గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బెంగళూరులో 31 అక్టోబర్ నుంచి 2 నవంబర్, 2022 వరకు మూడు రోజుల జాతీయ ఇఎంఆర్ఎస్ సాంస్కృతిక వేడుకను నిర్వహిస్తున్న ఎన్ఇఎస్ టిఎస్


ముఖ్య అతిథిగా హాజరు కానున్న గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీమతి రేణుక

Posted On: 30 OCT 2022 4:44PM by PIB Hyderabad

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న స్వయంప్రతిపత్తి సంస్థ ది నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (గిరిజన విద్యార్ధులకు జాతీయ విద్యా సంస్థ) 31 అక్టోబర్ నుంచి 2 నవంబరు 2022 వరకు కర్నాటకలోని బెంగళూరులో జాతీయ ఇఎంఆర్ఎస్ కల్చరల్ ఫెస్ట్ ను ప్రారంభించేందుకు సంసిద్ధమవుతోంది. 
ఈ కార్యక్రమాన్ని కర్నాటక రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (కెఆర్ఇఐఎస్) ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో ఏర్పాటు చేస్తోంది.  ఈ కార్యక్రమానికి గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రేణుకా సింగ్ హాజరుకానున్నారు. 
 మూడు రోజులు జరుగనున్న ఈ సాంస్కృతిక కార్యక్రమంలో దేశం నలుమూలలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఇఎంఆర్ఎస్)కు చెందిన 1500+ విద్యార్ధులు పాలుపంచుకోనున్నారు. 
గిరిజనులను జనజీవన స్రవంతిలో ఏకీకరించి, వివిధ క్షేత్రాలలో అభివృద్ధి చెందేందుకు, సమాన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మంత్రిత్వ శాఖ ఇఎంఆర్ఎస్ సాంస్కృతిక వేడుకలను, క్రీడా కార్యక్రమాలను ప్రతి ఏడాదీ నిర్వహిస్తోంది. తద్వారా వివిధ రంగాలలో గిరిజన విద్యార్ధులలో దాగి ఉన్న ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక జాతీయ వేదికను అందిస్తోంది. కోవిడ్ కారణంగా గత రెండళ్ళుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించకపోవడం వల్ల ఈ మూడు రోజుల వేడుక అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తికి అనుగుణంగా ఇఎంఆర్ఎస్ లో విద్యను అభ్యసిస్తున్న గిరిజన విద్యార్ధుల సర్వతోముఖాభివృద్ధికి ఈ కార్యక్రమం ప్రేరణనివ్వడమే కాక నిరంతర సాంస్కృతిక అనుసంధానాన్ని ప్రోత్సహించి, జాతీయ సమైక్యత ద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిస్తుంది. 
దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ గిరిజనులు (షెడ్యూల్డు తెగల)కోసం భారత ప్రభుత్వం చేపట్టిన మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల పథకమే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఇఎంఆర్ఎస్). భారత గిరిజన వ్యవహరాల మంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మక చొరవ ఇది. మారుమూల ప్రాంతాలలోని గిరిజన విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు 1997-98లో దీనిని ప్రవేశపెట్టారు. 

***


(Release ID: 1872118) Visitor Counter : 152