రక్షణ మంత్రిత్వ శాఖ
పదాతి దళ 76వ దినోత్సవాన్ని జరుపుకున్న భారత సైన్యం
Posted On:
27 OCT 2022 1:04PM by PIB Hyderabad
భారత సైన్యం లో అతిపెద్ద పోరాట విభాగమైన పదాతిదళం దేశానికి అందించిన సేవలు గుర్తించడానికి ప్రతి సంవత్సరం అక్టోబరు 27న పదాతి దళ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది. అక్టోబర్ 27 వ తేదీ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. 1947 అక్టోబర్ 27వ తేదీన భారత సైన్యంలోని పదాతి దళం శ్రీనగర్ విమానాశ్రయంలో దిగింది. శ్రీనగర్ విమానాశ్రయంలో దిగిన పదాతి దళం శివార్ల నుంచి ఆక్రమణదారులను తరిమి కొట్టింది. తన ధైర్య సాహసాలతో పదాతి దళం పాకిస్తాన్ మద్దతుతో జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రాన్ని ఆక్రమించడానికి జరిగిన గిరిజనుల దాడిని తిప్పి కొట్టి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రక్షించింది.
2022 పదాతి దళ దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతి సేవలో అత్యున్నత త్యాగం చేసిన పదాతి దళానికి చెందిన అమరులకు నివాళులు అర్పిస్తూ ఈ రోజు నేషనల్ వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్, లెఫ్టినెంట్ జనరల్ బి ఎస్ రాజు, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, రెజిమెంట్స్ కల్నల్‌లతో కలిసి పుష్పగుచ్ఛాలు ఉంచారు. పదాతి దళానికి ఎనలేని సేవలు అందించిన లెఫ్టినెంట్ కల్నల్ రామ్ సింగ్ సహారన్ కీర్తి చక్ర (రిటైర్డ్), సబ్ మేజర్ గౌరవ కెప్టెన్ యోగేంద్ర సింగ్ యాదవ్ పరమవీర చక్ర (రిటైర్డ్) మరియు సెప్ సర్దార్ సింగ్ వీర్ చక్ర (రిటైర్డ్) లు అనుభవజ్ఞుల తరపున పుష్పగుచ్ఛాలు ఉంచారు.
శ్రీనగర్ లో పదాతి దళం దిగి 76 సంవత్సరాలు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఉధంపూర్ (జమ్మూకాశ్మీర్ ), అహ్మదాబాద్ (గుజరాత్), వెల్లింగ్టన్
(తమిళనాడు) , షిల్లాంగ్ (మేఘాలయ ) నుంచి ద్విచక్ర వాహన ర్యాలీలు ప్రారంభమయ్యాయి. నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ర్యాలీ ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రారంభించారు. పదాతి దళ సైనికుల పరాక్రమానికి, త్యాగాలకు నివాళులు అర్పించేందుకు బయలుదేరిన సిబ్బంది మార్గమధ్యలో వీర్ నారీలు, అనుభవజ్ఞులు, ఎన్‌సిసి క్యాడెట్‌లు మరియు విద్యార్థులతో మాట్లాడారు.10 రోజుల పాటు 8000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని అధిగమించారు.
పదాతి దళ దినోత్సవం సందర్భంగా పదాతి దళం డైరెక్టర్ జనరల్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. శౌర్యం, త్యాగం, విధి పట్ల నిస్వార్థ భక్తి మరియు వృత్తి నైపుణ్యం యొక్క ప్రధాన విలువకు తమను తాము పునరంకితం చేసుకోవాలని మరియు దేశ సమగ్రత మరియు సార్వభౌమత్వాన్ని రక్షించే వారి సంకల్పంలో తిరుగులేని విధంగా ఉండాలని తన సందేశంలో పదాతి దళం డైరెక్టర్ జనరల్ ఉద్బోధించారు.
***
(Release ID: 1871242)
Visitor Counter : 321