రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, రష్యా రక్షణ మంత్రి శ్రీ సెర్గీ షోయిగు మధ్య టెలిఫోన్‌ సంభాషణ

Posted On: 26 OCT 2022 3:42PM by PIB Hyderabad

రష్యా రక్షణ శాఖ మంత్రి శ్రీ సెర్గీ షోయిగు అభ్యర్థన మేరకు, భారత రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ (బుధవారం) ఆయనతో టెలిఫోన్‌ ద్వారా మాట్లాడారు. రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారంతో పాటు ఉక్రెయిన్‌లో దిగజారుతున్న పరిస్థితులపై మంత్రులిద్దరూ చర్చించారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితుల గురించి రష్యా రక్షణ మంత్రి షోయిగు వివరించారు. 'డర్టీ బాంబ్' ప్రయోగం ద్వారా ఉక్రెయిన్‌ తమను రెచ్చగొట్టాలని చూస్తోందన్న ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ వివాదాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లకుండా చర్చలు, దౌత్యం ద్వారా రాజీ కుదుర్చుకోవాలని భారతదేశం ముందు నుంచీ చెబుతోంది. ఇదే వైఖరిని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. అణ్వాయుధాలు లేదా రేడియోలాజికల్ ఆయుధాల వినియోగం మానవత్వానికి విరుద్ధమని, అణ్వాస్త్రాల కోసం ఏ పక్షం కూడా ముందడుగు వేయకూడదని సూచించారు.

తాజా పరిణామాల మీద ఎప్పటికప్పుడు చర్చించుకునేందుకు ఇద్దరు మంత్రులు అంగీకరించారు.

 *****(Release ID: 1871006) Visitor Counter : 312