రక్షణ మంత్రిత్వ శాఖ
సిక్కిం ఉత్తర సరిహద్దులలో భద్రతా పరిస్థితిని సమీక్షించి, దళాలతో కలిసి దీపావళి జరుపుకున్న ఆర్మీ చీఫ్
Posted On:
24 OCT 2022 4:12PM by PIB Hyderabad
చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సైన్యాధ్యక్షుడు) జనరల్ మనోజ్ పాండే 23 & 24 అక్టోబర్ 2022న ఉత్తర్ బెంగాల్, సిక్కిం సరిహద్దు ప్రాంతాలలోని సైనిక స్థావరాలను సందర్శించారు. అన్ని ర్యాంకులకు చెందిన సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలిపడమే కాక సిక్కిం ఉత్తర సరిహద్దులలో భద్రతా పరిస్థితిని సమీక్షించారు. అత్యధిక స్థాయి కార్యాచరణ సామర్ధ్యాన్ని, స్థైర్యాన్ని కొనసాగిస్తున్నందుకు ఆర్మీ చీఫ్ సైనిక దళాలను అభినందించారు.
సరిహద్దు ప్రాంతాల వెంట మౌలిక సదుపాయాల అభివృద్ధి గమనం పట్ల ఆర్మీ చీఫ్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన వెంట ఈస్టర్న్ కమాండ్ కు చెందిన సైనిక కమాండర్ లెఫ్టనెంట్ జనరల్ ఆర్ పి కలితా, జిఒసి త్రిశక్తి కార్ప్స్ లెఫ్టనెంట్ జనరల్ తరుణ కుమార్ ఐచ్ ఉన్నారు. ఆయన సుక్నా సైనిక స్థావరానికి 23 అక్టోబర్ 2022న వచ్చినప్పుడు దీపావళి సందర్భంగా భారతీయ సాంస్కృతిక వారసత్వం, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ నిర్వహించిన ఒక కార్యక్రమం గురించి దళాలతో సిఒఎఎస్ ముచ్చటించారు. అంకిత భావంతో పని చేస్తున్న దళాలను కొనియాడుతూ, దీపావళి సందర్భంగా అన్ని ర్యాంకులకు చెందిన సిబ్బందికి, వారి కుటుంబాలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మౌంట్ జోన్సాంగ్, మౌంట్ డోమెఖాంగ్ లను అధిరోహించిన పర్వతారోహణ బృందాన్ని, ఇటీవల మోవ్ లో జరిగిన స్కిల్ ఎట్ ఆర్మ్స్ పోటీలో మొదటి స్థానంలో నిలిచిన త్రిశక్తి కార్స్స్ షూటింగ్ బృందాన్ని కూడా సిఒఎఎస్ అభినందించారు.
అక్టోబర్ 24వ తేదీన సైనిక కమాండర్, జిఒసితో కలిసి ఉత్తర, తూర్పు సిక్కింలోని ముఖ్య ప్రాంతాలను సిఒఎఎస్ సందర్శించారు. సిక్కిం సెక్టార్ లోని ఉత్తర సరిహద్దుల వెంట మోహరించిన ఫీల్డ్ ఫార్మేషన్స్ కార్యాచరణ పరిస్థితి, సంసిద్ధతను సమీక్షించిన సిఒఎఎస్ సంతృప్తిని వ్యక్తం చేస్తూ, అన్ని రకాల సవాళ్ళను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండటాన్ని కొనసాగించాలని దళాలకు ఉద్బోధించారు. దీపావళి సందర్భంగా సైనికులకు శుభాకాంక్షలు తెలియచేస్తూ, వారికి స్వీట్లను ఇచ్చి, వారితో కలిసి భుజించారు. సైనికుల వృత్తి నైపుణ్యాన్ని, విధుల పట్ల వారి అంకితభావాన్ని కూడా ఆయన అభినందించారు.
***
(Release ID: 1870716)
Visitor Counter : 143