ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌, రాజ్‌ కోట్‌ లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 19 OCT 2022 11:15PM by PIB Hyderabad

రాజ్‌కోట్ ప్రజలందరూ ఎలా ఉన్నారు?

 

మీరందరూ సంతోషంగా ఉన్నారా?

 

ఇటీవల, మీరు నవరాత్రి పండుగ ను అద్భుతంగా నిర్వహించారు. రెండేళ్ల తర్వాత ఈ వేడుక చేసుకునే అవకాశం మీకు లభించింది. దీపావళి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ? మీ దీపావళి సన్నాహాలను ఇప్పటికే నేను చూశాను. నేడు రాజ్‌ కోట్‌అంతా అలంకరించబడి ఉంది. నవరాత్రి, విజయదశమి పండుగలు ముగిశాయని, మీరు ‘గర్బా’ ఆడుతూ అలసిపోయారని ఎవరైనా ఊహించగలరా? అయినా మీరు ధంతేరాస్ కోసం ఎదురుచూస్తూ దీపావళికి సిద్ధమవుతున్నారు. కొత్త సంవత్సరం సమీపిస్తోంది, చిన్న వ్యాపారులు చేయాల్సింది చాలా ఉంది, అయినప్పటికీ, రాజ్‌ కోట్ ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించింది. చాలా ప్రేమ, ఆశీర్వాదాలతో నన్ను స్వాగతించి, గౌరవించినందుకు రాజ్‌ కోట్‌ కు నేను నమస్కరిస్తున్నాను.

మనకు దీపావళి అంటే ఏడాది పొడవునా చేసిన ప్రతిదానికీ లెక్కలు చెప్పడం, కొత్త సంవత్సరం అంటే కొత్త తీర్మానానికి నాంది, సంకల్పంతో ముందుకు సాగడం. రాజ్‌ కోట్‌ తో సహా మొత్తం సౌరాష్ట్రలో ఈరోజు పూర్తయిన అనేక ప్రాజెక్ట్‌ ల రూపంలో నేను మీకు దీపావళి కానుకలను అందిస్తున్నాను. నేడు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులే ఒక విధంగా కొత్త తీర్మానాలకు పునాది. కనెక్టివిటీ, పరిశ్రమలు, నీరు, ప్రజలకు సౌకర్యాలు మొదలైన వాటికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు రాజ్‌ కోట్‌ను శక్తివంతం చేస్తాయి. పౌరుల జీవితాలు సులభతరమవుతాయి.

 

ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దేశంలోని ఆరు చోట్ల ఇళ్లు నిర్మించాలని ఒక కొత్త ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో రాజ్‌ కోట్ ఒకటి. కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడ 1,144 ఇళ్లను నిర్మించారు. కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ ఈ ఇళ్లను నిర్మించిన వేగం, సాంకేతికత, సుపరిపాలన, నిబద్ధత, ప్రజల అవసరాల పట్ల శ్రద్ధ ఉంటే మంచి పని సాధ్యమవుతుందని చూపిస్తుంది. ఈ సభలకు భారత ప్రభుత్వంలోని మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, గుజరాత్ ప్రభుత్వ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ మరియు అతని బృందం తో పాటు రాజ్‌ కోట్‌ కు అభినందనలు.

 

ఈ రోజు, కొత్త టెక్నాలజీతో నిర్మించిన ఈ అందమైన ఇళ్లకు యజమానులుగా మారిన తల్లులు, సోదరీమణులను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దీపావళి సందర్భంగా కట్టిన మీ ఇళ్లలో లక్ష్మీదేవి నివసించాలని ప్రార్థిద్దాం. నేను తాళాలు అందజేసేటప్పుడు ఇంటి గురించి అందరినీ అడిగాను. వారి ముఖాల్లోని సంతృప్తి ఇళ్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలియజెప్పింది. లేకుంటే, ప్రభుత్వ గృహాల సంగతి చెప్పకపోవడమే మంచిది. కానీ ఇప్పుడు ప్రజలకు జవాబుదారీ ప్రభుత్వం ఉంది.

 

గత 21 ఏళ్లలో మనందరం కలసి కలలు కన్నాము, ఎన్నో అడుగులు వేస్తూ ఎన్నో విజయాల శిఖరాగ్రాన్ని చేరుకున్నాము. నాకు, రాజ్‌ కోట్ నా మొదటి పాఠశాల. మహాత్మా గాంధీ లాగా పోర్‌బందర్‌ లో పుట్టి రాజ్‌ కోట్‌ లో చదువుకోవడం అదృష్టం. అదే విధంగా, నేను ఉత్తర గుజరాత్‌ లో పుట్టడం నా అదృష్టం, అధికారం, రాజకీయాలలో నా మొదటి ప్రస్థానం రాజ్‌ కోట్ నుండి ప్రారంభమైంది. రాజ్‌ కోట్ భూమి యొక్క శక్తిని చూడండి. రాజ్ కోట్ గాంధీజీని ఆశీర్వదించింది. నేడు ఆ గాంధీజీ మనకు స్ఫూర్తిగా నిలిచారు. అదేవిధంగా, మీరు నన్ను ఆశీర్వదించారు, రెండు దశాబ్దాలు గడిచాయి, నా బాధ్యత నానాటికీ పెరుగుతూ వచ్చింది. ఇది రాజ్‌ కోట్ ఆశీర్వాదాల శక్తి.

 

మన వజూభాయ్ (వాలా) తన సీటును ఖాళీ చేసి నన్ను రాజ్‌ కోట్‌ కి పంపారు, మీరు నన్ను దత్తత తీసుకున్నారు. మీ ఆశీస్సులతో మొదలైన ఈ ప్రయాణం నేడు గుజరాత్ అభివృద్ధిని, దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే అవకాశంగా మారింది. ఈ రాజ్‌ కోట్ రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను, నేను మీకు రుణపడి ఉన్నాను. ఇప్పుడు నేను మీ మధ్యలో ఉన్నాను, నేను శిరస్సు వంచి ఈ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి అంకితభావంతో మీకు అందిస్తున్నాను సోదరులారా.

 

విద్యార్థిగా మీ నుంచి చాలా నేర్చుకున్నాను. నేను చాలా అర్థం చేసుకున్నాను, రాజ్‌కోట్ నాకు ఏదైతే నేర్పిందో, అది ఈ రోజు దేశానికి ఉపయోగకరంగా ఉంది సోదరులారా. ఈ రోజు, గుజరాత్ నియమ, నిబంధనల గురించి అందరూ చర్చించుకుంటున్నారు. దేశంలోనే అతిపెద్ద క్రీడోత్సవం కోసం దేశం నలుమూలల నుండి ఆటగాళ్ళు గుజరాత్ వచ్చిన సమయంలో అందరూ నవరాత్రి పండుగ జరుపుకుంటున్నారు. చాలా మంది ఆటగాళ్లు నాతో ఫోన్‌లో మాట్లాడారు, గుజరాత్‌ లో అమ్మాయిలు, సోదరీమణులు బంగారు ఆభరణాలు ధరించి రాత్రిపూట ఎక్కడికి వెళ్లినా భయం కానీ ఆందోళన కానీ లేదని మరికొందరు సోషల్ మీడియాలో తమ అనుభవాన్ని పంచుకున్నారు. దేశం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు రాజ్‌ కోట్‌ లోనూ, గుజరాత్‌ లోనూ ఇవన్నీ అనుభవించినప్పుడు ఆశ్చర్యపోయారు.

చట్టబద్ధమైన పాలనకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వచ్చిన ఫలితం ఇది. లేకపోతే, ఇక్కడ రాజ్‌ కోట్ మరియు మొత్తం సౌరాష్ట్ర పరిస్థితి ఏమిటి? జనసంఘ్ ఉన్న రోజుల్లో, మన చిమన్‌ భాయ్ శుక్లా మరియు సూర్యకాంత్‌ భాయ్ ఆచార్య సంఘ వ్యతిరేకులపై ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. అప్పుడు నేను రాజకీయాల్లో లేను. రాజ్‌ కోట్ మరియు మొత్తం సౌరాష్ట్రలో అసాంఘిక శక్తులకు వ్యతిరేకంగా జనసంఘ్ పోరాడింది.

 

నేడు బీ.జే.పీ. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నాయి. నేరస్థులు, మాఫియా, తీవ్రవాదులు, దోపిడీ ముఠాలు వంటి సంఘ వ్యతిరేక శక్తుల నుండి నేడు సమాజంలోని అన్ని వర్గాలు పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి. శాంతి, సామరస్యం, ఐక్యత ప్రతి తల్లిదండ్రుల మనస్సులో పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు హామీగా మారాయి. దీని వెనుక చాలా కఠోరమైన శ్రమ దాగి ఉంది. ఈ రోజు నేను చాలా గర్వంగా, సంతోషంగా ఉన్నాను సోదరులారా.

 

మనం నిరంతరం ఈ రకమైన పురోగతిని సాధిస్తున్నాము. గత కొన్ని దశాబ్దాలుగా మన గుజరాత్‌ను మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేశాం. అందుకు అవసరమైన పర్యావరణాన్ని, వాతావరణాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తాం. ప్రభుత్వ కృషి ఫలితంగా నేడు గుజరాత్ శరవేగంగా పురోగమిస్తోంది.

 

అభివృద్ధి చెందిన భారతదేశం కోసం అభివృద్ధి చెందిన గుజరాత్, సుసంపన్నమైన భారతదేశం కోసం సంపన్న గుజరాత్ అనే మంత్రంతో మేము కొనసాగాము. మేము వైబ్రంట్ గుజరాత్ ప్రచారాన్ని ప్రారంభించాము, పెట్టుబడి కోసం ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను ఆహ్వానించాము. కృషి మహోత్సవ్ కూడా నిర్వహించాం. ఈ కృషి మహోత్సవం మండు వేసవిలో ఒక నెల పాటు కొనసాగుతుంది. ఒకప్పుడు కరువు కాటకాలతో వ్యవసాయం చేయలేని రాష్ట్రం నేడు సరిపడా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తోంది. ఈ రాష్ట్రం 9 నుంచి 10 శాతం దాకా వ్యవసాయ వృద్ధిని సాధించడం ద్వారా భారతదేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. పేదల సాధికారత కోసం గుజరాత్‌ లో గరీబ్ కళ్యాణ్ మేళాలు జరుగుతున్నాయి. పేద, మరియు మధ్యతరగతి ప్రజలు సాధికారత పొందినప్పుడు, మొత్తం సమాజం పుంజుకోవడం మనం చూశాము. అన్నింటికంటే ఎక్కువగా, మీ తల దాచుకోడానికి ఒక నీడగా, మీరు స్వంత ఇంటిని పొందినప్పుడు, అది మీ గౌరవప్రదమైన జీవితానికి నాంది పలుకుతుంది. ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలనే కోరిక ఉంటుంది.

 

పేద, మధ్యతరగతి ప్రజలకు సొంత ఇల్లు కట్టుకునేందుకు మీ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. ఇల్లు అంటే, అందులో ఎవరైనా ఆనందంగా నివసించేలా ఉండాలి. ఆధునిక జీవిత అవసరాలకు అనుగుణంగా మరుగుదొడ్లు, విద్యుత్, నీరు, గ్యాస్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఆప్టికల్ ఫైబర్ నెట్‌ వర్క్ మొదలైనవి ఉండాలి.

 

తన కష్టార్జితంతో పేదరికం నుండి బయటపడిన సామాన్య మానవుడు కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మళ్లీ పేదరికపు చక్రంలో చిక్కుకుంటాడు. అలాంటి సందర్భంలో ఓ నిరుపేద కుటుంబం భిక్షాటన చేయవలసి వస్తుంది. కానీ మన సమాజంలో ఆరోగ్య భద్రత ఉంటే ఆ పేదవాడు చింతల నుండి విముక్తి పొందుతాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన లేదా పి.ఎం-జె.ఏ.వై. అమలు చేయడం జరిగింది. ఇప్పుడు పి.ఎం-జె.ఏ.వై. పథకం కింద, ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స కూడా అందించడం జరుగుతుంది. ఈ పథకం కోట్లాది మందికి లబ్ది చేకూరుస్తోంది, సోదరులారా.

 

సోదర సోదరీమణులారా!

 

'గరీబీ హఠావో' మరియు 'రోటీ-కపడా' నినాదాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ నినాదాలు చాలా బాధ్యతారాహిత్యంగా ఉన్నాయి, మేము సగం చపాతీ తింటాము, కానీ చాలా విషయాలు హామీ ఇస్తున్నాము. ఇది చాలా దశాబ్దాల పాటు కొనసాగింది. అయితే ఇవి కేవలం నినాదాలు మాత్రమేనని, మీ జీవితాన్ని మార్చాలని నేను చెప్పాను. మనకు సగం చపాతీ అవసరం లేదు కానీ సరైన ఆహారం కావాలి. ఆకలితో ఉన్న వ్యక్తి మీ ఇంటికి వస్తే ఆహారం ఇవ్వగలిగేలా మీ జీవితం ఉండాలి. ఈ వ్యక్తులు రాజకీయాల్లో చేరి తమ కోసం రాజభవనాలు నిర్మించుకున్నారు కానీ, పేద ప్రజలకు ఇళ్ళు నిర్మించాలని వారు ఏనాడూ పట్టించుకోలేదు. పేద ప్రజలకు పక్కా ఇళ్లు నిర్మించాలని దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించాను.

 

దీని వెనుక ఓ బలమైన శక్తి ఉంది. నేడు, రాజ్‌ కోట్ తో పాటు, గుజరాత్ మొత్తం పరిశ్రమల స్థాపనకు పేరు తెచ్చుకుంది. చాలా సంవత్సరాల క్రితం నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చేసిన ఒక ప్రసంగం నాకు గుర్తుంది. మోర్బి, రాజ్‌ కోట్, జామ్‌ నగర్‌ లలోని మొత్తం విస్తీర్ణం త్వరలో మినీ-జపాన్‌ గా మారుతుందని చాలా సంవత్సరాల క్రితం నేను అంచనా వేసాను. ఆ సమయంలో ప్రజలు నన్ను ఎగతాళి చేశారు. మీరు చెప్పండి నా సోదరులారా, నా అంచనా నిజమైందా లేదా? నేడు రాజ్‌ కోట్ ఇంజనీరింగ్ పరిశ్రమకు కేంద్రంగా మారింది. మోర్బీ, రాజ్‌ కోట్, జామ్‌ నగర్‌ లలోని ఈ ప్రాంతమంతా గుజరాత్‌ ను అగ్రస్థానానికి నడిపించే శక్తిని కలిగి ఉందని నేను ఆ సమయంలో ఊహించగలిగాను.

 

సోదర సోదరీమణులారా!

 

ప్రజలకు ఇళ్లు ఇస్తామన్న హామీ మేరకు గత ఎనిమిదేళ్లలో గ్రామాలు, నగరాల్లోని ప్రజలకు మూడు కోట్లకు పైగా పక్కా ఇళ్లు అందజేయడం జరిగింది. గుజరాత్‌ కు హామీ ఇచ్చిన 10 లక్షల పక్కా ఇళ్లలో ఇప్పటికే ఏడు లక్షల ఇళ్లను ప్రజలకు అందజేయడం జరిగింది. గుజరాత్‌ ను ఈ విధంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న భూపేంద్రభాయ్ మరియు అతని బృందాన్ని నేను అభినందిస్తున్నాను. పేద ప్రజలతో పాటు, మధ్యతరగతి ప్రజల పట్ల కూడా ఆయన చూపిన శ్రద్ధను నేను అభినందిస్తున్నాను. "రెరా" ను అమలు చేయడం ద్వారా మధ్యతరగతి ప్రజల కలలకు భద్రత కల్పించాం.

 

గుజరాత్‌ లోని మధ్యతరగతి ప్రజలకు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు వీలుగా 11 వేల కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది. గుజరాత్‌లో చాలా పనులు జరుగుతున్నాయి, ఇప్పుడు బయటి నుండి కూలీలను తీసుకురావాలి. ఈ కార్మికులకు వారి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి కూడా ఇళ్లను కట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాము.

 

గత ప్రభుత్వాల హయాంలో కట్టించిన విధంగా మేము ఇళ్ళు నిర్మించలేదు. మేము ఎవరి పట్ల పక్షపాతం చూపలేదు. మీరు స్వావలంబనతో జీవించాలని, సంపన్నులు కావాలనే ఉద్దేశ్యంతో, మేము ఈ పనులన్నీ చేస్తున్నాము. మేము ఏ పని చేసినా అందులో బహుముఖ విధానం ఉంటుంది. రాజ్‌ కోట్‌ లోని ఈ లైట్ హౌస్ ప్రాజెక్టు మన సమాజాన్ని శక్తివంతం చేయడానికి, స్వతంత్ర భారతదేశ కలలను నెరవేర్చడానికి మా నిరంతర ప్రయత్నాలలో భాగం.

 

"రెరా" ను అమలు చేయడం ద్వారా మధ్యతరగతి ప్రజల కలలకు భద్రత కల్పించాం. ఇంజినీరింగ్ విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వ్యక్తులతో సహా ప్రతి ఒక్కరూ రాజ్‌ కోట్ లైట్ హౌస్ ప్రాజెక్టు నుంచి ప్రయోజనం పొందనున్నారు. దీంతో లక్షలాది మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు కొత్త ఇళ్లకు మార్గం సుగమం కానుంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయడం, మొత్తం సౌరాష్ట్రను అనుసంధానించడం ద్వారా రాజ్‌ కోట్‌ ను ఆధునిక పద్ధతిలో వేగంగా అభివృద్ధి చేయడానికి మేము ప్రణాళికలు రూపొందిస్తున్నాము. సోదర సోదరీమణులారా, విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం.

 

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా దేశంలో స్వావలంబన రావాలి. ప్రజలు కూడా తమ జీవితంలో దీనిని అనుకరించేలా మేము ప్రచారాన్ని ప్రారంభించాము. యువతకు శిక్షణ ఇచ్చి కొత్త అంకుర సంస్థలతో ముందుకు వచ్చేలా ప్రోత్సహిస్తున్నాం.

 

మిత్రులారా!

 

అభివృద్ధి అంటే నగరాల్లో రోడ్లు, మార్కెట్లు, మాల్స్, ప్లాజాలు నిర్మించడం కాదు. పట్టణ జీవితానికి గొప్ప బాధ్యత ఉంది, ఈ బాధ్యతను నెరవేర్చడానికి ఇది ఒక అవకాశం, అభివృద్ధికి కొత్త కోణం కూడా. వీధి వ్యాపారులు, కూరగాయలు విక్రయించే వారి గురించి కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎలాంటి గ్యారెంటీ లేకుండా బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చని మేము నిర్ధారించాము. స్వనిధి యోజన కింద వారు సులభంగా రుణాలు పొందవచ్చని మేము నిర్ధారించాము.

 

సోదర సోదరీమణులారా!

 

ఈరోజు మీరు డిజిటల్ ఇండియా ఒక ప్రధాన శక్తిగా ఎదుగుతున్నట్లు చూడవచ్చు. మనం ప్రపంచంలోనే చౌకైన ఇంటర్నెట్‌ ను పరిచయం చేసాము, నేడు వీధి వ్యాపారులు కూడా డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారు. గుజరాత్‌ లో ఇలాంటివి ఎన్నో చూడగలుగుతున్నాం, దాని ప్రయోజనాలను గుజరాత్ పొందుతోంది. సోదరులారా. అంతేకాదు, దీని ప్రభావం కూడా బాగా పెరుగుతోంది.

 

చిన్న తరహా పరిశ్రమలు లేదా ఎం.ఎస్.ఎం.ఈ. లు రాజ్‌ కోట్ అభివృద్ధికి గొప్ప పని చేశాయి. ఇక్కడ తయారు చేయబడిన పంపులు, యంత్ర పరికరాలు అందుబాటులో లేని ప్రదేశం దేశంలో ఎక్కడా లేదు. ఫాల్కన్ పంప్, ఫిల్ మార్షల్స్, ఏంజెల్ పంప్, రోటెక్ ఇంజినీరింగ్, జలగంగా పంప్, సిల్వర్ పంప్, రోటెక్ పంప్, సిద్ధి ఇంజనీర్స్, గుజరాత్ ఫోర్జింగ్, టాప్ ల్యాండ్ మొదలైన అనేక బ్రాండ్‌ లు భారతదేశంలోని ప్రతి మూలకు చేరాయి. ఇవి కూడా ఎగుమతి అవుతున్నాయి. రాజ్‌ కోట్ ఈ శక్తిని సృష్టించింది.

 

నేడు, భారతదేశంలో అభివృద్ధి చెందిన ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించిన విడిభాగాలు రాజ్‌ కోట్‌ లో తయారవుతున్నాయి. గుజరాత్‌ లో తయారయ్యే కారు జపాన్‌ దిగుమతి చేసుకోవడం, దాని విడిభాగాలను రాజ్‌ కోట్‌ లో తయారు చేయడం అంతకంటే గర్వకారణం. ఒకప్పుడు గుజరాత్ లో సైకిళ్ళు కూడా తయారయ్యేవి కాదు. నా మాటలను గుర్తించండి, గుజరాత్‌ లో విమానం తయారయ్యే రోజు, రాజ్‌ కోట్‌ లో విమానం యొక్క విడిభాగాలను కూడా తయారు చేసే రోజు ఎంతో దూరంలో లేదు.

 

సోదర సోదరీమణులారా, గత రెండు దశాబ్దాల్లో రాజ్‌ కోట్ అద్భుతాలు చేసింది. గత రెండు దశాబ్దాల్లో కొత్త చరిత్ర లిఖించబడింది. రాజ్‌ కోట్‌ ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన ఇంజినీరింగ్‌ ఉత్పత్తులను ఎగుమతి చేసిందని ఓ విశ్వవిద్యాలయ అధ్యయనంలో తేలింది. యువత భవిష్యత్తుకు వెలుగులు నింపుతున్న రాజ్‌ కోట్‌ శక్తి ఇదే. ఫలితంగా, ప్రజలు అనేక ఉద్యోగాలు కూడా పొందుతున్నారు.

 

మన మోర్బీ కూడా అద్భుతాలు చేస్తోంది. మోర్బి యొక్క సిరామిక్ టైల్స్ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ప్రపంచంలోని సిరామిక్ పనిలో 13 శాతం మోర్బీలోనే జరుగుతున్నాయి. అందుకే, మోర్బి ఎగుమతి ఎక్సలెన్స్ టౌన్‌ గా గుర్తించబడుతోంది, సోదరులారా! గోడలు, అంతస్తులు, బాత్‌ రూమ్‌ లు, మరుగుదొడ్లు మొదలైనవి మోర్బి లేకుండా అసంపూర్ణంగా ఉంటాయి, సోదరులు. ఇవన్నీ, మోర్బి లేకుండా చేయలేము. మోర్బి లో వరదలు ముంచెత్తినప్పుడు, చేపలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, మోర్బి మళ్లీ పైకి లేస్తుందని ఎవరూ ఊహించలేరు. నేడు, మోర్బి ఇతరులను పెంచి పోషిస్తోంది, సోదరులారా.

 

ఆ సమయంలో మోర్బీ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు నాకు గుర్తుంది. గ్యాస్ అక్కడికి చేరితే మోర్బీ అద్భుతాలు చేయగలదని నేను గ్రహించాను. ఇండస్ట్రియల్ గ్యాస్ పైప్ లైన్ వేసి మోర్బీకి కొత్త బలాన్ని ఇచ్చాం. మోర్బీలోని సిరామిక్ పార్క్ కోసం ఈరోజు 15,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడం పెద్ద వార్త. గత 20-22 ఏళ్లలో గుజరాత్‌ లో వివిధ పరిశ్రమల వృద్ధి అనేక ప్రయోజనాలకు దారితీసింది. భూపేంద్రభాయ్ ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం రానున్న రోజుల్లో కొత్త తరాలకు కూడా మేలు చేయబోతోంది.

 

సోదర సోదరీమణులారా!

 

సాంప్రదాయ పరిశ్రమలతో పాటు, రాజ్‌ కోట్, సౌరాష్ట్ర, గుజరాత్‌ లలో అనేక అవకాశాలు వెలువడుతున్నాయి. సోదరులారా! మీకు చాలా ప్రాజెక్టులను అందించడానికి నేను ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా గర్వంగా, సంతృప్తిగా ఉన్నాను. మీరు నాకు అందించిన సాదర స్వాగతానికి, రాజ్‌ కోట్‌ కు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను రాజ్‌ కోట్‌ కు ఎప్పటికీ రుణపడి ఉంటాను, అదేవిధంగా రాజ్‌ కోట్‌కు సేవ చేసే ఏ అవకాశాన్ని వదులుకోను.

 

ఈ నమ్మకంతో మరోసారి మీ అందరికీ అనేకానేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

ధన్యవాదాలు!

 

 

గమనిక: ప్రధానమంత్రి గుజరాతీ భాషలో చేసిన ప్రసంగానికి ఇది స్వేచ్చానువాదం.

 


(రిలీజ్ ఐడి: 1871129) సందర్శకుల సూచీ సంఖ్య : : 162