హోం మంత్రిత్వ శాఖ

దుష్ప్రవర్తన ఆరోపణలపై ఐ.ఎ.ఎస్. అధికారి జితేంద్ర నరైణ్ సస్పెన్షన్ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ చర్య

Posted On: 17 OCT 2022 5:57PM by PIB Hyderabad

        సీనియర్ ఐ.ఎస్.ఎస్. అధికారి జితేంద్ర నరైణ్‌ను సస్పెన్షన్‌లో ఉంచుతూ  కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. ఈ సస్పెన్షన్ వెంటనే అమలులోకి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం, తదితర కేంద్రపాలిత ప్రాంతాల (ఎ.డి.ఎం.యు.టి.-1990) కేడర్‌కు చెందిన నరైణ్, ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా వచ్చిన ఆరోపణలకు సంబంధించి అండమాన్, నికోబార్ పోలీసుల నుంచి 2022 అక్టోబరు 16న నివేదిక అందిన నేపథ్యంలో నరైణ్‌పై ఈ చర్య తీసుకున్నారు. అండమాన్, నికోబార్ దీవుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినపుడు నరైణ్, ఇతరులు ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు నివేదికలో పేర్కొన్నారు. జితేంద్ర నరైణ్ అనుచిత ప్రవర్తనకు, అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉన్నందున, ఆయనపై చట్టప్రకారం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి ఆదేశించారు. దీని ప్రకారం, జితేంద్ర నరైణ్‌ను  తక్షణమే సస్పెన్షన్‌లో ఉంచుతూ, ఆయనపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలు జారీ అయ్యాయి.  అధికారులు ఏ హోదాలో ఉన్నప్పటికీ వారు క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినా, ప్రత్యేకించి మహిళల గౌరవానికి భంగం కలిగించినా ఏమాత్రం సహించబోమని స్పష్టం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ క్రిమినల్ కేసుకు సంబంధించి అండమాన్-నికోబార్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రత్యేకంగా తనవంతు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసింది.

 

****



(Release ID: 1868665) Visitor Counter : 151