ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలో జోరుగా స్వచ్ఛతా డ్రైవ్!
పెండింగ్ అంశాల పరిష్కారం లక్ష్యంగా
2వ దశ ప్రత్యేక పారిశుద్ధ్య ప్రచార కార్యక్రమం
Posted On:
21 OCT 2022 5:01PM by PIB Hyderabad
అపరిష్కృతంగా, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం (ఎస్.సి.డి.పి.ఎం.)-స్వచ్ఛత డ్రైవ్ లక్ష్యంగా రెండవ దశ ప్రత్యేక ప్రచార కార్యక్రమం (స్పెషల్ డ్రైవ్-2) పేరిట చేపట్టిన కార్యక్రమం కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ వేగంగా జరుగుతోంది. కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య పరిశోధన శాఖలో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పెండింగ్ సమస్యలను తగ్గించడం, స్వచ్ఛతను సంస్థాగతం చేయడం, అంతర్గత పర్యవేక్షణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం, రికార్డుల నిర్వహణలో అధికారులకు శిక్షణ ఇవ్వడం, మెరుగైన నిర్వహణ కోసం రికార్డులను డిజిటలీకరించడం, మంత్రిత్వ శాఖలను/విభాగాలను అన్నింటినీ ఒకే డిజిటల్ వేదిక (www.pgportal.gov.in/scdpm22)పైకి తీసుకురావడం లక్ష్యాలుగా పెట్టుకుని ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఎస్.సి.డి.పి.ఎం., స్వచ్ఛత డ్రైవ్ కార్యక్రమం 2022 అక్టోబరు 1వ తేదీన మొదలైంది. అక్టోబర్ 2నుంచి, అక్టోబర్ 31వ తేదీవరకూ దీన్ని అమలు చేస్తున్నారు. థర్డ్ పార్టీ మధింపు ప్రక్రియ 2022 నవంబర్ 14-30తేదీల మధ్య జరుగుతుంది, దాని తర్వాత 2022 డిసెంబర్ 24, 25 తేదీల్లో సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఉత్తమ అనుభవాల, అభ్యాసాల ప్రదర్శనలు చేపడతారు. ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నెలవారీ పురోగతిని పరిపాలనా సంస్కరణలు, ప్రజా సమస్యల విభాగం (డి.ఎ.ఆర్.పి.జి.) కార్యదర్శి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వస్తున్నారు.

ముందు తర్వాత
స్వచ్ఛతా ఫొటోగ్రాఫ్ (జవహర్ లాల్ నెహ్రూ స్నాతకోత్తర వైద్య విద్యా,
పరిశోధనా సంస్థ, పుదుచ్చేరి)

Before After
స్వచ్ఛతా ఫొటోగ్రాఫ్ (అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్), రుషీకేష్)
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎం.ఒ.హెచ్.ఎఫ్.డబ్ల్యు) ప్రధాన కేంద్ర కార్యాలయం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఇతర అనుబంధ శాఖల కార్యాలయాలు, 128 సబార్డినేట్ కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి కలిగిన 50 సంస్థలు, ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈ ప్రచార కార్యక్రమంలో ఎంతో చురుకుగా పాల్గొంటున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ క్షేత్రస్థాయి కార్యాలయాలకు కూడా ప్రచార కార్యక్రమాన్ని విస్తరింపజేశారు. ప్రచార కార్యక్రమాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ క్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తదితరులు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని సమీక్షిస్తూ వస్తున్నారు. ఈ 2వదశ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయడం కోసం విడిగా వాట్సాప్ గ్రూప్‌ను కూడా తయారుచేశారు.

స్వచ్ఛతా ఫొటోగ్రాఫ్ (అఖిల భారత ఫిజికల్ మెడిసిన్, పునరావాస సంస్థ, ముంబై)
స్వచ్ఛతను మెరుగుపరచడానికి, తమ ఆవరణల పరిధిలో పరిశుభ్రమైన, పచ్చటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ఉత్తమమైన విధానాలను, అభ్యాసాలను అనేక సంస్థలు చేపట్టాయి. తెలంగాణలోని బీబీనగర్‌లో ఉన్న అఖిల భారత వైద్య విజ్ఞాన అధ్యయన సంస్థ (ఎయిమ్స్)లో పొడి వ్యర్థాలను, ఉపయోగించని స్థలాలను తోటలుగా (ఎయిమ్స్ వాటికలు)గా మార్చేశారు. కలుషిత జలాలను, మురికి నీటి నిల్వలను ఫౌంటైన్‌లుగా మార్చేశారు. అలాగే, న్యూఢిల్లీలోని క్షయ, శ్వాస సంబంధమైన వ్యాధుల జాతీయ సంస్థ (ఎన్.ఐ.టి.ఆర్.ఒ.)లో రోడ్లు ఊడ్చేందుకు యాంత్రిక శుద్ధి పరికరాలను, చెత్త ఊర్పిడి యంత్రాలను ఏర్పాటు చేశారు.; వ్యర్థాల రీసైక్లింగ్ కోసం ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు వ్యర్థాల సేకరణ యంత్రాన్ని కూడా అందుబాటులో ఉంచారు. ఈ యంత్రంలోకి వ్యర్థాలను చేర్చిపెట్టడం కోసం వినియోగదారులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. అలాగే, రుషికేశ్ ఎయిమ్స్, ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్, భువనేశ్వర్ ఎయిమ్స్, ముంబైలోని జాతీయ ప్రజారోగ్య, శిక్షణ, పరిశోధనా సంస్థ (ఎన్.ఐ.పి.హెచ్.టి.ఆర్.), అఖిల భారత ఫిజికల్ మెడిసిన్-రిహాబిలిటేషన్ సంస్థ (ఎ.ఐ.ఐ.పి.ఎం.ఆర్.), ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇదే విధానాన్ని, ఉత్తమ పద్ధతులను అనుసరించాయి.

రోగులకు, సందర్శకులకు పరిశుభ్రమైన, పచ్చని పర్యావరణాన్ని అందించేందుకు పచ్చని చెట్లు, మొక్కల కుండీల ఏర్పాటు (జాతీయ క్షయ, శ్వాస సంబంధ వ్యాధుల పరిశోధనా సంస్థ, న్యూఢిల్లీ)
ఆరోగ్య పరిశోధన శాఖ పరిధిలోని అన్ని విభాగాలతో పాటు, క్షేత్ర స్థాయి యూనిట్లు, ఇతర సంస్థలు కూడా పారిశుద్ధ్య ప్రచార ప్రత్యేక కార్యక్రమాన్ని పూర్తి శ్రద్ధగా చేపట్టాయి. భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్.) పర్యవేక్షణా పరిధిలోని 27 సంస్థలు (ఐ.సి.ఎం.ఆర్.కు చెందిన 10 క్షేత్రస్థాయి సంస్థలు, అవుట్‌స్టేషన్ కేంద్రాలు సహా), 80 వైరస్ పరిశోధన, వ్యాధి నిర్ధారణ పరిశోధనా శాలలు (వి.ఆర్.డి.ఎల్.లు), 40 మల్టీ-డిసిప్లినరీ పరిశోధనా యూనిట్లు (ఎం.ఆర్.యు.లు), 12 ఆదర్శ గ్రామీణ ఆరోగ్య పరిశోధనా యూనిట్లు (ఎం.ఆర్.హెచ్.ఆర్.యు.లు) కూడా ఈ కార్యక్రమంలో క్రియాశీలకంగా పాలుపంచుకుంటున్నాయి. ఈ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయడానికి ఒక ప్రత్యేక సమాచార వ్యూహాన్ని కూడా ఐ.సి.ఎం.ఆర్. చేపట్టింది. ఇందులో భాగంగా సామాజిక మాధ్యమ వేదికల ద్వారా సందేశాలు పంపడం, అవగాహన ప్రచారాల ద్వారా భాగస్వామ్య వర్గాల వారందరినీ ఏకీకృతం చేయడం, వ్యాసాలు, వార్తా కథనాలు రాయడం మొదలైన ప్రక్రియలు చేపడుతూ ఉన్నారు. ఈ ప్రక్రియ యావత్తూ పూర్తయిన తర్వాత, ఇప్పటివరకూ భౌతికంగా నిర్వహిస్తూ వచ్చిన ఫైళ్లన్నింటినీ డిజిటల్ రూపంలోకి మార్చనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే చర్యలు మొదలయ్యాయి. కార్యక్రమాలన్నింటినీ కాగిత రహితంగా చేపట్టేందుకు ఈ శాఖ ప్రాధాన్యం ఇస్తోంది.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రెండవ దశ ఎస్.సి.డి.పి.ఎం. కార్యక్రమంలో భాగంగా, ఆరోగ్య పరిశోధన విభాగం పలు చర్యలు తీసుకుంది. అపరిష్కృతంగా ఉన్న ఎం.పి. సూచనలు, పార్లమెంట్ హామీలు, ప్రజా ఫిర్యాదులు-సమస్యలు, ప్రధాని కార్యాలయ సూచనలను ఈ శాఖ గణనీయంగా తగ్గించింది. ప్రత్యేక పారిశుద్ధ్య ప్రచారానికి అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారం లక్ష్యంగా 2వ దశ ప్రత్యేక ప్రచారం చేపట్టాలని ఈ శాఖ పరిధిలోని అన్ని క్షేత్రస్థాయి యూనిట్లను/సంస్థలను ఆదేశించారు.


ఈ మొత్తం కార్యక్రమాన్మన్ని ప్రత్యేక స్వచ్ఛత (https://cd.nhp.gov.in) పోర్టల్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి మార్గదర్శకత్వంలో, పరిపాలనా సంస్కరణలు, ప్రజాసమస్యల పరిష్కార శాఖ (డి.ఎ.ఆర్.పి.జి.) పోర్టల్ (https://pgportal.gov.in/SCDPM) చొరవతో ఈ స్వచ్ఛతా పోర్టల్ రూపుదాల్చింది. ఈ పోర్టల్‌కు ఛాయాచిత్రాలను, సమాచారాన్ని డి.ఎ.ఆర్.పి.జి. పోర్టల్ పొందుపరుస్తూ వస్తోంది. సంబంధిత కార్యాలయాలు,.. తమ రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన ఫొటోగ్రాఫ్‌లను ఈ పోర్టల్‌కు అప్‌లోడ్ చేస్తున్నాయి. నిర్మాణ్ భవన్‌లోని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఐ.డబ్ల్యు.ఎస్. యూనిట్ ఈ సమాచారాన్ని రోజువారీ పద్ధతిలో అప్‌లోడ్ చేస్తోంది.
****
(Release ID: 1870180)
Visitor Counter : 210