ప్రధాన మంత్రి కార్యాలయం
2022 అక్టోబర్ 30 వ తేదీన జరిగిన ‘ మన్ కీ బాత్ ’ (‘ మనసు లో మాట ’) కార్యక్రమం94వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
Posted On:
30 OCT 2022 11:50AM by PIB Hyderabad
ప్రియమైన నా దేశ ప్రజలారా, నమస్కారం. ఈ రోజు న, సూర్యుడి ని ఆరాధించే గొప్ప పండుగ ‘ఛఠ్’ ను దేశం లోని అనేక ప్రాంతాల లో జరుపుకొంటారు. ‘ఛఠ్’ పండుగ లో పాలుపంచుకోవడానికని లక్షల కొద్దీ భక్తజనం వారి ఊళ్ల కు, వారి ఇళ్ల కు, వారి కుటుంబాల చెంత కు చేరుకొన్నారు. ఛఠ్ మాత ప్రతి ఒక్కరి కి సమృద్ధి ని, సంక్షేమాన్ని అనుగ్రహించాలి అని నేను ప్రార్థిస్తున్నాను.
సహచరులారా, మన సంస్కృతి కి, మన విశ్వాసానికి, ప్రకృతి కి ఎంత లోతైన సంబంధం ఉందో చెప్పేందుకు సూర్యారాధన సంప్రదాయం ఒక నిదర్శనం. ఈ పూజ మన జీవనం లో సూర్యకాంతి ప్రాముఖ్యాన్ని వివరిస్తుంది. దీంతో పాటు ఎత్తుపల్లాలు జీవనం లో అంతర్భాగం అని సందేశం కూడా ఇస్తుంది. కాబట్టి ప్రతి సందర్భంలోనూ మనం ఒకే వైఖరి ని కలిగి ఉండాలి. ఛఠ్ మాత పూజ లో వివిధ పండ్ల ను మరియు టేకువా ప్రసాదాన్ని సమర్పిస్తారు. ఈ వ్రతం ఏ కఠినమైన సాధన కంటే తక్కువది ఏమీ కాదు. ఛఠ్ పూజ లో మరో ప్రత్యేకత ఏమిటంటే పూజ కు ఉపయోగించే వస్తువుల ను సమాజం లోని వివిధ వ్యక్తులు కలసి తయారుచేస్తారు. ఇందులో వెదురు తో చేసిన బుట్ట లేదా సుప్ లీ ని ఉపయోగిస్తారు. మట్టి దీపాల కు కూడా ప్రాముఖ్యం ఉంది. దీని ద్వారా శనగల ను పండించే రైతులు, పిండి ని తయారు చేసే చిన్న పారిశ్రామికవేత్తల కు సమాజం లో ప్రాముఖ్యం ఏర్పడింది. వారి సహకారం లేకుండా ఛఠ్ పూజ లు పూర్తి కావు. ఛఠ్ పండుగ మన జీవితం లో పరిశుభ్రత ప్రాముఖ్యత ను కూడా నొక్కి చెబుతుంది. ఈ పండుగ సందర్భం లో రోడ్లు, నదులు, ఘాట్ లు, వివిధ నీటి వనరుల ను సమాజ స్థాయి లో శుభ్రం చేస్తారు. ఛఠ్ పండుగ కూడా ‘ఏక్ భారత్- శ్రేష్ఠ్ భారత్’ కు ఉదాహరణ. ఈ రోజు న బిహార్, పూర్వాంచల్ ప్రజలు దేశం లో ఏ మూలన ఉన్నా ఛఠ్ ను ఘనం గా జరుపుకొంటున్నారు. దిల్లీ లో, ముంబయి తో సహా మహారాష్ట్ర లోని వివిధ జిల్లాల్లో, గుజరాత్ లోని వివిధ ప్రాంతాల లో ఛఠ్ ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. గుజరాత్ లో ఇంతకు ముందు ఛఠ్ పూజ పెద్ద గా జరిగేది కాదని నాకు గుర్తుంది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ దాదాపు గా గుజరాత్ అంతటా ఛఠ్ పూజ రంగు లు కనిపించడం మొదలైంది. ఇది చూసి నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. ఈ రోజుల్లో విదేశాల నుండి కూడా ఛఠ్ పూజ కు సంబంధించిన ఎన్ని అందమైన చిత్రాలు వస్తున్నాయో మనం చూస్తున్నాం. అంటే భారతదేశం యొక్క గొప్ప వారసత్వం, మన విశ్వాసం, ప్రపంచం లోని ప్రతి మూలలో మన గుర్తింపు ను పెంచుతున్నాయి. ఈ గొప్ప పండుగ లో పాల్గొనే ప్రతి విశ్వాసి కి నా తరఫున అనేకానేక శుభాకాంక్షలు.
ప్రియమైన నా దేశ ప్రజలారా, ఇప్పుడు మనం పవిత్రమైన ఛఠ్ పూజ ను గురించి, సూర్య భగవానుని ఆరాధన ను గురించి మాట్లాడుకొన్నాం. కాబట్టి ఈ రోజు న సూర్యుడి ని ఆరాధించడం తో పాటు గా ఆయన వరాన్ని గురించి కూడా ను చర్చించుకోవాలి. సూర్య భగవానుని వరదానమే ‘సౌర శక్తి’. సోలర్ ఎనర్జీ ఈ రోజుల లో ఎంత ముఖ్యమైన అంశం అంటే ఈ రోజు న యావత్తు ప్రపంచం తన భవిష్యత్తు ను సౌర శక్తి లో చూసుకొంటున్నది. సూర్య భగవానుడి ని భారతీయులు శతాబ్దాలు గా ఆరాధిస్తున్నారు. అంతే కాకుండా భారతీయ జీవన విధానాని కి కేంద్రం భాస్కరుడే. భారతదేశం నేడు తన సాంప్రదాయిక అనుభవాల ను ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో జోడిస్తోంది. అందుకే నేడు సౌర శక్తి నుండి విద్యుత్తు ను ఉత్పత్తి చేసే అతి పెద్ద దేశాల లో చేరిపోయాం. మన దేశం లో పేదల, మధ్యతరగతి ప్రజల జీవనం లో సౌర శక్తి తెచ్చిన మార్పు లు సైతం అధ్యయనం చేసే విషయం అని చెప్పాలి.
తమిళ నాడు లోని కాంచిపురం లో శ్రీ కె. ఎళిలన్ అనే రైతు ఉన్నారు. ఆయన ‘పిఎమ్ కుసుమ్ యోజన’ ను సద్వినియోగం చేసుకొన్నారు. తన పొలం లో పది హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన సోలర్ పంప్‌సెట్ ను అమర్చారు. ఇప్పుడు తమ పొలాని కి కరెంటు కోసం డబ్బేమీ ఖర్చు చేయవలసిన పని లేదు. పొలం లో సాగునీటి కోసం ప్రభుత్వం ఇచ్చే విద్యుత్ సరఫరా పై కూడా ఆధారపడడం లేదు కూడా. అలాగే రాజస్థాన్ లోని భరత్ పుర్ లో కమల్ జీ మీణా గారు ‘పిఎమ్ కుసుమ్ యోజన’ నుండి లబ్ధి ని పొందారు. కమల్ జీ పొలం లో సోలర్ పంపు ను అమర్చారు. దాని కారణం గా ఆయన ఖర్చు తగ్గింది. ఖర్చు తగ్గితే ఆదాయం కూడా పెరుగుతుంది. కమల్ జీ సౌర శక్తి కారణం గా అనేక ఇతర చిన్న పరిశ్రమల కు కూడా విద్యుత్తు లభిస్తోంది. వారి ప్రాంతం లో చెక్క పని ఉంది. ఆవు యొక్క పేడ తో ఉత్పత్తులు తయారవుతున్నాయి. సోలర్ విద్యుత్తు ను వాటిలోనూ వినియోగిస్తున్నారు. వారు 10-12 మందికి ఉపాధి ని సైతం కల్పిస్తున్నారు. అంటే కమల్ జీ ప్రారంభించిన కుసుమ్ యోజన యొక్క పరిమళం ఎంతో మంది కి వ్యాపించడం మొదలైంది.
సహచరులారా, మీరు ఒక నెలంతా కరెంటు వాడిన తరువాత మీకు కరెంటు బిల్లు రావడం కాకుండా మీకు అదనం గా ఆదాయం వస్తుందని మీరు ఊహించగలరా? సౌర శక్తి ఈ పని కూడా చేసింది. కొన్ని రోజుల క్రితం మీరు దేశం లో మొట్టమొదటి సౌర శక్తి గ్రామం - గుజరాత్ లోని మొఢేరా ను గురించి చాలా విన్నారు. మొఢేరా సౌర గ్రామం లోని చాలా ఇళ్ల లో సౌర శక్తి తో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడ చాలా ఇళ్ల లో నెలాఖరు లోగా కరెంటు బిల్లు రావడం లేదు. దానికి బదులుగా కరెంటు తో సంపాదన తాలూకు చెక్కు వస్తోంది. ఇలా జరగడం చూసి ఇప్పుడు దేశం లోని అనేక గ్రామాల ప్రజలు తమ గ్రామాన్ని కూడా సౌర గ్రామం గా మార్చాలంటూ నాకు ఉత్తరాల ను రాస్తున్నారు. అంటే భారతదేశం లో సౌర గ్రామాల నిర్మాణం పెద్ద ప్రజా ఉద్యమం గా మారే రోజు ఎంతో దూరం లో లేదు. దీని ప్రారంభాన్ని మొఢేరా గ్రామస్తులు ఇప్పటికే చేసి చూపించారు.
రండి.. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) శ్రోతల కు కూడా మొఢేరా వాసుల ను పరిచయం చేద్దాం. శ్రీమాన్ విపిన్‌భాయ్ పటేల్ గారు ప్రస్తుతం మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు.
ప్రధాన మంత్రి గారు :- విపిన్ భాయ్ నమస్తే! చూడండి.. ఇప్పుడు మొఢేరా యావత్తు దేశాని కి ఒక ఆదర్శం రూపం లో చర్చ కు వచ్చేసింది. అయితే మిమ్మల్ని మీ బంధువులు, పరిచయస్తులు అందరూ వివరాలు అడుగుతూ ఉంటారేమో మరి వారికి మీరు ఏమేం సంగతులు చెప్తారు ? ఏ విధమైన లాభం కలిగిందంటారు ?
విపిన్ గారు :- సర్, మమ్మల్ని ఎవరైనా అడిగితే ఇప్పుడు కరెంటు బిల్లు సున్నా గా వస్తోందని చెప్తాం. ఒక్కోసారి ఇది 70 రూపాయలు వస్తోంది. అయితే మొత్తం మీద మా ఊరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది.
ప్రధాన మంత్రి గారు :- అంటే ఒక రకం గా చెప్పాలంటే ఇంతకు ముందు లాగా కరెంటు బిల్లు ను గురించిన ఆలోచన ఇప్పుడు లేదన్న మాట.
విపిన్ గారు :- అవును సర్. అది వాస్తవం సర్. ప్రస్తుతం గ్రామం లో ఎలాంటి టెన్శన్ లేదు. సర్ చేసిన పని బాగుందని అందరూ అనుకుంటున్నారు. వారంతా ఆనందం గా ఉన్నారు సర్, సంతోషిస్తున్నారు.
ప్రధాన మంత్రి గారు:- ఇప్పుడు మీరే స్వయం గా మీ ఇంట్లోనే కరెంటు ఫ్యాక్టరీ కి యజమాని అయ్యారు. మీ సొంత ఇంటి పై కప్పు మీద విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.
విపిన్ జీ :- అవును సర్, నిజమే సర్.
ప్రధాన మంత్రి గారు :- ఈ మార్పు గ్రామ ప్రజల పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?
విపిన్ గారు:- సర్.. ఊళ్లో ప్రజలంతా వ్యవసాయం చేస్తున్నారు. మాకున్న కరెంటు కష్టాలు తీరిపోయాయి. కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు సర్.
ప్రధాన మంత్రి గారు:- అంటే కరెంటు బిల్లు కూడా పోయింది. సౌకర్యం పెరిగింది.
విపిన్ గారు:- మీరు ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా గందరగోళం గా ఉంది సర్. ఇక్కడ మొదలైన 3డి శో తరువాత మొఢేరా గ్రామం యొక్క ప్రభ దివ్యం గా వెలిగిపోవడం మొదలైంది సర్. అప్పుడు వచ్చిన సెక్రట్రి సర్..
ప్రధాన మంత్రి గారు :- అవునండి..
విపిన్ గారు :- అలా ఊరు పేరు తెచ్చుకొంది సర్.
ప్రధాన మంత్రి గారు :- అవును. ఐక్య రాజ్య సమితి సెక్రట్రి జనరల్. ఆయన కోరిక అది. ఇంత గొప్ప పని ని అక్కడికి వెళ్లి స్వయం గా చూడాలని ఉంది అంటూ ఆయన నన్ను అడిగారు. సోదరా విపిన్ ! మీకు, మీ గ్రామ ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యావత్తు ప్రపంచం మిమ్మల్ని స్పూర్తి గా తీసుకోవాలని, ఈ సౌర శక్తి ఉద్యమం ఇంటింటికి చేరుకోవాలని కోరుకుంటున్నాను.
విపిన్ గారు :- సరే సర్. ‘సౌర శక్తి ఉపయోగించుకోండి-మీ డబ్బు ఆదా చేసుకోండి’ అని అందరికీ చెప్తాం సర్. దీనివల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది సర్.
ప్రధాన మంత్రి గారు :- అవును. దయచేసి ప్రజల కు వివరించండి. మీకు శుభాకాంక్షలు. ధన్యవాదాలు సోదరా !
విపిన్ గారు :- ధన్యవాదాలు సర్. థాంక్యూ సర్. మీతో మాట్లాడటం వల్ల నా జీవితం ధన్యమైంది.
ప్రధాన మంత్రి గారు :- విపిన్ భాయ్ గారికి చాలా ధన్యవాదాలు.
ఇప్పుడు మొఢేరా గ్రామం లో సోదరి వర్ష గారి తో కూడా మాట్లాడదాం.
వర్ష బెన్ :- హెలో, నమస్తే సర్ !
ప్రధాన మంత్రి గారు :- నమస్తే- నమస్తే వర్ష బెహన్. మీరు ఎలా ఉన్నారు?
వర్ష బెన్ :- మేం చాలా బాగున్నాం సర్. మీరు ఎలా ఉన్నారు ?
ప్రధాన మంత్రి గారు:- నేను చాలా బాగున్నానమ్మా.
వర్ష బెన్ :- మీతో మాట్లాడడం మా భాగ్యం సర్.
ప్రధాన మంత్రి గారు :- అలాగా సోదరి వర్ష..
వర్ష బెన్ :- అవును సర్.
ప్రధాన మంత్రి గారు:- మీరు మొఢేరా లో ఉన్నారు. మీరు సైనిక కుటుంబాని కి చెందిన వారు కదా.
వర్ష బెన్ :- అవును సర్. మాది సైనిక కుటుంబం సర్. మాజీ సైనికుడి భార్య ను మాట్లాడుతున్నాను సర్.
ప్రధాన మంత్రి గారు:- మీకు భారతదేశం లో ఎక్కడెక్కడికి వెళ్లే అవకాశం వచ్చింది ?
వర్ష బెన్ :- నేను రాజస్థాన్ కు వెళ్ళాను. గాంధీ నగర్ కు వెళ్ళాను. జమ్ములో కలిసి ఉండే అవకాశం వచ్చింది. అక్కడ చాలా సౌకర్యాలు ఉన్నాయి సర్.
ప్రధాన మంత్రి గారు:- అవును. మీవారు సైన్యం లో ఉండడం వల్ల మీరు హిందీ కూడా బాగా మాట్లాడుతున్నారు.
వర్ష బెన్ :- అవును సర్. అవును. నేను నేర్చుకున్నాను.
ప్రధాన మంత్రి గారు :- మొఢేరా లో వచ్చిన పెద్ద మార్పు ను చెప్పండి. మీరు ఈ సోలర్ రూఫ్‌టాప్ ప్లాంటు ను పెట్టారు. ప్రజలు మొదట్లో ఏమి చెప్తుండే వారో అప్పుడు మీకు గుర్తు కు వచ్చి ఉంటుంది. దీని అర్థం ఏమిటి? మీరు ఏం చేస్తున్నారు ? ఏం జరుగుతుంది ? ఇలా విద్యుత్తు వస్తుందా? ఇవన్నీ మీ మనసు లో మెదిలి ఉంటాయి. ఇప్పుడు మీ అనుభవం ఏంటి ? దీని వల్ల ఏం లాభం కలిగింది ?
వర్ష బెన్:- చాలా లాభం ఉంది. చాలా లాభమే వచ్చింది సర్. మీ వల్లే మా ఊళ్లో ప్రతి రోజు దీపావళి ని జరుపుకుంటారు. 24 గంటలు కరెంటు వస్తోంది. బిల్లు అస్సలే రావడం లేదు. మా ఇంట్లోకి అన్ని ఎలక్ట్రిక్ వస్తువులను తెచ్చుకున్నాం సర్. మీ వల్లే అన్నీ వాడుతున్నాం సర్. బిల్లు అసలే రాకపోతే డబ్బు ఖర్చు ధ్యాసే లేకుండా వాడుకోవచ్చు కదా!
ప్రధాన మంత్రి గారు :- ఇది నిజమే. మీరు కూడా కరెంటు ను ఎక్కువ గా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారనుకుంటా.
వర్ష బెన్ :- నిర్ణయించాం సర్, నిర్ణయించాం. ప్రస్తుతం మాకు ఎలాంటి సమస్య లేదు. ఇవన్నీ మనం ఫ్రీ మైండ్ తో ఉపయోగించుకోవచ్చు. అన్నీ ఉన్నాయి.. వాశింగ్ మశీన్, ఏసీ.. అన్నీ ఉపయోగించుకుంటున్నాం సర్.
ప్రధాన మంత్రి గారు:- మరి ఊళ్లోని మిగతా ప్రజలు కూడా దీని వల్ల సంతోషం గా ఉన్నారా ?
వర్ష బెన్ :- చాలా చాలా సంతోషం గా ఉన్నారు సర్.
ప్రధాన మంత్రి గారు:- అక్కడ సూర్య దేవాలయం లో పని చేసేది మీ భర్తేనా ? అక్కడ జరిగిన లైట్ శో ఎంతో పెద్ద ఈవెంట్ కావడం తో ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుండి అతిథులు వస్తున్నారు.
వర్ష బెన్ :- ప్రపంచం నలు మూలల నుండి విదేశీయులు రావచ్చు కానీ మీరు ప్రపంచం లో మా ఊరు ప్రసిద్ధి చెందేటట్టు చేశారు సర్.
ప్రధాన మంత్రి గారు:- అయితే గుడి ని చూసేందుకు చాలా మంది అతిథులు వస్తుండడం తో మీ భర్త కు ఇప్పుడు పని పెరిగి ఉండవచ్చు..
వర్ష బెన్ :- పని ఎంత పెరిగినా ఫర్వాలేదు సర్. మా వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్లండి.
ప్రధాన మంత్రి గారు:- ఇప్పుడు మనమందరం కలసి గ్రామాభివృద్ధి చేయాలి.
వర్ష బెన్ :- అవును. అవును సర్. మేం మీతో ఉన్నాం.
ప్రధాన మంత్రి గారు:- నేను మొఢేరా ప్రజల ను అభినందించదలచుకొన్నాను. ఎందుకంటే గ్రామం ఈ పథకాన్ని అంగీకరించింది. మన ఇంట్లో విద్యుత్తు ను తయారు చేయగలం అని వారు నమ్మారు.
వర్ష బెన్ -: 24 గంటలు సర్! మా ఇంట్లో కరెంటు ఉంది. చాలా సంతోషంగా ఉంది.
ప్రధాన మంత్రి గారు :- రండి! నేను మీకు మంచి జరగాలి అని కోరుకుంటున్నాను. కరెంటు బిల్లు ఆదా వల్ల మిగిలిన డబ్బు ను పిల్లల అభ్యున్నతి కి వినియోగించండి. మీ జీవితాని కి ప్రయోజనం చేకూర్చేలా ఆ డబ్బు ను బాగా ఉపయోగించండి. నేను మీకు చాలా మంచి జరగాలి అని కోరుకుంటున్నాను. మొఢేరా ప్రజలందరికీ నా నమస్కారాలు.
సహచరులారా, వర్ష బెన్, బిపిన్ భాయ్ లు చెప్పిన విషయాలు దేశం అంతటికి, గ్రామాల కు, నగరాల కు ప్రేరణనిస్తాయి. మొఢేరా అనుభవం దేశవ్యాప్తం గా పునరావృత్తం అవుతుంది. సౌర శక్తి ఇప్పుడు డబ్బు ను ఆదా చేస్తుంది. ఆదాయాన్ని పెంచుతుంది. జమ్ము- కశ్మీర్ లోని శ్రీనగర్ కు చెందిన మిత్రులు మంజూర్ అహమద్ లఢ్వాల్. కశ్మీర్ లో చలి ఎక్కువ కావడం తో కరెంటు ఖర్చు కూడా ఎక్కువే. ఈ కారణం గా మంజూర్ గారి కరెంటు బిల్లు కూడా 4 వేల రూపాయలకు పైగా వచ్చేది. కానీ మంజూర్ గారి ఇంట్లో సోలర్ రూఫ్‌టాప్ ప్లాంటు ను ఏర్పాటు చేయడంతో ఆయన ఖర్చు సగానికి పైగా తగ్గింది. అదే విధంగా ఒడిశా కు చెందిన కున్ని దేవురి అనే అమ్మాయి తనతో పాటు ఇతర మహిళల కు కూడా సౌర శక్తి ని ఉపాధి మాధ్యం గా మారుస్తోంది. ఒడిశా లోని కేందుఝర్ జిల్లా కర్ దాపాల్ గ్రామం లో కున్ని నివసిస్తున్నారు. సౌర శక్తి తో నడిచే రీలింగ్ యంత్రం తో పట్టు వడకడం పై ఆదివాసి మహిళల కు ఆమె శిక్షణ ను ఇస్తున్నారు. సోలర్ మశీన్ ఫలితం గా ఈ ఆదివాసి మహిళల కు కరెంటు బిల్లు ల భారం లేకపోగా, వారు ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. ఇది సూర్య భగవానుని సౌర శక్తి వరదానమే అని చెప్పాలి. వరదానం, ప్రసాదం ఎంత విస్తారం గా ఉంటే అంత మంచి జరుగుతుంది. అందువల్ల, దీనిలో మీరు కూడా చేరండి. ఇతరుల ను కూడా చేర్పించండి అని మిమ్మల్ని నేను కోరుతున్నాను.
ప్రియమైన నా దేశ ప్రజలారా, ఇప్పటి వరకు నేను మీతో సూర్యుని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా దృష్టి అంతరిక్షం వైపు మళ్లుతోంది. అందుకు కారణం మన దేశం సోలర్ రంగం తో పాటు అంతరిక్ష రంగం లోనూ అద్భుతాల ను సృష్టిస్తోంది. భారతదేశం సాధించిన విజయాల ను చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. అందుకే ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాటల’ కార్యక్రమం) శ్రోతల కు ఈ విషయం చెప్పి వారిని కూడా సంతోషపెట్టాలి అని నేను తలచాను.
సహచరులారా, కొద్దిరోజుల కిందట భారతదేశం ఒకేసారి 36 ఉపగ్రహాల ను అంతరిక్షం లోకి ప్రవేశపెట్టడాన్ని మీరు చూసి ఉంటారు. దీపావళి కి సరిగ్గా ఒక రోజు ముందు సాధించిన ఈ విజయం ఒక విధం గా మన యువత నుండి దేశాని కి ప్రత్యేకమైన దీపావళి కానుక అని చెప్పాలి. ఈ ప్రయోగంతో దేశవ్యాప్తం గా కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కచ్ఛ్ నుండి కోహిమా వరకు డిజిటల్ కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుంది. దీని సహాయంతో మారుమూల ప్రాంతాలు కూడా దేశం లోని మిగిలిన ప్రాంతాల తో మరింత సులభం గా అనుసంధానం అవుతాయి. దేశం స్వావలంబన ను సాధించినప్పుడు కొత్త విజయ శిఖరాల కు చేరుకొంటుంది అని చెప్పేందుకు ఇది కూడా ఒక ఉదాహరణ. మీతో ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు భారతదేశాని కి క్రయోజెనిక్ రాకెట్ సాంకేతికత ను ఇవ్వడాన్ని నిరాకరించిన పాత కాలాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నాను. కానీ, భారతీయ శాస్త్రవేత్త లు స్వదేశీ సాంకేతికత ను అభివృద్ధి చేయడమే కాకుండా ఇప్పుడు దాని సహాయం తో ఏక కాలం లో పదుల సంఖ్య లో ఉపగ్రహాల ను అంతరిక్షం లోకి పంపుతున్నారు. ఈ ప్రయోగం తో భారతదేశం ప్రపంచ వాణిజ్య విపణి లో బలమైన పాత్రధారి గా ఎదిగింది. దీనితో, అంతరిక్ష రంగం లో భారతదేశాని కి కొత్త అవకాశాల తలుపులు కూడా తెరచుకొన్నాయి.
సహచరులారా, ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ అనే సంకల్పం తో సాగిపోతున్న మన దేశం, ప్రతి ఒక్కరి కృషి తో తన లక్ష్యాల ను చేరుకోగలుగుతుంది. భారతదేశం లో అంతకుముందు అంతరిక్ష రంగం ప్రభుత్వ వ్యవస్థ ల పరిధి లో మాత్రమే ఉండేది. ఎప్పుడైతే అంతరిక్ష రంగాన్ని భారతదేశం లోని యువత కోసం, ప్రైవేట్ రంగం కోసం తెరవడం జరిగిందో, అప్పుడు దీనిలో విప్లవాత్మక మార్పు లు రావడం మొదలైంది. భారతీయ పరిశ్రమ లు, స్టార్ట్- అప్ స్ ఈ రంగం లో కొత్త ఆవిష్కరణల ను, కొత్త సాంకేతికతల ను తీసుకు రావడం లో నిమగ్నం అయి ఉన్నాయి. విశేషించి ఇన్-స్పేస్ ( IN-SPACe ) సహకారం ఈ రంగం లో పెద్ద మార్పు ను తీసుకు రాబోతోంది. ప్రభుత్వేతర సంస్థ లు కూడా తమ పేలోడ్ లను, ఉపగ్రహాల ను IN-SPAce ద్వారా ప్రయోగించే సౌకర్యాన్ని పొందుతున్నాయి. అంతరిక్ష రంగం లో భారతదేశం లోని ఈ భారీ అవకాశాల ను పూర్తి గా ఉపయోగించుకోవాలి అని స్టార్ట్- అప్ స్ ను, నూతన ఆవిష్కర్తల ను నేను కోరుతున్నాను.
ప్రియమైన నా దేశ వాసులారా, విద్యార్థులు, యువశక్తి, నాయకత్వ శక్తి విషయాల కు వస్తే మనలో పాతుకుపోయిన ఎన్నో మూస భావన లు, పాత విషయాలు గుర్తుకు వస్తాయి. విద్యార్థి శక్తి విషయానికి వస్తే దాని పరిధి ని విద్యార్థి సంఘం ఎన్నికల తో జోడించడం చాలా సార్లు చూస్తుంటాం. కానీ విద్యార్థి శక్తి పరిధి చాలా పెద్దదీ, చాలా విస్తృతమైందీనూ. భారతదేశాన్ని శక్తివంతం చేయడానికి విద్యార్థి శక్తి ఆధారం. నేటి యువత భారతదేశాన్ని 2047వ సంవత్సరం వరకు తీసుకుపోతుంది. భారతదేశం శతాబ్ది ఉత్సవాల ను జరుపుకొంటున్నప్పుడు ఈ యువత శక్తి, వారి శ్రమ, వారి చెమట, వారి ప్రతిభ, భారతదేశాన్ని ఈ రోజు సంకల్పిస్తున్న ఉన్నత స్థాయి కి తీసుకు పోతాయి. నేటి మన యువత దేశం కోసం పని చేస్తున్న తీరు ను, వారు దేశ నిర్మాణం లో చేరిన తీరు ను చూసి నేను చాలా నమ్మకం తో ఉన్నాను. మన యువత హ్యాకథాన్‌ల లో సమస్యల ను పరిష్కరించే విధానం, రాత్రి అంతా మేల్కొని గంట ల తరబడి శ్రమించే తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. దేశం లోని లక్షల కొద్దీ యువత గత సంవత్సరాల లో నిర్వహించిన హ్యాకథన్ లలో అనేక సవాళ్ల ను పరిష్కరించింది. దేశాని కి కొత్త పరిష్కారాల ను అందించింది.
సహచరులారా, మీకు గుర్తు ఉండే ఉంటుంది- నేను ఎర్ర కోట నుండి ‘జయ్ అనుసంధాన్’ అని ఆహ్వానించాను. ఈ దశాబ్దాన్ని ‘టెకేడ్’ గా మార్చడాన్ని గురించి కూడా నేను మాట్లాడాను. దీనిని చూడడం నాకు చాలా ఇష్టం. మన ఐఐటి ల విద్యార్థులు కూడా దీని స్ఫూర్తి ని తీసుకున్నారు. ఈ నెల-అక్టోబరు 14వ, 15వ తేదీల లో మొత్తం 23 ఐఐటి లు వాటి ఆవిష్కరణల ను, పరిశోధన ప్రాజెక్టుల ను ప్రదర్శించడానికి మొదటి సారి ఒకే వేదిక మీదకు వచ్చాయి. దేశం నలు మూలల నుండి వచ్చిన విద్యార్థులు, పరిశోధకులు 75కు పైగా అత్యుత్తమ ప్రాజెక్టుల ను ఈ మేళా లో ప్రదర్శించారు. ఆరోగ్య పరిరక్షణ, వ్యవసాయం, రోబోటిక్స్, సెమికండక్టర్స్, 5 జి కమ్యూనికేశన్స్.. ఇలా అనేక ఇతివృత్తాల పై ఈ ప్రాజెక్టుల ను రూపొందించారు. ఈ ప్రాజెక్టులు అన్నీ ఒక దాని ని మించినవి మరొకటి అయినప్పటికీ కొన్ని ప్రాజెక్టుల ను గురించి మీ కు చెప్పాలనుకొంటున్నాను. ఉదాహరణ కు ఐఐటి భువనేశ్వర్ కు చెందిన ఒక బృందం నవజాత శిశువుల కోసం పోర్టబుల్ వెంటిలేటరు ను అభివృద్ధి చేసింది. ఇది బ్యాటరీ తో నడుస్తుంది. మారుమూల ప్రాంతాల లో కూడా దీనిని సులభం గా ఉపయోగించవచ్చు. ఇది నెల లు నిండకుండా జన్మించిన శిశువుల జీవితాల ను రక్షించడం లో చాలా సహాయకారి గా ఉంటుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ, డ్రోన్ సాంకేతికత, 5జి.. ఏదైనా కావచ్చు, మన విద్యార్థులు చాలా మంది వాటి కి సంబంధించిన కొత్త సాంకేతికత ను అభివృద్ధి చేయడం లో తలమునకలు గా ఉన్నారు. స్థానిక భాషల ను నేర్చుకొనే విధానాన్ని సులభతరం చేసే బహు భాషా ప్రాజెక్టు లో వివిధ ఐఐటి లు కలసి పని చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కొత్త జాతీయ విద్య విధానం లక్ష్యాల ను సాధించడం లో చాలా సహాయపడుతుంది. భారతదేశ స్వదేశీ 5జి టెస్ట్ బెడ్ ను అభివృద్ధి పరచడం లో ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్ పుర్ లు ప్రముఖ పాత్ర ను పోషించాయి అని తెలుసుకుని మీరు సంతోషిస్తారు. ఇది కచ్చితం గా ఒక గొప్ప ప్రారంభం. రాబోయే కాలం లో ఇలాంటి ప్రయత్నాలు మరెన్నో జరగాలి అని నేను ఆశిస్తున్నాను. ఐఐటి లు, ఇతర సంస్థ లు కూడా వాటి పరిశోధన ను, అభివృద్ధి కార్యకలాపాల ను మరింత వేగవంతం చేయాలి అని ఆశిస్తున్నాను.
ప్రియమైన నా దేశ ప్రజలారా, పర్యావరణం పట్ల సున్నితత్వం మన సమాజం లోని అణువణువు లో ఇమిడిపోయి ఉంది. మన పరిసరాల లో మనం దానిని అనుభూతి చెందగలం. పర్యావరణ పరిరక్షణ కోసం తమ జీవితాల ను వెచ్చించే వారికి దేశం లో కొదువ లేదు.
కర్నాటక లోని బెంగళూరు లో నివసిస్తున్న సురేశ్ కుమార్ గారి నుండి కూడాను మనం చాలా నేర్చుకోవచ్చు. ఆయన కు ప్రకృతి మరియు పర్యావరణ పరిరక్షణ లో గొప్ప అభిరుచి ఉంది. ఆయన ఇరవై ఏళ్ల క్రితం నగరం లోని సహకార్ నగర్ లో ఒక అడవి ని సస్యశ్యామలం చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు వాటి అందాలు అందరి మనసుల ను దోచుకొంటున్నాయి. ఇది అక్కడ నివసించే ప్రజల కు కూడా గర్వకారణం. సురేశ్ కుమార్ గారు అద్భుతమైన కార్యాన్ని చేశారు. కన్నడ భాష ను, సంస్కృతి ని పెంపొందించేందుకు సహకర్ నగర్ లో బస్ శెల్టర్ ను కూడా నిర్మించారు. కన్నడ లో రాసిన ఇత్తడి పలకల ను వంద ల మంది కి బహూకరించారు. పర్యావరణం - సంస్కృతి రెండూ కలసి వృద్ధి చెంది, వికసించాలంటే.. ఇది ఎంత పెద్ద కార్యమో ఆలోచించండి.
సహచరులారా, ఈ రోజు ప్రజల లో పర్యావరణ అనుకూల జీవన విధానం, పర్యావరణ అనుకూల ఉత్పత్తుల గురించి గతంలో కంటే ఎక్కువ అవగాహన కనిపిస్తోంది. తమిళ నాడు నుండి అలాంటి ఒక ఆసక్తికరమైన ప్రయత్నాన్ని గురించి తెలుసుకొనే అవకాశం కూడా నాకు లభించింది. కోయంబత్తూరు లోని అనైకట్టి లో ఆదివాసి మహిళ ల జట్టు ఒకటి చేసిన అద్భుతమైన ప్రయాస ఇది. ఈ మహిళ లు ఎగుమతుల కోసం పది వేల పర్యావరణ అనుకూలమైన టెర్రకోట టీ కప్పుల ను తయారు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. టెర్రకోట టీ కప్పు ల తయారీ బాధ్యత ను ఈ మహిళలే స్వయం గా తీసుకున్నారు. క్లే మిక్సింగ్ మొదలుకొని ఫైనల్ ప్యాకేజింగ్ వరకు స్వయం గా నిర్వహించారు. ఇందుకోసం శిక్షణ ను కూడా తీసుకున్నారు. ఈ అద్భుతమైన ప్రయత్నాని కి ఎలాంటి ప్రశంస లు దక్కినా తక్కువే.
సహచరులారా, త్రిపుర లోని కొన్ని గ్రామాలు కూడా చాలా మంచి పాఠాలు చెప్పాయి. మీరు బయో-విలేజ్ ను గురించి వినే ఉంటారు. కానీ త్రిపుర లోని కొన్ని గ్రామాలు బయో-విలేజ్-2 యొక్క నిచ్చెన ను ఎక్కేశాయి. బయో-విలేజ్ 2 ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాన్ని ఎలా తగ్గించాలో నొక్కి చెబుతుంది. ఇందులో వివిధ ఆలోచనల ద్వారా ప్రజల జీవన నాణ్యత ను మెరుగుపరచడానికి పూర్తి శ్రద్ధ తీసుకొంటారు. సౌర శక్తి, బయోగ్యాస్, తేనెటీగల పెంపకం, బయో ఫెర్టిలైజర్ లపై పూర్తి దృష్టి పెడతారు. మొత్తమ్మీద చూస్తే వాతావరణ మార్పుల కు వ్యతిరేకం గా చేస్తున్న ప్రచారానికి బయో-విలేజ్ 2 మరింత గా బలాన్ని చేకూరుస్తుంది.
దేశం లోని వివిధ ప్రాంతాల లో పర్యావరణ పరిరక్షణ పట్ల పెరుగుతున్న ఉత్సాహాన్ని చూసి నేను చాలా సంతోషం గా ఉన్నాను. కొద్ది రోజుల కిందట భారతదేశం లో పర్యావరణాన్ని పరిరక్షించడానికి అంకితమైన ‘మిశన్ లైఫ్’ ను కూడా ను ప్రారంభించడం జరిగింది. మిశన్ లైఫ్ సాధారణ సూత్రం ఒకటే.. అది పర్యావరణాని కి హాని కలిగించని జీవన శైలి ని ప్రోత్సహించాలి అనేదే. మిశన్ లైఫ్ ను గురించి తెలుసుకొని, దానిని స్వీకరించడానికి ప్రయత్నించవలసింది గా మిమ్మల్ని కోరుతున్నాను.
సహచరులారా, రేపు అక్టోబర్ 31వ తేదీ జాతీయ ఏక్ తా దివస్. సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ గారి జయంతి శుభ సందర్భం కూడా ను. ఆ రోజు న దేశం లోని ప్రతి మూల లో రన్ ఫర్ యూనిటీ ని నిర్వహిస్తారు. ఈ పరుగు దేశం లో ఏకత సూత్రాన్ని బలపరుస్తుంది. మన యువత కు స్ఫూర్తి ని ఇస్తుంది. కొద్ది రోజుల క్రితం మన జాతీయ క్రీడల సందర్భం లో నూ అదే భావన కనిపించింది. ‘జుడేగా ఇండియా తో జీతేగా ఇండియా’ .. ఈ మాటల కు ‘దేశం అనుసంధానం అయిందంటే విజయాన్ని సాధిస్తుంది’ అని భావం. ఈ ఇతివృత్తం తో జాతీయ క్రీడలు బలమైన ఐక్యత సందేశాన్ని అందించాయి. భారతదేశ క్రీడల సంస్కృతి ని కూడా ప్రోత్సహించాయి. భారతదేశం లో ఇప్పటివరకు నిర్వహించిన వాటిలో ఇవే అతి పెద్ద జాతీయ క్రీడలు అని తెలుసుకొంటే మీరు సంతోషిస్తారు. ఇందులో 36 క్రీడల ను చేర్చారు. వాటిలో 7 కొత్త పోటీల తో పాటు రెండు దేశీయ పోటీ లు- యోగాసనాలు, మల్లఖంబ్ ను కూడా చేర్చారు. స్వర్ణ పతకం గెలుచుకోవడం లో ముందంజ లో ఉన్న మూడు జట్లు - సర్వీసెస్ టీమ్, మహారాష్ట్ర ,హరియాణా టీమ్. ఈ గేమ్స్ లో ఆరు జాతీయ రికార్డుల ను నెలకొల్పారు. సుమారు 60 జాతీయ క్రీడ ల రికార్డుల ను కూడా సృష్టించారు. ఈ క్రీడల పోటీల లో పాల్గొన్న, పతకాలు సాధించిన, కొత్త రికార్డుల ను సాధించిన క్రీడాకారులు అందరికి అభినందన లు. ఈ ఆటగాళ్ల కు ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అని కోరుకొంటున్నాను.
సహచరులారా, గుజరాత్ లో జరిగిన జాతీయ క్రీడల ను విజయవంతం గా నిర్వహించడం లో సహకరించిన వారందరికీ నా హృదయపూర్వక అభినందనల ను తెలియజేస్తున్నాను. గుజరాత్ లో నవరాత్రుల సందర్భం లో జాతీయ క్రీడల ను నిర్వహించడాన్ని మీరు చూశారు. ఈ సమయం లో గుజరాత్ మొత్తం నవరాత్రుల ఉత్సవాలలో ఉండడం వల్ల ప్రజలు ఈ ఆటల ను ఎలా ఆస్వాదించగలరు అని ఈ క్రీడల ప్రారంభానికి ముందు ఒకసారి నా మనసు కు అనిపించింది. ఇంత పెద్ద క్రీడోత్సవాల వ్యవస్థ- మరోవైపు నవరాత్రుల సందర్భంలో గర్ బా మొదలైన వాటికి ఏర్పాటు లు. గుజరాత్ ఏక కాలం లో ఇవి అన్నిటి ని ఎలా చేస్తుంది అని అనుకున్నాను. కానీ గుజరాత్ ప్రజలు వారి ఆతిథ్యంతో అతిథులందరినీ సంతోషపెట్టారు. అహమదాబాద్ లో జరిగిన జాతీయ క్రీడల సందర్భం లో కళ, క్రీడలు,సంస్కృతుల సంగమం జరిగిన తీరు ఆనందాన్ని నింపింది. క్రీడాకారులు కూడా పగటి పూట ఆట లో పాల్గొని, సాయంత్రం గర్ బా, దాండియా ఉల్లాసం లో మునిగితేలారు. గుజరాతీ ఆహారం తో పాటు నవరాత్రుల కు సంబంధించిన చాలా చిత్రాల ను కూడా వారు సామాజిక మాధ్యం లో శేర్ చేశారు. ఇవన్నీ చూడడం మా అందరికీ ఆనందదాయకం. ఇలాంటి ఆట లు భారతదేశం లోని విభిన్న సంస్కృతుల ను గురించి కూడా వెల్లడిస్తాయి. అవి ‘ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్’ భావన ను అంతగానూ బలోపేతం చేస్తాయి.
ప్రియమైన నా దేశ ప్రజలారా, నవంబర్ నెల లో 15వ తేదీ న మన దేశం ఆదివాసి ల గౌరవ దినాన్ని జరుపుకొంటుంది. మీకు గుర్తు ఉండే ఉంటుంది.. భగవాన్ బిర్ సా ముండా జయంతి సందర్భం లో ఆదివాసి వారసత్వ, గౌరవ దినాన్ని పాటించడాన్ని దేశం గత సంవత్సరం మొదలుపెట్టింది. భగవాన్ బిర్ సా ముండా తన స్వల్ప జీవన కాలం లో ఆంగ్లేయుల పాలన కు వ్యతిరేకం గా లక్షల మంది ని ఏకం చేశారు. భారతదేశం స్వాతంత్ర్యం కోసం, ఆదివాసి సంస్కృతి పరి రక్షణ కోసం ఆయన తన జీవనాన్ని త్యాగం చేసివేశారు. ఆయన నుండి మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి.
సహచరులారా, భగవాన్ బిర్ సా ముండా విషయానికి వస్తే.. ఆయన చిన్న జీవన కాలం కేసి చూస్తే ఈ రోజు కు కూడా మనం ఆయన నుండి చాలా నేర్చుకోవచ్చును. “ఈ భూమి మనది. మనం దీని రక్షకులం” అని ఆయన చెప్పేవారు. ఈ వాక్యాల లో మాతృభూమి పట్ల కర్తవ్యం కూడా ఉంది. పర్యావరణం పట్ల కర్తవ్య భావన కూడా ఉంది. మన ఆదివాసి సంస్కృతి ని మరచిపోకూడదదు అని, దానికి దూరంగా వెళ్లకూడదు అని ఆయన ఎప్పుడూ చెప్పేవారు. నేటికీ దేశం లోని ఆదివాసి సమాజాల నుండి మనం ప్రకృతి, పర్యావరణం మొదలుకొని చాలా విషయాల ను గురించి నేర్చుకోవచ్చు.
సహచరులారా, గత ఏడాది భగవాన్ బిర్ సా ముండా జయంతి సందర్భంలో రాంచీ లో భగవాన్ బిర్ సా ముండా మ్యూజియాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. సమయం దొరికినప్పుడు తప్పకుండా ఈ మ్యూజియాన్ని సందర్శించండి అంటూ యువత ను నేను కోరుతున్నాను. నవంబర్ 1వ తేదీ న, అంటే ఎల్లుండి, గుజరాత్- రాజస్థాన్ సరిహద్దుల్లోని మాన్‌గఢ్ లో ఉంటానని కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. భారతదేశం స్వాతంత్ర్య పోరాటం లో, మన సుసంపన్నమైన ఆదివాసి వారసత్వం లో మాన్‌గఢ్ కు చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉంది. 1913 నవంబర్ లో ఇక్కడ ఒక భయంకరమైన ఊచకోత జరిగింది. బ్రిటిష్ వారు స్థానిక ఆదివాసిల ను దారుణం గా హత్య చేశారు. ఈ మారణకాండ లో వెయ్యి మందికి పైగా ఆదివాసులు ప్రాణాలు కోల్పోయారని చెప్తారు. ఈ గిరిజన ఉద్యమానికి గోవింద్ గురు జీ నాయకత్వం వహించారు. ఆయన జీవనం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. గోవింద్ గురు జీ తో సహా ఆ ఆదివాసి అమరవీరులందరూ ప్రదర్శించిన అసమానమైన ధైర్యాని కి, పరాక్రమానికి నేను ఈ రోజు న నమస్కరిస్తున్నాను. భగవాన్ బిర్ సా ముండా, గోవింద్ గురు, ఇతర స్వాతంత్ర్య సమరయోధుల ఆదర్శాల ను ఈ అమృత కాలం లో మనం ఎంత నిష్ఠ తో అయితే పాటిస్తామో, అంతే ఉన్నతమైన శిఖరాల ను మన దేశం అందుకొంటుంది.
ప్రియమైన నా దేశ ప్రజలారా, నవంబర్ 8వ తేదీ న గురుపురబ్ ఉంది. మన విశ్వాసాని కి గురునానక్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ ఎంత ముఖ్యమైందో, మనం దీని నుండి అంతగానూ నేర్చుకోవచ్చును. గురు నానక్ దేవ్ జీ తన జీవిత పర్యంతం మానవాళి కి వెలుగుల ను ప్రసరింపచేశారు. గత కొన్నేళ్లు గా గురువుల వెలుగుల ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దేశం ఎన్నో ప్రయత్నాలు చేసింది. గురు నానక్ దేవ్ జీ 550వ ప్రకాశ్ పర్వ్ ను దేశ విదేశాల లో పెద్ద ఎత్తున జరుపుకొనే అవకాశం మనకు లభించింది. దశాబ్దాల నిరీక్షణ తరువాత కర్ తార్‌పుర్ సాహిబ్ కారిడార్ నిర్మాణం కూడా జరగడం అంతే ఆనందం గా ఉంది. కొద్దిరోజుల క్రితం హేమకుండ్ సాహిబ్ కోసం రోప్‌వే కు పునాది రాయి ని వేసే అవకాశం కూడా నాకు దక్కింది. మనం మన గురువు ల ఆలోచన ల నుండి నిరంతరం నేర్చుకొంటూ ఉండాలి. వారి పట్ల అంకితభావం తో ఉండాలి. ఈ రోజు కార్తిక పౌర్ణమి కూడా. ఈ రోజు న మనం పుణ్యక్షేత్రాల్లో, నదుల్లో స్నానం చేస్తాం. సేవ, దానధర్మాలు చేస్తాం. ఈ పండుగ ల సందర్భం లో మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల లో చాలా రాష్ట్రాలు వాటి రాష్ట్ర స్థాపన దినాన్ని జరుపుకొంటున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ తన స్థాపన దినాన్ని జరుపుకోనుంది. కేరళ లో పిరవి ని జరుపుకొంటారు. కర్నాటక లో రాజ్యోత్సవ్ ను జరుపుతారు. ఇదేవిధం గా మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హరియాణా లు కూడా వాటి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకొంటాయి. ఈ అన్ని రాష్ట్రాల ప్రజల కు నా శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను. మన రాష్ట్రాలన్నిటి లో ఒకరి నుండి మరొకరు నేర్చుకోవడం, సహకరించుకోవడం, కలసి పనిచేయడం అనే స్ఫూర్తి ఎంత బలం గా ఉంటే దేశం అంత ముందుకు సాగుతుంది. ఈ స్ఫూర్తి తో ముందుకు సాగుతామన్న నమ్మకం నాకు ఉంది. మీరందరూ మిమ్మల్ని మీరు జాగ్రత్త గా చూసుకోండి. ఆరోగ్యం గా ఉండండి. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) లో మళ్ళీ కలిసే వరకు మీ నుండి సెలవు తీసుకునేందుకు నన్ను అనుమతించండి.
నమస్కారం, ధన్యవాదాలు.
*****
(Release ID: 1872089)
Visitor Counter : 297
Read this release in:
Kannada
,
Urdu
,
Assamese
,
English
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam