ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

సెప్టెంబర్‌లో 25.25 కోట్ల ఆధార్‌ ఆధారిత ఈ-కేవైసీ లావాదేవీలు; ఆ నెలలో 175 కోట్లకు పైగా అథెంటికేషన్లు


సెప్టెంబర్‌ నెలలో 21 కోట్లకు పైగా ఏఈపీఎస్‌ లావాదేవీలు

సెప్టెంబర్‌లో 1.62 కోట్లకు పైగా ఆధార్ వివరాల నవీకరణలను విజయవంతంగా పూర్తి చేసిన ఉడాయ్‌

Posted On: 25 OCT 2022 5:49PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ప్రజలు నిర్వహిస్తున్న ఆధార్‌ అనుసంధానిత లావాదేవీలు పెరుగుతున్నాయి. జీవన సౌలభ్యానికి ఆధార్‌ ఎలా సహాయపడుతుందో ఈ మార్పు సూచిస్తోంది. ఒక్క సెప్టెంబర్‌ నెలలోనే ఆధార్ ద్వారా 25.25 కోట్ల ఈ-కేవైసీ లావాదేవీలు జరిగాయి. ఆగస్టుతో పోలిస్తే ఇవి దాదాపు 7.7% పెరిగాయి.

ఆధార్‌ కలిగిన వ్యక్తి ఇచ్చే విస్పష్టమైన సమ్మతితోనే ఈ-కేవైసీ లావాదేవీ జరుగుతుంది. రాత పనిని, వ్యక్తిగత ధృవీకరణ అవసరాన్ని తప్పిస్తుంది.

బ్యాంకింగ్, బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సేవల్లో ఆధార్ ఈ-కేవైసీ కీలక పాత్ర పోషిస్తోంది. మెరుగైన, పారదర్శకమైన అనుభవాన్ని అందిస్తుంది. జరగాల్సిన వ్యాపారాన్ని సరళంగా మారుస్తుంది.

2022 సెప్టెంబర్ చివరి నాటికి, ఆధార్ అనుసంధానిత ఈ-కేవైసీ లావాదేవీల సంచిత సంఖ్య 1297.93 కోట్లకు పెరిగింది.

అదేవిధంగా, ఆదాయ పిరమిడ్ దిగువ భాగాన్ని ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏఈపీఎస్‌) ఆర్థికంగా బలపరుస్తుంది.

2022 సెప్టెంబరు చివరి నాటికి; ఏఈపీఎస్‌, మైక్రో ఏటీఎంల నెట్‌వర్క్‌ ద్వారా 1549.84 కోట్ల లాస్‌-మైల్ బ్యాంకింగ్ లావాదేవీలు కూడా సాధ్యమయ్యాయి. ఒక్క సెప్టెంబర్‌లోనే దేశవ్యాప్తంగా 21.03 కోట్ల ఏఈపీఎస్‌ లావాదేవీలు జరిగాయి.

సెప్టెంబర్‌లో, ఆధార్ ద్వారా 175.41 కోట్ల అథెంటికేషన్‌ లావాదేవీలు జరిగాయి. ఈ లావాదేవీల్లో ఎక్కువ భాగం వేలిముద్రల అథెంటికేషన్‌ను ఉపయోగించి జరిగాయి. దీని తర్వాతి స్థానంలో డెమోగ్రాఫిక్, ఆ తర్వాత ఓటీపీ అథెంటికేషన్‌ లావాదేవీలు ఉన్నాయి.

సెప్టెంబర్ చివరి నాటికి మొత్తం 8250.36 కోట్ల అథెంటికేషన్‌ లావాదేవీలు పూర్తయ్యాయి. ఆధార్ ఉద్దేశ్యం ఎంత నిజాయతీగా నెరవేరుతోందో ఈ సంఖ్య సూచిస్తోంది.

మన దేశంలోని వయోజనలకు ఆధార్‌ కార్డుల జారీ దాదాపుగా సంపూర్ణ స్థాయికి చేరింది. సెప్టెంబర్ చివరి నాటికి, ఆధార్ తీసుకున్న అన్ని వయసుల వారు దేశ మొత్తం జనాభాలో 93.92%గా ఉన్నారు.

ఆధార్‌ కార్డుదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు, సెప్టెంబర్ నెలలో 1.62 కోట్లకు పైగా ఆధార్‌ కార్డ్‌ వివరాల నవీకరణలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఆగస్టులో 1.46 కోట్ల నవీకరణలు జరిగాయి.

మొత్తంగా, సెప్టెంబర్ చివరి నాటికి 66.63 కోట్ల ఆధార్ కార్డ్‌ వివరాలు విజయవంతంగా నవీకరించించారు.

ఈ నవీకరణలు డెమోగ్రాఫిక్, వేలిముద్రల నవీకరణనలకు సంబంధించినవి. భౌతిక ఆధార్ సెంటర్ల ద్వారా, ఆన్‌లైన్ ఆధార్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ప్రజలు ఈ తరహా విజ్ఞప్తులు చేసుకున్నారు.

లాస్ట్‌-మైల్‌ బ్యాంకింగ్ కోసం ఏఈపీఎస్‌, ఈ-కేవైసీ, ఆధార్-ఆధారిత డీబీటీ లేదా అథెంటికేషన్‌.. కార్యకలాపం ఏదైనా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా దార్శనికతకు మద్దతుగా నిలవడంలో ఆధార్ ఒక అద్భుత పాత్రను పోషిస్తోంది.

సుపరిపాలనలో ఒక డిజిటల్ మౌలిక సదుపాయం ఆధార్. అటు జీవన సౌలభ్యం, ఇటు వ్యాపార సౌలభ్యం రెండింటినీ ఇది సులభతరం చేస్తుంది. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడంలో, లక్ష్యిత లబ్ధిదారులకు వాటిని సక్రమంగా చేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు ఈ డిజిటల్ ఐడీ సాయం చేస్తోంది.

అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేస్తున్న సుమారు 1000 సంక్షేమ పథకాలను ఆధార్‌తో అనుసంధానించారు.

 

***



(Release ID: 1870880) Visitor Counter : 134