మీరీ భాషలోనే ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం మొదలైంది. మొత్తం కార్యక్రమాన్ని దాల్ సరస్సులో నిర్వహించారు.

తపాలా విభాగం కార్యదర్శి శ్రీ వినీత్ పాండే ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, “ఆర్థిక అవగాహనలో అంతరాన్ని తగ్గించడానికి ఇది ఒక అద్భుతమైన అడుగు. దేశంలోని ప్రతి భాగానికి, ప్రతి ఇంటికి చేరుకోగల డీవోపీ బృందం సామర్థ్యాన్ని భారతదేశ మొట్టమొదటి తేలియాడే ఆర్థిక అక్షరాస్యత శిబిరం స్పష్టం చేస్తోంది. ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని గ్రామీణ మహిళలకు సుగమం చేస్తుంది. మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి, సొంత భాషలో మాట్లాడే సొంత నివేశక్ దీదీ సాయంతో రక్షణ పొందండి”.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఎండీ & సీఈవో శ్రీ జె.వెంకట్రాము మాట్లాడుతూ, “భాష & ఆర్థిక ఉత్పత్తులు, సేవలపై ప్రాథమిక అవగాహన పరంగా గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు నివేశక్ దీదీ ద్వారా పరిష్కారం చూపడం ద్వారా ఐపీపీబీ మరో మైలురాయిని చేరుకుంటుంది. నివేశక్ దీదీ ఒక మహిళా డాకియా. గ్రామీణ ప్రజలతో లోతైన సామాజిక సంబంధాన్ని కలిగి ఉంటారు. చక్కటి సహకారంతో, ప్రజల సందేహాలను సౌకర్యవంతమైన వాతావరణంలో పరిష్కరించగలుగుతారు. అదే సమయంలో ఆర్థిక అవగాహనను, ముఖ్యంగా మహిళల్లో పెంపొందించగలరు”.

 

జే&కే, శ్రీనగర్‌లోని దాల్ సరస్సు చుట్టూ నివశిస్తున్న స్థానికుల మధ్య 'నీటిపై తేలే ఆర్థిక అక్షరాస్యత శిబిరం' నిర్వహణ

చీఫ్‌ జనరల్ మేనేజర్, చీఫ్ సేల్స్, మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీ గురుశరణ్ రాయ్ బన్సాల్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) శ్రీ విశ్వనాథ్ దివ్య, శ్రీనగర్ ఐపీపీబీ & డీవోపీ అధికార బృందాల పర్యవేక్షణలో  'నీటిపై తేలే ఆర్థిక అక్షరాస్యత శిబిరం' నిర్వహించారు. బ్యాంకింగ్ & ఆర్థిక ఉత్పత్తులు, నియంత్రిత సంస్థలు అందించే ప్రధాన ఆర్థిక సేవల్లో చేరడం వల్ల ప్రయోజనం, పెట్టుబడులతో ముడిపడి ఉన్న వివిధ ఆర్థిక ప్రమాదాల నుంచి రక్షణ, మోసాల నిరోధానికి చర్యలు వంటి అంశాలను ఈ కార్యక్రమంలో వివరించారు. దేశంలో చివరి మైలు వరకు ఆర్థిక సాధికారతను పెంపొందించేందుకు ఈ తరహా ప్రయత్నాలను కొనసాగించేందుకు భారత ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు కోసం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటుంది.

ఐపీపీబీ గురించి

కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన తపాలా విభాగం కింద ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఏర్పాటయింది. 100% ప్రభుత్వ యాజమాన్యం కింద పని చేసే సంస్థ ఇది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 1, 2018న ఐపీపీబీని ప్రారంభించారు. మన దేశంలో సామాన్యులకు అత్యంత అందుబాటులో ఉండే, సరసమైన, విశ్వసనీయమైన బ్యాంక్‌ను నిర్మించాలన్న లక్ష్యంతో ఈ బ్యాంక్ ఏర్పాటయింది. 1,60,000 పోస్టాఫీసులు (గ్రామీణ ప్రాంతాల్లో 1,45,000), 4,00,000 తపాలా ఉద్యోగులతో కూడిన నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవడం ద్వారా, బ్యాంకింగ్ సదుపాయం లేని & తక్కువ బ్యాంకింగ్ సదుపాయం ఉన్న ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బందులు తొలగించడం, చివరి మైలు వరకు చేరుకోవడం ఐపీపీబీకి అందిన ప్రాథమిక ఆదేశం. సీబీఎస్‌-సమీకృత స్మార్ట్‌ఫోన్ & బయోమెట్రిక్ పరికరం ద్వారా ఖాతాదారుల ఇంటి వద్దకే వెళ్లి సులభమైన, సురక్షితమైన పద్ధతిలో కాగిత రహిత, నగదు రహిత, వ్యక్తులు హాజరవ్వాల్సిన అవసరం లేని బ్యాంకింగ్‌ సేవలను అందించడం అనే మూలస్తంభాల మీద ఐపీపీబీ పరిధి, కార్యకలాపాల నమూనా ఆధాపడింది. తక్కువ వ్యయమయ్యే ఆవిష్కరణలను ఉపయోగించుకోవడం, సామాన్యులకు బ్యాంకింగ్ సౌలభ్యంపై ఎక్కువ దృష్టి పెట్టడం అనే అంశాలతో.. 13 భాషల్లో అందుబాటులో ఉన్న ఇంటర్‌ఫేస్‌ల ద్వారా సరళమైన, సరసమైన బ్యాంకింగ్ పరిష్కారాలను ఐపీపీబీ అందిస్తుంది. తక్కువ నగదుతో ముడిపడిన ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ ఇండియా విజన్‌కు తోడ్పాటు అందించడానికి ఐపీపీబీ కట్టుబడి ఉంది. ప్రతి పౌరుడి ఆర్థిక భద్రతకు, సాధికారతకు సమాన అవకాశాలు ఉన్నప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఐపీపీబీ నినాదం - ప్రతి ఖాతాదారు ముఖ్యం, ప్రతి లావాదేవీకి ప్రాధాన్యం, ప్రతి డిపాజిట్ విలువైనది. 

 

***



(Release ID: 1873321) Visitor Counter : 300


Read this release in: English , Urdu , Hindi