రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

సి-295 విమానాల తయారీకి ప్రైవేట్ రంగంలో తొలికేంద్రం!


గుజరాత్‌లోని వడోదరలో ప్రధాని శంకుస్థాపన
టాటా కన్సార్షియం-ఎయిర్‌బస్ డిఫెన్స్ ద్వారా
భారత్‌లో 40 విమానాల తయారీ..

అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ
పగలూ రాత్రీ పనిచేసే సి-295 విమానం
సైనికదళాల సత్వర ప్రతిచర్యకు,
సరకులను జారవిడవడానికి ప్రత్యేక ఏర్పాటు..
‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’తో
భారత్ పురోగమనం : నరేంద్ర మోదీ
‘కోవిడ్, యుద్ధం, సరఫరా వ్యవస్థ సంక్షోభం,..
అయినా ఊపందుకున్న వృద్ధి రేటు’

తక్కువ తయారీ వ్యయంతో, అధికోత్పత్తి అవకాశాలను
అందిస్తున్న భారత్: ప్రధాన మంత్రి

”2025కల్లా రక్షణ తయారీ రంగాన్ని
25 బిలియన్ డాలర్లను దాటించాలన్నది మా లక్ష్యం;
5 బిలియన్ డాలర్లకుపైగా రక్షణ ఎగుమతులే ధ్యేయం”


రక్షణరంగం ‘ఆత్మనిర్భరతా’ పయనంలో
ఈ తయారీ కేంద్రం ఒక ప్రధాన మైలురాయిగా
అభివర్ణించిన రక్షణమంత్రి..
“భారత వైమానిక దళం లాజిస్టిక్ సామర్థ్యం
సి-295 విమానంతో మరింత బలోపేతం”
స్వదేశీ తయారీతో సాయుధ బలగాల అవసరాలను తీర్చడం
నికర రక్షణ ఎగుమతిదారుగా
దేశాన్ని మార్చడమే ప్రభుత్వ లక్ష్యం: రాజనాథ్

Posted On: 30 OCT 2022 5:15PM by PIB Hyderabad

     ప్రైవేట్ రంగంలో దేశంలోనే ప్రప్రథమంగా సి-295 రకం విమానాల తయారీ కేంద్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2022 అక్టోబర్ 30వ తేదీన శంకుస్థాపన చేశారు. గుజరాత్‌లోని వడోదరలో ఈ తయారీ కేంద్రాన్ని నిర్మించబోతున్నారు. భారత వైమానిక దళం (ఐ.ఎ.ఎఫ్.) కోసం సి-295 విమానాలను వడోదర కేంద్రం తయారు చేస్తుంది. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, స్పెయిన్ దేశానికి చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ ఎస్.ఎ. సంస్థల మధ్య సహకారంతో  ఈ కేంద్రం ఏర్పాటవుతోంది. భారతదేశంలో సైనిక విమానాలను ఒక ప్రైవేట్ కంపెనీ తయారు చేయనున్న తొలి ప్రాజెక్ట్ ఇదే. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.21,935 కోట్లు.  పౌర అవసరాలకు కూడా ఈ విమానాలను ఉపయోగించవచ్చు.

 

 

ప్రధాని ప్రసంగం

    శంకుస్థాపన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ,.. ప్ర‌పంచంలోనే  భార‌త‌దేశాన్ని ఉత్పాద‌క కేంద్రంగా మార్చే దిశ‌గా ఈరోజు మ‌నం పెద్ద ముంద‌డుగు వేశామని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ప్రజాదరణ పొందిన యుద్ధ విమానాలు, ట్యాంకులు, జలాంతర్గాములు, మందులు, టీకాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, కార్లను భారతదేశం తయారు చేస్తోందని అన్నారు. ‘భారతదేశంలో తయారీ, ప్రపంచంకోసం ఉత్పాదన (మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్)’ అనే మంత్రంతో భారతదేశం ముందుకు సాగుతోందని, ఇప్పుడు రవాణా విమానాల తయారీలో కూడా భారత్‌ పెద్దదేశంగా మారుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే పదాన్ని సగర్వంగా చెప్పుకునేలా, ప్రయాణీకుల భారీ విమానాలను త్వరలో మనదేశం తయారు చేయనుందని తాను భావిస్తున్నట్టు ప్రధాని పేర్కొన్నారు.

  దేశ రక్షణ రంగాన్ని, రవాణా రంగాన్ని మార్చే శక్తి ఈ విమాన తయారీ కేంద్రానికి ఉందన్నారు. భారత రక్షణ రంగంలో ఇంత భారీగా పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారని అన్నారు. వడోదర కేంద్రంలో తయారయ్యే రవాణా విమానాలు,.. సాయుధ బలగాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా, విమానాల తయారీలో కొత్త పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. “సాంస్కృతిక నిలయంగా, విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందిన వడోదర నగరం ఇక విమానయాన రంగ కేంద్రంగా క్రమంగా కొత్త గుర్తింపును సాధిస్తుంది" అని ఆయన అన్నారు.  వందకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎం.ఎస్.ఎం.ఇ.లు) కూడా ఈ ప్రాజెక్టుతో అనుబంధం కలిగి ఉండడం సంతోషదాయకమని ప్రధాని అన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ అనే వాగ్దానం ఈ భూమి నుంచి ప్రోత్సాహాన్ని పొందుతుందని, భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ ఇతర దేశాలకు ఎగుమతి ఆర్డర్‌లను సాధించగలదని  ఆయన అన్నారు.

   దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగం గురించి నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ, విమానాల రాకపోకలకు సంబంధించి ప్రపంచంలోని తొలి మూడు దేశాల సరసన మనం చేరబోతున్నామని అన్నారు. పలువురు ప్రయాణికులను విమానప్రయాణానికి మళ్లించేందుకు ఉడాన్ పథకం ఎంతో దోహదపడుతోందని అన్నారు. ప్రయాణ విమానాలకు, సరకు రవాణా (కార్గో) విమానాలకు పెరిగిన గిరాకీని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.  వచ్చే 15 ఏళ్లలో భారతదేశానికి 2,000కు మించి విమానాలు అవసరమవుతాయని అన్నారు. ఈ దిశగా ఈరోజు దేశంలో కీలకమైన ముందడుగు పడిందని, అందుకు తగిన సన్నాహాలను దేశం ఇప్పటికే ప్రారంభించిందని అన్నారు. కోవిడ్-19 వైరస్ మహమ్మారితో, యుద్ధం, సరఫరా వ్యవస్థ అంతరాయాలతో దెబ్బతిన్న ప్రపంచ దేశాలకు భారతదేశం ఒక అవకాశాన్ని అందజేస్తోందని కూడా మోదీ అన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారతదేశంలో వృద్ధి స్థిరంగా ఊపందుకుంటోందని అన్నారు. దేశంలో విమానయానం, తదితర నిర్వహణా పరిస్థితులు నిరంతరం మెరుగుపడుతూ వస్తున్నాయని, ధర విషయంలో పోటీతత్వంతో పాటు నాణ్యతపై కూడా భారత్ దృష్టిని సారిస్తోందని ఆయన వివరించారు. "తక్కువ ధరలో తయారీకి, అధిక స్థాయిలో ఉత్పత్తికి భారతదేశం అవకాశం కల్పిస్తోంది" అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. నైపుణ్యం కలిగిన మానవవనరులతో కూడిన భారీ ప్రతిభా కేంద్రం భారతదేశంలో అందుబాటులో ఉందని అన్నారు.

   గ‌త ఎనిమిదేళ్ల లో ప్ర‌భుత్వం చేపట్టిన సంస్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌ధాన మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ సంస్కరణలతో దేశంలో ఉత్పాద‌క రంగానికి అపూర్వ‌మైన వాతావ‌ర‌ణం రూపుదిద్దుకుంటోందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వంతో సరళీకృత కార్పొరేట్ పన్ను వ్యవస్థను రూపొందించడం, వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌.డి.ఐ.లకు) అవకాశం ఇవ్వడం, రక్షణ, అంతరిక్ష పరిశోధన రంగాల్లో ప్రైవేట్ కంపెనీలకు మార్గాలను తెరవడం, 29 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా సంస్కరించడం, 33,000 అనుమతి నిబంధనలను రద్దు చేయడం, డజన్ల కొద్దీ పన్నులతో కూడిన సంక్లిష్ట వ్యవస్థకు ముగింపు పలకడం ద్వారా వస్తు సేవా పన్నును ప్రవేశపెట్టడం తదితర సంస్కరణ చర్యలను ఆయన ప్రస్తావించారు. "ఈ రోజు భారతదేశంలో ఆర్థిక సంస్కరణల కొత్త యుగం రూపుదిద్దుకుంటోంది. ఈ పరిణామంనుంచి రాష్ట్రాలతో పాటు తయారీ రంగం కూడా అత్యధిక ప్రయోజనాలను పొందుతోంది" అని ఆయన అన్నారు.

  దేశం ఆలోచనా విధానంలో మార్పు రావడమే ఈ విజయానికి కారణమని నరేంద్ర మోదీ అన్నారు.  కొత్త ఆలోచనలతో, కొత్త పని-సంస్కృతితో ఈ రోజు భారతదేశం పనిచేస్తోందని అన్నారు. దేశంలోని ప్రతిభను, ప్రైవేటు రంగం శక్తిని అణచివేసే మనస్తత్వం, ప్రభుత్వానికి అన్నీ తెలుసుననే భావన ఒకప్పుడు ఉండేదని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ‘సబ్‌కా ప్రయాస్’ నినాదాన్ని అనుసరిస్తూ, ప్రభుత్వానికి, ప్రైవేట్ రంగానికి సమాన ప్రాధాన్యతను ఇవ్వడం మొదలైందని అన్నారు. కేవలం రాయితీల ద్వారా ఉత్పాదక రంగాన్ని అంతంత మాత్రంగానే ఉంచిన గత ప్రభుత్వం తాత్కాలిక విధానంపట్ల  ప్రధాన మంత్రి విచారం వ్యక్తం చేశారు. లాజిస్టిక్ సదుపాయాలు, విద్యుత్ సరఫరా-నీటి సరఫరా వంటి ప్రాథమిక సౌకర్యాలను గతంలో నిర్లక్ష్యం చేశారన్నారు. “తాత్కాలిక నిర్ణయం తీసుకునే పాత విధానాన్ని మేం వదిలేశాం. వివిధరకాల కొత్త ప్రోత్సాహకాలను పెట్టుబడిదారులకు అందించేందుకు ముందుకు వచ్చాం. ఉత్పత్తితో ముడివడిన ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించాం, ఇది మార్పును ప్రస్పుటంగా కనిపించేలా చేసింది. ఈ రోజున, మా విధానాలు సుస్థిరంగా, ఉజ్వల భవిత సాధనకు అనుగుణంగా ఉన్నాయి”అని ప్రధాని అన్నారు.

   తయారీ రంగం మనకు అందుబాటులో ఉండదని, సేవా రంగంపై దృష్టి పెడితే చాలని గతకాలంలో సాగిన ఆధిపత్యపూరిత ఆలోచనను కూడా ప్రధాన మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. " సేవల రంగాన్ని, తయారీ రంగాన్ని, ఇలా రెండింటినీ ఈ రోజున మేం మెరుగుపరుస్తున్నాం" అని ఆయన చెప్పారు. తయారీ రంగం-సేవా రంగం రెండింటిపై దృష్టి సారించే సమగ్ర విధానానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. “తయారీ రంగంలో అందరికంటే ముందు నడవడానికి నేడు భారతదేశం సన్నాహాలు చేసుకుంటోంది,” అని ప్రధాని అన్నారు.  “నైపుణ్యం, అభివృద్ధిపై గత ఎనిమిదేళ్లలో మేం దృష్టి సారించడం, అందుకు సానుకూల వాతావరణాన్ని సృష్టించడం వల్ల సానుకూల ఫలితం సాధ్యమైంది, తయారీ రంగంలో భారతదేశం అభివృద్ధి ఇపుడు ఈ స్థాయికి చేరింది. ” అని ఆయన అన్నారు.

  పెట్టుబడులకు  అనుకూలంగా ప్రభుత్వం చేపట్టిన విధానాలను ప్రధానమంత్రి తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు.  ఎఫ్‌.డి.ఐ.ల ప్రవేశంతో  ప్రభుత్వ విధాన ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. గత ఎనిమిదేళ్లలో 160కి పైగా దేశాల కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాయన్నారు. ఇలాంటి విదేశీ పెట్టుబడులు కొన్ని పరిశ్రమలకే పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థలోని 61 రంగాలకు విస్తరించాయని, భారతదేశంలోని 31 రాష్ట్రాలకు అవి వర్తిస్తున్నాయని ఆయన వివరించారు. కేవలం గగనతల  రంగంలోనే 3 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు ప్రధాని తెలియజేశారు. 2014 తర్వాత, ఈ రంగంలో పెట్టుబడులు భారీగా పెరిగాయని, 2000వ సంవత్సరం నుంచి 2014 సంవత్సరం మధ్యకాలంతో పోల్చితే ఈ పెట్టుబడులు ఐదు రెట్లు పెరిగాయన్నారు. రాబోయే సంవత్సరాల్లో, రక్షణ-అంతరిక్ష రంగాలు 'ఆత్మనిర్భర భారత్' సూత్రానికి మూల స్తంభాలుగా తయారు కాబోతున్నాయని నరేంద్ర మోదీ చెప్పారు. "రక్షణ తయారీ రంగాన్ని 2025 నాటికి 25 బిలియన్ల అమెరికన్ డాలర్ల స్థాయికి మించి పెంచాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. రక్షణరంగంలో మన ఎగుమతులు కూడా 5 బిలియన్ల డాలర్లను మించిపోతాయి" అని ఆయన చెప్పారు.

   ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రూపొందుతున్న రక్షణ రంగ ఉత్పత్తి కారిడార్లు రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంలో ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఇటీవల గుజరాత్‌లోని గాంధీనగర్‌లో డిఫెక్స్‌పో పేరిట రక్షణ రంగంలో అత్యంత భారీస్థాయి ప్రదర్శనను నిర్వహించిన రక్షణ మంత్రిత్వ శాఖను, గుజరాత్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు. డిఫెక్స్‌పోలో ప్రదర్శించిన అన్ని పరికరాలు, సాంకేతిక పరిజ్ఞాన ప్రక్రియలు భారతదేశంలో తయారైనవేనని ఆయన స్పష్టంచేశారు. "ప్రాజెక్ట్ సి-295 ప్రతిఫలం రాబోయే సంవత్సరాల్లో జరిగే డిఫెక్స్‌పోలో కూడా మనకు కనిపిస్తుంది" అని ప్రధాని అన్నారు.

    ఈ తరుణంలో దేశంలో పెట్టుబడులకు విశ్వాసాన్ని కలిగించేలా ఏర్పడిన అపూర్వమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమతో అనుబంధం కలిగిన వారందరినీ ప్రధానమంత్రి కోరారు. దేశంలోని స్టార్టప్‌ కంపెనీలు, దేశ పురోగమనానికి సహాయపడే అంశంపై మరింత ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. పరిశోధనా రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం పెరగడం చాలా ముఖ్యమని ప్రధాన మంత్రి అన్నారు. "ఈ దిశలో మనం ముందుకు సాగితే, ఆవిష్కరణ, తయారీ రంగాల బలమైన వ్యవస్థను రూపొందించ గలుగుతాం. స‌బ్‌కా ప్ర‌యాస్ అనే మంత్రాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి” అని ప్ర‌ధాన మంత్రి తన ప్రసంగాన్ని ముంగించారు.

 

రక్షణ మంత్రి ప్రసంగం

  ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ,  దేశంలో ప్రైవేట్ రంగం మొదటి తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేయడం అంటే,.. అది రక్షణ రంగం ‘ఆత్మనిర్భరతా’ పయనంలో ఒక కీలకమైన మైలురాయి వంటిదని పేర్కొన్నారు. గుజరాత్‌కు చెందిన జాతిపిత మహాత్మా గాంధీ స్వదేశీ ఉద్యమాన్ని ఇలా ప్రోత్సహించినందుకు టాటా కన్సార్షియం, ఎయిర్‌బస్ సంస్థలను, ఈ ప్రాజెక్ట్‌తో అనుబంధం ఉన్న ఇతర సంస్థలను ఆయన అభినందించారు. సి.-295 అనేది అత్యాధునిక సామర్థ్యాలు, ప్రపంచ ప్రమాణాలతో కూడిన అధునాతన విమానమని రక్షణ మంత్రి అభివర్ణించారు, భారతీయ వైమానిక దళం రవాణా సామర్థ్యాన్ని ఇది అపూర్వమైన రీతిలో బలోపేతం చేస్తుందన్నారు. “భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ద్వారా తయారయ్యే మొత్తం 56 విమానాలకు స్వదేశీ ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్ర వ్యూహాలను అమర్చడం అత్యంత ప్రాముఖ్యత కలిగిన విషయం. దేశవ్యాప్తంగా వందలాది ఎం.ఎస్.ఎం.ఇ.లు ఈ ప్రాజెక్ట్‌లో పాలుపంచుకోనున్నాయి. ప్రైవేట్ రంగం, రక్షణ ప్రభుత్వ రంగ సంస్థల (డి.పి.ఎస్.యు.ల) సహకారంతో సాయుధ బలగాల అవసరాలు తీరగలవని చెప్పడానికి  ఇది ఒక చక్కని ఉదాహరణ, ”అని ఆయన అన్నారు.

 

  స్వదేశీ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యలు సాయుధ దళాల అవసరాలను తీర్చడమే కాకుండా, రక్షణ పరికరాలు/వేదికల నికరమైన ఎగుమతిదారుగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతాయని రాజనాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కేంద్రంలో తయారైన విమానం ప్రయాణం,.. పరస్పర సహకారం, రక్షణ సాధికారత, స్వావలంబనల పయనంతో సమానమని అన్నారు.

   ఎంతో దార్శనిక దృష్టితో కూడిన ప్రధానమంత్రి నాయకత్వాన్ని రక్షణ మంత్రి ప్రశంసిస్తూ,. నరేంద్ర మోదీని ఒక రాజనీతిజ్ఞుడుగా అభివర్ణించారు, దేశ ప్రస్తుత అవసరాలకు మాత్రమే కాకుండా, భవిష్యత్తు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కూడా ప్రధాని నిర్ణయాలు దేశాన్ని సన్నద్ధం చేస్తున్నాయని అన్నారు. ప్రధానమంత్రి తన దార్శనికతతో నిర్దేశించిన ‘ఆత్మనిర్భర భారత్’ లక్ష్యాన్ని సాధించేందుకు దేశం భారీ ముందడుగు వేస్తోందని, ప్రపంచంలోని బలమైన దేశాల్లో ఒకటిగా భారతదేశం ఎదగాలంటే ఇది అవసరమని ఆయన అన్నారు. “ప్రధాన మంత్రి దూరదృష్టితో కూడిన నాయకత్వం కారణంగా, ప్రపంచ స్థాయిలో భారతదేశం ప్రతిష్ట పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రధాన వాణిగా మారింది, మన మాటలను ప్రపంచం శ్రద్ధగా, గౌరవ భావంతో ఆలకిస్తోంది.” అని రక్షణమంత్రి అన్నారు.

 

 

కాలవ్యవధి

  ఈ ప్రాజెక్టులో భాగంగా 16  విమానాలను పూర్తిగా ఎగిరే స్థితిలో బట్వాడా చేస్తారు.  2023 సెప్టెంబర్  2025 ఆగస్టు మధ్య కాలంలో ఇవి అందుబాటులోకి వచ్చేలా షెడ్యూల్ తయారు చేశారు. మిగిలిన నలభై 40 విమానాలు వడోదర తయారీ కేంద్రంలో తయారవుతాయి. భారతదేశంలో తయారయ్యే మేడ్ ఇన్ ఇండియా మొదటి విమానం 2026 సెప్టెంబరు నుంచి  అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు.

 

 

విమాన సామర్థ్యం

   సి-295 రకం విమానం సమకాలీన సాంకేతిక పరిజ్ఞానంతో 5నుంచి10 టన్నుల సామర్థ్యం కలిగిన రవాణా విమానం. భారతీయ వైమానిక దళంలోని పాతబడిన అవ్రో విమానాల స్థానాన్ని భర్తీ చేసే సి-295 విమానం ఎంతో బలమైనది, విశ్వసనీయమైనది. విభిన్నమైన అనేక కార్యకలాపాలను ఇది నిర్వహించగలుగుతుంది.  ఇది బహుముఖమైన సమర్థవంతమైన వ్యూహాత్మక రవాణా విమానం. సుదీర్ఘంగా 11 గంటల వ్యవధి వరకు ఎంతో పటిష్టంగా, అన్ని వాతావరణ పరిస్థితులలో బహుముఖ కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యం దీనికి ఉంది. ఇది ఎడారి నుంచి, సముద్ర పరిసరాల వరకు పగలు, రాత్రి తేడా లేకుండా పోరాట విన్యాసాలను నిర్వహించగలదు.  వేగంగా ప్రతిచర్యకు దిగే శక్తి సామర్థ్యాలు దీనికి ఉన్నాయి. సైనిక దళాలు సత్వరం ప్రతిచర్యకు దిగేందుకు, సరుకులను జారవిడవడానికి వీలుగా వెనుక భాగంలో ర్యాంప్ తలుపును కలిగి ఉంటుంది. సగం వరకూ సన్నద్ధంచేసిన ఉపరితలాలంలో షార్ట్ టేకాఫ్ చేయడానికి/దిగడానికి తగిన సామర్థ్యం కలిగి ఉండటం ఈ విమానం మరో ప్రత్యేకత.

 

ఆత్మనిర్భరత

 టెక్నాలజీ ప్రాధాన్యం, అత్యంత పోటీతత్వం ఉన్న విమానయాన పరిశ్రమలోకి ప్రవేశించడానికి భారతీయ ప్రైవేట్ రంగానికి ఈ ప్రాజెక్ట్ ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. దేశీయ విమానయాన తయారీ కార్యకలాపాలను ఈ ప్రాజెక్టు మరింతగా పెంపొందిస్తుంది, దీనితో విమానాలకోసం మనం దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఎగుమతులపై అంచనాలు కూడా పెరుగుతాయి. అలాగే, స్పెయిన్‌లో ఎయిర్‌బస్ సంస్థ తయారీ కేంద్రంలో ఒక విమానం తయారీకి ఉపయోగించే మొత్తం సిబ్బంది పనిలో 96శాతాన్ని భారతదేశంలో టాటా కన్సార్షియం ద్వారా చేపడతారు. పరికరాలు, జిగ్‌లు, పరీక్షా సామగ్రితో పాటు 13,400 కంటే ఎక్కువ డిటైల్ పార్ట్‌లు, 4,600 సబ్-అసెంబ్లీలు, మొత్తం ఏడు ప్రధాన విడిభాగాల కూర్పు, తయారీ ప్రక్రియను భారతదేశంలో చేపడతారు. ఇంజిన్‌లు, ల్యాండింగ్ గేర్, ఏవియానిక్స్, ఇ.డబ్ల్యు. సూట్ మొదలైన వివిధ వ్యవస్థలను ఎయిర్‌బస్ డిఫెన్స్, స్పేస్ సంస్థ అందిస్తుంది. టాటా కన్సార్షియం సంస్థ ద్వారా విమాన పరీక్షలను ఏకీకృతంగా నిర్వహిస్తారు. టాటా కన్సార్షియం ద్వారానే ఈ విమానాన్ని సమగ్ర వ్యవస్థగా పరీక్షిస్తారు. విమానం ఎగిరే సామర్థ్యంపై  టాటా కన్సార్షియం బట్వాడా కేంద్రం ద్వారా పరీక్షిస్తారు, అక్కడే బట్వాడా చేస్తారు.

   రక్షణ విభాగపు ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ద్వారా తయారైన స్వదేశీ ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్రాల సూట్‌నే మొత్తం 56 విమానాలకూ అమర్చుతారు. భారతీయ వైమానిక దళానికి 56 విమానాల బట్వాడా ప్రక్రియ పూర్తయిన తర్వాతనే,  భారతదేశంలో తయారైన ఈ విమానాలను పౌర విమానయాన నిర్వహకులకు విక్రయించడానికి, భారత ప్రభుత్వం ఆమోదం పొందిన దేశాలకు ఎగుమతి చేయడానికి ఎయిర్‌బస్ డిఫెన్స్-స్పేస్ సంస్థకు అనుమతి ఇస్తారు.

 

ఉపాధి కల్పన

 దేశంలోని ఏడు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న 125కిపైగా  దేశీయ ఎం.ఎస్.ఎం.ఇ. సరఫరాదార్లను టాటా కన్సార్షియం గుర్తించింది. దేశంలోని గగనతల సానుకూల వ్యవస్థలో ఉపాధి కల్పనకు ఇది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. అత్యధిక నైపుణ్యం కలిగిన 600 ఉద్యోగాలను ప్రత్యక్షంగా, 3,000 పైగా ఉద్యోగాలను పరోక్షంగా కల్పిస్తుంది. 42.5 లక్షలకు మించిన పని గంటలతో పాటు అదనంగా 3,000 రకాల మధ్యస్థ నైపుణ్యం కలిగిన ఉపాధి అవకాశాలను ఇది కల్పిస్తుందని భావిస్తున్నారు. ఇక స్పెయిన్‌లోని ఎయిర్‌బస్ కేంద్రంలో దాదాపు 240 మంది ఇంజనీర్లకు శిక్షణ లభిస్తుంది.

 

 ఎగ్జిబిషన్, ఇతర సందర్శకులు

   ఈ కార్యక్రమంలో భాగంగా, 'ఆత్మనిర్భర భారత్' కింద విమాన పరిశ్రమలో సాంకేతిక, తయారీ రంగ పురోగతిని వివరించే ఎగ్జిబిషన్‌ను కూడా ప్రధాని సందర్శించారు. గుజరాత్ గవర్నర్  ఆచార్య దేవవ్రత్; పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా; గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్;  రక్షణ సిబ్బంది ప్రధాన అధిపతి జనరల్ అనిల్ చౌహాన్; వైమానికదళం అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్. చౌదరి; రక్షణ మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్; పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సాల్; టాటా సన్స్ సంస్థ చైర్మన్, ఎన్ చంద్రశేఖరన్; ఎయిర్‌బస్ సంస్థ వాణిజ్య వ్యవహారాల ప్రధాన అధికారి క్రిస్టియన్ స్కెరర్,  పారిశ్రామిక రంగ ప్రముఖులు హాజరయ్యారు. 

 

**** 



(Release ID: 1872170) Visitor Counter : 204